Previous Page Next Page 
దేవదాసు పేజి 15

    ఇదే సమయంలో మళ్ళీ మీసాల రెండు వైపులా నుంచీ జారుతున్న అశ్రువులు పక్కమీద దిండును తడుపుతూ వున్నాయి. పార్వతి వ్యాకులంగా అశ్రువులు తుడుస్తూ "మహేంద్రునికి ఎందుకు పెళ్ళి చేయలేదూ?" అని అడిగింది.
    "ఆహా! అది నాకు ఎలా సుఖంగా వుండే రోజు కాగలదు? ఇదే ఆలోచిస్తున్నాను. కాని అతడి మనసులో విషయం ఎవరు తెలుసుకొనగలరు? అతని హఠాన్ని ఎవరు మార్చగలరు? ఏ విధంగానూ అతడు పెళ్ళి చేసికొనడానికి ఇష్టపడలేదు. అంచేతనే వృద్ధాప్యంలో....ఇల్లంతా బావురుమంటూ వుంది. ఇల్లంతా దుఃఖంతోనే వుంది. లక్ష్మి కళ పోయింది. ఇల్లు దరిద్రుల నివాసంగా వుంది. ఇంట్లో ఎవరూ దీపం పెట్టేవాళ్ళు లేరు. ఇదంతా చూడలేక పోయాను. అందుచేతనే....
    ఈ మాట విని పార్వతి చాలా దుఃఖించేది. జాలిగా నవ్వుతో పాటు తల వూపుతూ "నీవు వృద్ధుడిని అయినందువలన నేను కూడా త్వరలోనే వృద్దురాలిని అవుతాను. స్త్రీలు వ్రుద్దురాండ్రు కావడానికి ఎంతో కాలం పట్టదు" అన్నది.
    భువన్ చౌదరి లేచి కూర్చుంటాడు. ఒక చేతిలో ఆమె చిబుకాన్ని పట్టుకొని, మౌనంగా ఆమె మొఖం వైపు చాలా సేపటివరకూ చూస్తూ వుంటాడు. శిల్పి తన ప్రతిమను అలంకరించి, తలపై కిరీటం పెట్టి ఎడమకూ, కుడికీ త్రిప్పి చాలా సేపటివరకు చూస్తూ వుంటాడు. తర్వాత కొంచెం గర్వమూ, ఎక్కువగా స్నేహ భావమూ ఉత్పన్నమవుతుంది. సరీగా అదే విధంగా భువన్ బాబు పరిస్థితి కూడా వుంది. ఒకరోజు ఈయన నోటి నుంచి అస్పష్టంగా "ఆహా, మంచి పని చేయలేదు" అనే మాట వెలువడుతోంది.
    "ఏం మంచి పని చేయలేదు?"
    "ఇక్కడ నీకు శోభనివ్వడం లేదని ఆలోచిస్తున్నాను."
    పార్వతి నవ్వుతూ, "బాగా శోభగానే వుంది. మనకు శోభ, అశోభ ఏమిటి?" అన్నది.
    వృద్ధుడు మళ్ళీ పడుకొని లోలోపల అనుకొంటూ వుండేవాడు_"నాకు తెలుసు, అది నాకు తెలుసు. నీకు మేలు కలుగుగాక!" భగవంతుడు నిన్ను చూస్తాడు.
    ఇదే విధంగా ఓ నెల గడిచిపోయింది. మధ్యలో ఒకసారి చక్రవర్తి మహాశయుడు కూతురును తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. పార్వతి తన ఇష్టప్రకారమే వెళ్ళలేదు. "నాన్నగారూ! ఇది ఇంకా కుదుటపడని సంసారం. కొన్నాళ్ళ తరువాత వస్తాను!" అన్నది తండ్రితో.
    "స్త్రీల జాతే ఇటువంటిది!" అని ఆయన లోలోపల నవ్వుకున్నాడు.
    ఆయన వెళ్ళిపోయాడు. పార్వతి, మహేంద్రుని పిలిచి "ఒకసారి నా పెద్ద కూతురును పిలిచుకురా!" అని చెప్పింది.
    మహేంద్రుడు అటూ, ఇటూ దాట వేస్తున్నాడు. యశోద ఏ విధంగానూ రాదని అతడికి తెలుసు. "ఒకసారి నాన్నగారు వెళ్ళడం మంచిది" అన్నాడు.
    "ఛీ! అదేం బాగుంటుంది? అంతకన్న మనం తల్లీ కొడుకులం వెళ్ళి పిలిచుకొని రావటం మంచిది."
