Previous Page Next Page 
మంచివాడు పేజి 15


    "అసలు నేను ఓడిపోవడానికి కారణం కులతత్త్వాలూ, ముఠా రాజకీయాలూను. ఆ నియోజక వర్గంలో మన "స్త్రీలకు అసలు స్థానమే లేదు. "కె" ల డామినేషన్ ఎక్కువ. వాళ్ళను ఎదిర్చి నిలబడగల కులం ఆ నియోజక వర్గంలో "యన్" ఒక్కటే. వాళ్ళిద్దరికీ పడకపోతే మన "బి" లకు రెండు వర్గాల వాళ్ళూ సపోర్టు చేస్తారు."
'ఈ బి. కె. యన్' లు ఏమిటో అర్థంకాక నేను తెల్లముఖం వేసి, వెర్రి చూపులు చూస్తూ కూర్చుండి పోయాను! ఆమె ధోరణిలో చెప్పుకు పోతోంది.
"ఈ 'యస్' లకు అసలు బుర్రే వుండదు. వట్టి మంద. ఈ 'కె' లు 'యన్' లు వాళ్ళను బెదిరించీ లంచాలు పెట్టీ ఓట్లు పట్టేస్తారు. మన 'బి' లకు వున్నదల్లా బుర్రే. తెలివితేటలే మనకు ఆస్తి. మనకు ఓట్లు ఎవరిస్తారు చెప్పు. అందుకే ఈ దేశం ఇట్లా వుంది" అని నా ముఖంలోకి సంతృప్తిగా చూసింది.
ఓ ఐదు నిముషాలు ఆలోచిస్తే గాని ఆమె కో వర్డ్స్ కు అర్థం తెలిసింది కాదు. తెలిశాక మరీ వళ్ళు మండిపోయింది. "బి" అంటే బ్రాహ్మలనీ "కె" అంటే కమ్మ వారనీ, "యస్" అంటే నాయుళ్ళని, "యస్" అంటే షెడ్యూల్ కులాల వారనీ అర్థం చేసుకున్నాను.
"సారీ. మిసెస్ కైలాసం! మీరనుకున్నట్టు నేను "బి"ని కాదు అన్నాను నొక్కుతూ.
ఆమె ఉలిక్కిపడి నా ముఖంలోకి చూసింది. "ఇంతసేపూ నిన్ను "బి" అనే అనుకున్నానే! మరి ఏం కులం?" అన్నది. "బి" కాదని ముందే తెలిస్తే అసలు నీతో మాట్లాడకనే పోదును అన్నట్టు వుంది ఆమె ధోరణి.
"మానవ కులం!" అన్నాను గంభీరంగా ముఖం పెట్టి.
ఓ క్షణం దెబ్బతిన్న దానిలా అయిపోయింది. వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది.
నాకూ నిద్ర ముంచుకు వచ్చింది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను.
ఒక్కసారిగా వెనక్కూ ముందుకూ ఊగి బండి ఆగింది. నేను కళ్ళు తెరిచాను. అది వరంగల్ స్టేషను. అప్పటికే మిసెస్ కైలాసం లేచి తల కిటికీలోకి పెట్టి ప్లాట్ ఫారం వైపు చూస్తోంది.
నీరుకా విధోవతీ, షర్టూ, ఉత్తరీయంలో ప్లాట్ ఫారం మీద పచార్లు చేస్తూన్న ఓ నడి వయస్సు మనిషి మిసెస్ కైలాసాన్ని చూసి, గుర్తు పట్టినట్టు చిరునవ్వుతో దగ్గిరకు వచ్చాడు.
"బాగున్నావా? హయిదరాబాద్ కేనా?"
"అవును." భయం భయంగా నాకేసి చూస్తూ.
"కైలాసం ఇప్పుడు ఢిల్లీ రూట్ లో వున్నట్టు చెప్పాడు. గట్టివాడే. మొన్న రైల్లో కలిశాడు. టికెట్ అడిగాడు. టికెట్ చూశాక కాని మంచీ చెడూ మాట్లాడలేదు." అన్నాడు ఆ పెద్దమనిషి.
నేను మిసెస్ కైలాసం ముఖంలోకి చూశాను చిరునవ్వుతో. ఆమె ముఖం పాలిపోయి వుంది. అకస్మాత్తుగా ఆత్మీయుల మరణవార్త విన్న వ్యక్తి ముఖంలా వుంది ఆమె ముఖం.
రైలు కూత వేసింది. ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. మిసెస్ కైలాసం చివుక్కున లేచి సూట్ కేసు తీసుకుని డోర్ వైపు నడిచింది.
"అదేమిటండీ? ఇక్కడ దిగుతున్నారేం? మీ కలెక్టర్ గారు కారు తెచ్చారా?"
ఆమె వినిపించుకోకుండా చరచరా వెళ్ళిపోయింది. నేను ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఎంతసేపు వుండిపోయానో తెలియదు.


                                                   **    **    **


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS