Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 15

   
    "రాజారామ్ గారూ, నేను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్ని....నా పేరు మహావీర్. మీ వీధి చివరున్న మేడ గదిలో సుమిత్ర అనే అమ్మాయిని మర్డర్ చేశారు. ఆ గదికి ఇవాళ సాయంత్రం మీ అమ్మాయి రమణి వెళ్ళిందని తెలిసింది. మర్డరర్ని మీ అమ్మాయి చూసి వుంటుందని మా ఊహ. ఐడెంటిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళాలను కుంటున్నాను.

    "మేడమీది గది దగ్గరికి ఇవాళ సాయంత్రం రమణి వెళ్ళిందా?" అనడిగాడు రాజారామ్ ఆత్రంగా.

    "అవును ఆ విషయం మీ అమ్మాయే చెప్పింది. ఒక విషయం మీకు స్పష్టం చేస్తున్నాను. స్మగ్లింగ్ రేకెట్ కీ ఈ మర్డర్ కి సంబంధం ఉంది. మీ అమ్మాయి కనక మర్డర్ ని చూసి ఉంటె అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం! వీళ్ళు చాలా డర్టీ రోగ్స్, మీ అమ్మాయి ఐడెంటిఫై చేస్తే కేస్ ని త్వరగా ముగించవచ్చు."

    "మా అమ్మాయికోసారి ఫోనివ్వండి"

    ఒక్క క్షణం తరువాత రమణి కంఠం ఫోన్ లో వినిపించింది.

    "హల్లో డేడీ!"

    "రమణీ.... నేను వెంటనే అక్కడికి బయలుదేరి వచ్చేస్తాను. నువ్వేం భయపడకు?"

    "డేడీ...పోలీసులు నన్ను జైల్లో పెడతారా?"

    "ఛ...ఛ...అదేం కాదమ్మా! వాళ్ళకి నీ సహాయం కావాలి. అంటే....యూ ఆర్ ఏన్ ఇంపార్టెంట్ లిటిల్ పెర్సన్ అన్నమాట....నువ్వు వాళ్ళతో వెళ్ళు....లక్ష్మీకాంతమ్మ గారు కూడా నీతో ఉంటారే....నేనిప్పుడే బయలుదేరి వచ్చేస్తాను." అంటూ ఫోన్ పెట్టేశాడు రాజారామ్.

    అతని మొహం స్వేదబిందువులతో నిండిపోయింది. అనుకొని ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆలోచనరాగా ఒక్క క్షణం అతని కళ్ళముందు లక్షలాది చీకటి తెరలు దిగాయి.


                                  5


    జరిగినదంతా విన్న తరువాత చైర్మన్ మొహంలో ఆందోళన కనిపించింది. అంతలోనే సర్దుకున్నాడు. వెంటనే డ్రయివర్ వేపు చూసి "ఇదుగో సైదులూ, అయ్యగారిని తీసుకెళ్ళు. పనంతా అయ్యేక, ఆయన వెళ్ళమన్నప్పుడు వచ్చెయ్యి" అన్నాడు.

    డ్రయివర్ చేతులు కట్టుకుని "అలాగే సార్" అన్నాడు.

    ఇంకా ఏదో విభ్రమలో మునిగినట్టున్న రాజారామ్ రాజేశ్వరిని చూస్తూ "మీరు...నువ్వు నాతో వస్తావా?" అనడిగాడు. రాజేశ్వరి జాలిగా చూసి అతని చెయ్యి పట్టుకుంది. "పదండి" అంది.

    ఇద్దరూ బయటికి నడిచి పోర్టికోలో ఉన్న కారెక్కారు. మరో పావు గంటకల్లా కారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ముందాగింది. ఇద్దరూ కారు దిగారు. గబగబ నడిచి లోపలికి వెళ్ళాడు రాజారామ్. అతన్ని అనుసరించింది రాజేశ్వరి.

    లోపల....

    టేబిలు మీద రమణి కూర్చొని ఉంది. కాళ్ళు అల్లల్ల్లాడిస్తూ పావ్ కార్న్ తింటోంది. తండ్రిని చూసి "హల్లో డేడీ!" అంది నవ్వుతూ.

    అప్పటికి గాని రాజారామ్ గుండె కుదుట పడలేదు. రాజేశ్వరి దగ్గరికి వచ్చి రమణి తల నిమిరింది. ఇంతలో కుర్చీలో కూర్చున్న సబ్ ఇన్ స్పెక్టర్ లేచి రాజారామ్ ముందుకు వచ్చాడు.

    "హలో మిస్టర్ రాజారామ్, అయామ్ సబ్ ఇన్ స్పెక్టర్ మహావీర్" అంటూ చెయ్యిచాచాడు.

    అంతలో రాజారామ్ దృష్టి వంటామె లక్ష్మీకాంతమ్మ గారి మీద పడింది. "లక్ష్మీకాంతమ్మ గారూ బాగా పొద్దు పోయింది గాని ఇక మీరు ఇంటికి వెళ్ళండి. రమణి సంగతి నేను చూసుకుంటాను." అన్నాడు.

    "పదండమ్మా....నేను పోలీస్ జీప్ లో మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను..." అంటూ మహావీర్ రాజారామ్ వేపు చూశాడు. "అన్నట్టు రాజారామ్ గారూ, మీకోసం పోలీస్ కమిషనర్ గారు వెయిట్ చేస్తున్నారు పక్కగదిలో ఆయన్తో మాట్లాడి రండి" అంటూ వెళ్ళిపోయాడు.

    పక్క గదిలోకి నడిచాడు రాజారామ్.  లావుగా ఎర్రగా ఉన్న వ్యక్తిని చూడగానే అతనే పోలీస్ కమిషనర్ అని గ్రహించాడు. రాజారామ్ ని చూస్తూనే అతను కుర్చీలోంచి లేచారు. "మీరేనా రాజారామ్?" అంటూ చెయ్యి చాచాడు.

    "అవును."

    "అయామ్ ది కమీషనర్ ఆఫ్ పోలీస్! మై నేమ్ ఇజ్ వీరప్ప!"

    "గ్లాడ్ టు మీట్యూ"

    "సారీ మీ అమ్మాయిని ఇంత రాత్రి ఇక్కడికి తెచ్చినందుకు."

    'ఇంతకీ అసలేం జరిగిందో నాకు అర్ధం కావడం లేదు." అన్నాడు రాజారామ్.

    "మీకు సుమిత్ర తెలుసు కదా?"

    "తెలుసు."

    "మీరావిడతో మాట్లాడినట్టు మీ అమ్మాయి రమణి చెప్పింది."

    "అవును. నిజమే. వాళ్ళ కజిన్ సిస్టర్ సుందరి అనే అమ్మాయి కనిపించడం లేదనీ - ట్రేస్ చెయ్యడంలో హెల్ప్ చెయ్యమనీ అడిగింది."

    "సబ్ ఇన్ స్పెక్టర్ మహావీర్ ఇవాళ సాయంత్రం సుమిత్ర ఇంటికి వెళ్ళాడు. అప్పటికే ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంది. ఎవరో పీక నులిమి చంపారు." అంటూ వీరప్ప రాజారామ్ మొహంలోకి సూటిగా చూశాడు.

    ప్చ్ పాపం!" అంటూ జాలిపడ్డాడు. రాజారామ్. అంతలో- "ఇంతకీ సుమిత్రకీ, గంజాయి ముఠాకి ఏం ఏం సంబంధం?" అనడిగాడు.

    "ఎవరన్నారామాట?

    "మహావీర్....ఇన్ స్పెక్టర్ మహావీర్ ఇందాక నాతో ఫోన్ లో మాట్లాడ్తూ చెప్పారు. నిజానికి మిస్సింగ్ గర్ల్ సుందరి గురించి మా డైలీలో ఒక న్యూస్ స్టోరీ వేద్దామని అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాం ఇంతలో మీరు 'హోల్డ్ ఆఫ్' చెయ్యమన్నారని నేను విన్నాను.

    పోలీసు కమిషనర్ ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చాడు. టేబిలు మీదున్న బాల్ పాయింట్ పెన్నుని అటూ ఇటూ త్రిప్పి చూస్తూ-నిజమే సుందరి తిరిగి వచ్చింది. ఆవిడ ట్రావెలింగ్ బేగ్ గదిలో ఉంది. అందులో టూత్ పేస్ట్, బ్రష్, మేకప్ సరంజామా వగైరాలన్నీ ఉన్నాయి. ఇవాళ సాయంత్రం మీ అమ్మాయి అక్కడికి వెళ్ళినప్పుడు సుందరితో పాటు మరో వ్యక్తి కూడా అక్కడా ఉన్నాడని 'అతన్ని' చూసింది 'అతనే' సుమిత్రను పీక నులిమి చంపినా హంతకుడు!" అంటూ ముగించాడు కమిషనర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS