Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 15


    "అయితే అవ్వా! నేను అర్ధరాత్రి వెళ్ళి ప్రమాదంలో చిక్కుకుపోయాను కదా! ఉపయానికి క్షేమంగా తిరిగి రాగలుగుతానని ఎలా చెప్పగలిగావ్?" అని ప్రశ్నించాను. ఈ విషయాన్ని అవ్వ చాలా తేలికగా కొట్టిపారేసింది.
    "రాత్రిళ్ళు నరసంచారం కనిపించారని యీ కీకారణ్యంలో నేను కొన్ని దశాబ్దాల నుండీ సుఖంగానే వున్నాను. ఇక్కడ రాత్రులు సైతానులు సంచారం చేయలేవు" అన్నది.
    "ఎందుకని అవ్వా?" కుతూహలంతో ప్రశ్నించాను.
    "ప్రతి రాత్రి ఇక్కడ అల్లా కొలువుతీర్చి పుణ్య పాపాలు విచారిస్తాడు. నిజం బేటా!" అంటూ అర్ధవిమీలితురాలైంది అవ్వ. అటువంటి ప్రగాఢ విశ్వాసమే లేకపోతే త్యాగశీలి అయిన యీ ప్రేమమూర్తి కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ ఒంటరిగా జీవించగలిగేదా? భ్రమలో సైతం ఎంత గొప్ప? ఇటువంటి అద్భుతాలున్న యీ సృష్టిలో, చిత్రవిచిత్ర మనస్తత్వాలున్న మానవ సమాజంలో మనం జీవిస్తున్నామన్న స్పృహ మనిషికి చాలా అవసరమనిపించింది.
    ఓ 'ఎయిర్ బ్యాగ్' ఓ 'జిప్ బ్యాగ్' సర్దుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు కవిమిత్రుడు. మౌనంగా వుండే మిత్రుడూ, రమణా కూడా సరాసరి రూము ఖాళీచేసి నా దగ్గరకు వచ్చాడు. వస్తూనే కూనిరాగం తీయసాగాడు కనిశేఖరుడు.
    "నీవు గేయానికి ట్యూను చేస్తున్నావా? ఏడుస్తున్నావా?" తన సందేహాన్ని ముక్కుసూటిగా వెలిబుచ్చాడు రమణ.
    "అంటే నేను ట్యూను చేస్తున్న విషాద గేయంలో అంత నాచురాలిటీ వుందన్నమాట!" అంటూ మురిసిపోయాడు కవి అజ్ఞానంలో వుండే ఆ ఆనందాన్ని తనివితీరా గ్రోలుతూ.
    "మరికొంచెం పెద్దగా ఏడ్చావంటే మరికొంచెం నాచురాలిటీ వస్తుంది. ట్రైచెయ్యి" సలహా యిచ్చాడు రమణ.
    ఒక్క పెట్టున బావురుమని ఏడ్చి ఇది మూర్తిక అన్నాడు ఆయాసపడుతూ. మౌసమిత్రుడు కూడా నవ్వాడీసారి. అది చాలా అరుదైన సందర్భం అన్నట్లు.
    వీళ్ళ గొడవ ఇలా వుంటే నా మనసులో కదలికలు మరోవిధంగా ఉన్నాయి. ఎలాగైనా మిత్రబృందాన్ని వెనుకకు పంపివేయాలి. ఐడియాలు వెదుకుతున్నాను.
    "నీ వాలకం చూస్తే కొండవీటి శిథిలాల మధ్య పాతుకుపోయేలా వున్నావు. నీ వాలకం నాకేమీ బాగోలేదు" అన్నాడు కవి కొంచెం సీరియస్ గా నటిస్తూ. రాత్రి నువ్వు చేసిన పనికి బెంబేలెత్తిపోయామనుకో అంటూ పకపకా నవ్వసాగాడు. వినటానికి కర్ణ కఠోరమయిన శైలిలో.
    "నువ్వు నవ్వటం ఆపేస్తే ఆచార్లు బయలుదేరి రావటానికి వీలవుతుంది. నోర్మూసుకో" అన్నాడు రమణ.
    "నా నవ్వుకి ఆయన బయలుదేరటానికి సంబంధం ఏమిటసలు?" అన్నాడు కవి విస్తుపోతూ.
    "ఏమీ లేదనుకుంటున్నావా నా చిట్టి తండ్రీ. సంబంధం చాలానే వుంది. నువ్వు నవ్వుతుంటే రెండు మూడు గాడిదలు ఒకేసారి తుమ్ముతున్నట్లుగా వుంది. గాడిదలు తుమ్మే శకునంలో ఎవరూ ప్రయాణానికి సిద్ధం కారు. బాగా తెలిసిందా?" వివరించాడు రమణ.
    హాస్యంలో చురుకుపాలు రవ్వంత ఎక్కువైందేమో కవిగారి ముఖం మాడిపోయిన మినపట్టు ఫోజులో పడింది.
    "లే వెళదాం" రమణ నాకేసి తలూపుతూ అన్నాడు.
    "నడుస్తూ వుండండి, అవ్వతో రవ్వంత మాట్లాడాలి" నసిగాను.
    "ఈ ఆచార్లేదో కొంప ముంచేలా వున్నాడు బాబోయ్, ఈ రాత్రికి కూడా ఇక్కడే పాతుకుపోయేలా వున్నాడు బాబోయ్, ఈ భూత్ బంగ్లాలో నేను మటుకు నిద్రచెయ్యలేను" అంటూ భీష్మించాడు కవి.
    "ఈ అలవాట్లు ఆరోగ్యానికి మంచివికావు" రమణ తీర్పు.
    నేను ఇరుకున పడిపోతున్నాను. జాగ్రత్తపడాలి.
    "రమణా! అనూహ్యమైన చరిత్రలూ, అగాధమైన జీవితపు విలువలనూ అన్వేషించటం ప్రాణాలను కాపాడుకోవటం కన్నా ముఖ్యమైన పని కాదంటావా?" అన్నాను.
    "ఓహో! అలాగేం, నీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించు. నీ జీవితపు విలువలకొక నమస్కారం, ఈ కొండవీటి చరిత్రకొక నమస్కారం, చీకటి పడకముందే నేను క్రిందికి దిగిపోవాలి" అంటూ తొందరించాడా కవి.
    అసలు విషయం రమణకూ తెలుసు. నేను ఏదో పరధ్యానంలో పడ్డానని. అతడు తేలికగానే ఊహించగలడు.
    సాధారణమయిన సంభాషణలో చారిత్రాత్మకమైన అంశాలు ప్రస్తావనకు వస్తే నేను సీరియస్ గా మారిపోవటం అతడు అనేక మార్లు చూచాడు. నన్ను ఒంటరిగా వదలిపోవటం అసలే ఇష్టం లేదు. రమణ ఇరుకునపడ్డాడు.
    చివరకు రమణ ఒక నిర్ణయానికి వచ్చి మిత్రులిద్దరినీ దూరంగా తీసుకుపోయి ఏదో కుట్ర జరుగుతున్నదని అనుమానం కలిగింది. దగ్గరగా వెళ్ళాను.
    రమణా కవీకలమూ కాగితాలూ సిద్ధంచేశారు. ఖర్మం చాలక కవిత్వం ప్రారంభించారేమోనని అనుమానమేసింది. తీరా చూస్తే లీవ్ లెటర్స్. చెరొక శలవుచీటీ వ్రాసి మూగ మిత్రునికి ఇచ్చారు. అతడు అవి పుచ్చుకుని త్వరత్వరగా కొండ దిగిపోయాడు. నా మూర్ఖత్వంతో ప్రక్కవారిని బాధించానేమోననిపించింది.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS