పన్నెండు
ఉదయం 8.30 గంటలకు నాంకింగ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల (state college of New Medicine) చూశాము. మావో బోధనల ననుసరించి ఈ కళాశాల "కొత్త పాతల మేలుకలయిక"తో నడుపబడుతోంది. ప్రాచీన సంప్రదాయాలనూ, ఆధునిక వైద్య ప్రక్రియలనూ మేళవించడం చైనావారి ప్రత్యేకత. సుమారు పదివేల సంవత్సరాల చరిత్రగల ఆకుపంచర్ టెక్నిక్ తో బాటు అత్యంతాధునికమైన వైద్యపద్ధతులను అవలంబించే విద్యా విధానం అది.
కమ్యూనిస్టులకు పరలోకాలతో ప్రమేయం లేదు. పెట్టుబడిదారీ విధానపు కట్టుకథలలో ఒక భాగమే పారమార్థిక చింతన. "ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్" అని ఏనాడో తన నిర్వేదాన్ని ప్రకటించాడు గురజాడ. ఇహలోకంలో మానవుల భౌతికావసరాలను తీర్చడంలోనే పరమార్థం వుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. గ్రామాల్లోనైనా పారిశుద్ద్యానికే ప్రాధాన్యం. దేశమంతటా ఎక్కడా ఎలుకలూ, ఈగలూ, దోమలూ లేకుండా చేయడం ఈ ఉద్దేశంతోనే. ఇందుకుగాను చైనావారు సాంబ్రాణిని ఎక్కువగా ఉపయోగిస్తారు. గ్రామాల్లో సహా సాంబ్రాణి సువాసనలే మనకు స్వాగతం ఇస్తాయి.
మానవ సహజమైన బలహీనతలను క్రమక్రమంగా తొలగిస్తూ ఒక నూతన మానవుణ్ణి రూపొందించడమే చైనావారి ధ్యేయం. పాతరకపు మానవుని ఆలోచనలెంతసేపూ స్వార్థాన్ని చుట్టుకొని పరిభ్రమిస్తూవుంటే నూతనమానవుడు సాటిమానవుని శ్రేయస్సు కోసం శాయశక్తులా శ్రమిస్తాడు.
మధ్యాహ్నం 2 గంటలకు సినిమా ప్రోజెక్టర్ల ఫ్యాక్టరీ చూశాము. తమకు కావలసిన సమస్త వస్తువులనూ స్వయంశక్తితో, స్వదేశీ వనరులతో చైనావారు తయారు చేస్తారనడానికి ఈ ఫ్యాక్టరీ అనేకానేకమైన ఉదాహరణలలో ఇంకొకటి మాత్రమే. ఇతర దేశాలతో లాలూచీలు పెంచుకొని, స్వదేశంలోని సామాన్య ప్రజానీకాన్ని దోచుకునే పద్ధతిని చైనావారు ఏనాడో బహిష్కరించారు.
4 నుంచి 4.39 దాకా ఒక తమాషా అయిన రంగుల డాక్యుమెంటరీ చిత్రం చూశాము. ఇందులో కథానాయకుడు పండా అనే జంతువు. ప్రపంచంలోని చాలా అపురూపమైన జంతువులలో ఇదొకటి. చైనాలోని అనేక స్థలాలలోనూ, ప్రపంచంలో కొద్ది స్థలాలలోనూ ఇది కనిపిస్తుంది. ఇది చైనావారికెంతో ప్రీతిపాత్రమైన జంతువు.
డాక్యుమెంటరీలో పండా జీవితానికి సంబంధించిన వివరాలతో బాటు అది చేసిన రకరకాల వింతవింత విద్యలను చూపించారు.
4.45 గంటలకు ఒక ఘాట్ రోడ్ మీదగా వెళ్ళి, పాత అబ్జర్వేటరీ (నక్షత్ర శోధనశాల) చూశాము. పాత పరికరాలను జాగ్రత్తగా భద్రపరచిన ఆ స్థలంలోనే అత్యంతాధునికమైన టెలిస్కోపులతో ఒక భవనాన్ని నిర్మించారు.
ఏ నక్షత్ర గమనాలనూ, గ్రహగతులను పరిశీలించనక్కర లేకుండానే చైనా దేశానికి మానవ చరిత్రలో మహోన్నత భవిష్యత్తు వున్నదని చెప్పవచ్చు. గత చరిత్రలో మన రెండు దేశాలకూ ఎన్నెన్నో పోలికలున్నాయి. అనేక సహస్రాబ్దాలు అవ్యాహతంగాసాగిన చరిత్రలో మనవి ఎన్నో నాగరికతలు కాల గర్భంలో కలిసిపోయినా భారత చైనా దేశాలు రెండూ నిబ్బరంగా నిలత్రొక్కుకొని నిలబడగలిగాయి. మన రెండు దేశాల మైత్రి ఇతోధికంగా పెంపొందించడం మానవజాతి మనుగడకే ఎంతో అవసరం.
ఇప్పుడు చైనాదేశం 21వ శతాబ్దం వైపు హుటాహుటిగా పయనిస్తోంది. మనం ఎక్కడున్నాం? ఎటుపోతున్నాం? ఇది అందరూ ఆలోచించవలసిన విషయం.
ఆ రాత్రి హోటల్ రూంలో కూర్చుని Henri Barbusse గురించి ఆలోచిస్తున్నాను. బార్బూస్ ఈ శతాబ్దపు ప్రథమార్థంలోని ఒక గొప్ప ఫ్రెంచి మేధావి. రష్యన్ విప్లవం జయప్రదమైన తర్వాత అతడు లెనిన్ ఆహ్వానం మీద సోవియట్ యూనియన్ సందర్శించాడు. అక్కడ నుండి స్వదేశానికి మరలి వచ్చిన తర్వాత అతడొక పారిస్ పత్రికలో ఇలా రాశాడు.
I have seen the future. It works.
(భవిష్యత్తును చూశాను. అది బాగా పనిచేస్తోంది.)
అది తలచుకుంటూ, చైనా గురించి నా డైరీలో ఇలా రాసుకున్నాను.
"I have seen the future ! It is fast becoming past!"
(నేను భవిష్యత్తును చూశాను. అది త్వరత్వరగా గతమయిపోతోంది.)
19-12-76 నాంకింగ్ లోని ఒక చారిత్రాత్మకమైన స్థలాన్ని చూడడంతో ప్రారంభమయింది.
ఇది సుమారు ఒక సంవత్సరం బాటు 1946-47లో చౌఎన్ లై నివశించిన ఇల్లు అంతర్యుద్ధాన్ని విరమించవలసిందిగా చాంగ్ కై షేక్ తో రాయబారాలు సాగించడానికి వచ్చినప్పుడు బసచేసిన స్థలం (రాయబారాలు విఫలం కావడం చరిత్రప్రసిద్ధమైన విషయాలే!)
చౌ ఎన్ లై నివాసం చాలా నిరాడంబరంగా వుంది. ఆయన రాసుకొనేచోటు, పడకగది ఇత్యాదులన్ని యథాతథంగా ఉంచారు. పడకగది గోడమీద చౌ దంపతుల చిత్రపటం వుంది. ఆ యింట్లో నివసించినప్పుడు తీయించుకున్న చిత్రం.
చౌ ఎన్ లై రాయబారాలు సాగించే పద్ధతి గురించి విని నేనాశ్చర్యపడ్డాను. ఆయన ఎప్పుడూ గొంతు హెచ్చించి మాట్లాడేవాడు కాడట. అయితే తాను చెప్పదలుచుకున్న విషయాలు మాత్రం ఎటువంటి డొంక తిరుగుళ్ళూ లేకుండా, ఎటువంటి సందేహాలకు ఆస్కారం ఇవ్వకుండా విశదం చేసేవాడట. ఎదుటివాణ్ని బోల్తా కొట్టించడం కాదు. తాను చెబుతున్న దానిలోని సమంజసత్వాన్ని ఎదుటివారు అంగీకరించేటట్లు చేయడంలోనే చౌ ఎన్ లై వాదపటిమ ఉంది.
(ఇండియా - చైనా సరిహద్దు తగాదాలో నెహ్రూ గారు చౌ చేసిన ప్రతిపాదనలన్నింటినీ అంగీకరించడమూ, దరిమిలాను గోవిందవల్లభపంత్ లాంటివారి మంత్రాంగం వల్ల సంభాషణలు బెడిసిపోవడమూ పండిత్ సుందర్లాల్ గారు బహిర్గతం చేసిన విషయాలు.)
చౌ ఎన్ లై దంపతుల పడక గదిలో ఒక రాక్ కు తగిలించిన టోపీ ఒకటి వుంది. ఈ టోపీని కొంతకాలం చౌ, కొంతకాలం మావో ధరిస్తూ వుండేవారట. (ఇద్దరూ చెరో టోపీ కొనుక్కునే స్థితిలో వారప్పుడు లేరు.) చలి ప్రాంతంలో ఎవరుంటే వారా టోపీ ధరించేవారట. దీని వెనక ఇంత కథ ఉంది కాబట్టే ఇతర వస్తువులతో బాటు దీనిని కూడా ఆ యింట్లో పదిలపరచడం జరిగింది.
అదే ఉదయం 10 గంటలకు సన్ యట్ సేన్ స్మారక కేంద్రం దర్శించాము. వైశాల్యంలో ఈ కేంద్రం చక్రవర్తుల భవనాలకు సమానంగా ఉంటుంది. ఆ భవనాలలోని ఆడంబరం మాత్రం ఇక్కడ కనబడదు. మెట్ల పొడుగునా వచ్చేపోయే జనాలు. అయితే ఎక్కడా తొడతొక్కిళ్లూ తోపులాటలూ కనబడవు. నేను చూసిన ప్రతిచోటా వీధుల్లో గాని, షాపుల్లో గాని, పబ్లిక్ భవనాల్లో గాని - జనం సావకాశంగా సంచరిస్తూ వుంటారు. నేనంటే నేనంటూ పోటీపడరు. "మాకు కావలసినంత భూ వసతి వుంది. ఒకరి నొకరు తోసుకోవలసిన అవసరం ఏమొచ్చింది" అనే తత్వం సర్వత్రా నాకు కనిపించింది.
10.15 గంటలకు సన్ యట్ సేన్ మసోలియం సమీపంలోని టీ గృహంలో మేమందరమూ తేనీరు సేవించాము.
2.30 గంటలకు షాంఘై నగర ప్రయాణం వుంది. అందుచేత దూలాలూ, వాసాలూ లేని భవనం చూశాము. చర్చి భవనాలు నిర్మించడంలో పాశ్చాత్యులవలంబించే వాస్తు శిల్ప విధానం ప్రాచీన చైనా శిల్పులకు కూడా తెలుసునన్నమాట.
11.00కి సరోవర ప్రాంతం చూశాము.
12.30కి మధ్యాహ్న భోజనం.
2.30కి ట్రైన్ లో నాంకింగ్ నుండి బయల్దేరి సాయంత్రం 6.55 గంటలకు షాంఘై చేరుకున్నాము.
