షణ్ముఖం పరుగులాంటి నడకతో చెమటలు కక్కుతూ ఆఫీసులోకి వచ్చిపడ్డాడు.
మూడుసార్లు లేటయితే ఒక క్యాజువల్లీవు కట్ అవుతుంది ఆ తర్వాత మూడురోజుల లేటుకు ఒకరోజు జీతం కట్. పైగా ఎన్ని మాటలు పడాలి? ఎంత టెన్ షన్?
"ఆఫీసరు పిల్చారు." నురగలు కక్కుతూ ఆఫీసులోకి పడ్డ షణ్ముఖంతో అన్నాడు మునుస్వామి.
తను అనుకున్నంతా అయింది. ఆలస్యం అయినరోజే పిలుస్తాడు. తొమ్మిదింటికే వచ్చి కూర్చున్నరోజు ఒక్కసారీ పిలవరు. తను నడుస్తూ రావడం కార్లో వెళ్తూ చూసేవుంటాడు. అందుకే పిల్చి వుంటాడు.
"సార్? అయ్యగారు పిలుస్తున్నారు" ప్యూన్ వచ్చి చెప్పాడు. షణ్ముఖం కాళ్ళల్లో వణుకూ, మెదడులో హోరూ ప్రారంభం అయింది.
పులి బోనులోకి వెళ్తున్నట్టు గుండె దడదడలాడుతూ వుంటే ఆఫీసరు గదిలోకి వెళ్ళాడు.
"ఏం లేటుగా వచ్చావ్?"
"ఆలస్యం అయింది సార్!"
"ఏమిటా సమాధానం? స్టుపిడ్!"
"ఫూల్" అంటే ఫూల్ లాగా స్టుపిడ్ అంటే స్టుపిడ్ లా ఆఫీసరు ముందు ముఖం పెట్టడం నేర్చుకుని చాలా కాలం అయింది షణ్ముఖం.
"పలకవేం బుద్ధిలేదూ?"
అయినా మౌనంగానే నిల్చున్నాడు షణ్ముఖం. ఆఫీసర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకూడదని ఏనాడో తెలుసుకున్నాడు.
"క్యాష్ అంతా వెరిఫై చేసి క్యాష్ బుక్ క్లోజ్ చేసి సంతకం తీసుకో. ఇవ్వాళ ముప్పైఒకటో తారీఖని తెలుసుగా?"
"యస్ సార్!"
"వెళ్ళు!"
ఒక్కసారి బయటకు వచ్చిపడి గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాడు.
షణ్ముఖం బయటకి వచ్చిపడి తన సీటులో కూలబడ్డాడు. బుర్రంతా గందరగోళంగా వుంది.
ఛీ! వెధవ బ్రతుకు! ఆత్మగౌరవం లేని బతుకెందుకు. సర్వీసులో చేరిన వాడికి ఆత్మగౌరవం వుండకూడదట. రాజీనామా పత్రం రాసి ఆఫీసరుగాడి ముఖంమీద కొట్టి ఇంటికి పోతే...?
"ఏమండీ మందులు తెచ్చారా!"
"కందిపప్పూ చింతపండూ తెచ్చావురా నాయనా?"
"జామెంట్రీ బాక్స్ తెచ్చావా నాన్నా?"
"చిన్నదానికి ధారకం పోవడంలేదు. గ్లూకోజ్ తెమ్మని చెప్పాను గదండీ."
"అబ్బబ్బ! నోరు ముయ్యండే!" కళ్ళు మూసుకొని నొసలు నొక్కుకొంటూ అరిచాడు షణ్ముఖం.
సెక్షన్లో వాళ్ళంతా ఉలిక్కిపడి చూశారు.
"ఎవర్నండీ!" సహ ఉద్యోగి.
అప్పటికిగాని ఈ లోకంలోకి రాలేదు. ఫిలాసఫీ ఆనర్సు పాసయిన షణ్ముఖం.
"సారీ!" గాడ్రేజ్ తెరిచి ఫైల్సూ క్యాష్ బుక్కూ, వోచర్సూ, బల్లమీద పెట్టుకోసాగాడు. ఎవరికేసీ చూడకపోయినా అందరూ తనను చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నట్టు అనిపించింది షణ్ముఖానికి.
ఫిలాసఫీ ఆనర్సులో క్లాసు! వెధవక్లాసు ఎందుకు? తను ఎందుకు బతుకుతున్నాడో ఈ జీవితానికి అర్థం ఏమిటో? ఎంత ఆలోచించినా క్రాసు వర్డ్ పజిల్ లా తెగడం లేదు.
కాళ్ళులేక కాదు కాలం వచ్చి చిక్కినట్టు ఫిలాసఫీ గ్రాడ్యుయేట్ ఎకౌంటు సెక్షన్ లో యు.డి. గుమాస్తా అయ్యాడు. అదీ నాలుగేళ్ళ యల్.డి.సీ.గా పనిచేస్తేగాని కాలేదు. స్కూలు ఫైనల్ వాడు చెయ్యాల్సిన ఉద్యోగంలో పోస్టు గ్రాడ్యుయేట్ అయ్యే చేరాడు. ఏదో కొంతకాలం పని చేస్తే మంచి ఉద్యోగం రాగానే వెళ్ళిపోవాలనే ఉద్దేశ్యంతోనే చేరాడు. కాని మంచి ఉద్యోగం దొరకడం మాట అటుంచి ఉన్న ఉద్యోగం నిలుపుకోవడానికి తన సర్వశక్తులూ ధారపోసి, ఆత్మాభిమానం చంపుకొని పని చేశాడు. తర్వాత తీసుకోలేక పోతానా అని ఊబిలో కాలు వేశాడు. మోకాలు లోతు దిగబడిపోయాడు.
