"ఏం షూటింగ్ జరిగిందిక్కడ?"
"చిన్న టూత్ పేస్ట్ యాడ్ సార్" అన్నాడు ప్రమోద్.
"ఎవరో కొత్త అమ్మాయిలా కనిపించింది. దీన్లో యాక్ట్ చేసిందా? పేరు ఏమిటి?" యధాలాపంగా అడిగినట్టు అడిగాడు.
"ప్రీతి అని కొత్తగా వచ్చింది. మనం ఇచ్చిన ప్రకటనకి అప్లికేషన్ పెట్టింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. ఓ రెండు స్టిల్ యాడ్స్ లో నటించింది".
"ఫోటోజెనిక్ ఫేస్ లా ఉంది. యాక్షన్ ఎలా ఉంది?" ఆరా తీశాడు.
"స్టార్ పొటెన్సీ ఉంది సార్. ఫ్రీగా చెప్పింది. ఈజీగా చేసింది. మనం కాంట్రాక్ట్ బేసిస్ మీద బుక్ చేసుకోవచ్చు" ప్రమోద్ అన్నాడు.
"ఓకే లెటజ్ సీ... ఇంకొక రెండు చెయ్యనీ, ఆలోచిద్దాం" అని బయటికి వెళ్లాడు. అతని కుడిభుజం... డ్రైవర్ కం అడ్వయిజర్, ఇన్ ఫార్మర్ లాంటి పాత్రలు పోషించే అన్వర్ తో లిఫ్ట్ లో ... "ఆరా తీయి ఆ అమ్మాయి సంగతులన్నీ" అన్నాడు అర్థవంతంగా చూస్తూ.
'జీ సాబ్' ఒక్కమాట నమ్రతగా అన్నాడు. మర్నాడు సాయంత్రానికల్లా ప్రీతి పుట్టుపూర్వోత్తరాలన్నీ రాబట్టేశాడు అన్వర్.
ప్రీతి మధ్యతరగతి అమ్మాయి. చదువు కంటే కూడా, తన అందాన్ని నమ్ముకుని పెద్ద సినీతార, కనీసం టీ.వి. తారయినా అయిపోవాలని ఆరాటపడే అమ్మాయి. దానికోసం రకరకాల ఫోటోలు తీయించుకుని అడ్వర్టయిజింగ్ కంపెనీలకి, సినీ, టీ.వి. ప్రొడ్యూసర్లకి పంపిస్తూ, చెయ్యని ప్రయత్నాలు లేవు. ఎలాగో బి.ఎ. అయితే గట్టెక్కింది. మన కంపెనీకి పంపిన అప్లికేషన్ కి ఇంటర్య్వూకి పిలిస్తే వచ్చి సెలెక్ట్ అయి, చిన్న యాడ్స్ చేసింది. మామూలు మధ్యతరగతి అమ్మాయిల మనస్తత్వం యాడ్ వరల్డ్ గాలానికి చిక్కుకుంటుందన్నది అతనికి బాగా తెలుసు.
మర్నాడు ఆఫీసుకి రాగానే ప్రొడక్షన్ మేనేజర్ ని పిలిచి చాలా మామూలుగా, షూటింగ్ కి తయారుగా ఉన్న ప్రోడక్ట్ గురించి ఆరాతీశాడు. ఒక ఫేషియల్ క్రీమ్ యాడ్ షూట్ చెయ్యాల్సి ఉంది అన్నాడతను.
"నిన్న ఎవరో ప్రీతి అన్న అమ్మాయి లిఫ్ట్ దగ్గర కనిపించింది. చాలా ఫొటోజేనిక్ గా ఉందనిపించింది. ప్రమోద్ ని వివరాలు అడిగాను. చెప్పాడు. ఫేషియల్ క్రీముకి హీరోయిన్ ని సెలెక్ట్ చేశారా?" ఆరా తీశాడు.
"ఇంకా లేదు సార్. చూస్తున్నాం. ఇద్దరు ముగ్గురు కొత్త ఫేస్ లున్నారు".
"అయితే, ఈ అమ్మాయిని ట్రై చేయండి. ఆ అమ్మాయిలో స్పార్క్ ఉంది. స్టార్ పోటెన్సీ కనిపించింది" అన్నాడు చాలా మామూలుగా.
"ఓకే సార్! యాజ్ యూ విష్" అని వెళ్లిపోయాడు మేనేజర్.
ఇదేమీ తెలియని ప్రీతి వెంటవెంటనే మరో ఆఫర్ వచ్చినందుకు పొంగిపోయింది. అదంతా తన అందం, నటన వల్లే అనుకుని ఊహాలోకంలో తేలిపోయింది.
ఫేషియల్ క్రీమ్ షూట్ అయ్యాక ఫైనల్ ప్రోడక్ట్ విజువల్స్ చూస్తే వినోద్ కి తన అంచనా తప్పుకాదని, ప్రీతిని ట్రైన్ చేసే సక్సెస్ ఫుల్ స్టార్ అవుతుందన్న నమ్మకం కలిగింది. వెంటనే పనికి ఉపక్రమించాడు. ప్రీతిని తన ఆఫీసు రూముకి పిలిపించాడు. ప్రీతి ఈ ఎదురుచూడని ఆహ్వానానికి తబ్బిబ్బు అవుతూ, కాస్త భయం, ఆరాటంతో తడబడుతూ... లోపలికి వెళ్ళింది. కంపెనీ డైరెక్టర్ నుంచి పిలుపు రావడం అంటే మాటలు కాదు అని అనరూ అంటూండగా వింది. ఇప్పుడు తనకి ఇలా పిలుపు రావడం..." కమిన్ మిస్ ప్రీతి! అలా కూర్చోండి. బి కంఫర్టబుల్. నిన్న మీరు నటించిన ఫేషియల్ క్రీమ్ యాడ్ చూశాను. అయామ్ ఇంప్రెస్ డ్ విత్ ఇట్" మొదటి బాణం వదిలాడు వినోద్ జైన్. ఆశ్చర్యంతో, ఆనందంతో తబ్బిబ్బు అవుతూ "థాంక్యూ సర్! ఇట్స్ ఏ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మి!" అంతకంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ప్రీతికి.
"మిమ్మల్ని ఆ యాడ్ లో చూస్తే మంచి ఫొటోజేనిక్ ఫేస్ అని, యాక్టింగ్ టాలెంట్ ఉందన్నది అర్థం అయింది. అంచేత ముమ్మల్ని మా కంపెనీ ఆర్టిస్ట్ గా కాంట్రాక్ట్ తీసుకుందామని నిర్ణయించాను. ఐ హోప్, మీకు అభ్యంతరం లేకపోతే... అగ్రిమెంట్ రాసుకుందాం" రెండో బాణం వదిలాడు.
ప్రీతి నమ్మలేనట్టు చూసింది. కాంట్రాక్టు అంటే ఆమెకి తెలుసు. మొదటిసారి యాడ్ లో నటించినప్పుడు కొన్ని వివరాలు సేకరించింది. ఈ కంపెనీతో కాంట్రాక్ట్ అంటే ఇంకో కంపెనీ అవకాశాలు వచ్చినా నటించకూడదు. ఇక్కడ వీరు చేసే ప్రకటనలకి అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇచ్చిన పాత్రల్లో నటించాలి. కాంట్రాక్టు అంటే నెలజీతం ప్రకారం పనిచెయ్యాలి అని తెలుసుకుంది. ఇంత పెద్ద పేరున్న కంపెనీలో అవకాశం దొరకడం అదృష్టం. ఇక్కడ పనిచేస్తే పేరుకి పేరూ, నెలకి జీతమూ... కొన్నాళ్ళు చేశాక కావలిస్తే, పెద్ద అవకాశాలు వస్తే, కాంట్రాక్ట్ అయ్యాక వదిలేసుకోవచ్చు. ప్రీతి ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇప్పుడు గుర్తింపేలేని తనకు ఇది పెద్ద అదృష్టం.
మొహం సంతోషంగా వెలిగిపోతుండగా, "థాంక్స్ సార్ మెనీ థాంక్స్ సార్. మీ కంపెనీలో పనిచేయడం నా అదృష్టం..." గబగబ అంది. వినోద్ కి అర్థమైంది ఆమె ఆరాటం. తను కూడా మరీ తొందరపడకూడదు. అంతా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతోందని అందరూ అనుకోవాలి.
"దెన్ ఓకే! మేమిచ్చిన ఫారాలు చదువుకుని సంతకం పెట్టండి. లీగల్ వివరాలు మా ప్రొడక్షన్ మేనేజర్ వివరిస్తారు..." అంటూ ప్రొడక్షన్ మేనేజర్ సుధాకర్ వంక చూశాడు.
"ఓకే సార్" అని "ప్లీజ్ రండి ... నా ఆఫీసులో సంతకాలు పెడుదురుగాని" అని సుధాకర్ దారితీశాడు.
