వినోద్ వెనక్కి వాలాడు కుర్చీలో విలాసంగా. వినోద్ కి పేరుకి తగ్గట్టు వినోదం కావాలి. విలాసం కావాలి. కొత్త అందాలు కావాలి. జీవితం అంటే విలాసంగా, ఆనందంగా అనుభవించాలనే తత్వం. చాలా తొందరగా అందానికి ఆకర్షితుడవడమే కాదు, ఆ అందం సొంతం అయ్యేవరకు అలజడి, పొందాలనుకున్న దానికోసం ఎవరేమనుకున్నా లెక్కచెయ్యని మనస్తత్వం. చేతినిండా డబ్బు, ఇంటినిండా డబ్బు, ఆఫీసునిండా అమ్మాయిలు... ఇంకేం కావాలి. వేటికీ వెతుక్కోనక్కరలేదు. వలకి ఎరగా కళ్ళకి కనిపిస్తూ ఊరించే భవిష్యత్తు చూపించే ఫ్యాషన్ వరల్డ్, కష్టపడకుండా అమ్మాయిలను వలలో పడేసుకునే అందం, డబ్బు, యవ్వనం, మాట చాతుర్యం, అన్నీ ఉన్న వినోద్ కి కొత్త అందాలు, అమ్మాయిలు వినోదం!
ఇన్నీ ఉన్న వినోద్ కి ఇంట్లో మిగతావన్నీ మెండుగా ఉన్నా అందమైన ఆ అనుభవం మాత్రం అనుభవంలోకి రాలేదు. భార్య అందంగా ఉంటే ప్రేయసిని చూడగలిగేవాడేమో! వ్యాపారం దివాలా తీసి తిరిగి నిలదొక్కుకోడానికి తండ్రి అవస్థలు పడుతున్న తరుణంలో... కళ్ళెదుట కనిపించిన దారి భారీ పెళ్ళికూతురితో పాటు వచ్చే భారీకట్నం, కోట్లిస్తామన్నా కూతురి చేయి అందుకోడానికి ముందుకు రాని వాళ్ల సంఖ్య పెరిగిపోతున్నకొద్దీ, కోట్ల ఆస్తి ఉన్న తండ్రి రేటు పెంచుతూ పెంచుతూ పోయాడు. చూస్తూ చూస్తూ మరీ లేనింట్లో పిల్లని పడేయలేక, దారీ తెన్నూ తోచక సతమతమవుతున్న కన్నతండ్రికి, వ్యాపారం దెబ్బతిని తేరుకోవడానికి మార్గాలు అన్వేషిస్తున్న జైన్ కుటుంబం కనిపించింది. మధ్యవర్తి ద్వారా కోట్ల ఆస్తి ఎరగా చూపాడు. అంతస్తులు, ఆస్తిపాస్తులు అన్నీ సరితూగేవైనా చూస్తూ చూస్తూ అందంగా, స్మార్ట్ గా చదువుకున్న వినోద్ కి జోడు కుదరని ఆ అమ్మాయిని కట్టబెట్టలేక మథనపడుతుంటే... 'డాడీ, మనం ఈ గండంలోంచి గట్టెక్కే మార్గం ఇదొక్కటే. అందంగా లేకపోయినా ఫరవాలేదు, డబ్బు లేకపోతే ఎలా బతుకుతాం? అందులో ముందునుంచీ దర్జాగా బతికినవాళ్లం. దరిద్రాన్ని ఎలా కావలించుకుంటాం'? బతకనేర్చిన వినోద్ తండ్రికి ధైర్యం చెప్పి సలహా ఇచ్చాడు. అప్పటికింకా విశాల్ చదువు పూర్తవలేదు. కూతురి పెళ్ళి చేయాలి. ఇల్లు తాకట్టులో ఉంది. ఈ సమస్యలన్నీ కళ్ళముందు కదలాడుతుంటే... మరో మార్గం లేక తలొగ్గాడు అవినాష్ జైన్.
కొత్త కోడలితో వచ్చిన కోట్ల ఆస్తితో అప్పులు తీర్చి, వ్యాపారంలో నిలదొక్కుకుని ఊపిరి పీల్చుకున్నారు అందరూ. అందం లేకపోయినా ఒంటినిండా అహంకారం ఉంది సుస్మితా అగర్వాల్ కి. కోట్ల ఆస్తికి వారసురాలు. మొగుడయితేనేం, అత్తవారయితేనేం తల ఒగ్గాల్సిన ఖర్మ తనకేం ఉంది. తనవల్ల కంపెనీకి పునర్జీవితం వచ్చింది. తన డబ్బుతో తినేవారు తనకు ఎదురుచెప్పే సాహసం చెయ్యకూడదు అన్న మనస్తత్వం. అత్తవారింట అడుగుపెడుతూనే కంపెనీలో పెద్ద షేర్ సొంతం చేసుకుంది. ఇల్లంతా తనిష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేసేసింది. అత్త, మామ, మొగుడు ప్రేక్షకపాత్ర పోషించారు. ధనరాశితో వచ్చిన భార్యని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఏడాది గడిచిపోయింది. నోరెత్తకుండా కాపురం చేసి వంశోద్ధారకుణ్ణి కన్నాడు. ఇంట్లో కోడలి పెత్తనానికి అలవాటుపడి మామగారు ఆఫీసుకి, అత్తగారు పూజగదికి అంకితమయ్యారు. కూతురి పెళ్ళి చేసి పంపి నిశ్చింతగా నిట్టూర్చారు. తండ్రి మీద గౌరవంతో ఛైర్మన్ పోస్టులో కూర్చోపెట్టాడు వినోద్. ఎం.బి.ఎ. పూర్తిచేసి వచ్చిన తమ్ముడికి తనతోపాటు మేనేజింగ్ డైరెక్టర్ పదవి ఇచ్చి, ఆ ఇంటి కొడుకుగా కర్తవ్యం నెరవేర్చాడు. ఆరేళ్ల కొడుకు ముద్దుమురిపాలు చూసి మురిసిపోతూ, కొడుకు మంకుపట్టుకి తల ఒగ్గి ప్రేమంతా కుమ్మరిస్తూ, కొడుకు పెంపకంలో తలమునక లవుతూ కాస్తంత అహం, అహంకారం తగ్గింది ఇల్లాలి పాత్ర నుంచి తల్లి పాత్రలోకి మారేసరికి సుస్మిత మనసు కాస్తంత సున్నితం అయి, ఇంట్లో అత్తమామల్ని, తనకు ఎదురుచెప్పని భర్తని గౌరవంగానే చూడడం ఆరంభించింది. దానికితోడు కంపెనీ ఎనిమిదేళ్లలో బాగా పుంజుకుని లాభాలబాట పట్టడంతో, అందులో మామగారు, మరిది పాత్ర చాలా ఉండడం, తను మరీ అతిశయం చూపిస్తే సహించని స్థాయికి వారి సంపాదన పెరగడంతో సుస్మిత ఇంట్లో పవరు, ఒంట్లో పవరు తగ్గించుకుంది.
వినోద్ పెళ్ళయితే చేసుకున్నాడుకాని, నిజం చెప్పాలంటే ఒక్కరోజు కూడా సుఖంగా లేడు. అడుగడుగునా అహంకారం చూపే భార్య అందమైనా చూసి సర్దుకుపోదామన్నా, అదీ ఊరించే ఊహల్లో తప్ప నిజజీవితంలో దొరక్క, నిర్లిప్తత నిండిన కాపురంలో రోజులు నెట్టుకొచ్చాడు కొన్నాళ్లు. ఒకటే ఓదార్పు... కొడుకు పుట్టడం. తల్లిదండ్రులకి మనవణ్ణి ఇచ్చానన్న తృప్తి. భార్య దృష్టి తనమీద నుంచి కొడుకుపైకి మళ్లడంతో ఊపిరి పీల్చుకుని కేవలం నాలుగేళ్ళు కంపెనీని నిలబెట్టే ప్రయత్నంలో రాత్రింబవళ్ళు మునిగిపోయి తనలోని నిరాశ, నిస్పృహని మరిచిపోయాడు.
కంపెనీ వ్యవహారాలు కుదుటపడి తండ్రి, తమ్ముడు తోడయి బరువు బాధ్యతలు కాస్త తగ్గి ... చుట్టూచూడడం ఆరంభించాడు. ప్రకటనల ప్రపంచంలో, ఫ్యాషన్ వరల్డ్ లో అందమైన అమ్మాయిలను చూసినప్పుడల్లా చలించేవాడు. భార్య గుర్తువచ్చి తనకు దొరకని అందమైన అనుభూతికోసం మనసు ఉవ్విళ్ళూరేది. కానీ, ఆ అందాలు ఎలా అందుకోవాలో తెలిసేది కాదు. పిరికితనం ఒక కారణమైతే, ఎవరికైనా తెలుస్తుందేమో, పరువు ప్రతిష్ఠ అన్నీ గుర్తువచ్చేవి. ఎంతోమంది అమ్మాయిలు కెమెరా ముందు నటించడానికి, చిన్న ప్రకటనలోనైనా కనపడాలని ఉవ్విళ్ళూరుతూ, ఆఫీసు చుట్టూ తిరిగేవారు ఫోటోలు చేతపట్టుకుని. వినోద్ ది విజువల్స్ సెక్షన్ కనుక యాడ్ షూటింగులు, నటీనటులు, డైరెక్టర్లు, పూర్తయిన యాడ్ లు చూసి ఓకే చెయ్యడం అంతా అతని పర్యవేక్షణలో ఉండడంతో, రోజూ ఎంతోమంది అమ్మాయిలు అతని దృష్టిలో పడి అతన్ని నిద్రకి దూరం చేసేవారు. ఆ అందం అందుకోవాలన్న తపన, ఆరాటం రోజురోజుకి పెరిగింది.
