రవి ఓ క్షణం ఆమె ముఖంలోకి చూశాడు. ఏదో తట్టినట్లు తనలో తాను నవ్వుకున్నాడు.
"అడిగేదేదో సూటిగా అడిగి తెలుసుకోకూడదూ?" అతని కంఠం మృదువుగా పలికింది.
"అంటే?" లేని కోపం తెచ్చి పెట్టుకుంటూ అన్నది ఇందిర.
"అదే- మీకు నేను వివాహితుణ్ణో కాదో తెలుసుకోవాలని వుంది. సూటిగా అడగలేక పిల్లలెంతమంది అని ప్రశ్నించారు. కాని పిల్లలు లేరని చెబితే అవివాహితుణ్ణని ఎలా భావించగలరు?" అన్నాడు.
ఈసారి ఇందిరకు నిజంగానే కోపం వచ్చింది. ముఖం తిప్పుకుంది.
"కోపంలో మీరు చాలా అందంగా వుంటారు." అన్నాడు రవి.
ఇందిర సమాధానం ఇవ్వలేదు.
"నాకు ఇంకా వివాహం కాలేదులెండి. ఎలిజిబుల్ బాచులర్నే!" అన్నాడు అదోలా నవ్వుతూ.
ఇందిర తనలో కలిగిన మార్పును కన్పించకుండా జాగ్రత్తపడింది.
"హద్దులు మీరి మాట్లాడుతున్నారు. కొత్త వారితో మాట్లాడవలసిన విధంగా మాట్లాడటం లేదు" అన్నది ఇందిర.
"మీరు నాకు కొత్తవారిగా అనిపించటంలేదు. ఎంతో కాలంగా తెలిసివున్న వ్యక్తిలా మిమ్మల్ని చూడగానే అనిపించింది. దీన్ని ఏమంటారో?" అన్నాడు రవి.
ఇందిర గుండెలు దడ-దడ కొట్టుకున్నాయ్! "నాకూ అలాగే అనిపిస్తూంది" పైకి అనలేదుకాని మనస్సులోనే అనుకుంది.
రాత్రి పది గంటలైంది. ఇందిర ఆవలించింది.
"గుడ్ నైట్" అన్నాడు రవి.
"నాకు పై బెర్త్ ఇచ్చారు. మీరు పైకి వెళ్ళి పడుకుంటే?"
"అలాగే! తప్పుతుందా! ఎంత లాయరైనా పాపం ఆడది ఆడదే గదా?" అన్నాడు. రవి ఇందిరను ఉడికిస్తూ.
ఇందిరకు రోషం వచ్చింది.
"అక్కరలేదు లెండి. నేను పైకి వెళ్ళగలను" లేచి నిల్చుంది.
"అరెరే! నిజంగానే కోపం వచ్చినట్టుంది. తమాషాగా అన్నాను. మీరు ఈ క్రింది బెర్తు మీదే పడుకోండి" అన్నాడు రవి నొచ్చుకుంటూ.
"అక్కర్లేదని చెప్పానుగా!" అంటూ ఇందిర పై బెర్తు మీదకు ఎక్కుతూ జారింది.
రవి చటుక్కున చెయ్యి అందించాడు. చెయ్యి పట్టుకుని రవి కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో ఎగతాళి లేదు. చిన్నచూపు లేదు. తేలికతనం అంతకన్నా లేదు. కాని ఏదో వెలుగు. ఆ వెలుగులో అనిర్వచనీయమైన ఆరాధన, ఆర్తి కన్పించాయి. మనసులు ఊసులాడాయి. భాషకందని భావాలను వ్యక్తం చేశాయి.
ఏవేవో ఊహల్లో తేలిపోతూ ఇద్దరూ కలత నిద్రే పోయారు.
ఉదయం ఏడు గంటలకు ఇందిర దిగవలసిన స్టేషన్ వచ్చింది. రవి సామాన్లు అందించటానికి సిద్ధంగా వున్నాడు. ఇందిర మనస్సును ఏదో నల్లటి పొర కప్పి వేసింది. దిగులు దిగులుగా వుంది. రైలు దిగాలని లేదు. రవితో ఇంకా ప్రయాణం చెయ్యాలని వుంది. జీవితమంతా ఇలాగే ప్రయాణం చెయ్యాలని వుంది.
"మీకు బొత్తిగా మర్యాద తెలియదు" అంది ఇందిర.
రవి తెల్లబోయి చూశాడు.
"కనీసం మీ అడ్రసు అయినా ఇచ్చారా?" అన్నది చిరు కోపంతో.
"ఓ అదా? ఎప్పుడో ఇచ్చానుగా?" అన్నాడు రవి.
"ఇచ్చారా? ఎప్పుడు? ఏమి ఇచ్చారు?"
"అప్పుడే! మిమ్మల్ని చూసిన క్షణంలోనే. ఉన్న ఒక్క మనసూ ఇచ్చాను. మనసు ఉన్నచోట అడ్రసూ వుంటుంది" అన్నాడు రవి.
ఇందిర చెంపల్లోకి వెచ్చటి రక్తం చిమ్మింది. కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. ఆ వెలుగు రవి హృదయాన్ని దేదీప్యమానంగా చేసింది.
"నేను నాగపూర్ లో ప్రైవేట్ ఫరమ్ లో ఉద్యోగం చేస్తున్నాను. ఇది నా అడ్రసు" అంటూ ఇందిర తన విజిటింగ్ కార్డు ఇచ్చింది.
ఇందిర ఫ్లాట్ ఫారంమీద సామాను పక్కగా నిల్చుని వుంది. రవి ఆమెకు ఎదురుగా నిల్చున్నాడు. ఇద్దరికీ ఏవేవో చెప్పాలని వుంది. హృదయాలు నిండుగా సంతృప్తిగా వున్నాయి. మౌనమే మధ్యవర్తిత్వం చేస్తూ ఒకరి మనో భావాలను మరొకరికి అందజేస్తూ వుంది.
"ఉత్తరం రాస్తే జవాబిస్తారా?" అడిగాడు రవి.
"నిజంగా రాస్తారా?" ఉత్సాహంగా అడిగింది ఇందిర.
"రాయమంటారా?" అన్నాడు.
రైలు కూత వేసింది. రవి, ఇందిర చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నొక్కి వదిలేశాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. రైలు కదులుతూ వుంటే గబగబా ఎక్కి డోర్ దగ్గర నిలబడి చెయ్యి ఊపాడు.
"ఉత్తరం రాస్తారు గదూ?" ఇందిర అడిగింది.
"తప్పకుండా!"
రైలు వాళ్ళ గొడవ పట్టనట్టు వేగంగా ముందుకు జరిగింది.
ఇందిర కన్పించినంతవరకూ చెయ్యి ఊపుతూ రవి డోర్ దగ్గిర నిలబడ్డాడు.
12
"ఓస్ అదా నీ గొడవ? ఈ రోజుల్లో విధవను వివాహం చేసుకోవడం హీరోయిజం! వీరేశలింగంగారి పుణ్యమా అంటూ ఈనాడు విధవలు మరో పెళ్ళి తేలిగ్గా చేసుకోగలుగుతున్నారు. నిన్ను నేను వివాహం చేసుకుంటాను. నాకు అలాంటి అభ్యంతరాలు ఏమీలేవు. మనం వెంటనే రిజిష్టర్ మారేజ్ చేసుకుందాం!" అన్నాడు హిప్పీరావు.
"నేను వితంతువును కాదు నువ్వనుకున్నట్టు!" అన్నది హేమ.
