గీ. అవనిజనుగూడి భద్రసింహాసనమున
రమణఁ గూర్చుండి రాజ్యపాలనము సేయు
నట్టి కోదండరాము నే నాత్మలోన
మెలఁత! కలగంటి నంతట మేలుకొంటి.
సీ. అలోలకల్లోల మగుమాలికావలి
విలసితం బగు పాలవెల్లిఁ గంటి
నందు రత్నాంకితం బౌపేక్కుపడగలఁ
బ్రజ్వరిల్లెడు పెనుఁబాముఁ గంటి
దానిపై సుఖలీలఁ దగిలి నిద్రించేడు
పరమాత్ము నొక దివ్య పురుషుఁ గంటి
నభవ్యు నురమున ననిశంబు రత్నంపుఁ
బ్రతిమఁ బోలెడు దివ్యభామఁ గంటి
అ.వె. నాలతాంగిమేని యందొక్క కళయు నా
సొబగు వక్త్రమందుఁ జొరఁగఁ గంటి
నంతఁ ఋణ్యపాఠ కాకీర్ణనాద స
మ్మిళిత విహగరుతుల మేలుకొంటి.
-: ఆర్త జన రక్షణోపాయః ఆంజనేయః :-
సీ. శరధి లంఘించి దాశరధి యిచ్చిన భూష
ణము సీత కొసఁగిన నాఁటి రూపు
లంకారమాముఖాలంకార మాగ్రహో
న్నతి నీఱు చేసిన నాటి రూపు
నీవాలమునఁ జుట్టి నీ వాలమున దైత్య
నాధులఁ బొరిగొన్న నాటి రూపు
మరుదీశసుతు డ నా మరుదీశసుతుకేత
నంబెక్కి తోడైన నాఁటి రూపు
గీ. తలఁచు వారికి నపదల్ తలుఁగు టరుదే
నీ కృపాస్పూర్తి నీ కీర్తి నిస్సమములు
మహిత శ్రీరామ పదభక్తి మద్వి ధేయ
ఆర్త జనరక్షణోపాయ! ఆంజనేయ!
సీ. శ్రీరాము నాత్మలోఁ జెర్చుకొన్న మహాత్మ!
చిత్తంబులోన వసింపు మయ్య
కడులావుమైఁ జౌటి కడలి దాటినధీర!
కడలేనిభవవార్ధిఁ గడపు మయ్య
ధవుని సేమంబు సీతకు నొసంగిన మేటి!
పరిణామ మొసగి చేపట్టు మయ్య
ధట్టించి మందులగట్టుఁ దెచ్చినదేవ!
జీవనౌషద మిచ్చి ప్రోవు మయ్య
గీ. హనుమ నీవు సమర్ధుడ వయ్య యిపుడు
నింత నన్ను నుపేక్ష సేయింపఁదగునె
మహిత శ్రీరామ పదభక్తి మద్వి ధేయ
ఆర్త జనరక్షణోపాయ! ఆంజనేయ!
సీ. లవణవారాశి కోలకుఁ దెచ్చె నీరాజు
నగుచు నంబుధి దాఁటినాఁడ వీవు
రాతి నాతిగఁ జేసి రక్షించే నీరాజు
మకరి నంగనఁ జేసి మంచి తీవు
మాయలమారీచు మడియించె నీరాజు
చెడు కాలనేమి నుక్కడిఁచి తీవు
లంకేశుఁ ద్రుంచె నాలములోన నీ రాజు
వెస లంక నీఱు గావించి తీవు
గీ. ఆశ్రితావనుఁ డగురామునంత రాజు
పతిహితుం డగు నీవంటిబంటు గలఁడే
మహిత శ్రీరామ పదభక్తి మద్విధేయ
ఆర్త జనరక్షణోపాయ! ఆంజనేయ!
సీ. పుట్టినాఁ డితఁడు శంభునియమోఘంబైన
శక్తిచేఁ బార్వతీజఠరమునను
పట్టినాఁ డితఁడు చేపట్టు ఁగొమ్మగఁ బంటి
చవిఁ జిన్ననాఁడే హస్తముల రవిని
కొట్టినాఁ డితఁడు గగ్గోలుగా లంకలో
వెన్నాడి యక్షాదివీరవరుల
చుట్టినాఁ డితఁ డాజిఁ బెట్టని కోటగా
వాలంబు కపిసేన వలగొసంగ
గీ. ఇతఁడు దైవంబు పటు తేజుఁ డితఁడు సరస
బాహు బలవంతుఁ డితఁడు నాఁ బరగి తౌర
మహిత శ్రీరామ పదభక్తి మద్విధేయ
ఆర్త జనరక్షణోపాయ! ఆంజనేయ!
సీ. రాలవే యుడులు ప్రేలాలపోలిక నీవు
వాల మల్లార్చిన వానరేంద్ర!
తూలవే గిరులు బంతులతెఱంగున నీవు
హస్తముల్ సాచిన నలఘుతేజ!
పగులదే మిన్నంటిపంటి కైవడి
పెళపెళ నార్చిన భీతిరహిత!
తిరుగదే ధరణి కుమ్మరిసారెవలె నీవు
కుప్పించి యెగసినఁ గిలిశ దేహ!
గీ. దేవదానవమానవాధి పులలోన
నిన్ను వర్ణింపఁ దరమై నిర్నిద్రశౌర్య!
మహిత శ్రీరామ పదభక్తి మద్విధేయ
ఆర్త జనరక్షణోపాయ! ఆంజనేయ!
సీ. స్తంభసంభూతావసర ఘోరతరనర
పంచాస్యక హాకహర్భటులఁ దేగడి
శాకినీడాకినీ సంత తలయకాల
భైరవ కిలకిలార్భటులఁ దేగడి
సంవర్తసమయ ప్రచండ దండధరారి
భగ్గకోలాహలార్భటులఁ దెగడి
దాక్షాధ్వరధ్వంసకాక్షుద్ర బలవీర
భద్రహూహూక్రి యార్భటులఁ దేగడి
గీ. పొలుచు భవదట్టహాసంబు చెలఁగఁ బంక్తి
ముఖుని రొమ్ము పగుల్పవే ముష్టిహతిని
మహిత శ్రీరామ పదభక్తి మద్విధేయ
ఆర్త జనరక్షణోపాయ! ఆంజనేయ!
సీ. నిడుదవాలంబుతో నిలువునామంబుతో
నిగనిగమెఱయ నెమ్మొగము తోడ
సహజవర్ణంబుతో సవరనిమౌంజితో
సలిలపూరిత కమండలముతోడ
పసిఁడియందియలతోఁ బట్టు జన్నిదముతోఁ
బాటలలోచనాబ్జముల తోడ
కరముల మోడ్పుతోఁ గటి హేమపటముతోఁ
గమనీయకుండలకాంతి తోడ