    "ఏమిటి? నీవు వెళతావా?" అన్నాడు మహేంద్రుడు ఆశ్చర్యంతో.
    "ఏం నష్టమేమిటి? ఇందులో నాకేమీ సిగ్గులేదు. నేను వెళ్ళిణ,నందు వలన కోపం తొలగిపోయి, యశోద వస్తే నేను వెళ్ళడానికి కష్టమేమిటి?"
    అంచేత మహేంద్రుడు మరుసటి రోజే యశోదను తీసికొని రావడానికి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళి అతడు ఏమి కౌశలం ప్రదర్శించాడో అది మాత్రం నాకు తెలియదు. నాలుగు రోజుల తరువాత యశోద వచ్చేసింది. ఆ రోజు పార్వతి ఒంటినిండా చాలా విలువైన కొత్త కొత్త ఆభరణాలు ధరించి వుంది. కొద్ది రోజుల క్రితమే వాటిని భువన్ బాబు కలకత్తా నుంచి తెప్పించాడు. పార్వతి ఈరోజు ఆ నగలన్నింటినీ ధరించి వుంది. దారిలో వచ్చేటప్పుడు యశోద చాలా క్రోధంతోనూ, అభిమానంతోనూ కూడిన మాటలను లోలోపల రిపీట్ చేస్తూ వుంది. కాని ఇక్కడకు వచ్చిన తరువాత కొత్త కోడలను చూచి అకస్మాత్తుగా అవాక్కయిపోయింది. విద్వేషపు మాట ఒక్కటి కూడా ఆమె మనసులో మిగలకుండా పోయింది. కేవలం అస్పుష్టమైన స్వరంతో "ఈమే!" అన్నది.
    పార్వతి యశోద చేయి పట్టుకొని యింట్లోకి తీసికొని వెళ్ళింది. ఆమె దగ్గర కూర్చొని, ఒక పంఖా చేతిలోకి తీసికొని "తల్లిమీద ఇంతగా కోపగించుకొంటారటమ్మా?" అన్నది.
    యశోద ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. అప్పుడు పార్వతి తన ఒంటిమీద సొమ్ములన్నీ ఒక్కొక్కటే తీసి యశోదకు పెడుతూ వుంది. యశోద విస్మయంతో "ఇదేమిటీ?" అని అడిగింది.
    "ఏమీలేదు, కేవలం తల్లి కోరిక!"
    ఆభరణాలు ధరించినందు వలన యశోద శరీరం అద్బుతంగా వికసించింది. ధరించడం పూర్తి అయిన తర్వాత ఆమె అధరం మీద హాసరేఖ తొణికిసలాడింది. ఆమె ఒంటినిండా ఆభరణాలు తగిలించి నిరాభరణంగా వున్న పార్వతి "యశోదా, తల్లిమీద క్రోధం తెచ్చుకుంటారా?" అన్నది.
    "లేదు, లేదు, క్రోధం ఏమిటి? క్రోధం ఎవరిమీద?"
    "విను యశోదా! ఇది నీ తండ్రి ఇల్లు! ఇంత పెద్ద భవనంలో ఎంతోమంది దాస దాసీలు అవసరం అవుతారు. నేను కూడా ఒక దాసిని. ఛీ-ఛీ! అమ్మాయీ, తుచ్ఛమైన దాసీ పైనే ఇంతగా కోపగించుకోవడం నీకు శోభనిస్తుందా?"       
    యశోద వయసులో పెద్దదే కాని, మాట్లాడటంలో చిన్నది. ఆమె కలత చెందింది. పంఖాతో విసురుతూ పార్వతి మళ్ళీ "ఒక దుఃఖం అనుభవించే వాని కూతురుకు మీ అందరి దయ వలన యిక్కడ కొంచెం స్థానం లభించింది. ఎంతో మంది దీనులనూ, అనాధలనూ, పీడుతులనూ మీ అందరి దయవలన నిత్యం పోషిస్తూ వున్నారు. వారిలో నేనూ ఒకదాన్ని, ఆశ్రితురాలివి...."
    యశోద తన్మయత్వంతో వింటూ వుంది. ఇప్పుడు అమాంతంగా తనను తాను మరచిపోయి ఆమె పాదాల దగ్గర పడి నమస్కారం చేసి "నీ కాళ్ళమీద పడుతున్నానమ్మా" అన్నది.
    మరుసటిరోజు మహేంద్రుడు యశోదను ఒంటరిగా పిలిచి "ఏం కోపం తగ్గిపోయిందా?" అన్నాడు.
    యశోద అన్న పాదం మీద చేయివేసి వెంటనే "అన్నయ్యా, కోపంతో, ఛీ-ఛీ! ఎన్నో మాటలు అనేశాను. చూడు, అవన్నీ బయటపెట్టకు."
    మహేంద్రుడు నవ్వుతూ వున్నాడు. "సరే అన్నయ్యా! సవతి తల్లి ఎవరైనా ఇంత ఆదరభావం కలిగి వుండగలదా?" అన్నది.
    రెండు రోజుల తరువాత యశోద స్వయంగా తండ్రి దగ్గరకు వచ్చి "నాన్నగారూ, నేనింకా రెండు మాసాలు ఇక్కడే ఉంటానని అక్కడికి ఉత్తరం వ్రాసెయ్యండి" అని చెప్పింది.
    "ఎందుకమ్మా?" అన్నాడు భువన్ బాబు కొంచెం ఆశ్చర్యంగా.
    "నా ఆరోగ్యం కొంచెం బాగాలేదు. అంచేత కొన్నాళ్ళు చిన్నమ్మ దగ్గర ఉంటాను" అన్నది యశోద.
    వృద్దుడి కళ్ళనుంచి ఆనందాశ్రువులు రాలాయి. సాయంకాలం పార్వతిని పిలిచి "నీవు నా గౌరవాన్ని కాపాడావు, సుఖంగా వర్థిల్లు" అన్నాడు.
    "అదేమిటి?" అన్నది పార్వతి.
    "అదేమిటో నీకు వివరించలేను. ఆ శ్రీమన్నారాయణుడు ఈరోజు నన్ను లజ్జ పడవలసి రాకుండా ఉద్దరించాడు."
    ఆ నంద చీకట్లో భర్త కళ్ళల్లో నీళ్ళు తిరగడం పార్వతి చూడలేదు. భువన్ బాబు చిన్న కుమారుడు వినోద్ లాల్ పరీక్షలు వ్రాసి ఇంటికి వచ్చాడు. అతడింతవరకూ చదువుకొనడానికే వెళ్ళలేదు.
                                 11
    రెండు మూడు రోజులు దేవదాసు పిచ్చివాడిలాగా అటూ యిటూ తిరుగుతూ గడిపాడు. ధర్మదాసు ఏదో చెప్పబోతే కళ్ళెర్రజేసి, దబాయించి అతణ్ణి తరిమేశాడు. అతడి వికృత భావాలు చూసి చున్నీలాల్ కూడా ఏమనడానికి సాహసించలేకపోయాడు. ధర్మదాసు రోధిస్తూ "చున్నీబాబూ, దేవదాసు ఎందుకు ఇలా అయిపోయాడు?" అన్నాడు.
    "ఏమయిపోయాడు ధర్మదాసూ?" అన్నాడు చున్నీలాల్.
    ఒక గ్రుడ్డివాడు మరో గ్రుడ్డివాణ్ని అడిగాడు. ఇరువురిలో ఒక్కరు కూడా అతడి హృదయంలోని విషయాన్ని తెలుసుకోలేకపోయారు. కళ్ళు తుడుచుకుంటూ ధర్మదాసు "చున్నీబాబూ, ఎలాగయినా సరే దేవదాసును వాళ్ళమ్మ దగ్గరకు చేర్చు. ఇక ఇప్పుడు చదువు కూడా లేకపోతే ఇక్కడ వుండవలసిన అవసరం ఏముంది?"
    అతడన్న మాట అక్షరాలా నిజం. చున్నీలాల్ ఆలోచిస్తూ వున్నాడు. నాలుగైదు రోజుల తరువాత ఒకరోజు సాయంకాలం సరీగా అప్పుడే చున్నీ బయటికి వెళుతూ వున్నాడు. దేవదాసు ఎక్కడ నుంచో వచ్చి అతడి చేయి పట్టుకొని, "చున్నీబాబూ, అక్కడికే వెళుతున్నావా?" అన్నాడు.
    చున్నీ సంకోచిస్తూ "అవును, వద్దంటే వెళ్ళను" అన్నాడు.
    "లేదు, నేను వెళ్ళవద్దని చెప్పడం లేదు. కాని యే ఆశతో నీవు అక్కడికి వెళ్తున్నావో చెప్పు."
    "ఆశ యేముంది? ఊరకనే, మనస్సును ఆహ్లాద పరచుకొనడం కోసం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS