పారిజాత దుఃఖంతో వణికిపోతూనే ఆవేశంగా లలిత చేతులందుకొంది. "నువ్వు నా స్నేహితురాలివే కాదు! ఇవాళ నాకు జ్ఞానభిక్ష పెట్టిన దేవతవు. నీ మేలు జన్మలో మరిచిపోను!" అంది.
6
"పారూ! నువ్విక్కడున్నావా! మీనాన్నగారు వాంతి చేసుకొంటున్నారు!"
పారిజాత గబుక్కున పరిగెత్తింది.
కాంపౌండ్ లో ఓ ప్రక్కగా కృష్ణారావు వాంతి చేసుకొని, నోరు పుక్కిలించి లోపలికి వస్తున్నాడు.
"ఏం నాన్నా? ఏమైంది" పారిజాత తండ్రి చెయ్యి అందుకొంది.
"తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్సేపు పడుకొంటాను. ఆ పిల్లలకి కాస్సేపు పాఠాలు చదివించి వాళ్ళని వదిలిపెట్టు"
కృష్ణారావుకు ఎప్పుడైనా కాస్త సుస్తీ అయితే ఆ రోజంతా విశ్రాంతి తీసుకొంటే తగ్గిపోయేది. ఈసారి మాత్రం అలా వదిలి పెట్టలేదు. తీవ్రమైన జ్వరం, మూలగడం మొదలయ్యాయి.
రంగనాధం ఫ్యాక్టరీనుండి వచ్చి చూసి, "పక్కమీద విశ్రాంతిగా పడుకొంటే మందులు లేకుండా రోగాలు నయమైపోతాయా? ఇదేం మూర్ఖంరా?" అని కేకలేసి, రిక్షాని పిలిచి కృష్ణారావును డాక్టరు దగ్గరికి తీసుకుపోయాడు.
వారంరోజులు పక్క దిగలేదు కృష్ణారావు రోజూ రిక్షాలో డాక్టరు దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు.
పిల్లలకి పారిజాతే పాఠాలు చెప్పి పంపిస్తోంది.
ఆ రోజు ఫస్టుతారీకు.
పాఠాలు చెప్పించుకోడానికి పిల్లలెవరూ రాలేదు. వరండా ఖాళీగా, నిశ్శబ్దంగా వుంది. మరో రెండు రోజులు గడిచాయి. పిల్లలు ఒక్కరూ రాలేదు.
"ఏమిటో కనుక్కొని వస్తాను. ఆ తువాలు యిలా అందివ్వమ్మా!"
కృష్ణారావుకు ఒంట్లో నీరసం ఏం తగ్గలేదు. శరీరం తూలి పోతున్నట్టుగా ఉంది. వారం రోజుల జ్వరం ఆయన్ని పీల్చి పిప్పి చేసింది. అసలే సన్నపాటి మనిషేమో, ఈ జ్వరం తీసిన దెబ్బతో దీర్ఘకాలపు పేషెంటులా తయారయ్యాడు.
ఆ వీధిలోనే నాలుగిళ్ళ అవతల ఓ మేడఉంది. "బాగున్నారా, లక్ష్మిదేవమ్మగారూ?" అంటూ ఓ శుష్కహాసంతో ప్రవేశించాడు కృష్ణారావు.
"ఆఁ రండి మాస్టారూ! మీ ఆరోగ్యం ఈ మధ్య బాగుండ లేదని విన్నాను. ఎలా వుందిప్పుడు?" సాదరంగా ఆహ్వానించింది ఆ గృహిణి.
"కనిపించడం లేదూ? తిరిగి పూర్వపు మనిషిని కావడం ఉట్టిదే. అయినా కడుపు కింత సంపాదించుకోవాల్సిందే కదా?... పిల్లల్ని పంపడం లేదేమిటమ్మా?" అన్నాడు.
"ఈ వయసులో, ఈ అనారోగ్య పరిస్థితిలో మీకు విశ్రాంతి అవసరం మాస్టారూ! ఇంకా ఎన్నాళ్ళని పిల్లలకి పాఠాలు చెప్పగలుగుతారు? నా కొడుకులకి కూతుళ్ళకి మీరే చెప్పారు. వాళ్ళ పిల్లలకీ ఇప్పుడు చెబుతున్నారు. మీరంటే మా పెద్దబ్బాయికి ఎక్కడలేని గురుభక్తి. ఇన్నాళ్ళ మీ శ్రమకి మిమ్మల్ని ఓ రోజు యింటికి పిలిచి పంచెల చాపుపెట్టాలని అన్నాడు. ఈ వ్యాపారం గొడవల్లో తీరక మీ దగ్గరికి రాలేదు!"
"ఏదో ఇన్నాళ్ళు మీ ఆదరాభిమానాలవల్లే ఇలా ఈ ఊళ్ళోకాలు నిలవద్రొక్కు కొన్నాను" యెందుకో కృష్ణా రావు కళ్ళు చెమర్చాయి. "ఇది విశ్రాంతి తీసుకోవలసిన వయసేగాని. విశ్రాంతి తీసుకొంటే నాకు గడవదమ్మా! పిల్ల పెళ్ళికికూడా ఎదిగింది!"
"పారిజాతకు సంబంధం యెక్కడైనా కుదిరిందా, మాస్టారూ?"
"కుదరలేదు, చూస్తున్నాను. అనుకూలిస్తే ఈ సంవత్సరం చేసేస్తాను!"
"సంబంధం కుదిరాక ఓ మారు రండి. పిల్ల పెళ్ళికి పదో పాతికో సాయంచేస్తాను."
"పిల్లలు......"
"మీరు విశ్రాంతి తీసుకోండి మాస్టారూ! ఈ వయసులో మిమ్మల్ని శ్రమపెట్టడం భావ్యంగా ఉండదని పిల్లలకి మరోచోట ట్యూషన్ కుదిర్చాము."
పిడుగుపడ్డట్టుగా నిశ్చేష్టుడయ్యాడు కృష్ణారావు. "నేను పిల్లలకు పాఠాలు చెప్పగలనమ్మా! నా ఆరోగ్యం మరీ అంత చెడిపోలేదు. మా పారు బడి మానేసింది. నాకు సాయంగా ఆ పిల్ల ఉంటుంది."
