"హాయ్ ప్రీతీ, మై డార్లింగ్... హ్యాపీ... నా ప్రామిస్ నిలబెట్టుకున్నాను కదా... నౌ యు బిలీవ్ మీ" గోముగా అడిగాడు ప్రీతి వెంట్రుకలు సరిచేస్తూ. మాటలు రానట్టు. చేతులు మెడచుట్టూ వేసి అతని గుండెల్లో మొహం దాచుకుంది ప్రీతి.
"థాంక్యూ డార్లింగ్! నా కలను ఇన్నాళ్లకి నిజం చేశావు. యు మేడ్ మి ఎ స్టార్! అయామ్ సో హ్యాపీ! ఇవాళ అందనంత ఎత్తుకి ఎదిగిపోయానన్న ఫీలింగు... రెండేళ్ల నా కష్టం, ఎదురుచూపులు ఫలించాయి. నీ సపోర్ట్ లేకుండా నేను ఈ స్థాయికి ఎదగడమన్నది కలగానే మిగిలేది..." కళ్లు చెమ్మగిల్లుతుండగా అంది.
"డోంట్ బి సిల్లీ! నీలో అందం, ఆకర్షణ, నటన అన్నవి లేకపోతే నేనెంత ప్రయత్నించినా సక్సెస్ అవలేవు. ఇప్పుడు చూడు ఇక నీవెంట అందరూ ఎలా పడతారో. ఫ్యాషన్ వరల్డ్ ఏదీ శాశ్వతం కాదు ప్రీతి. ఈ క్షణం నిచ్చెన పైమెట్టుమీద ఉంటావు. ఆ స్థానం నిలుపుకోడానికి అనేక దారులలో వెళ్లాలి. అందరినీ ఆకర్షిస్తూ, మాటల్లో తెలివి, ఆత్మవిశ్వాసం, మంచితనం, వినయం అన్నీ కనబరుస్తూ, అందం మెరుగుపరుచుకోడానికి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ... యోగాలు, ఎక్సర్ సైజులు, ఫేషియల్స్, బ్యూటీ ట్రీట్ మెంట్లు అన్నీ జీవితంలో భాగం అవ్వాలి. పేరొచ్చింది కదాని ప్రతి చెత్తా ఒప్పుకోకు. డిగ్నఫైడ్ గా కనపడాలి".
"ఓకే డార్లింగ్! నా వెనక నీవుండగా నాకేం భయం" కౌగిలి మరింత బిగించింది.
"ఏమో! రేపు పెద్ద స్టార్ వి అయిపోతే, నా అవసరం తీరిపోవచ్చు. అప్పుడు నేను నీ వెంట పడాలేమో. నీ దర్శనం కోసం పడిగాపులు పడాలేమో..."
"ఏయ్... అలా మాట్లాడకు, నాకు కోపం వస్తుంది" బుంగమూతి పెట్టింది.
"చిన్న పాపాయిలా ఏమిటా అలక" ఆ బుంగమూతికి ముద్దు పెట్టాడు.
"ప్రీతి, నిజంగా, నీవు నా జీవితంలోకి రాకపోతే ఎంత నిస్సారంగా జీవితం గడిచేదో. జీవితంలో ఛార్మ్ లేదు అన్న నైరాశ్యాన్ని పటాపంచలు చేశావు. నా జీవితంలోకి వెలుగులా, వరదలా వచ్చేసి చుట్టుముట్టేశావు. నీ ప్రేమలో పడి ఎటో కొట్టుకుపోయాను. చుట్టూ ప్రపంచం ఉన్నదన్నదే మర్చిపోయాను. ప్రేమ అంటే ఇలాంటి అనుభూతి అని ఎరగని నాకు కొత్త లోకాన్ని చూపావు" ఆర్తిగా, ఆరాధనగా ఆమెని చుట్టేసి అన్నాడు.
"ఓ అనామికగా, కలలు మాత్రమే కనగలిగే మామూలు అమ్మాయితో ఏం చూశావో, ఏం మంత్రం వేశావో, నేనెందుకు నచ్చానో, ఏదీ ఆలోచించే శక్తి కోల్పోయినట్లు చేసి వశపరచుకున్నావు. నీవు మంత్రగాడివి. ఒకటే భయం నాకు. ఇది కల అని, కరిగిపోతుందన్న భయం మాత్రం వదలడం లేదు. నిన్ను శాశ్వతంగా నా దగ్గర ఉంచేసుకోవాలంటే... ఎలా డియర్? చెప్పు నేనేం చెయ్యాలో..." ఆర్తిగా అంది ప్రీతి.
"అది సాధ్యం కాదని మనిద్దరికి తెలుసు. మరుక్షణం మనది కాదు. ఉన్న క్షణంలో ఆనందం అనుభవించకుండా జరగనిదాని గురించి ఆలోచించి ఉన్నది చేజార్చుకోవద్దు. ప్రీతి, నన్ను ఈ అనుభూతినించి దూరం చెయ్యకు. ఇక్కడున్నంతసేపు మనిద్దరం తప్ప ఏ ఆలోచన చొరబడనీయకు" తమకంగా అల్లుకుపోయాడు.
ప్రీతి నిట్టూర్చింది. ఆ విషయం తనకీ తెలుసు. కానీ, తను కోరుకున్న ఈ క్షణాలు తనెప్పటికీ ఉంచుకోవాలంటే ఏంచెయ్యాలో మాత్రం తెలియడం లేదు ఆమెకి.
* * * *
ప్రీతి తండ్రి బ్యాంక్ ఉద్యోగి. తల్లి స్కూలు టీచరు. ఇద్దరిది కులాంతర వివాహం అవడంతో ఇటువారు, అటువారు దూరం అయ్యారు. ప్రీతి పుట్టాక ఇంక పిల్లలు వద్దనుకున్నారు. ప్రీతిని ఉన్నంతలో బాగానే పెంచి చదివించసాగారు. వయసొచ్చేసరికి ప్రీతి, తల్లి అందం పుణికిపుచ్చుకుని మిసమిసలాడే టీనేజ్ గర్ల్, కాలేజ్ గర్ల్ గా మగపిల్లలందరినీ తన చుట్టూ తిప్పుకుంటూ, వాళ్ల పొగడ్తలకి మురిసిపోతూ, తన అందం చూసి వెంటపడుతున్న అందరిని ఆకర్షిస్తూ, తనో రాకుమారిగానో, ఓ సినీతారగానో ఊహించుకుంటూ, చుట్టూ ఉన్న అమ్మాయిలని చిన్నచూపు చూస్తూ, తనుండాల్సింది ఇలాంటి చోటున కాదని, ఎలాగైనా సినిమాలలో పెద్ద నటి అవ్వాలని, కావాలని, ప్రకటనల రంగంలో చిన్న ఉద్యోగం సంపాదించుకుని, చిన్న చిన్న యాడ్స్ లో నటిస్తూ ఏనాటికన్నా తనకి గుర్తింపు వచ్చి, పెద్ద స్టార్ అవ్వాలని కలలు కనే సమయంలో... వినోద్ కంటపడింది.
ఓ రోజు చిన్న ప్రకటన జరుగుతోంది. చిన్న టూత్ పేస్ట్ ప్రకటన. హౌస్ వైఫ్ గా నటించే సీను. షూటింగ్ జరుగుతుండగా వినోద్ ఇంటికి వెళ్ళబోతుంటే లిఫ్ట్ దగ్గర షూటింగ్ పూర్తిచేసి బయటికి వచ్చి లిఫ్ట్ వైపు వెళుతున్న ప్రీతి కనబడింది. చూపు తిప్పుకోకుండా అటే చూస్తుండిపోయాడు. లిఫ్ట్ తలుపులు మూసుకున్న తరువాత స్టూడియో వైపు వెళ్లాడు. పేకప్ చేస్తున్న స్టాఫ్ అంతా వినయంగా నమస్కారాలు చేశారు. డైరెక్టర్ ప్రమోద్ ఎదురొచ్చి విష్ చేశాడు.
