సుమారు గంటన్నర ప్రయాణం తర్వాత రాత్రి తొమ్మిది ఇరవైకి హైద్రాబాద్ చేరుకుంది ఢిల్లీ - మెడ్రాస్ ఎయిర్ బస్.
దారితప్పిన పసికందులా కనిపిస్తున్న శశాంకలో ఈ ఆందోళనకి కారణాన్ని రాజమణి వూహించలేకపోతున్నాడు.
ఎయిర్ పోర్టులో బయటకు వచ్చిన శశాంక కృపకోసం అటూ ఇటూ చూశాడు ముందుగా.
కారుందేమోనని పార్కింగ్ ఏరియాకు వెళ్ళాడు.
"శశాంకా... వాట్ హేపెండ్ టు యూ" శశాంకని ఎప్పుడూ అలా చూసి ఎరుగని రాజమణి అప్పుడు నిలదీశాడు.
"కృప కారు రాలేదు" అన్యమనస్కంగా అన్నాడు మళ్ళీ.
"ఎలా వస్తుంది. మనం ఈ రాత్రికి రిటర్నవుతున్నట్టు ఇన్ ఫాం చేయలేదుగా."
"కాని రావల్సిందే... వస్తానని చెప్పినట్టు గుర్తు" స్వగతంలోలా అనుకుంటూ అసహనంగా టాక్సీని పిలిచాడు.
ఒక అసాధారణమైన విజయం కూడా భరింపశక్యం కాని ఓటమిలాగే మనిషిని ఉన్మాదిని చేస్తుంది."
శశాంక కూడా సరిగ్గా ఆ స్థితిలో వున్నాడనే ఆలోచనతో మౌనంగా రాజమణి టాక్సీలో ఎక్కాడు.
పది నిముషాలలో టాక్సీ ఇంటికి చేరగానే ఎవరో తరుముతున్నట్టు క్రిందికి దూకిన శశాంక రెండు క్షణాలలో పోర్టికోని దాటి ఇంటిలోకి పరుగెత్తాడు.
"కృపా."
నిశ్శబ్దం.
"కృపా."
సందడిగా వుండాల్సిన ఇల్లు ఆ రోజు ఒక నిశ్శబ్దపు దీవిని గుర్తుచేస్తోంది.
"కృపా."
శశాంక కేకలతో ఇల్లు ప్రతిధ్వనిస్తోంది.
మెట్లెక్కుతున్న రాజమణి టక్కున ఆగిపోయాడు చాలా దగ్గరగా ఓ మూలుగు వినిపించడంతో. వేగంగా కిచెన్ దగ్గరికి చేరిన రాజమణికి నోట్లో గుడ్డలు కుక్కి తాళ్ళతో కట్టివేయబడి వున్న నౌకరు సాంబయ్య కనిపించాడు.
రెండు క్షణాల్లో బంధ విముక్తుడైన సాంబయ్య ఆయన కాళ్ళను చుట్టేశాడు.
"అయ్యా! అయిపోయిందయ్యా... అమ్మాయిగారు..."
వినే శక్తి, సహనం నశించిపోయినట్టు అప్పటికే కూతురు గదివైపు దూసుకుపోయాడాయన.
ప్రాణాలెప్పుడో కోల్పోయిన కృప రక్తసిక్తమైన దేహంతో నేలపై వెల్లకిలా పడివుంది.
విరిగిన మబ్బుల నడుమ మెరుపు కోల్పోయిన అ వేగుచుక్కని చూస్తూ నిస్త్రాణగా ద్వారానికి చేరగిలబడిపోయారు.
అశ్రుసిక్త నయనాలతో భార్య పక్కనే కూర్చున్న శశాంక తొణికిన స్వప్నంలోంచి ఇంకా తేరుకోలేనట్టు నిశ్శబ్దంగా రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.
మనసు పొరల్లోనుంచి దూకి రావాలనుకునే దుఃఖం గొంతు దగ్గరే ఆగి, నెత్తురుతో కలిసి గుండె కొసలపై నర్తిస్తూ ఎదగోడలను బాకులతో పొడుస్తుంది.
నమ్మలేక పోతున్నాడు...
ఇందాక... కొన్ని గంటల క్రితమే తనతో ఫోన్ లో ఉత్సాహంగా మాటాడిన వ్యక్తి కడదాకా తనకు తోడుంటానని ఎన్నెన్నో కబుర్లు చెప్పిన ఈ మనిషి ఇలా చేసిందేమిటి? ఏమైంది? ఆ చిలిపి కబుర్లేవి? ఆకాశంలోని హరివిల్లుగా మారి ఆ ఏడు రంగుల ఇంద్రధనుసుపై తనను ఊయల లూగించిన అల్లరి పిల్ల రక్తపు ఎరుపుతో మాత్రమే తనకిలా ఆహ్వానం పలుకుతుందేమిటి? జీవనదిగా మారి తన జీవన యానాన్ని అపురూపంగా స్పృశిస్తూ అల్లనల్ల సాగిన ఈ సెలయేరు గడ్డకట్టి హఠాత్తుగా అగాధంలోకి నెట్టిందేమిటి?
"రిటైర్డ్ కల్నల్ రాజమణిగారి కూతుర్ని ఓ ఇంటర్నేషనల్ షటర్ కి భార్యని... అంతకుమించి మరో గొప్ప హీరోకి కాబోయే తల్లిని. నాకేం భయంలే... మాస్టారూ"
ఆ మాటలు గుర్తుకొచ్చి కాదు శశాంక దుఃఖం ఉన్నపాటుగా కట్టలు తెంచుకున్నది.
తన రక్తంతో రూపుదిద్దుకుని నేలపైకి అడుగు పెట్టాలనుకున్న పసికందు తూటాల తాకిడితో శిథిలమై మళ్ళీ రక్తంగా బయటికి రావటాన్ని హర్షించలేనట్టు పొట్టకి చేతుల్ని అడ్డంగా వుంచిందింకా.
పగిలిన ఆ ప్రతిరూపమే తనను అతిగా కలవర పరచినట్టు ఆందోళనగా కళ్ళు తెరిచి చూస్తోంది.
బాధతో పెనుగులాడుతూ తలని ఆమె చెంపలపై ఆనించాడు. నాతో వస్తానని మొండిగా మారాం చేసిన నిన్ను కోరి ఆపింది ఇలా చూడాల్సిరావటానికాని ముందే నాకు తెలిసి వుంటే నిన్ను నేను పోగొట్టుకునేవాణ్ని కాదు కృపా... తప్పటడుగులు వేయబోయిన నాకు నీ ఇంట ఆశ్రయమిచ్చి అడుగడుగునా నాకు బాసటగా నిలిచిన నిన్ను కోరి కోరి మృత్యువాతకి నెట్టాను. ఈ పొరపాటుని నేనెలా సరిదిద్దుకోను? నువ్వు లేవన్న నిజాన్ని నేనెలా జీర్ణించుకోను?"
"శశాంకా!" భుజంపై చేయి ఆనించిన రాజమణి గొంతు అక్కడ నిశ్శబ్దాన్ని బాధాకరంగా భంగపరిచింది.
శశాంక లేవలేదు.
వేదాన్ని నివేదనగా మార్చుకుని కుమిలిపోతూనే వున్నాడు.
