Previous Page Next Page 
తప్పు పేజి 15

   
    'బావగారు యివాళ క్రొత్తగా మాట్లాడుతున్నారు. కొడుకు యింజనీరు కాగానే ఫారిన్ పంపే సూచనలు యేమైనా చేస్తున్నారా యేమి? ఒకవేళ మీ వుద్దేశ్యం అదే అయితే మాకూ సంతోషమే. మీరు కట్నం యింత కావాలని చెల్లెలు కనుక రాధికని అడగలేక పోవచ్చును. గంగ నా కూతురు. నా దగ్గర నుంచి వసూలు చేసుకునేందుకేమండీ?నేనెలాగూ పై వాడినే కదా'
    చటర్జీ త్రుళ్ళి పడ్డాడు. ',మీరు నన్ను అపార్ధం చేసుకుంటున్నారు. డబ్బు కోసం కాదు బావగారు. నా దగ్గర భగవంతుడి దయవల్ల డబ్బు పుష్కలంగానే వుంది.  నేను డబ్బు కోసం కక్కుర్తి పడడం లేదు.'
    'మరి? మీ వుద్దేశ్యం తెలుసుకోవాలి కదా మేము?
    గోవింద వడ్డిస్తోంది మౌనంగా. విషాదం పూర్తిగా ఆవిడ మొహంలో స్పష్టంగా ద్యోతకమౌతోంది. రాధిక కి యిన్నేళ్ళ తరువాత అన్నగారి స్వభావం యేమిటో అంతు చిక్కడం లేదు.
    రాధిక కి వుద్రేకంతో మొహం యెరుపు రంగుకి మారిపోయింది. అన్న పట్ల అసహ్య భావం యేర్పడిందా క్షణం లో. కాని నిగ్రహంగా భర్త వైపు చూస్తూ అతనికే మాట్లాడేందుకు అవకాశం యిచ్చింది. నందగోపాల్ చాలా తెలివైన వాడు . అతను తక్కువగా మాట్లాడతాడు. అందుకే అతని యెక్కువ మాటలు వృధా కావు.
    'చూడండి బావగారు మేము యిద్దరమూ డాక్టర్లమే. దైవానుగ్రహం వల్ల మా కోరిక కూడా గంగ తీరుస్తున్నది. యీ కాస్మా పాలిటన్ రోజుల్లో గంగ పెళ్ళి మాకేమీ పెద్ద తీరని సమస్య కాదు. కానీ ముందు నుంచీ మేము శ్రీకాంత్ మీద ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలు నిరశాలైపోతాయనే బెంగ లేదు. మరో సంగతి.... చిన్నతనం లో ఈ పెద్దవాళ్ళు కావాలని తెలిసి దేనికో తప్పులు చేస్తుంటారు. పిల్లలకి పుడుతూనే ని మొగుడు వీడు, నీ భార్య యిది అని దేనికో పోయింట్ అవుట్ చేసి లేనిపోని ఆశలు క్రియేట్ చేస్తారు. తీరా పెద్దలయేక రాత లేవిధంగా తారుమారై పోతాయో గ్రహించరు. మనకే,మండీ నిక్షేపం లా వుంటాం. లేత హృదయాల్లో రగిలే జ్వాలల్ని ఆపేందుకు నిమిత్త మాత్రులం కనుక మాకేమీ తెలీదని తప్పించుకుంటాం.  గాజు పాత్రలా పగిలిపోయే ఆ మనసుల్ని మనం అతకలేము. లెట్ యిట్ బి. మేము వచ్చిన కారణం యిప్పుడు చెప్పక తప్పదు.' అన్నాడు గంబీరంగా.
    చటర్జీ దొంగతనం చేశాక పట్టుబడిన వాడిలా అయిపోయి అక్కడికీ యెవరూ గుర్తించకుండా జాగ్రత్త పడ్డాడు.
    నందగోపాల్ ప్రారంభించాడు. 'మా అమ్మా నాన్న పెద్ద వాళ్ళయ్యారు. వాళ్ళు గంగ కి పెళ్లి చేయమని తొందర చేస్తున్నారు. యీ సంబంధం కాకపోతే మరో సంబంధం అనుకునేందుకు పై వాళ్లెం కారు కద మీరు. యింతకీ మీరు శ్రీకాంత్ కి గంగను చేసుకుంటారో లేదో కనుక్కునేందుకు వచ్చాము.'
    చటర్జీ మాట్లాడలేదు చాలాసేపటి వరకూ. శ్రీకాంత్ గుండెలు దడదడ లాడుతున్నాయి. ఉమేష్ కి తండ్రి ప్రవర్తన వింతగా వుంది. గోవింద కి మనసులో యిన్నాళ్ళూ లీలగా మెదిలిన భావానికి యిప్పుడు సాదృశ్యం యేర్పడి పటిష్టంగా పాతుకు పోయింది. రాధిక చేతిని తూములో కడుక్కుని అన్నని వుద్దేశిస్తూ అంది. 'మేనత్త గా నాకు రైట్ వుంది. శ్రీకాంత్ ని నేను చిన్నప్పటి నుంచీ నా కూతురు కోసం నిర్ణయించిన వరుడనే అనుకున్నాను. యివాళ నువ్వూ, వదినా యిద్దరూ కలిసి అడ్డం వచ్చినా యీ పెళ్లి జరిగి తీరుతుంది. చిన్నప్పుడు బజార్లో కీయిస్తే ఆడే బొమ్మని తీసుకు రమ్మని నేను చెబితే జేబులో డబ్బు లేకపోయినా తంటాలు పడి తెచ్చేవాడివి. అటువంటిది నా చిన్న కోరికని తల్లీ తండ్రి కన్నా గారాబంగా చూసిన నువ్వు కాదనవనే నమ్మకం వుంది. వున్నది కాబట్టి యింతదూరం పని గట్టుకుని వచ్చాను!' రాధిక యెన్నడూ యేడవలేదు. విష్ణుమూర్తి ని గాడంగా ప్రేమించి ఆ ప్రేమ విఫలమై గోవిందని చేసుకు వచ్చినప్పుడు కూడా కన్నీరు కార్చలేదు. అతను పోయినప్పుడు ఆత్మీయుడిని పోగొట్టుకున్న దుర్భరమైన బాధని దిగమిగింది. విష్ణుమూర్తి తో రాధిక యే నాడూ ప్రేమ కలపాలూ సాగించలేదు. సంభనగా మనసులో అతని రూపానికి ఆరాధన చేయసాగింది. శ్రీకాంత్ ని తన బిడ్డకి చేసుకుంటే చచ్చిపోయిన విష్ణుమూర్తిని యే తరం లోనూ మరిచి పోలేననే వెర్రి భ్రమ పెట్టుకుంది. ఆ ఆశలు యిప్పుడు నెరవేరవేమోననే భీతితో డగ్గుత్తిక పడింది. గొంతు గాడ్గాదికం అయిపొయింది. నందగోపాల్ భార్యని గమనిస్తూనే వున్నాడు. అతనికి రాధిక పట్ల గల అనురాగం అంతులేనిది?
    చటర్జీ మౌనంగానే వూరుకున్నాడు అప్పటికీ.
    గోవింద అన్నది : 'ఛ! రాధికా! కంట తడి పెట్టడం మంచిది కాదు. యిప్పుడు అయన అలా అన్నారు కానీ చిన్నప్పటి నుంచీ మీ మాటని యెన్నడైనా త్రోసి పుచ్చడం జరిగిందా? మీకు నేను యిస్తున్నాను భరోసా.'
    రాధిక పేలవంగా నవ్వింది : 'భరోసా ......యిప్పటిది కాదు వదినా అన్నయ్య యిచ్చిన భరోసా. దాదాపు యిరవై యేళ్ళు దాటి పోయింది: ఆ భరోసా తోటే నిశ్చింతగా ఉన్నాము యిన్నాళ్ళు. కానీ యిప్పుడు చూడు....నువ్వు యిస్తున్న భరోసా అన్నయ్య యిచ్చిన దాని కన్న దృడం అయినదేమీ కాదు.'
    గంగ నిశ్చలంగా శ్రీకాంత్ కళ్లల్లోకి చూసింది. భోజనాల దగ్గర యేర్పడిన సంభాషణ యింటిని పూర్తిగా గంబీర్యం అయిన వాతావరణం లోకి దింపేసింది.
    చేతులు కడుక్కుని భారంగా లేచారు అందరూ.
    సాయంత్రం కాఫీ టిఫిన్ లు పూర్తయాక గంగ అన్నది : కలకత్తా పూర్తిగా చూడనిదే వెళ్ళద్దమ్మా. ఈసారైనా కనీసం కలకత్తా చూశానని ఫ్రెండ్స్ తో చెప్పడాని కైనా వుంటుంది.'    
    చటర్జీ యీ మాట విన్నాడు. విని 'శ్రీకాంత్ ఉమేష్ ఇవాల్టి నుంచీ దాన్ని తీసుకుని దక్షణేశ్వర్, కాళీ ఘాట్ బొటానికల్ గార్డెన్, నష్కర్ బాడీ లో జోడా మందిర్, గడియర్ మార్ట్ తీసుకు వెళ్ళి చూపించి రండి. శాంతిని కేతన్ కి కాలేజీ సెలవు పెట్టి మరీ తీసుకు వెళ్ళండి.' అన్నాడు.
    అతని మాట పూర్తీ కాలేదు కృష్ణ మోహిని గుమ్మం లో నిలుచుని 'మరి నన్ను మావయ్యా,' అని అడిగింది.
    కృష్ణ మోహిని చిన్న తనం లో రబ్బరు బంతి లా చూడ ముచ్చట గా వుండేది. చటర్జీ కి చంటి పిల్లలంటే యేనలేని మమకారం కారణంగా ఆ పిల్లని యెన్నడూ దింపే వాడు కాదు. అలా ఆ పిల్ల అతని వొడి లో పెరిగి పెద్దదైంది. కాలం తెచ్చిన మార్పో లేక మానసికమైన జాడ్యం అవరించడం వల్లనో చటర్జీ యివాళ మనసుకి బానిస అయిపోయి తను చేస్తున్న పనులు తనకే అంతు బట్టని విధంగా మారిపోయాడు. కృష్ణ మోహిని కి అతని దగ్గర చనువు కనీసం గోవింద యిన్నేళ్ళ సాహచర్యం లోనూ సంపాదించలేకపోయింది.
    కృష్ణ మోహిని ఆ విధంగా అడగగానే అతని గొంతు లో పచ్చి వెలక్కాయ అడ్డంగా చిక్కు కున్నట్లయింది. చటర్జీ చివరికీ ఏదో నిశ్చయానికి వచ్చేసిన వాడిలా ' మహారాణివి తల్లీ నువ్వు. నిన్ను తీసుకు వెళ్ళకుండా వాళ్ళనే పంపిస్తే నన్ను కలకత్తా మహానగరం నుంచి తేలికగా గెంటేస్తావని తెలీదూ,' అన్నాడు.
    శ్రీకాంత్ ఉమేష్ ల ఆనందానికి అవధులు లేవు.
    మర్నాటి నుంచి వరుసగా అన్ని ప్రదేశాలూ చూడడం ప్రారంభించారు నలుగురూ. కృష్ణమోహిని , గంగా అప్తమిత్రుల మాదిరి అయిపోయారు.
    గారియర్ మార్ట్ కి వెళ్ళినప్పుడు గంగ వేరు శనక్కాయలు కొనుక్కుని తింటుంటే శ్రీకాంత్ నవ్వి 'వేరు శనక్కాయలు మీ వూళ్ళో వుండవా,' అని అడిగాడు.
    కృష్ణ మోహిని గంగ తరపున వకాల్తా పుచ్చుకుంది! అబ్బే వుండవు. మీ కలకత్తా లోనే దొరుకుతాయి. అదీ అక్కడా యిక్కడా కాదు గారియల్ మార్ట్ లో మరి తమరు పానీపూరీ లు తినడం దేనికోయ్.'
    శ్రీకాంత్ మరోసారి నవ్వి పానీ పూరీలు తినడం లో మునిగి పోయాడు.
    కృష్ణ మోహాని ని ఉమేష్ కి యిస్తారనే సంగతి గంగ కి తెలుసు. ఉమేష్ దూరంగా నిలుచుంటే అతని వైపు చూస్తూ "మిమ్మల్ని యిక్కడ వదిలెయమంటావా బావ. నోట్లోంచి మాటే రావడం లేదు నీకు. యిన్నాళ్ల యింది ఒక్కసారి కూడా పెదవి విప్పడం చూడలేదు. మేము యిద్దరం డిస్టర్బ్ చేస్తున్నాం కదూ' అన్నది.
    ఉమేష్ తలెత్తాడు; 'అంటే మమ్మల్ని వెళ్ళి పోమ్మనేగా? దానిదెం వుంది యిద్దరం నేతాజీ సరోవర్ కి వెళ్ళి వస్తాం మీరు యిక్కడే వుండండి .' నలుగురూ చిన్నగా నవ్వుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS