Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 15

                       

                                      11
    ఆ రోజు క్లబ్బులో రాజు నోటంట వారి చరిత్ర నంతా విన్నప్పటి నుంచీ ఇన్స్ పెక్టర్ ప్రవర్తన మారిపోయింది. అంతవరకూ వనజంటే ఎంతో గౌరవ పూర్వకంగా వ్యవహరించే వాడు. ఇప్పుడు మాటల్లోనూ, ప్రవర్తన లోనూ అది లోపించింది. లేచిపోయి వచ్చింది -- సులభ సాధ్య అనే చులకన భావం ఏర్పడింది. వనజ కూడా అతనిలో మార్పును గమనించక పోలేదు. కాని మొదట్లో అదంత ముఖ్యమైన విషయంగా కనుపించలేదు.
    ఇన్స్ పెక్టర్ గారి మేడ మీది గది, కిటికీ లోంచి చూస్తె వనజ వాళ్ళ వంట గదీ, ఖాళీ స్థలమూ చక్కగా కనిపిస్తూ ఉంటాయి రాజు సామాన్యంగా ఎనిమిది గంటల వరకూ నిద్రలేవడు. వనజ ఆరు గంటలకే నిద్ర లేచి వంటింట్లో పని చేసుకొంటూ వుంటుంది. నాలుగైదు రోజుల్నుంచీ ఇన్స్ పెక్టర్ గారు ఆఫీసు టైమయ్యే వరకూ మేడ మీదనే తచ్చాడుతున్నాడు. మొదట ఏదో పని చేసుకొంటున్నాడెమో ననుకోంది వనజ. కాని ఒకరోజు కొంచెం గమనించి చూసేసరికి, కిటికీ దగ్గర నిలబడి తనవేపు చూడటం తప్ప మరోపనేమీ లేదని స్పష్టపడింది. రోజులు గడిచే కొద్దీ అతని చేష్టలు మరీ అసహ్యంగా తయారయ్యాయి. అతని మనస్సులోని ఉద్దేశం బయట పడింది. వాడియైన అతని కాముక దృక్కులకు గురౌతూ , దొడ్లో అటూ ఇటూ తిరుగుతూ పని చేసుకోవటం దుర్భరమౌతుంది. ఇవ్వాళ మరీ శృతి మించి రాగాన పడింది. మెల్లగా దగ్గి నవ్వుతూ సైగ చేశాడు. వనజకు వళ్ళంతా తేళ్ళూ, జేర్రులూ ప్రాకినట్లైంది. పాలగిన్నే అక్కడ పడేసి విసవిసా లోపల కొచ్చేసింది.
    రాజు అప్పుడే నిద్ర లేస్తూ "వనజా కాఫీ " అంటూ కేక వేశాడు.
    "పెట్టలేదండీ"
    "ఇంకా కాఫీ పెట్టలేదా? అదేమిటి?"
    "యేమో పెట్టలేదు-- వంట్లో బాగాలేక" అబద్దమాడింది.
    రాజుకు ఆ సమాధానం రుచించలేదు. నిద్ర లేవగానే వేడి వేడి కాఫీ లేకపోతె అతనికి చాలా చిరాకు కలుగుతుంది. 'సరే, చిల్లర డబ్బన్నా ఇవ్వు. హోటలు కెళ్ళి తాగి వస్తాను." అన్నాడు.
    వనజ లోపలి కెళ్ళి ఐదు రూపాయల నోటొకటి తీసుకొచ్చి రాజు కిస్తూ "చిల్లర లేదు. ఇది తీసుకెళ్ళండి." అని ఒక క్షణ మాగి మళ్ళీ ఇంట్లో డబ్బు ఎక్కువ లేదు. మరో రెండు వందలుంతాయేమో. కొంచెం జాగ్రత్తగా వాడుకోండి." అంది.
    "అదేమిటి? డబ్బంతా అప్పుడే ఖర్చై పోయిందా?" అన్నాడు రాజు ఆశ్చర్యపోతూ.
    "ఎందుక్కాదు. మీరేం తక్కువ ఖర్చు పెడుతున్నారా?' ఎదురు ప్రశ్న వేసింది.
    "ఐతే మాత్రం? నేను చాలా డబ్బు తెచ్చాను కదా. అదంతా అప్పుడే ఎలా ఖర్చై పోతుంది.?"
    వనజ అసలే చిరాగ్గా ఉందేమో, రాజు రెట్టించి అడగటం తో సహనాన్ని కోల్పోయి , కఠినంగానే సమాధాన మిచ్చింది. "ఎందుక్కాదో చెప్పండి? మీ సిగరెట్ల కే రోజుకు మూడు రూపాయలు కావాలి. ఇంత ఫర్నిచరు వద్దంటే వినకుండా ఇవన్నీ తెచ్చి పడేస్తిరి. చిన్న రేడియో తీసుకు రమ్మంటే వెయ్యి రూపాయలు తగలేసి రెడియోగ్రాం తీసుకొచ్చారు. అద్దె తక్కువలో చిన్న యిల్లు సరిపోయే దానికి ఇంత పెద్ద యిల్లు తీసుకొంటిరాయే. ఇవన్నీ ఖర్చులు గాక మరేమిటి చెప్పండి?"
    ఎన్నడూ వినని ఆమె కఠిన స్వరానికి ఆశ్చర్యపోతూ "అదికాదు వనజా. డబ్బు ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో చూడు" అన్నాడు.
    "ఎక్కడో పెట్టి మర్చిపోవటానికి నేనేం పసి పిల్లను కాను. మీరు మొదట ఏ సూటు కేసులో పెట్టారో, ఇప్పటికీ దాంట్లోనే ఉంది. మీకంత అనుమానంగా ఉంటె, ఇవిగో తాళాలు. మీరే చూసుకోండి." అంటూ తాళాలు టేబులు మీదకు విసిరేసింది.
    రాజు నిర్ఘాంత పోయాడు. తనను తాను సంభాళించుకొని సమాధానమేమీ చెప్పకుండానే షర్టు వేసుకొని బయటి కెళ్ళి పోయాడు. అదే వారిరువురి మధ్యా మొట్టమొదటి తగాదా.
    తీరా రాజు వెళ్ళిపోయాక వనజ బాధ పడసాగింది. తనే తొందరపడింది. నిజానికి అంత పెదసరిగా సమాధానం చెప్పటానికి తగిన కారణమేమీ కనుపించలేదు. అపరాధం తనలోనే ఉంది. బహుశా అందుకే తనకంత కోపమొచ్చింది! రాజుకు తెలియకుండా ప్రతినెలా కొంత డబ్బు, లిల్లీ ద్వారా తమ్ముడికి పంపుతుంది. రెండు మూడు బంగారు వస్తువులు, బోలెడన్ని ఖరీదైన చీరెలూ, రాజుకు తెలియకుండా కొన్నది. కొంత డబ్బు వేరే దాచి పెట్టింది . డబ్బంటే రాజు ప్రదర్శించే నిర్లక్ష్య వైఖరి చూసి. అతను ఇవన్నీ గమనించలేడను'కొంది. ఐనా ఇవ్వాళ తను కొంత ఓర్పు ప్రదర్శించి ఉంటే ఇంత వివాదం జరక్కుండా పోయేది!
    మధ్యాహ్నమైనా రాజు ఇంటికి రాలేదు.... భోజనం వేళ కూడా మించిపోయింది. వనజ ఆదుర్దా పడసాగింది. ఊరు కాని ఊర్లో, అడదాన్ని దాని ఖర్మానికి వదిలేసి హటాత్తుగా పలాయనం చిత్తగించిన మగవాళ్ళ కధలు రెండు మూడి వినే వుంది. మనసంతా అజ్ఞాత భయంతో నిండిపోయింది. భోజనం సహించలేదు. రాజు టీ వేళ క్కూడా ఇంటికి రాలేదు. పక్క వాటా లోంచి ఇన్స్ పెక్టర్ గారు రాజు కోసమంటూ రెండు సార్లు వచ్చి పోయాడు. కాని అది కేవలం సాకు మాత్రమే. అతను ఎందు కొచ్చేది వనజకు అర్ధమైంది. రాజు కోసం ఎదురు చూసి, చూసి విసిగిపోయి చీకటి పడిం తర్వాత వంట ప్రయాట్నం మొదలు పెట్టింది.
    త్వరగా వంట ముగించుకొని, స్నానం చేసి వచ్చేసరికి బయట గదిలో ఇన్స్ పెక్టర్ కూర్చుని ఉన్నాడు. హటాత్తుగా , వేళ కాని వేళలో అతన్ని చూసేసరికి వనజకు భయం వేసింది. ఇన్స్ పెక్టర్ వనజను చూసి పైకి లేస్తూ "ఇవ్వాళ టౌను హల్లో డాన్సు ప్రోగ్రాం ఉంది మనమంతా కలిసి వెళ్దామన్న ఉద్దేశంతో అందరికీ టిక్కెట్లు తెప్పించాను" అన్నాడు.
    వనజ కొంచెం తిరస్కార భావం ప్రదర్శిస్తూ "వారింకా ఇంటికి రాలేదు" అన్నది.
    "అదే నేనూ ఆలోచిస్తున్నాను. రాజు ఇంకా ఎందుకు రాలేదా అని? బహుశా ఏ క్లబ్బు లోనో ఉండి ఉంటాడు. ఐనా మీకు తెలుసో తెలియదో గాని, రాజు ఈ మధ్య చాలా మారిపోయాడు. చెడు స్నేహాలు ఎక్కువయ్యాయి. మీ శ్రేయోభిలాషి ని కాబట్టి చెప్తున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది."
    అతను వచ్చింది తమ ఇద్దరి మధ్యా భేధాభిప్రాయాలు కలిగించటానికేనని వనజ గ్రహించింది . కొంచెం ప్రోత్సాహ మిచ్చి వుంటే ఇంకా ఎన్ని చాడీలు చెప్పేవాడో గాని, వనజ నిర్లక్ష్య వైఖరితో అతని నోరు మూయించింది. సంభాషణ పెంచటానికి అతడు చేసిన ప్రయత్నాలన్నీ వృధా కాగా చేసేదేమీ లేక "సరే నేను వెళ్తున్నాను." ప్రోగ్రాం ఎనిమిది గంటలకు. రాజు రాగానే మీరిద్దరూ కలిసి రండి. ఇవిగో టిక్కెట్లు' అంటూ వెళ్ళిపోయాడు.
    మెట్ల మీద రాజు ఎదురు పడ్డాడు. అతనికి ఇన్స్ పెక్టర్ అంటే ఉన్న సద్భావం ఏనాడో పోయింది. "క్షమించండి, ఇవ్వాళ రాలేను చాలా అలసిపోయి ఉన్నాను" అని తప్పించుకొన్నాడు.
    రాజును చూడగానే వనజ మనసెంతో కుదుట పడింది. "అదేమిటండి ఇవ్వాళ్ళంతా ఇంటికి రానే లేదు? నేనెంత భాధ పడ్డానో తెలుసా? పాపిష్టి దాన్ని ఉదయమే ఏదో వాగి మీ మనస్సు కష్టపెట్టాను. నామీద కోపంతోనే ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కదూ?' అన్నది ఎంతో అనునయంగా.
    "లేదు, ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో నని ప్రయత్నాలు చేస్తున్నాను."
    'ఛా, ఒక్క రోజుకే మీ ముఖం ఎలా పీక్కు పోయిందో చూడండి. ముందు స్నానం చేసి భోజనం చెదురు గాని రండి."
    రాజు మౌనంగా భోజనం ముగించి గదిలోకి వెళ్ళిపోయాడు. వనజ వంటిల్లు చక్కబర్చుకొని తలుపులన్నీ వేసి గదిలోకి వచ్చేసరికి రాజు కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు. అతను నిజంగా నిద్రబోతున్నడో లేదో వనజకు అర్ధం కాలేదు. ఫాను వేసి లైటు తీసేసి మంచం మీది కొచ్చేసరికి రాజు పక్కకు జరిగి ఆమెకు చోటిచ్చాడు. అతనింకా నిద్ర పోలేదు.
    "నామీద ఇంకా కోపం పోలేదా?"
    "లేదు. నాకు కోపమేమీ లేదు. చెప్పాను కదా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను."
    "ఎందుకండీ మీకు ఉద్యోగం? మహా వస్తే ఓ రెండు వందల రూపాయలు ఉద్యోగం వస్తుందేమో అది మీ సిగరెట్ల కే చాలదు అదీ గాక మీరసలు ఉద్యోగం చెయ్యలేరు. చెయ్యాల్సిన అవసరం మాత్రం ఏముంది చెప్పండి?"
    "మరేం చెయ్యమంటావ్ వనజా?"
    "ఇప్పటికే మీరు నావల్ల అష్టకష్టాలు పడుతున్నారు. నాగురించే మీరు మీ వాళ్ళందరికీ దూరమయ్యారు. ఇవి చాలదన్నట్లు ఇంకా కష్టాలు కొని తెచ్చుకోవట మెందుకు? ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్ళిపోదాం. మన మెప్పటికైనా అక్కడకు చేరవలసిన వాళ్ళమే కదా!"
    "లేదు వనజా, మనకక్కడ స్థానం లేదు" అన్నాడు.
    "ఎందుకు లేదు చెప్పండి. మనమంత కాని పనేమీ చేయలేదు. మీ నాన్నగారు తప్పక క్షమిస్తారు."
    రాజు సమాధానమేమీ చెప్పలేదు. వనజ అంతర్యంలో ఏమాలోచించుకొన్నదో గాని చాల సేపటికి వృధా పూరిత స్వరంతో "మీరు సుకుమారులు ఉద్యోగం చెయ్యలేరు. అంత అవసరమే వస్తే నేను చేస్తాను. దాన్ని గురించి మీరు విచారం పెట్టుకోవలసిన అవసరమేమీ లేదు. కాని మన స్థానం మాత్రం ఇది కాదని జ్ఞాపకం పెట్టుకోండి.' అన్నది.
    రాజు చప్పున "ఛా, ఛా , నువ్వు ఉద్యోగం చెయ్యట మెందుకు? నిన్ను ఒక్కదాన్ని పోషించలేనా ఏమిటి?' అన్నాడు.
    వనజ మాట్లాడలేదు. ఆరాత్రి ఎంత సేపటికీ ఆమెకు నిద్రరాలేదు. అనుకొన్న దొకటి జరుగుతున్నది మరొకటి. కేవలం ప్రేమే జీవిత సర్వస్వమని ఆమె ఎన్నడూ భావించలేదు. అనాది నుంచీ పేదరికంతో సతమతమవుతున్న తన కుటుంబాన్ని, ఆ రాక్షసి హస్తాల నుండి ఏదో విధంగా రక్షించి, కనీసం తన తమ్ముడు ప్రకాశమైనా వృద్ది లోకి రావటానికి కాస్త మంచి అవకాశాలను సృష్టించాలని ఆమె ఆశించింది. జయం కనుచూపు మేరలో కనిపించినట్లే ఉన్నది. రాజు శ్రీమంతుల బిడ్డ. ఒక్కగానొక్క కుమారుడు. ఏనాటి కైనా పెద్ద వాళ్ళు రాజును క్షమించకుండా ఉంటారా? ఏదో విధంగా ఇప్పుడు రాజును ఇంటికి చేరిస్తే చాలు తరువాత పెద్దలను ప్రసన్నులను చేసుకొనే దేలాగో తనకు తెలుసు, కాని రాజు లేనిపోని అనుమానాలతో, అర్ధం లేని అభిమానాలతో కష్టాలను కొని తెచ్చుకొనే టట్లున్నాడు. "భగవాన్ నాకొక దోవ చూపించు" అని ప్రార్ధిస్తూ రాత్రంతా గడిపి వేసింది వనజ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS