Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 15



    "నాన్నగారి ఆరోగ్యం చక్కబడితే నీలాగే జోడు కొబ్బరి కాయలు కొడతామని, నిలువుదోపు ఇస్తామని మొక్కుకొన్నాళ్ళు ఎందరో? దేవతా నువ్వేం లంచం ఆశపెట్టావు దైవానికి, మామయ్యకి నయమైతే?"

    అతడి ముసిముసి నవ్వులో ఒక ప్రాణికోసం మరొక ప్రాణి ఇంత బాధపడడం, వాపోవడం ఏమిటన్న హేళన ఉందేమో అనిపించింది దేవదాసికి.  "నువ్వు అప్పుడే వచ్చేశావేం? తిరిగి వెడతావా?"

    నాతో అంత అవసరం లేదక్కడ. కావలసిన దానికల్లా చేతిక్రింద మనుషులున్నారు కదాని అమ్మే వెళ్ళమంది."

    "మనకు అవసరంలేని పనులు చాలా ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనం ఉండడం కూడా అనవసరమే. అలా అని మనకై మనం వెళ్ళిపోతున్నామా?" అని నవ్వింది దేవదాసి. "అవసరం అణుమాత్రం లేకపోయినా బాధ్యతలేదూ? తండ్రి ఆరోగ్యానికై తపన చెందడం కొడుకుగా నీకనీస ధర్మం కాదూ? నువ్వు విదేశాలనుండి రాకముందు అత్తయ్య నీకోసం ఎంతగా ఎదురుచూచిందని? ఎంత విలపించిందని? అలాంటిదిప్పుడు తన దగ్గరుండకుండా నిన్ను పంపేసిందంటే నీ ప్రవర్తన ఆమెను నొప్పించి ఉంటుంది. బావా! నిజం చెప్పు! అక్కడుండడం ఇష్టంలేదూ నీకు?"

    "అబద్ధం ఆడే అలవాటు నాకులేదు. దేవతా! నిజంగా ఆ వాతావరణం నాకు చికాకనిపించింది."

    "ఎందుకు?"

    "నాన్న రోగశయ్యమీద మూలుగుతూ ఉన్నప్పుడు అమ్మ శోకదేవతలా కూర్చొని ఉంటుంది. వారిని కనిపెట్టుకొని ఆ విషాద వాతావరణంలో ఉండిపోవడమంటే ఏదో చెరసాలలో ఉన్నట్లనిపించింది."

    అతడి మాటలకు తీవ్రంగా విమర్శించాలన్న ఉద్రిక్తత ఏదో కలిగింది దేవదాసికి. మమతా, మానవతా గురించి ఆ మనసులేని మనిషికి చెప్పాలనిపించింది. మధ్యాహ్నం దాటి ఆకలిగొన్న కడుపుతో అన్నంముందు కూర్చొన్నవాడితో ఇప్పుడు వాదం పెట్టుకోవడం బాగుండదనిపించి అప్పటికి మౌనం వహించింది దేవదాసి.

   
       
                                                                                   3


    "మాయామోహ చక్రానబడి నశించిపోయేటి, వెర్రిజీవా!

    సతి మాయ, సుతులు మాయస్వరమూ మాయకన్ను తెరువుమో, మాయజీవా!"

    శాంతికీ, మమతకూ ప్రతి రూపాలుగా అగుపించే పావురాలకు గింజలు చల్లి అవి భుజాలమీద. చేతులమీద వాలుతూంటే నిర్మలానందం పొందుతూన్న దేవదాసి, పూల పాదులకు నీళ్ళుపోస్తూ పాడుకొంటూ వస్తూన్న తోటమాలి కంఠంలో కవియోగి జ్ఞానబోధవిని చిరుహాసం ఒలికించింది. తమని సమీపిస్తున్నభార్గవరామ్ ను క్రీగంట వీక్షించి. తమాషాగా నవ్వి అన్నది. "ఆయన వయసులో ఆ తత్వం చెప్పి వుండడు. తాతా! యవ్వనకాలంలో స్త్రీని దేవతగా ఆరాధించే ఉంటాడు. పాతిక మంది సంతానాన్ని కనిపారేసి ఉంటాడు. కష్టం సుఖం అన్నీ చవిచూచి వయసు ఉడిగి, ఇక చూడవలసిందేమో ఉండక తీరికగా కూర్చొని ఈ శుష్కవేదాంతం వల్లించి వుంటాడు. ఆయన వయసులో ఈ తత్వమే వింటే ఫక్కున నవ్వేసే ఉండేవాడు."

    తోటమాలి చిత్రంగా చూచాడు "అదేంటి తల్లీ? సుస్కఏదాంతమా? ఆ మానుబావుడు చెప్పడం నిజమే కదా? పెళ్ళాం పిల్లలు మూణ్నాళ్ళ ముచ్చటనే కదా? యమపాసం మెడకుపడి లాక్కెడుతూంటే ఈళ్ళెవరూ ఎంటరారుకదా? అంతా మాయేకదా?"

    "వెంటరారని యిప్పుడు తెలుసుకొన్నావు. పెళ్లాంతో ముచ్చటగా గడిపిననాడూ పిల్లలతో స్వరం మరచి ఆడుకొన్నవాడూ పొరపాటుగానైనా ఈ తత్వం నీ నోట వచ్చేదా?"

    భార్గవరామ్ దేవదాసి మాటలు అందుకొని "నిజమే, పెళ్ళాంసంసారం అదంతా కర్మయోగమనేవాడు, మామయ్యలాగా!" అని నవ్వాడు.

    "చిన్నపిల్లలు! ఏదాంతమంటే ఏం తెలుసు ఈళ్ళకి? తోటమాలి తాత నవ్వుకొంటూ, తిరిగి పాడుకొంటూ, పాదులకు నీళ్ళుపోస్తూ ముందుకు సాగాడు.

    కన్నుగానని కామమునబడి నశించిపోయెదవు. వెర్రిజీవా!

    కండకరిగితే కన్ను తెరుతువో, మాయజీవా!"

    "విన్నావా, బావా ఈ పాట నీకు బాగా నచ్చుతుంది కదూ?"

    నచ్చకేం? సత్యం చెప్పాడు." దేవదాసి భుజంమీది పావురాయిని అందుకొంటూ అన్నాడు భార్గవరామ్.

    కొంచెం గంభీరంగా అడిగింది దేవదాసి "కామం అంత పరమ నీచమైనదైతే, అది కారణంగా జరిగే మానవజన్మ ఉత్కృష్టమైనదిగా ఎందుకు చెప్పబడింది?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS