Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 16


    ఇవన్నీ కూడా తను భరించనా, క్రమశిక్షణ పేరుతో హాస్టలునించి బర్తరఫ్ చేస్తారు.


    అదే జరిగితే తనిన్నాళ్ళు కలలు కన్న బంగారు కలలు చెదిరిపోతాయి. వ్రతం చెడినా ఫలితం దక్కని సామెత అవుతుంది. తండ్రి అశాంతితో చనిపోతాడు. తన బతుకు బజారు పాలవుతుంది.


     అవంతి కిటికీ దగ్గరగా వెళ్ళి నిల్చుంది.


    దూరంగా లోకల్ ట్రైన్ వెళుతోంది.


    రోజూ కంటికి అత్యంత రమణీయంగా కనబడే అందమైన దృశ్యమే తనని పట్టి పీడిస్తోన్న పిశాచాల్లా కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళనిండా నీరు తిరిగింది. మెదడు మొద్దుబారిపోతుంది.


    ఓసారి చేత్తో పొట్టపైన సవరదీసుకొంది.


    తొలిసారిగా కడుపున పడ్డ శిశువు మొదటిసారిగా "అమ్మా" అని పిలిచి తనని మాతృమూర్తిని చేయబోయే ఆ చిన్నారిని చేతులారా ఎలా పొట్టనబెట్టుకోవాలి?


    ఆడదానిగా పుట్టడం కంటే ఏ అడవిలోనో చెట్టుగానో, పుట్టగానో పుడితే సుఖం కాదా?


    ఏ వ్యక్తి వల్ల తనకి కడుపొచ్చిందో అవంతికి తెలుసు.


    అతను...... మనోహర్. మనోహర్ కి చెప్పాలి?


    విని....


    ..... నవ్వుతాడు.


    సిల్లీ అని తేలిగ్గా కొట్టిపారేస్తాడు.


    అసలు తనే కారణమని నమ్మకం ఏమిటంటాడు? డాక్టర్ దగ్గరికెళ్ళి అబార్షన్ చేయించుకోమంటాడు.


    అంతకంటే ఏమీ చెప్పడు, అనడు.


    మనోహర్ గురించి ఆమెకి తెలీని విషయాలేమీ లేవు.


    అవంతికి ఏడుపొచ్చింది.


    ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.


    రమణి మెల్లగా ఆమె దగ్గరగా వచ్చి భుజంపైన చెయ్యివేసింది.


    "ఏడుస్తున్నావా? ఛీ..... నువ్వేడిస్తే నా గుండె పగిలిపోయేలా ఉంది ప్లీజ్! ఒక్కసారి నవ్వు" అంది రమణి.


    "ఎలా నవ్వను? నా బతుకిలా కాలిపోతున్నందుకు నవ్వనా?" ఆవేదనగా అంది అవంతి.


    "అవంతీ, నువ్వింత పిరికిదానివని నేననుకోలేదు."


    "స్టాపిట్. నేను పిరికిదాన్ని కాదు."


    ఏదో సెంటిమెంట్ వెంటాడి నన్ను పీడిస్తోంది అంతే! అదేమిటి అర్థంకాక ఈ బాధ" అంది అవంతి.


    "ఆ రోజు నాకెంతో ధైర్యం చెప్పావు. నీ మాటలు నాకు ఊపిరి పోశాయి. నాలా నువ్వూ గుండె దిటవు చేసుకో" రమణి లాలనగా అన్నది.


    అవంతి చురుకుగా చూసింది.


    "అదే నేనిప్పుడనుకుంటున్నాను, నీకెలా చెప్పగలిగానా అని ఆశ్చర్యంగా ఉంది. రమణీ, ఆనాడు నువ్వు నన్ను ద్వేషించలేదు కదూ,"


    "లేదు నా ప్రాణాన్ని కాపాడిన దేవతగా భావించాను!"


    "హు..... గొప్పదానివే. అదెంత పాప కార్యమో నాకు తెలుసు దానిలో నాకూ షేర్ ఉంది. అందుకే ఇప్పుడు నాకీ పనిష్మెంట్."


    "సిల్లీ. కావాలని మనం చేయలేదు. మనకర్మ అంతే అనుకోవాలి."


    అవంతి రమణి మొహంలోకి చూసింది. ఆమె భుజంపైన తల ఆనించి అన్నది.


    "అదేదో మగాడికీ ఆడదానికీ వున్న తేడా! ఆడది మానభంగానికి గురైతే వచ్చిన కడుపుని సైతం మోసి ఆ బిడ్డని తల్లిగా సాకగలదు. కానీ మగాడు తన భార్యకాని ఆడదానికి తనవల్ల బిడ్డపుడితే  ఆ బిడ్డని తనబిడ్డలా అంగీకరించడు. ఏమైపోతోందంటావ్ మరి రక్త సంబంధం? అంటారేగానీ ఆ బందం, ఆ సంబంధం మగాడికేం తెలుసు! ఓ పసుపుతాడు మెడకు కట్టి, ఆ ఆడదానికి పుట్టిన సంతతినే రక్త సంబంధంగా భావించే దౌర్భాగ్య పరిస్తితిలో మగాడు మగ్గిపోతున్నాడు." అంది ఆవేశంగా అవంతి.


    "ప్లీజ్ ఆవేశపడకు. అన్నీ సర్దుకుంటాయి."


    "ఆవేశంకాదు. నిజం. నిజమే మాట్లాడుతున్నాను. మగాడి కామానికి ఆహుతి అయిపోయి,  బిడ్డల్ని కని, అటు వాళ్ళని పెంచుకోలేనని దిక్కుమాలిన స్థితిలో పెద్దవాళ్ళ కన్నెర్రకి భయపడి అనాధలుగా వదిలేస్తారు. ఆడది ఆ కడుపుకోతని మరిచిపోయినట్లు నటిస్తుందే తప్ప జీవితంలో మరిచిపోలేదు. అందుకే నేను తెగిస్తున్నాను.


    నాకు తాళిబొట్టు అవసరం లేదు.


    మొగుడు అవసరం లేదు.


    కానీబిడ్డల్ని కంటాను. వాళ్ళని అల్లారుముద్దుగా పెంచుతాను.


    పిరికితనంతో జీవితంలో రాజీపడలేక ఆత్మహత్యలకు తలపడేతోటి వాళ్ళకి ఆదర్శంగా నిలబడి సమాజానికి ఎదురుతిరిగి బతకమని చెప్పడమే నా ఆదర్శం.


    రమణి ఆ మాటలకి పిచ్చిదానిలా చూసింది.


    అవంతి కళ్ళలోని ఎర్రని జీరలు చూసి భయపడింది.


    రమణి, అవంతిని అమాంతం కౌగలించుకుంది.


    "నీలాంటి వాళ్ళు నూటికొక్కళ్ళుంటే ఆడవాళ్ళంతా అదృష్టవంతులే అయ్యేవారే, ఆ రోజు రావాలనే కోరుకుంటున్నాను. నీకు అన్ని విధాల మంచి జరగాలని మనసారా దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఐ విష్ యు ఆల్ సక్సెస్" అంది రమణి.


    అప్పుడు అవంతి పెదవులపైన చిన్న నవ్వు కదిలింది.


    "మరి ఇప్పుడేం చేస్తావు?" అడిగింది రమణి.


    "రేపు డాక్టర్ దగ్గరకెళుతున్నాను."


    అబార్షన్ చేయించుకొంటాను.    


    "ఇకముందు మాత్రం ఇలా జరగదు" ఆ మాటల్ని స్థిరచిత్తంతో అన్నది అవంతి.


    "అమ్మయ్య! ఇప్పుడు నా ప్రాణం కుదుటపడింది. నిన్ను చూసి భయపడి చచ్చాను. నీతోపాటు మూడురాత్రులు నాకు నిద్రలేదు. ఈ రాత్రన్నా సుఖంగా పడుకొందాం" అంది రమణి.


    "పిచ్చిపిల్లా, ఎందుకే నేనంటే నీకు అంత అభిమానం"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS