Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 15


              

    భలే హఠాత్తుగా వూడిపడ్డావే! నువ్వు నిజంగా మారలేదు. వేరేవాళ్లు చేసే పనులు తామే చేస్తున్నామని టాంటాం వేసుకునే కొందరు లబ్ధ అప్రతిష్టులు వున్న ఈ రోజుల్లో నీ వినయం వందనం నిజంగా అభినందనీయం. ముక్కుపచ్చలారని నిన్ను ఆ రోజుల్లోనే చూసి నాతో అప్పుడే అన్నాడు తాంతియా తోపే - ఈ కుర్రాడు బహుగడసరి అని, ఈ భూగోళపు స్ర్కీన్ ప్లే ఒంటిచేత్తో సరిదిద్దగల సమర్ధుడని.
    కుంజమ్మాళ్... అదేలే మన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఇంటికి వెడుతూంటే దార్లో నువ్వేమన్నావు? నా కొత్తరాగం గురించి అక్కడ ప్రస్తావనే తేవద్దనీ, ఏదో పాటల సందర్భంలో నేను కొత్తరాగం వినిపిస్తే వాళ్ళు చిన్నబుచ్చు కుంటారనీ, కావాలనే నన్ను ఆవిడకి పోటీగా తెచ్చావని అనుకుంటారనీ భయపడ్డావా లేదా! కానీ నిజం నిప్పులాంటిదిరా వెంకీ! కేవలం షడ్జమం పంచమం కాక ఒక్క శుద్ధమధ్యమంతో నేను కట్టిన వరస దాయమంటే దాగుతుందా! ఒక దర్శకుడు తన టీవీ సీరియల్ కు యిమ్మంటే ఇచ్చేశా... నీలాగే నేనూనూ, ఎవరికైనా చెప్పానా ఈ విషయం? ఆ మాటకొస్తే జైల్లో కూర్చుని బహదూర్ షా జఫర్ రాసిన గజల్స్ కొన్నిటికి నేనే ట్యూన్లు కట్టానని నీకు ఎప్పుడైనా చెప్పానా? మరి కుంజమ్మాళ్ వాళ్లు అంత చిన్నబుచ్చుకుంటే నేనెంత పెద్దబుచ్చుకోవాలి? కొన్ని కొన్ని మన నోటితో చెప్పకూడదు. వాళ్ళంతట వాళ్లే తెలుసుకునేదాకా మనం ఓపిక పట్టాలి.
    ఇక్కడో విషయం చెప్పాలి. ఎందుకంటే నీకు తెలీదు కాబట్టీ, అప్పుడు నువ్వు ఇండియాలో లేవు కాబట్టీ. పెర్ల్ హార్బర్ విషయాలూ నాగసాకీ గురించీ ట్రూమన్ కీ, రూజ్వెల్ట్ కీ వాళ్లు ఇకచాలు బాబోయ్ అని పైకెళ్లి పోయేదాకా డిస్కషన్ లు చెయ్యటానికి అమెరికా వెళ్ళి చాలాకాలం అక్కడే వుండిపోయావు. ప్రత్యేక ఆంధ్రాగురించి శ్రీరాములుగారు నిరసన వ్రతం చేస్తుంటే నేనూ ఊరుకోలేక ఓ వారం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా వున్నాను. అప్పటికే మూడుసార్లు నెహ్రూజీ నుంచి నాకు తంతి. 'నువ్వైనా ఒప్పించు శ్రీరాములు గారిని' అని. ఎవరైనా ఏదైనా ఉత్తరం రాస్తే లేక తంతి ఇస్తే అంతే మర్యాదగా తిరుగుటపాలో ప్రత్యుత్తరం లేక ప్రతితంతి ఇవ్వడం నాకు అలవాటని నీకు తెలుసుగా.. కానీ, ఆ ఒక్కసారికి మర్యాద తప్పాను. నెహ్రూగారిని ఎగర్తించాను సమాధానం ఇవ్వకుండా. ఆఫ్టరాల్.. జాతీయ స్థాయిలో నాకు కూడా నీలాగే ఎంతమంది మిత్రులున్నా వాళ్లతో ఎన్ని భాషలు మాట్లాడినా నేను ముందర పదహారణాల తెలుగువాణ్ణి. అది కోస్తా అయినా తెలంగాణా అయినా సీడెడ్ అయినా - సారీ సినిమా భాష వాడినట్టున్నాను - రాయలసీమ అయినా సోదర ప్రేమతో తెలుగు జాతికి అంకితమై వుండాలి. మన రామం పాడలేదూ. అదేదో సినిమాలో? 'తెలుగుజాతి మనదీ నిండుగ వెలుగు జాతి మనదీ" అంటూ!
    మొన్న రాజా ... అదే...మన రాష్ట్ర సీ.ఎం....వచ్చి విదేశాలకెళ్లి స్టడీ చేయాలి, అమెరికా వెళ్లమంటారా బ్రిటన్ కా అని అడిగి, కొంచెం బుష్ గానీ, బ్లైర్ కి గాని ఓ మాట చెప్పండి - ఏదో అందరిలా మొక్కుబడిలా మనల్ని రిసీవ్ చేసుకోకుండా - ఇది సీరియస్ ట్రిప్ అని చెప్పండి అన్నాడు. నేను చిరునవ్వుతో 'అమెరికా వద్దూ బ్రిటనూ వద్దూ" అని చెప్పా. రాజా ఆశ్చర్యపోయాడు. మరి ఇంకెక్కడికి అని అతని మోహంలో ప్రశ్నార్ధకం.
    'చైనా వెళ్లిరా" అన్నా. మనిషి కొంచెం అయోమయంలో పడ్డాడు. అతని సందిగ్ధం గమనించా. అల్ రెడి డెవలప్ అయిన కంట్రీస్ చూసి మూలాలు ఏం తెల్చుకుంటావు! రుషి మూలం అమెరికా మూలం ఎట్సెట్రా తెల్సుకోవటం వ్యర్ధం. అందుకని గోడదాటి చైనా వెళ్ళు. అక్కడి వాళ్ళు ఎంత డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నారో ప్రత్యక్షంగా చూడొచ్చు అన్నా.
    వెళ్లాట్ట. నాకు ఒకటే ఫోన్లు అక్కణ్ణుంచీ . అక్కడ జనాభా నియంత్రణ. ముఖ్యంగా ఒక బిడ్డనే కనాల్ట. రెండో బిడ్డ పుడితే జీతంలో కోత, జరిమానాలూ, జైలు శిక్షలూట. సమిష్టి వ్యవసాయమట. ఇరిగేషన్ బ్రహ్మాండంట. ముందర్జంటుగా హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గించడం కోసమైనా జనాభా నియంత్రణ అమలు చెయ్యమని చెప్పా. ఏం చేస్తాడో చూద్దాం.
    నువ్వూ నమ్మూ నమ్మకపో, నీ దగ్గర నేను దాచిందేముంది? అప్పుడు మావోతో - ముందు ముందు జనాభా ఇలాగే పెరిగితే తిండి దొరకడం కష్టం . కాగా దొరకదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి తిరగాలి అన్నా.
    'నిజమే....కానీ ప్రసూ .....ఎలా ? ఏమిటి చెయ్యటం?' అన్నాడు. కొంచెం నిష్కర్షగా వ్యవహరించటమే అన్నాను. అంతేకాదు అయన భారీ శరీరం చూస్తె నాకు కొంచెం భయమేసిన మాట నిజం. షుగరుందేమో కోలేష్టరాలు పెరిగిపోయిందేమో! బీపీ కంట్రోల్లో వుందో లేదో! అంత గొప్ప నాయకుడు ఇంకో వెయ్యేళ్ళయినా బతకాలి అని. దాని కొకటే మార్గం. అప్పటి వైద్యులు ముక్తకంఠంతో ఒకటే చెప్పేవారు. అది - నడక.
    నాకూ అదే తట్టి చెప్పాను . ఫలితం - లాంగ్ మార్చ్!
    శ్రీ శ్రీ రమణగారు నవ్య వీక్లీలో కొన్ని వారాల పాటు వెంకట సత్య స్టాలిన్ పేరుతొ చాలా అద్భుతమైన అతిశయోక్తుల కల్పనతో కొన్ని పేజీ కధలు రాశాడు. అయన రచనల్లోకెల్లా నాకు విపరీతంగా నచ్చిన ప్రక్రియ ఇది. నేనూ ఆగలేక కనీసం ఒక్క వాతైనా పెట్టుకుందామని రాసిన ప్రయత్నం ఇది. వినేవాడుంటే ఎన్ని గొప్పలయినా ఆశువుగా చెప్పేవాళ్లకి చెమడాలిరగ దీసేలాంటి గొప్ప శిక్ష ఆయన రాసిన కధలు.

                                        *  *  *  *    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS