పైన కవ్వించినంత సేపు వాల్మీకి ప్రయత్నం చేయలేదు. ఆ స్థితిలో దాన్ని అందనివ్వరు కాబట్టి! అంతే అలిసిపోయి నేలమీద నిలిచిన సమయంలో అది బాగా క్రిందికి వచ్చింది.
అలసిపోయివున్న సహచరులు అందరికన్నా ముందుగా గాలితో లేచాడు వాల్మీకి. ఎంతో సులభంగా ఉట్టిని కొట్టేశాడు.
ఇది చాలా అకస్మాత్తుగా దొంగదెబ్బలా అన్పించింది. వెర్రి ముఖాలేసుకుని చూస్తూ ఉండిపోయారు.
ఆమని ఇచ్చిన ఉంగరాన్ని గెలుచుకుని గర్వంగా చూచాడు వాల్మీకి! ఉట్టి కొట్టటానికి యువకులు ఎగిరే సమయంలో కొందరు ప్రోత్సహిస్తారు. కాని అక్కడ చేరిన యువతుల సమూహం వారి సామర్ధ్యాన్ని, ప్రయత్నాన్ని నిరోధిస్తూ ఎర్రనీళ్ళు చల్లుతున్నారు.
వాల్మీకి బట్టలు తడిశాయి. అతడు నేరుగా వెళ్ళిపోయి చెరువులో దిగి స్నానం చేశాడు. మంచిబట్టలు కట్టుకుని తిరిగివచ్చి గట్టుమీద ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు.
ప్రక్కన అడుగుల చప్పుడు వినిపిస్తే తల ఎత్తి చూశాడు!
పసిపిల్లలా మెత్తని అడుగులు వేస్తూ అతని వైపుగా చెట్టుచాటు నుంచి వస్తోంది ఆమని! కాని ఆమె అడుగుల క్రింద ఎండుటాకులు పడి గలగలమని చప్పుడు అయింది!
వాల్మీకి ఆమె రాకను గమనించాడు!
"మీ వస్తువులు అన్నీ నా దగ్గరకే చేరిపోతున్నాయేమిటి?" అన్నాడు మైత్రీ పూర్వకమైన కంఠస్వరంతో!
"అన్నీ అంటే-? ఎన్ని ఉన్నాయట?" అంది ఆమని!
అతడు రింగ్, చెయిన్ తీసి చూపించాడు.
"రెండు చేరాయి నా దగ్గరకి" అన్నాడు.
"రెండే కదా! ఉంచుకోండి!"
"కాదు తిరిగి ఇచ్చేద్దామనుకుంటున్నాను"
"మీరు వాటిని మీ ప్రతిభతో గెలుచుకున్నారు. తిరిగి యివ్వాలనుకోవటం ఏమిటి? ఒకసారి మీరు గెలుచుకున్న తరువాత తిరిగి యిచ్చినా మీదే అవుతుంది. కాని మాదికాదు.
అర్హతలున్నవారికి రెండేమిటి? ఎన్ని బహుమతులు అయినా రావచ్చు! అవన్నీ వారికి స్వంతమే అన్నదామె.
చనువుగా వెళ్ళి పాతకాలపు బంధువు అయినంత మక్కువగా అతని ప్రక్కనే కూర్చుంది.
"ఏదో తమాషాకోసం పందాలు కాచుకుంటాం! అది ఆ కాసేపు ఆనందించటానికే. కాని ఇంత విలువయిన బంగారం ఎలా తీసుకోను. అవకాశం దొరికింది కదా అని మిమ్మల్ని కష్టపెట్టటం నాకు యిష్టంలేదు" అన్నాడు వాల్మీకి! ఇచ్చుకోవటంలో ఉన్న ఆనందమేమిటో మేము అనుభవించిన తరువాత అది నష్టం ఎలా అవుతుంది.
రెండేకదా సార్!
ఒకటి నా జ్ఞాపకంగా రెండు అక్క జ్ఞాపకంగా వుంచుకోండి! అవి రెండు మీ దగ్గర వుంటేనే మాకు ఆనందం" తీసుకునేందుకు నిరాకరించింది ఆమని!
అక్కగారంటే ఎవరు? నాకు మీరు తెలుసు! ఆమె ఎవరో తెలియదు. ఎలా జ్ఞాపకం పెట్టుకోను-?" అని ప్రశ్నించాడు వాల్మీకి.
"అక్క తెలియకపోవటం ఏమిటి? మీ ఇద్దరికి పెళ్ళి అనుకుంటున్నారు కదా?" అంది ఏమీ ఎరుగనిదానిలా!
"పెళ్ళా ఎవరు అనుకుంటున్నారు?"
"ఊళ్ళో అందరూ అనుకుంటూ వుంటే నాకు తెలిసింది."
"ప్రస్తుతం కొంతకాలంపాటు పెళ్ళి చేసుకోకుండా వుండాలని తీర్మానించుకున్నాను. ఈ విషయం ఎవరు ప్రచారం చేశారో నాకు తెలియదు"
"బహుశా కరణంగారు ప్రచారం చేశారనుకుంటా" అంది ఆమని! మమ్మీ పేరు బయటకు రాకుండా వుండటానికి ఆమె అలా చేసింది.
లింగమూర్తి పేరు వినగానే వాల్మీకి మండిపడ్డాడు.
"ఇలాంటి వాళ్ళకి పుకార్లు పెట్టటం తప్ప మరో పని ఉండదు. అయినా ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం ఏమిటి? అతనెందుకు ఇలా అనుకుంటున్నాడో తేల్చుకుంటాను" అన్నాడు కొంచెం వేడిగా!
లింగమూర్తితో అతడు మాటాడినా మమ్మీ పేరు బయటపడే అవకాశం ఉంది. అటువంటిది జరగకుండా చూచుకోవాలి.
"ఈ ప్రచారం అయినందువల్ల ఎవరికి నష్టం జరుగుతుందంటారు."
"మీ అక్క పెళ్ళి కావలసిన పిల్ల! ఎంతో పరువు ప్రతిష్టలు కలిగిన వారు రాణి సుమిత్రగారు! ఒకప్పుడు మా నాన్నగారు వ్యాపారంలో సర్వస్వం కోల్పోయి వట్టి చేతులతో ఈ ఊరికి వచ్చారు.
అలాంటి సమయంలో అమ్మగారు మమ్మల్ని ఆదుకున్నారు. తిరిగి మేం సంపాదించుకున్న తరువాత మీ డబ్బులు ఇచ్చేశాం అనుకోండి. అయినా మా కుటుంబం మీ సాయాన్ని మర్చిపోకూడదు.
అలాంటిది మీకు కష్టం కలిగేలా మాటలు ప్రచారం కావటం నాకు ఎంతో బాధను కలిగిస్తోంది" అన్నాడు వాల్మీకి.
"జరగవలసిన ప్రచారం ఎలాగో జరిగిపోయింది కాబట్టి అక్కను పెళ్ళి చేసుకుంటే తీరిపోతుంది కదా?" అంది ఆమని!
"ప్రస్తుతం పెళ్ళిచేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు. ఇంకా చాలా సాధించాలి"
"ఆ సాధించేది ఏదో పెళ్ళి చేసుకుని సాధించవచ్చు కదా?"
"నిజమే అనుకోండి.... కాని...."
"అదంతా తరువాత వింటాను. అక్క ఎంత యోగ్యురాలు అనుకుంటున్నారు? నాలాంటిది కాదు. పాపం నోరులేని మనిషి! రుక్మిణీదేవికి అవతారం అనుకోండి!"
అతను నవ్వాడు!
"మరి మీరు సత్యభామలా భయపెట్టేస్తారేం?" అన్నాడు.
"మా యిద్దరినీ రెండుదారులు! తీరులు వేరు వేరు! అయినా ఒకరంటే ఒకరికి ప్రాణం! మా ఇద్దరిదీ ఒకే ప్రాణంలాగా పెరిగాం!
నిజం చెప్తున్నాను. ఇవన్నీ విన్న తరువాత అక్కకూడ మిమ్మల్ని చేసుకోవాలనే కోరికతో వుంది. మీరు కాదు కూడదు అంటే దాని మనసు ఎంతయినా గాయపడుతుంది.
నా మాటవిని మీ అభిప్రాయం మార్చుకోవటం మంచిది!" అంటూ రాయబారం నడిపించింది ఆమని!
అతడు ఎలాంటి వాగ్దానం చేయలేదు. అసలు మాటాడలేదు. మౌనంగా వుండిపోయాడు.
"వసంతోత్సవాలు, దొంగలు దోపిడీ మిగిలున్నాయి. బహుశా నేను పాల్గొనే ఆఖరు బ్రహ్మోత్సవం ఇదే అనుకుంటా! ఆ తరువాత చదువు, ఉద్యోగం ఎవరెక్కడ వుంటారో?! ఏమైపోతారో!?
కాలమనే పేటికను తెరచి చూచిన వారు ఎవరున్నారు? దానిలో ఎన్నో అద్భుతాలు రహస్యాలు దాగి ఉన్నాయో!?" అంది ఆమని!
"ఉద్యోగం చేయాల్సిన అవసరం మీకేమిటి?"
"డబ్బు వుండగానే జీవితం నిండయినది అనుకునే స్వభావం కాదు నాది! ఉద్యోగం పురుష లక్షణం అనేది ఒకనాటి మాట! ఉద్యోగం ఉభయ లక్షణం అనేది నేటిమాట!
ఆడవాళ్ళూ మగవాళ్ళూ సమానంగా ఉద్యోగం చేయాలి! రాణించాలి!"
"అవునూ! ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు?"
"కలెక్టర్ కావాలనేది నా జీవిత ఆశయం! ఆశలన్నీ తీరకపోవచ్చు సాధించేందుకు శక్తి చాలకపోవచ్చు. ముందు జాగ్రత్త కోసం ఒక్కసారి మెడికల్ ఎంట్రన్స్ వ్రాస్తాను. సీటువస్తే అప్పుడు ఒక దారిని స్థిరంగా నిర్ణయించుకుంటాను.
మొత్తం మీద చదువు ఉద్యోగం అనేవి నేను వెళ్ళదలుచుకున్న దారులు. వాటినించి నన్ను ఎవరూ వేరు చేయలేదు" ఉద్వేగంగా అంది ఆమని.
"విష్ యూ ఆల్ సక్సెస్" ఆమె సిన్సియారిటీకి తగిన విధంగా మనఃపూర్వకమయిన శుభాకాంక్షలు తెలియజేశాడు వాల్మీకి!
"దొంగల దోపిడి ప్రోగ్రాం ఏమిటి?" అంది ఆమని తేరుకుని!
అది వినగానే అతడు పెద్దపెట్టున నవ్వాడు.
"పాల్గొనేందుకు సరదాగానే వుంటుంది. కానీ సాధారణంగా ఆ వేళ ఆ ఛాయలకు ఆడపిల్లలు ఎవరూరారు. ఎందుకంటే ముగింపు ఉత్సవం అది! మగవాళ్ళు మరీ కోతులు అయిపోతారు.
ఆడపిల్లలు ఇల్లు కదిలేందుకు కూడా భయపడతారు."
"మాకు అలాంటి భయం లేదు. మీరు సాయంగా వుంటారు కదా?"
"మీరు భలే మెలికలు వేస్తారండీ! చాలా తెలివిగా ముడివేశారు, విప్పడం ఎవరికయినా కష్టమే" అన్నాడు వాల్మీకి!
"మీరు ఏమయినా అనుకోండి! ఆ రోజు మాత్రం మాకు సాయంగా వుంటారు. వుంటున్నారు. మేము వస్తున్నాం. అంతే!" అంటూ తీర్మానం చేసినట్టు ప్రకటించింది. అతడు కాదనలేకపోయాడు!
"అయితే ఆ రోజు కోతులుగా మారిన యువకుల్లో ఎప్పుడు ఎవరేం చేస్తారో తెలియదు! అందువల్ల మనం నేరుగా మన కార్యక్రమాలు నిర్ణయించుకోవాలి! కాని రాత్రి సమయంలో మీరు ఇల్లు వదిలి రాగలరా?"
"తొమ్మిది గంటల తరువాత మమ్మీ నిద్రపోతారు. ఇంక తెల్లవారు ఝామున నాలుగున్నర వరకు ప్రపంచం తల్లక్రిందులు అయినా నిద్రలేవరు! అది మంచి సమయమే!" అంది ఆమని.
"మేము రాగలం" అని షెడ్యూల్ ని ధృవీకరించి చెప్పిందామె! వాల్మీకి ఆశ్చర్యపోయాడు.
