Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 16


    ఆ ఊరికి వెళ్ళిన తరుణ్ బస్టాండ్ లో బస్సుకోసం కాచుకుని వుంటాడు.గణపతిరాజు, అతని మనుషులు అలా వెళ్ళి కాఫీ తాగి రావడానికి బయల్దేరి వుంటారు.

 

    అక్కడ తరుణ్ ని వీళ్ళలో ఎవడో ఒకడు గమనిస్తాడు. అప్పటికప్పుడే ఎలా చంపాలో నిర్ణయం తీసుకుంటారు. అందరూ తలో పక్కనుంచి చుట్టుముడతారు. ఒకడు ముందునుంచి కత్తితో కడుపులో పొడుస్తాడు. రక్తం ఫౌంటైన్ లా చిమ్మి నేలమీద ఎర్రగా అమాయకంగా పరుచుకుంటుంది.

 

    ఆమె కెవ్వున అరవబోయి తమాయించుకుంది. అప్పటికే గణపతిరాజు మనుషులు కుటీరాన్ని దాటేశాడు. ఒక్కక్షణం ఆలస్యం చేస్తే తను ఊహించిందంతా నిజమవుతుంది. కాబట్టి ఇక అక్కడ వుండడం వేస్ట్.

 

    ఆమె రివ్వున వెనక్కి తిరిగింది.

 

    ఇది గమనించిన విమలాబాయి "మౌనికా! ఏమైనా అర్జెంట్ విషయమా?" అని అడిగింది.

 

    ఇక తప్పదని ఆమెవైపు తిరిగి "ఏమీ లేదమ్మా! ఊరకనే ఇలా వచ్చాను" అని మరో మాటకు తావివ్వకుండా వచ్చేసింది. ఆమె ఎంత వేగంగా నడుస్తోందంటే చూసేవాళ్ళకు పరిగెడుతున్నట్లు అనిపిస్తోంది.

 

    ఇక్కడికి వచ్చాక ఆమె మొదటిసారి మరొకరికోసం దేవుణ్ణి ప్రార్థిస్తోంది. తరుణ్ ని ఎలాగైనా తన గదిలో కనిపించేటట్లు చేయమని దేవుడికి మనసులోనే నమస్కరించింది. ఎక్కడో మనసుబెట్టి నడుస్తుండడంతో కాలు బొటనవేలు రాయికి కొట్టుకుంది. ఆమె అంత బాధనైనా ఓర్చుకుందిగాని నడక మాత్రం ఆపలేదు. వేలు నుంచి రక్తం కారుతుండడం తెలుస్తూనే వుంది. ఆమె మరింత మొండిగా ముందుకే అడుగులు వేస్తోంది.

 

    మహిళా సదన్ గేటు దగ్గరకి వెళ్ళేసరికి ఆమె భయం రెండింతలైంది. అక్కడ గణపతిరాజు, మరో నలుగురు వ్యక్తులు వున్నారు. అందరూ వచ్చి రక్తం తాగేంత క్రూరులుగా కనిపించారు.

 

    ఆమె వాళ్ళను సమీపించగానే "ఏమండీ" అని పిలిచాడు గణపతిరాజు.

 

    ఆమె ఆగలేదు గానీ మెల్లగా అడుగులేస్తోంది.

 

    "ఈ ఫోటోలో వున్న వ్యక్తిని మీరు చూశారా?"

 

    ఇప్పుడు అబద్ధం చెప్పక తప్పదు. అబద్ధం చెప్పచ్చా చెప్పకూడదా అన్న సందేహం రాలేదామెకి. పరిస్థితి అలాంటిది. తన మూలంగా ఒక జీవి చచ్చిపోకూడదన్నదే ఆమె తాపత్రయం. తనవల్ల అంత ఘోరం జరిగితే భరించే మానసిక స్థితి ఆమెకు లేదు.

 

    అందుకే చూడలేదన్నట్లు తల అడ్డంగా ఊపింది.

 

    "ఇదేమిటి?" గణపతిరాజు మహిళా సదన్ బిల్డింగ్ కేసి చూస్తూ అడిగాడు.

 

    "మహిళా సదన్" తన గొంతు వణకడం ఆమెకు తెలుస్తూనే వుంది.

 

    "ఎవరుంటారు?"

 

    "అమ్మాయిలు"

 

    "మగవాళ్ళు ఎవరూ వుండరా?"

 

    "ఉహూఁ - స్త్రీలే వుంటారు. కనీసం సెక్యూరిటీ గార్డ్ కూడా లోపలికి రాడు"

 

    "అంటే లోపలుండే అవకాశం లేదు. గణపతిరాజు తన అనుచరులతో అని అక్కణ్నుంచి కదిలాడు.

 

    "ఇద్దరు ఇక్కడే వుండండి. మేమిద్దరం వెళ్ళి అన్నావారి సత్రంలో ఓసారి వెతికివస్తాం" అతను అంటున్న మాటలు మౌనికకు వినిపించాయి.

 

    తరుణ్ ఇక్కడ లేకపోతే ఇక అయిపోయినట్టే. మరో అరగంటకు తను ఘోరమైన వార్త వింటుంది.

 

    ఆమెకు తొందర ఎక్కువైంది.

 

    ఎదురొచ్చిన అమ్మాయిలవైపు తలైనా ఎత్తి చూడలేదు. పరుగులాంటి నడకతో తన గది చేరుకుంది.

 

    పూర్తిగా మూసివున్న తలుపును చూడగానే ఆమెకి నవనాడులూ కుంగిపోయాయి. తలుపు మూసివుంటే అతను వెళ్ళిపోయాడన్న మాట.

 

    అలా అనుకోగానే ఆమె అక్కడ కూలబడిపోయేదేగానీ ఏదో చిన్న ఆశ ఆమెను నిలబెట్టింది.

 

    ఎవరికీ కనిపించకూడదని తలుపు వేసుకుని లోపల వున్నాడేమో అన్న అనుమానం ఆమెను మరింత ముందుకు నెట్టింది. అక్కడికి వెళ్ళేలోపు టెన్షన్ భరించలేక గుండె ఆగిపోతుందేమోనన్న సందేహం కూడా పట్టుకుంది. అందుకే గొంతెత్తి అతన్ని పిలవాలనుకుంది కానీ అది ఎంత పొరబాటో మరుక్షణంలోనే తెలియడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

 

    నాలుగు మెట్లను రెండు అంగల్లో ఎక్కింది. ద్వారం బయట నిలబడి విసురుగా తలుపును లోపలికి నెట్టింది.

 

    అతను అక్కడ లేడు.

 

                                                   *    *    *    *    *

 

    తరుణ్ గదిలో లేకపోవడంతో మౌనికకు ఒక్కసారిగా నిస్సత్తువ కమ్మింది. కలలో నడిచినట్లు నాలుగు అడుగులు వేసి మంచం మీద కూలబడి పోయింది. తన మూర్ఖత్వం వల్ల ఒక మనిషిని ప్రమాదంలోకి నెట్టానన్న భావన కన్నీళ్ళను లోపల నుంచి తోడుతోంది.

 

    అలా కళ్ళు మూసుకుంది.

 

    "హలో మౌనికగారూ! అప్పుడే వచ్చేశారా?"

 

    ఆమె కళ్ళు విప్పలేదు. తరుణ్ ఎదురుగ్గా నిలబడి మాట్లాడుతున్నాడన్ననమ్మకం ఆమెకు లేదు. అదంతా తన చిత్త భ్రమే అనుకుంటోంది.  

 

    "హలో! మిమ్మల్నే" అన్నాడు మళ్ళీ.

 

    అప్పటికి కళ్ళు తెరిచింది. ఎదురుగ్గా నవ్వుతూ నిలబడివున్న తరుణ్ ని చూడగానే యిది కలా? నిజమా? అన్న సందిగ్ధంలో పడిపోయింది. అదీ ఒక్క క్షణమే. ఇదంతా నిజమేనని అనిపించడంతో ఆనందం లోపలినుంచి పైకి చిమ్ముకొస్తోంది.

 

    కన్నీళ్ళు దానంతటనే కారిపోతున్నాయి.

 

    "మీరు.... మీరు..." ఆపైన మాట్లాడడానికి సంతోషం అడ్డం పడుతోంది.

 

    "ఎందుకట్లా వణికిపోతున్నారు? నేను తరుణ్ ని"

 

    "మీరు వెళ్ళిపోలేదా?"

 

    "లేదండి. అయాం సారీ . వెళ్ళాలనే అనుకున్నాను. ఏదీ ఈ తాళం కనిపిస్తే కదా. తాళం వేయకుండా వెళ్ళిపోతే దొంగతనం జరుగుతుందేమోనన్న అనుమానంకొద్దీ వెళ్ళలేకపోయాడు. ముందు గదిలో వెదికితే కనపడలేదు. అందువల్లే లోపలున్న గదిలో వుండచ్చని వెదుకుతూ వుంటే మీరొచ్చారు."

 

    ఆమెలో ఆనందమూ ఆగలేదు, కన్నీళ్ళూ ఆగలేదు. అదన్నమాట విషయం. తాళం కోసం వెదుకుతూ లోపలున్న గదిలో వుండిపోయాడు. అందుకే తలుపు తెరవగానే కనిపించలేదు.

 

    "ఇక్కడ గదులకు తాళాలు వేయరు. విలువైనవేవీ వుండవు. అందులోనూ ఇక్కడ దొంగతనాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS