20 వ. సర్గ
రావణుడు సీతతో :
1. "ఓ సీతా - ఓ పద్మనేత్ర
నా చెంత నీకు - ఏల చింత ?
ఎక్కడి రాముడు - ఎక్కడి అయోధ్య
ఎందుకోస మీ - వనవాస వ్యధ ?
నవ యౌవ్వనత్రి | లోక సుందరీ
నీ కెందుకు ఈ | మునివేషధారి?"
అని రావణుడు కా | మాంధుడై నిలిచె
నోటికి వచ్చిన | దెల్ల పలికె | .... ||శ్రీ||
2. "సిగ్గెందుకు ఓ - మోహనాంగి
చేసికొందు నిను - నా అర్ధాంగి |
భయమెందుకు ఇం | దెవ్వరు లేరు
దాచుకొనకు నీ | అందాల తీరు |
పరకాంతల హ | రించి రమించుట
పరమ ధర్మము | మా కులమంతట |"
అని రావణుడు కా | మాంధుడై నిలిచె
నోటికి వచ్చిన | దెల్ల పలికె | .... ||శ్రీ||
3. "మాసిన పీత వ | సనము దాల్చుట
నేల బరుండుట - ఉపవాసముంట |
దీనముగా లో | లోన కుందుట
సుముఖముగా మా | టాడకుండుట |
అందము కాదు ఆ | నందము కాదు
మళ్ళిన వయసు - మళ్ళీ రాదు"
అని రావణుడు కా | మాంధుడై నిలిచె
నోటికి వచ్చిన | దెల్ల పలికె | .... ||శ్రీ||
4. "దివ్యసుందరీ - లేరు నీకు సరి
ముల్లోకముల | నీకు నీవే సరి |
సృష్టికర్త తన - చతురతనంతను
పొందుపరచి సృ | జించెనో నిను |
అదను దాటిన - ముదుసలులైన
నిదుర బోరు నీ - సొగసులు గాంచిన |"
అని రావణుడు కా | మాంధుడై నిలిచె
నోటికి వచ్చిన | దెల్ల పలికె | .... ||శ్రీ||
5. "బంగరు పాత్రల - మధుర రసాలు
మణిమయ రత్న సు | వర్ణ భూషలు |
చిత్ర విచిత్రమౌ - దివ్యాంబరములు
కాలగరు సు | గంధ ధూపములు |
నృత్యగీతములు - మృదుతల్పములు
నను గూడిపొందు - స్వర్గ సుఖములు |"
అని రావణుడు కా | మాంధుడై నిలిచె
నోటికి వచ్చిన | దెల్ల పలికె | .... ||శ్రీ||
6. "రాముడు నీకు | సరిగానివాడు
నిను సుఖపెట్టడు - తను సుఖపడడు
గతిచెడి వనమున - తిరుగుచుండేనో
తిరిగి తిరిగి తుద | కు రాలిపోయేనో |
మరచిపొమ్ము ఆ | కొరగాని రాముని
వలచి రమ్ము నసు | యశోవిశాలుని |"
అని రావణుడు కా | మాంధుడై నిలిచె
నోటికి వచ్చిన | దెల్ల పలికె | .... ||శ్రీ||
7. "చారు వృత్త ప | యోధర భోగిని
చలిత లలిత సు | మధ్య విభాగిని |
రతి విహార వి | శాల నితంబిని
లీలా లోలిత - నీలవేణి |
ననుగోరని నిను | బలాత్కరించను
నను కాదను నిను - కనికరించను |"
అని రావణుడు కా | మాంధుడై నిలిచె
నోటికి వచ్చిన | దెల్ల పలికె | .... ||శ్రీ||
8. "రాముడు వచ్చుట - నన్ను గెల్చుట
నిన్ను పొందుట - కలలో మాట |
బల విక్రమ ధన - యశములందున
అల్పుడు రాముడు - నా ముందెందున |
యమ కుబేర ఇం | ద్రాది దేవతల
గెలిచిన నాకిల - నరభయమేల ?"
అని రావణుడు కా | మాంధుడై నిలిచె
నోటికి వచ్చిన | దెల్ల పలికె | .... ||శ్రీ||
9. "చంద్రముఖి నీ | పైని నా చూపు
మరలకున్నదే - మరియే వైపు |
చేసికొందు నిను - పట్టపురాణిగ
చూచుకొందు నా - శుభముల రాశిగ |
జలధి సమీప కుం - జముల దేలి
రమియింతము ర | మ్ము మధువును గ్రోలి |"
అని రావణుడు కా | మాంధుడై నిలిచె
నోటికి వచ్చిన | దెల్ల పలికె | .... ||శ్రీ||
__: 20 వ. స. సంపూర్ణము :__
