జ్ఞానోదయం
షణ్ముఖం ఉలిక్కిపడి నిద్రలేచాడు.
ఆదిలక్ష్మి పాలవాడితో ఘర్షణ పడుతూ వుంది. విసుగ్గా మంచం దిగాడు షణ్ముఖం. అప్పటికే బారెడు పొద్దెక్కింది. గబగబా బాత్ రూంలోకి నడిచాడు.
ఇవ్వాళ ముప్పై ఒకటో తారీఖు. సాయంత్రంలోగా పని పూర్తిచేసి ఆఫీసరుకు చూపించకపోతే తను వినాల్సిన మాటలు ఆ భగవంతుడికే తెలుసు! ఆఫీసర్ మరి! ఏమైనా అంటాడు. తను ఆఫ్టరాల్ ఒక ఎన్.జీ.ఓ. ఏమన్నా తల వంచుకొని పడాలి. తలెత్తి వినకూడదు.
త్వరత్వరగా స్నానం ముగించాడు. నాలుగు పచ్చడి ముద్దలు మింగి ఆఫీసుకు బయలుదేరాడు.
"ఏమండీ?"
గడప దాటుతున్న షణ్ముఖం ఆగాడు. విసుగ్గా భార్య ముఖంలోకి చూశాడు.
"ఇవ్వాళన్నా పెందలాడే వస్తారా?"
షణ్ముఖానికి వళ్ళు మండిపోయింది.
"మాట్లాడరేం? దీనంగా అన్నది ఆదిలక్ష్మి. షణ్ముఖం మాట్లాడలేదు.
"నిన్న కూడా పాపకు మందు లేదు. పిల్లవాడికి కోరింత దగ్గు ఎక్కువైంది."
షణ్ముఖం భార్య ముఖంలోకి చూశాడు.
ఆమె చూపులు అతని గుండెలకు తుమ్మ ముళ్ళలా గుచ్చుకున్నాయ్. అపరాధిని చూసినట్టు చూస్తున్న భర్తను భార్య.
"మాట్లాడరేం?"
తను ఏం మాట్లాడాలి? తను రావాలని రోజూ ఆలస్యంగా వస్తున్నాడా? తనకేదో ఆకర్షణ వుండి కూర్చుంటున్నాడా? తనేమన్నా ఆఫీసరా కావాలన్నప్పుడు సీటు నుంచి లేచి వచ్చి గవర్నమెంటు కార్లో దర్జాగా కూర్చుని బయలు దేరటానికి? దీనికి బొత్తిగా బుద్ధి లేదు. తన గురించి బొత్తిగా ఆలోచించదు.
"మాట్లాడరేం? ఒకవైపు చిన్న వాళ్ళిద్దరికి జబ్బు. మీ అమ్మగారికి తన పూజలతోనే సరిపోతుంది. ఇంత చాకిరీతో సతమతమై పోతున్నాను. మీరేమో రాత్రి తొమ్మిదింటిదాకా రారాయె! పెళ్ళాం బిడ్డలు గుర్తున్న వుండదా మీకు?"
"అయిందా?" కోపంగా అన్నాడు.
ఆదిలక్ష్మి కళ్ళల్లో నీరు తిరిగింది.
"మీకు బొత్తిగా మా గురించి ఆలోచనే వుండదు." ఆదిలక్ష్మికి దుఃఖం పొర్లుకొచ్చింది. ఆ పైకి మాట్లాడలేక పోయింది. "ఛీ! ఛీ! ఇదొకటి! నీళ్ళకుండ ఎప్పుడూ నెత్తినే వుంటుంది. నా బిడ్డలూ నేనూ మీకు అంత బరువై పోయామా" వీడుస్తూనే అన్నది భార్య.
దీని బిడ్డలట! తన బిడ్డలు కారూ! తన పెళ్ళాం అన్నా తన పిల్లలన్నా తనకు పట్టటంలేదా? వాళ్ళు తనకు బరువు అనుకుంటున్నాడా? అలా అనుకుంటే ఏనాడో ఈ బాధ్యతల నుండి పారిపోయేవాడు! దీనికి ఆ మాత్రం జ్ఞానం లేదు.
ఆదిలక్ష్మి కళ్ళు తుడుచుకుంది.
ముందు ఏడుపు పుట్టి ఆ తర్వాత ఇది పుట్టింది. దీని బతుకంతా ఏడుపే. ఈ ఇంటి కప్పూ గోడలూ దీని కన్నీళ్ళతో నాని నాని కూలిపోతాయి.
షణ్ముఖం రెండడుగులు ముందుకు వేశాడు.
"నా గోడు ఆలకించే వాళ్ళే లేరు." ఎక్కిళ్ళ మధ్య నుంచి ఆదిలక్ష్మి కంఠం.
ఓ భగవంతుడా! ఎక్కడున్నావయ్యా? ఒక ఏనుగు ఏడిస్తేనే "సిరికిం చెప్పడు - శంఖు చక్ర యుగమున్ చేదోయి సంధింపడు ..." ఇంకా ఏమేమో వదిలేసి పరిగెత్తికొచ్చావటగా? నువ్వు ఆపద్బాంధవుడివట! కరుణామయుడివట. ఒక మనిషి అందులో ఆడమనిషి ఏడుపు. ఏడువు ఏడువు కదిలించినంత మాత్రం నిన్ను కదిలించలేక పోతుందా? మరెందుకు రావు? నీ గురించి చెప్పిందంతా అబద్ధమేనా?"
