'ఆహా! ఎంత సుకుమారివి మహా తల్లీ!" అన్నాడొక కొంటెవాడు వెనుక నుంచి.
కొన్ని తలలు అటు తిరిగాయి. అక్కడో గుంపు కనబడ్డది. ఎవరైంది ఎవరికీ తెలియలేదు.
ఆ అమ్మాయి బహుమతి నందుకొని గబగబా పరుగెత్తినంత పనిచేసి స్టేజి దిగి వెళ్ళిపోయింది.
ఒక అమ్మాయి ఆటల పోటీలలో చాల బహుమతులు తీసుకొంది. తిరిగి త్రోబాల్ కెప్టెన్ గా వచ్చింది.
'అయితే మనకు చదువుతో సున్నాయేనన్న మాట."
ఆ అమ్మాయి సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయింది.
మరొక అమ్మాయి భారత నాట్యం డ్రెస్సు లో అలాగే వచ్చింది.
"నాట్యం చెయ్యడానికి అంత తొందరా! ఇంకా టైముంది వెనక్కి పో!" అరిచాడొకడు.
తిరిగి ఆమె జాడ కనిపించలేదు.
"ఎన్.సి.సి. డిసిప్లిన్ ఫస్ట్ ప్రైజ్ . కుమారి సరళ. అరవ ఫారం."
పాపమా అమ్మాయి చాలా ముచ్చట పడుతుందేమో, ఎన్.సి.సి డ్రెస్సు లో అలాగే స్టేజి పైకి వచ్చింది. ఆ టీచరు ఆమెకు రావలసిన "ఎన్.సి.సి వారేప్పటికి అటెన్షన్ పొజిషన్ లో నిలబడాలి. ప్లీజ్! ఇదేదో పక్షపాతపు బహుమతి లాగుంది."
ఉలిక్కిపడిందా అమ్మాయి. ఆటేన్షన్ పొజిషన్ లోకి వచ్చి బహుమతి నందుకొని వెనక్కు రెండడుగులు వేసి సెల్యూట్ చేసి తిరగబోతున్నంత లో "రైట్ టర్న్ , క్విక్ మార్చ్" అన్నాడోకడు. "నో, నో డబులప్" అన్నాడింకొకడు. పగలబడి నవ్వారా గుంపంతా.
ప్రేక్షకులకు కొందరికది వినోదకరంగా ఉన్నా మరికొందరు తిట్టుకొంటున్నారు.
"ఛీ, ఛీ, రౌడీ వెధవలు , మెడబట్టి బయటికి గెంటితే సరి. "కోపంతో అంది రజియా రాజ్ తో.
అది విని నవ్వాడు రాజ్.
"ఆ పని వాళ్ళ చేత నై వుంటే ఎప్పుడో చేసేవారు. చేతకాకే మౌనంగా ఉన్నారు." అన్నాడు.
"ఇది ఆడపిల్లల స్కూలు. జరిగే కార్యక్రమాన్ని చూడను వచ్చిన సోదరులు మర్యాదగా ఉంటె మంచిదని కోరుతున్నాము. మీరు యెగతాళి చేసేది అమ్మాయిలను కాదు. మీ సభ్యతను, సంస్కారాన్నీ, ఎంత అందంగా ఉందొ చూడండంటూ చూపిస్తున్నారు. అది మీకు మంచిదైతే అలాగే చెయ్యచ్చు. కానీ ఇలా చేస్తుంటే మేం కష్టపడటమే కాకుండా మీకందరికీ కష్టాన్నీ కలిగించవలసి వస్తుందని చెప్పడానికి చింతిస్తున్నాను. కావున ఇకనైనా మాతో సహకరిస్తే ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్తమం జయప్రదం కావింపబడుతుంది. "కాస్త ఆవేశంగా వెలువడ్డాయి మైక్ లో నుండి ఇందిర మాటలు.
ఏ పిల్లో, కుక్కో అరుస్తుందని భావించారంతా. కానీ అలాంటిదేమీ జరుగలేదు.
"థాంక్స్" అని ఇందిర వేదిక దిగి వెళ్ళిపోయింది.
రాజ్ కళ్ళతోనే ఏదో చెప్పాడు రజియాకు. రజియా చిరునవ్వు నవ్వింది.
కార్యక్రమం ముగింపు లో జనగణమన పాట పాడారంతా. ఏ కార్యక్రమానికీ గానీ, ఏ సభకు గానీ ఈ జాతీయ ప్రార్ధన గీతం మన భారతీయులలో నిలిచి ఉంటుంది. ఈ ప్రార్ధన గీతం లేనిదే మనమీనాడు , ఏ కార్యక్రమాన్నీ జరుపము. ఇది ఎప్పటి నుండో వచ్చే ఆచారం. దీనికి తరుగు లేదు. ఇక మీదట కూడా దిగ్విజయంగా ఉంటూనే ఉంటుంది. మన భారత చరిత్రను, గొప్పతనాన్ని చాటి చెప్పే గీతం. భారతీయులందరికీ పూజనీయమైన గీతం. ఆ గీతాన్ని ఆలాపించే భారతీయుల మైన మనం ధన్యులం.
దారిలో సుగుణను పరిచయం చేశాడు రజియాకు. అప్పుడే వికసించబోయే పుష్పం లా ఉన్న సుగుణ . సౌందర్యం రజియాను ఆకర్షించింది. సుగుణ మోహంలో ఉన్నది గంబీరత్వమో, అమాయకత్వ మో తెలుసుకోలేక పోయి అన్నకు తగిన చెల్లెలే అనుకొంది. అన్నయ్య కు తగిన వదినే అనుకొంది సుగుణ.
"సుగుణా బహుమతి ప్రదాన సమయంలో పేర్లు చదివిందే-- ఆవిడెవరు?"అడిగాడు రాజ్.
"ఇందిరని మా సైన్సు టీచరన్నయ్యా! అదిగో ముందు వెళ్తోంది చూడు. ఆమె ప్రక్కనే ఉన్నావిడ ఆమె చెల్లెలు" అని ముందు పోతున్న లత, ఇందిరాలను చూపించింది.
"ఓహో" అనుకున్నాడు రాజ్.
"మీరు వస్తుండండి . ఆమెతో ఒక్క విషయం మాట్లాడి వస్తాను" అని సుగుణ ముందుకు పోయింది.
"రజీ, గోపీ, లతలు కలుసుకొన్న విషయం నీకు చెప్పలేదు కదూ?"
"ఏమిటో అంత విశేషం?"
జరిగినదంతా చెప్పాడు రాజ్.
"అయితే వారి జీవితాలలో ప్రేమ బీజాలను నాటి నీరు పోశావన్న మాట."
"కానీ ఆవి మొలకెత్తుతాయో లేదోనని భయంగా ఉంది."
"మొలకెత్తడమే కాదు. పెద్దవై పెనవేసుకొని చిగురిస్తాయి."
"నా పై నమ్మకం లేనివాడు అసలీ ప్రపంచంలో నమ్మకం అన్న పదానికే విలువుండదు."
"ఈ మధ్య తమ వాక్చారుత్యధోరణి మారినట్లుందే!"
"తమ సాహచర్యం లో అన్నీ వాటంతటనే వస్తాయి."
అదే సమయం లో రాజ్ ను తనకు అన్నయ్య గా చెప్పు కొంటుంది సుగుణ, ఇందిరతో . అర్ధం కాక అయోమయంగా వెనక్కు తిరిగి నవ్వుకొంటున్న వీరిద్దరినీ చూసింది లత. ఏమిటీ సంబంధ బందావ్యాలు అవి అలోచించి అర్ధం చేసుకోలేక విడిచి పెట్టింది లత.
"రాజ్, దారంబడి ఇలా నవ్విస్తూ వస్తుంటే చూచేవాళ్ళు ఏమను కుంటారు చెప్పు?"
"ఏమనుకుంటారు ? ఎవరో క్రొత్త దంపతుల లాగుంది. మోజు తీరలేదేమో అని ఈర్ష్య పడుతారు."
"ఛ, ఫో నీతో మాట్లాడడమే బుద్ది తక్కువ" అని తల వంచుకుంది. తన అదృష్టానికీ, ఆనందానికీ గంతులేయాలనిపించింది.
"జాగ్రత్త. ఇది రోడ్డు. గంతులేస్తే పిచ్చి వాళ్ళను కుంటారు."
ఉలిక్కిపడి రాజ్ ను చూసింది. ఏమీ తెలియనట్లు గంబీరంగా అడుగులు వేస్తున్నాడు రాజ్.

11
"రాజ్?"
"ఏం, రజీ?"
"ఈ ప్రకృతి ఎలా ఉంది?"
"వర్ణించ లేనంత అందంగా ఉంది."
"ఈ పరిసరాలు?"
"ప్రశాంతంగా ఉన్నాయి."
"మన మనస్సులు?"
"వాటితో పోటీ పడుతున్నాయి."
"సముద్రుడేమంతున్నాడు, రాజ్?"
"నిన్న రాలేదేం అని అలిగి కూర్చున్నాడు, రజీ."
"కారణం చెప్పలేదూ?"
"చెప్పాను."
"ఏమన్నాడు?"
"క్షమించాను పొండి అన్నాడు గంబీరంగా!"
"రాజ్!"
"ఊ"
"అతని కంత అధికారాన్ని ఎవరిచ్చారు?"
"మనమే."
"అదెలా?"
"ప్రతిదినమూ అతనితో అడుకుంటున్నాం. ఎన్నో మాట్లాడు కుంటున్నాము. అతనికి కన్నుల పండువుగా ఉంటున్నాము. మన రహస్యాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. తల్లి తండ్రుల్లా దగ్గర తీస్తాడు. ఊరట కలిగిస్తాడు. స్నేహితుల పై అధికారాన్ని చలాయిస్తున్నాడు. తప్పు కాదుగా!"
"ఊహూ."
రజియా తెల్లని ఇసుక లో తలను రాజ్ ఒళ్లో పెట్టి పడుకొంది. రాజ్ సముద్రపు అలల వైపు చూస్తున్నాడు. రజియా చుట్టూ ఉన్న పకృతిని పరిశీలిస్తుంది. వారి చుట్టూ ఏకాంతం. ప్రశాంతం వారిలో తాండవీస్తుంది. ఒకరికొకరు స్వంత మై పోతున్నారు. వారికీ లోకంతో పనిలేదు.
దూరంగా ఉన్న తాటి చెట్లు, వాటి పైని వివిధ రకాల పక్షుల కిలకిలారావములు, అప్పుడప్పుడు వాటి మధ్య తాండవించే నిశ్శబ్ధత ఆనందాన్ని చేకూరుస్తున్నాయి. చుట్టూ కొండలు, ఆ కొండల లోని ప్రతి ధ్వనులు, నేనూ ఉన్నానంటూ హోరు పెట్టె సముద్రుడు ఎటువంటివారికైనా ఊరట కలిగిస్తాయి.
"రాజ్!"
"ఊ,"
"సముద్రపు లోతెంత?"
"సామాన్యులకు కనుక్కోవడం కష్టం."
"పోనీ వైశాల్యం?"
"అది అంతే. కనుచూపు మేర వరకూ ఉంటుంది. చుట్టూ చిలిపిగా గంతులు వేసే అలలతో మధ్యలో చాల గంబీరంగా ఉంటుంది."
"నువ్వూ అంతే, రాజ్!"
"అంటే?"
"నీ హృదయపు లోతులను సులభంగా కనుగొనలేరు. నీ హృదయం ఎంత విశాల మైనదో ఊహించ లేరు. సముద్రానికి కాస్త దగ్గర చేరితే చుట్టూ ఉన్న అలలు భయాన్ని పుట్టించినా, తరువాత ఆనందాన్నిస్తాయి. పోను పోను లోతుగా గంబీరంగా ఉండేదాన్ని చూస్తుంటే ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఆ ఆనందానికి అంతు ఉండదు కానీ అయోమయంగా ఉంటుందంతా. మొదట నీతో స్నేహం చేసుకొనేందుకు భయపడ్డాను. కానీ నీతో సాహచర్యం లభించిన తర్వాత నిన్ను అర్ధం చేసుకోవాలని ప్రయత్నించి విఫలురాలనయ్యాను. నీలో కలిసి పొయ్యాను. నా కోరిక ఫలించింది. కానీ అప్పుడప్పుడు నిన్ను అర్ధం చేసుకోవడం లో తప్పటడుగు వేస్తావేమోనని భయంగా ఉంది."
