"ఏమండీ"
"ఛ! ఊరుకో, ఎప్పుడూ ఏడుపే వెధవ ఏడుపు ముఖము నువ్వూను! ఆఫీసు పని అయిపోగానే వస్తాన్లే" రెండడుగులు ముందుకు వేశాడు షణ్ముఖం.
"వచ్చేప్పుడు డాక్టరు దగ్గిరకెళ్ళి మందు కూడా తీసుకురండి."
"అలాగే." ఎలాగో అనగలిగాడు.
"ఆ మర్చిపోయాను. కాఫీ పొడీ, పంచదార కూడా అయిపోయినై.
"ఊ!" మరో అడుగు ముందుకు వేశాడు.
"పిల్లకు బొత్తిగా ధారకం పోవడం లేదు. ఒక గ్లూకోజ్ డబ్బా. బత్తాయి పళ్ళు..."
షణ్ముఖం గిర్రున తిరిగి భార్య ముఖంలోకి చూశాడు. ఊఁ ఇంకా?"
ఆదిలక్ష్మి భర్త ముఖంలోకి చూస్తూ మాట్లాడలేక పోయింది. ఆ రోజు ముప్పై ఒకటో తారీఖని గుర్తొచ్చి బొమ్మలా నిలబడిపోయింది.
"ఒరె అబ్బాయ్! కందిపప్పూ, పెద్దుల్లిపాయలూ, చింతపండూ తీసుకురారా."
షణ్ముఖం తల్లి మంగమ్మ ఉతికి, పిండిన బట్టలు భుజం మీద వేసుకొని బయటికి వచ్చింది.
షణ్ముఖానికి వెనక్కి తిరిగి తల్లి ముఖం చూసే ధైర్యం లేక వీథిలోకి చూస్తూ నిలబడి పోయాడు.
"ఎటూ మార్కెట్ కు వెళ్తారుగా కూరగాయలు కూడా పట్టుకు రండి." పెళ్ళాం గొంతు.
"ఒరే నాయనా. ఓ పాతిక నిమ్మకాయలు కూడా పట్టుకురా! కోసి ఉప్పులో వేస్తాను. నోరు మరీ చవి చచ్చిపోయింది.
"నాన్నోయ్. రంగు పెన్సిళ్ళూ జామెంట్రీ బాక్సు మాష్టారుగారు తిడుతున్నారు"
"ఏమండోయ్ మరి..."
"నాన్నోయ్ మరేమో..."
"ఒరే నాయనా..."
షణ్ముఖం చరచర వెళ్ళిపోయాడు.
రోడ్డుమీద ఉసిగా నడుస్తున్నాడు. చురచుర ఎండనెత్తి మాడుస్తూ వుంది. అరిగిపోయిన చెప్పులు ఎండకు కరిగిన తారుకు మధ్యమధ్య అతుక్కుంటూ వున్నాయి. మైలు దూరం నడవాలి. నటరాజా సర్వీస్ నిగనిగలాడుతున్న నల్లటి ఎంబాసిడర్ షణ్ముఖం పక్కగా దూసుకుపోయింది. అది ఎవరి కారో తెలుసు.
ఆఫీసరు వెళ్ళాడు. తనకు ఇవ్వాళ ఆలస్యం కాక తప్పదు. నడక వేగం హెచ్చించాడు.
ఏమిటీ జీవితానికి అర్థం? ఈ బ్రతుక్కు ప్రయోజనం. అసలు తను బ్రతికేది కూడా ఒక బ్రతుకేనా?
సెంటర్ లో కొచ్చేసరికి క్లాక్ టవర్ "టంగ్"న ఒక దెబ్బకొట్టింది శ్రీరామ చంద్రమూర్తి విరిచిన శివ ధనుష్టకారంలా విన్పించింది షణ్ముఖానికి.
షణ్ముఖం చివ్వున తలెత్తి చూశాడు. సత్యాన్వేషణలో పడి విహరిస్తున్న మనసు తార్రోడ్డు మీద సెంటర్ లో నిలబడిపోయిన అతనిలోకి తిరిగి వచ్చింది.
పదిన్నర!
అమ్మయ్యో. పదిన్నరే?
అప్పుడే పదిన్నర అయింది. ఇంకా అరమైలు నడవాలి. సరిగ్గా బయలుదేరేప్పుడే అందరికి అన్నీ గుర్తొస్తాయి. వాళ్ళకు బొత్తిగా బుద్ధిలేదు.
నల్లత్రాచులా తారురోడ్డు షణ్ముఖం కళ్ళముందు పడుకొని వుంది.
"లేట్! లేట్! యూ ఆర్ ఆల్ వేస్ట్ లేట్ - బుద్ధి లేదూ! ఇలా అయితే సస్పెండు చేస్తాను..." ఆఫీసరు ఎగ్గొడ్డులా అరుస్తున్నట్టు కళ్ళముందు కన్పించాడు.
