మొదట నా పాదాలముందు చిక్కటి నీలం దానివెనక నీలిమందురంగు, అటుతరువాత చిక్కని వూదా, అన్నిటిమీదా తెల్లని కొంగల్లాగు తేలే అలల తలమీది నురుగు; యెన్ని గంటలు చూచినా విసుగు పుట్టదు. పొద్దస్తమానం ఇక్కడే కూచుందామంటే రెండు గంటలైతేనేగాని యీ మొగలిపొద కొంచెం నీడనివ్వదు.
బారకందని చాపల్ని కావిళ్ళల్లో వేసుకుని యీ తోవన తీసుకుపోతున్నారు పల్లెవాళ్ళు విశాఖపట్టణం మార్కెట్టుకి. ఐదు మైళ్ళు మొయ్యాలి యీ యెండలో. మేడమీద కాలే యీ యెండని చూసే విసుక్కుంటున్నాను నేను. వాళ్ళో పాపం! ఈ చాపల్ని తీసికెళ్ళి అమ్మి, యింటింటికీ పంచి, ప్రజల్ని బతికించే పరోపకార పారాయణవలనూకూడదూ వీళ్ళని! ఆ మాటంటే మాంసాహారేతరులు పళ్ళు కొరుకు తారు. మళ్ళీ వడ్లు పండించే కర్షకుడిమీద, యీనాడు అచ్చయ్యే పాటల్నీ పద్యాల్నీ మాన్యాలిచ్చే యే మహారాజుకూడా అందలేక పోయాడు. కర్షకు డెంతఘనుడో, పరోపకార పారీణుడో యీ పల్లెవాడు అంతే. భేదాభిప్రాయనికి జీవహించి సెన్టిమింటే కారణం. పల్లెవాడి కష్టంలో కాపువాడిది యెన్నోవొంతు!
పొలం దున్నడంగాని, చాపలు మొయ్యడంగాని నిజంగా అంత దుస్సహమైన కార్యమేనా? కాదు. ఆ బాధ అంతా చూసే నాకళ్ళలోనే, వ్రాసే నా కలంలోనే ఇతరులకి లేని బాధలు వున్నా యనుకోడం ధర్మాత్ముల డ్యూటీ కవికీ, కధకుడికీ, అత్యవసరం అతని జీవనాధారం; అతిశయోక్తిలేంది వాంగ్మయమేలేదు. ప్రస్తుతం కవులు వ్రాసే కార్మిక కర్షక రచనలు మూడుపాళ్ళు misplaoud sentiment. నా నరాలు ఆ పల్లెవాడి నరాలుకావు. అతనిని యింత సుకుమారాలుకావు. ఎండలో దున్నే కర్షకుడి చమటలు తలుచుకుని నడుము వొంగని కవి సరదాగా వరండాలో చాపమీదకూచుని, తనకే సంభవిస్తే ఆపని యెంత బాధకరంగా వుంటుందో యోచించుకుని, కవిత్వమల్లుతాడు. తాను కూర్చున్నందుకు చాపకెంత బాధో అని కధలు వ్రాయవచ్చు. ఆ చాపరోదనం ప్రపంచానికి వినిపించవచ్చు. ఆ చాప లోకపారిశుధ్యఆశయం, ఆచాప తనలోపల పెట్టుకుని అవతరించిన దేవత అనవచ్చు. స్త్రీ విషయమై నేను వ్రాసే కధలూ అంతేనేమో! కళకూడా fashinons ని అనుసరించి నడుస్తోంది. స్త్రీలని subject గా తీసుకుని కధలు వ్రాయడం చాలా సన్నుతకార్య మైపోయింది ప్రస్తుతం.
చల్లని గాలికి నిద్రవొస్తుంది. Old horse యెండలో పడుకుని కొండలకేసి చూస్తోంది. దూరంగా Dolphin's nose ఎండకి దాహపడి వుప్పునీళ్ళు తాగవొచ్చిన యీలోకపు మొదటి మృగం వలె సముద్రంలో పడుకునివుంది, చెరువులో పడుకున్నట్లు. వీళ్ళు రాళ్ళు చుట్టూ తిరిగివొచ్చి కలుసుకుని నవ్వుతున్నాయి, తల్లిచుట్టూ దాగుడుమూతలాడే పిల్లలవలె.
నిద్ర వొస్తుంది యీ ! తెల్లారకట్టే మెళుకువ వొచ్చేసింది అట్లతద్ధికి ఆడుకునే పిల్లల గోలవల్ల. ఈ ఊళ్ళో యింకా యీ ఆచారం సాగుతున్నట్టుంది. ఏ ఏ వూళ్ళనించోవొచ్చి దిగే యీ కొల్లూరు మాన్షస్సులో పిల్లలందరూ చుట్టుపక్కల వాళ్ళని నిద్రలేపే ప్రయత్నంలో unite ఐనారు. పక్కమీద కళ్ళు తెరవగానే పక్కనకూచుని పల్కరించింది సుందరమ్మ. అప్పుడే చీకట్లో తెరుచుకుంటున్న నా కళ్ళమీద అగరువాసనలతో పెద్ద జుట్టు కప్పింది. నా చెవులో జాలిగా "మరిచిపోయినానా నన్ను!" అని రహస్యంగా వినిపించింది.
చిన్నప్పుడు ఎన్నేళ్ళయిందో - అట్లతద్దిముందు సాయింత్రం నన్ను చూడ్డానికని వొచ్చింది క్రూరమైన అభ్యంతరాలు తప్పించుకుని. కనపడగానే యెదురువెళ్ళి జాజిపొదవెనక యింకా చిన్నవిగా వున్న ఆ బుజాలు - మజిలిన్ చొక్కాకింది ఆ లేతబుజాలు - కావిలించుకున్నాను. అట్లతద్దీ, చిన్ని తెల్లని జాజిపువ్వులూ, సుందరమ్మా యీమాడూ చిక్కుపడిపోయినాయి నా హృదయంలో, గోరింటాకు టోపీలు పెట్టుకున్న వేళ్ళుచూసి నన్ను బెదరించింది, సా మెడవెనక కలిసి గోరింటాకు అంటిస్తానని. నేను వెనక్కితగ్గితే "మొగపిల్లలు ధైర్యం" అని నవ్వింది.
... ... ... ...
చంద్రుడు వొచ్చిందాకా డాబామీద కూచుందా మన్నాను. చీకట్లో మెట్లమీద యెత్తుకుని తీసికెళ్ళి కూచోపెట్టాను పొద్దుపోయిందని భయపడే పిల్లని.
వాడు, ఆ శ్రీహరి పచార్లు చేస్తున్నాడు డాబామీద.
ఏం చెయ్యను? కుర్రవాణ్ణి ధైర్యంలేదు. పెద్దవాళ్ళకి అనుమానాలు పుడతాయని భయం.
సుందరమ్మ లేచి నిలుచుంది. బిక్క మొహం వేసుకుని మాట్లాడకుండా చూస్తున్నాను ఆమెవంక. మెట్ల తలుపుదగ్గిర ఆ అమ్మాయి నావంక జాలిగాచూసి నా గడ్డంకింద చెయ్యేసి "రేపు పొద్దున్న తెల్లారగట్ట....తప్పకుండా" అని వెళ్ళిపోయింది.
నేను వొక్కన్నీ చంద్రున్నిచూస్తో విరహపడ్డాను. అందరితో చెప్పాను తెల్లారకట్ట లేస్తానని.
"ఏమిటి? నువ్వుకూడానా? ఇంకా చిన్నపిల్లవాడివా?" అన్నారు. టాగోరు Lad of Sixteen నేను! ఇటు పెద్ద వాళ్ళతో జతాకాదు; అటు కుర్రవాళ్ళతోనూ కాదు. కాని పెద్దవాణ్ణి ఆవురుమన్నాను గనకనే నేను లేస్తానన్న సంగతి తెలుసుకోలేదు యెవరూ.
తల్లిదండ్రులకి తమ పిల్లలమీద వుండే విశ్వాసాన్ని చూస్తే నవ్వు వొస్తుంది. మొన్నటిదాకా తమ వొళ్ళో, తమ ముందు నవ్వి, గంతులేసి, గోము చేసినపిల్లలు యిట్లాంటి మోహవాంఛలలో పడతారని నమ్మలేరు. తమ చిన్నతనం మరిచిపోతారు. Sex అనేది వాంఛ కాక ధర్మమయిపోయింది ఈ దేశంలో.....చాలా కాలం ధర్మంగానే నడిచిందేమో! పరిస్థితులు మారి వాంఛగా మారుతోవుంటే adjusts కాలేకుండా వున్నారు యీ నూతన వ్యవహారాలకి తల్లి దండ్రులూ, భర్తలూ, ఎన్ని కుటుంబాలలో ఎన్ని విషాకాంత చరిత్రలు...
