Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 16

"లేదు మేడమ్... సాయంత్రంవరకు ఈ స్థలంలోనుంచి కదలకుండా అమ్మితే ఒక పెద్దమనిషి యాబైరూపాయలు ఇస్తానని పాతిక రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు కూడా" అన్నాడతను.
అతని మాటలతో ధీరజ సందేహం పటాపంచలయిపోయింది.
"సరే ఒక పని చెయ్... ఆ పాతిక నేను ఇస్తాను... ఒకసారి నీ ఐస్ క్రీం పెట్టె క్రింద ఏం వుందో నన్ను చూడనియ్."
అందులో ఎలాంటి తప్పూ తోచలేదు అతనికి.
ఊరికినే పాతిక వస్తుంటే కాదు అని ఎలా అనగలడు. అతనికి ఇచ్చినమాటలో తను అంగుళం కూడా కదలకుండా అమ్మాలి అని ఉందే తప్ప ఎవరినీ ఐస్ క్రీం పెట్టెకింద చూడనివ్వకూడదు అని లేదు కాబట్టి అతను ఆనందంగా తల వూపాడు.
మోకాళ్ళపై కూర్చుని, ఆ పెట్టెకింద చెయ్యి పెట్టి వెదకగా ఒక ప్లాస్టిక్ కవర్ నలిగిపోయి కనిపించింది. అది తప్ప అక్కడ ఏమీ లేదు.
దానిని అందుకుని అనుమానంగా చూసింది.
దానిపై 'మిఠాయి పొట్లం' అని వ్రాసింది.
ధీరజకు దాని అర్ధం ఏమిటో అంతుపట్టలేదు.
స్వీట్స్ అమ్మీ షాపు ఎక్కడ అయినా ఉందేమోనని పార్క్ మొత్తం వెదికినా ఎక్కడా కనిపించలేదు ఆమె కంటికి.
వాచీవంక చూసుకుంది.
ఒంటిగంట అయింది!
లంచ్ చేసిన తరువాత వెదకవచ్చని బాక్స్ తెరిచింది. మిగిలిన వాళ్ళంతా ఎప్పుడో తమ బంధువులు తెచ్చిన టిఫిన్ పొట్లాలను ఆరగించడంలో మునిగిపోయారు.
అందరూ ఒక గంట విశ్రాంతి తీసుకుని తిరిగి సెర్చింగ్ ప్రారంభించారు.
సాయత్రం నాలుగు గంటలయింది.
ధీరజలో టెన్షన్ అధికం అయింది.
పార్కలో చిన్నపిల్లలు ఆడుకుంటూ పాటలుపాడుతూ చిందులు వేస్తున్నారు. వాళ్ళ వేపే చూస్తూ కూర్చుని వుండిపోయింది.
పిల్లలు పాడుతున్న పాటలోని ఒక చరణం వినడంతో ఆమె అలసట అంతా ఎగిరిపోయింది.
'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం' అంటే తేనెతుట్టె... పార్క్ లోని చెట్లలో యే చెట్టు కొమ్మల్లో తేనెతుట్టె వున్నదో వెదక సాగింది.
చివరకు ఒక కొబ్బరిచెట్టు పై భాగంలోతేనెతుట్టె కనిపించింది.
ఆ చెట్టుకింద నున్న రాతి బండపై ఒక యారో మార్క్ వేసి వుంది.
ఆవేపు మరొకచెట్టు వుంది. ఆ చెట్టు దగ్గరనుంచి ఇంకొక చోటకు... తరువాత మరొక చోటకి అలా జిగ్ జాగ్ గా అయిదు నిమిషాల పాటు తిప్పించాక ఒకచోట "యూ ఆర్ సక్సెస్... యూ ఆర్ ది విన్నర్ ఆఫ్ దిస్ రాయల్ ట్రెజర్ హంట్" అన్న స్లిప్ వున్న అట్టపెట్టె దొరికింది.
ధీరజ ఆనందంతో ఎగిరి గంతులేసినంత పని చేసింది.
ఉత్సాహంగా పరుగుదీసింది.
ఆ స్లిప్ చూసిన నిర్వాహుకులు ఆమెను అభినందించారు.
"మేడమ్ యూ హావ్ గాట్ అవర్ ట్రెజర్ హంట్... వెల్ కమ్ అండ్ హావ్  ఇట్" అంటూ లక్షరూపాయలున్న ఐదువందల రూపాయల నోట్లు వున్న బండిల్ అందిస్తూ హాండ్ మైక్ లో ఆ విషయాన్ని ఎనౌన్స్ చేశారు.
అప్పటికీ దినపత్రికలో ఎడ్వర్ టైజ్ మెంట్ కు, ఏర్పాట్లు ఖర్చులు పోను డెభయి ఐయిదువేలు మిగిలాయి.
అయితే అంతకంటే వాళ్ళకు అండర్ గ్రౌండులో జరిగిన లావాదేవీలలో జయచంద్ర పదిశాతం ఇచ్చాడు.
చట్టబద్దంగా, ఎవరికీ అనుమానం రాకుండా సత్యమోహన్ రచించిన పథకం యిది. నిజానికి రెండువందలమంది పోటీ దారులలో యాభయిమందివరకూ జయచంద్రతో చీకటి వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళే!
ఆరోజు చేతులుమారిన సూట్ కేసుల విలువ కోట్ల రూపాయలలో వుంది.
మూడవకంటికి తెలియకుండా దొంగనోట్ల మార్పిడి సజావుగా జరిగిపోయిందని భావించారు జయచంద్ర, సత్యమోహన్ లు.
కానీ, వాళ్ళు ఎవరూ ఊహించని రీతిలో జర్నలిస్టు ధీరజ మినీ కెమేరాతో నోట్ల మార్పిడి చేసిన ప్రతి ఒక్కరినీ ఫోటోలు తీసింది.
నిజానికి ఆమె వచ్చింది ట్రెజర్ హంట్ ను సాదించాలని... అయితే అనుకున్న విజయాన్ని సాధించడంతోపాటు అనుకోని ఆదృష్టం కూడా ఆమెనే వరించింది!
ట్రెజర్ ఎమౌంట్ తీసుకుని బయటకు నడిచింది ధీరజ.
పార్క్ గేట్ దాటి లోయర్ టాంక్ బండ్ రోడ్ లోకి తిరిగింది ఆమె హోండా. ఉన్నట్టుండి ఇందిరా పార్క్ గోడ దగ్గరవున్న ఐదుగురు వ్యక్తులు ఆమె తోవకు అడ్డంగా వచ్చి నిలుచున్నారు.
అది గమనించిన ఆమె బ్రేక్ వేసి కిందకు దిగింది.
"వాట్! ప్రెండ్స్... పందెంలో మీరు ఓడిపోయి, నేను గెలిచినందుకు ప్రత్యేకంగా అభినందించటానికి వచ్చారా?"
"అవును. అభినందిద్దామనే వచ్చాం. నీ దగ్గరవున ఆ డబ్బు ఇచ్చెయ్యమ్మా. అభినందనలతోపాటు ఆనందాన్ని కూడా పంచుకుందాం" అన్నాడు ఒకడు.
"ఓహో ఆ రూట్ లోవస్తున్నారా? మరి అయిదుగురు వున్నారు కదా, ఆనందాన్ని కూడా ఐదుగురూ కలిసే పంచుకుంటారా?"
"అవును అమ్మడూ... నిన్ను మేము అయిదుగురమూ కలిసే పంచుకుంటాం. ఏం భయం వేస్తుందా?" రెండోవాడు ఎకసక్కెంగా అన్నాడు.
"వైనాట్... ఆనందాన్ని అనుభవించేది మీరు అయినపుడు నాకేం భయం."
ఆమె మాటలకు అర్ధం వారికి భోధపడలేదు.
"కమాన్... ముందు ఆ డబ్బు ఇచ్చెయ్"
ఆమె అంత తమ్దరగా తమ దారిలోకి వస్తుందని వాళ్ళు వూహించలేదు.
"ఊ...తీసుకొండి"
అంటున్నా మాటలోనే విసురుగా లేచింది కుడికాలు. పెద్ద సుత్తిలా అతని కడుపులో తాకింది. కెవ్వున కేకవేస్తూ మోకాళ్ళపై కూలపడిబోయాడు.
బాధతో మెలికలు తిరుగుతున్నాడు అతను.
అది గమనించిన నలుగురూ రంకెలువేస్తూ ఆమెపైకి వచ్చారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS