Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 15


    చుట్టుముట్టిన పత్రికా విలేకర్లను దాటుకుంటూ రాజమణిని చేరుకోడానికి ఐదు నిముషాలు పట్టింది.


    అతడు పెదవి విప్పేలోగా పేరు అనౌన్స్ చేశారు.


    ఆప్యాయంగా భుజాన్ని తట్టిన రాజమణిని చూస్తూ అనుకున్నాడు మనసులోనే. "నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని అహోరాత్రులూ శ్రమించి ఓ కారుణ్యమూర్తీ... కీడు శంకిస్తున్న మనసుకి జవాబుని చెప్పుకోలేక, నిజానిజాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకునే వ్యవధి సైతం లేక ఈ క్షణంలోనే నేనొక దృఢ నిశ్చయంతో గోదాలో అడుగుపెడుతున్నాను... ఇక్కడ నా అసమర్థతకి క్షణం చింతించినా శాశ్వతమైన సమర్థతను దక్కించుకోవాలని తీసుకున్న నిర్ణయానికి ఆ తర్వాతైనా నన్ను అభినందించకపోవు..."


    కోటి గొంతుల ఘోష చుట్టుముడుతుంటే మృత్యు వలయంలో అడుగిడిన కర్మయోగిలా నిలబడి లక్ష్యం వేపే చూస్తున్నాడు శశాంక.


    జాగ్రత్ సుషుప్తుల మధ్య సంధికాలంలో మిగిలిన మనసు చేతనా చేతనావస్థల నడుమ డోలాయమానమై దారుణమైన వ్యధకు గురవుతుండగా కర్తవ్య విమూఢుడైన అర్జునుడిలా గమ్యాన్ని గమనిస్తున్నాడు...


    "అశోచ్యా నవ్యశోచస్త్వం" నా వశములో లేని విషయముల గూర్చి మధనపడవలదని హెచ్చరించిన భగవంతుడా నా యీ తప్పిదాన్ని మన్నించు..."


    నవ్వులు వికృతంగా కర్కశంగా....


    "న చ సన్న్యసనా దేవ సిద్ధిం సమధిగచ్చతి" సన్యసించినంత మాత్రాన సిద్ధి లభించదని, ముక్తి మార్గాన్ని ప్రవచించిన ఓ పరమాత్మా నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని ఆశీర్వదించు."


    గాలిని చీల్చుతున్న తూటాల మ్రోత సమీపంలో.


    భ్రమ దిగ్భ్రమల నడుమ నిలిచి అన్యమనస్కంగానే అర్థం చేసుకున్నాడు. పోటీకి ప్రారంభం జరిగిపోయిందని...


    ఒకటి... రెండు... మూడు...


    క్షణాలు దొర్లిపోతున్నాయి శబ్దరాహిత్యంగా.


    కళ్ళు అరమోడ్పు లౌతున్నాయి...


    సరిగ్గా అపుడు సెటీల్మన్న ఓ కొలిమితిత్తి కక్కిన విష వాయువు వూపిరిని కుత్తుకలోకి నెట్టింది.


    పగిలిన ఓ నిశీధి ప్రస్థానపు శకలం కలుక్కుమని గుండె అరల్ని గుచ్చుకున్నది అప్పుడే...


    పగిలిన ఒక జీవ విహంగపు ఆర్తనాదం ఇంతింతై స్మృతిని చేరిందిప్పుడిప్పుడే.


    వలయం విలయం నిషద్వర శోధిత విహంగధ్వానం...


    వశం తప్పిన తిరస్కృత బహిష్కృత సుప్తకంకాళికా భేదం


    ఒక నాడి కుదిపింది.


    ఒక ప్రేవు కదిలింది.


    దుస్పహదృశ్య నిక్షప్త నినాదం క్రోధంగా బుసకొట్టి తట్టింది...


    జారిపోయాడు సమాధిలోకి...


    ఒక ఆధ్యాత్మికమైన స్థితిని చేరిన శశాంక నేత్రం ఒకటి నిట్టూర్చి నీటి బొట్టును పైకి చిమ్మింది.


    "టప్" మన్న చప్పుడు


    నేత్రాంచలం నుంచి జారిన నీటి బొట్టు చెంపపై నిలిచింది.


    వేలు కదిలింది ఒళ్ళు మరిచి...


    మరో చప్పుడు...


    ఉఛ్వాసం ఉలికిపడింది.


    చెంపనుంచి పెదవుల అంచుకి పయనించిన అశ్రువు అలసటగా అక్కడ ఆవిరైంది.


    యాంత్రికంగా వేలు కంపించింది. మరోసారి, ఇంకోసారి.


    కేకలు


    కరతాళ ధ్వనులు.


    హోరు.


    కుదిపేస్తున్నారెవరు...


    మెరుపులు...


    "కంగ్రాట్స్" అభినందనలు.


    చూసా డప్పుడు


    ఊపిరందని ఉద్వేగంతో రాజమణి కావలించుకుంటున్నాడు.


    ఏం జరిగింది...

    
    అంతా తన చుట్టూ వున్నారు. ఎందరో తన వేపుకే దూసుకొస్తున్నారు... "యూ హేవ్ బ్రోకెన్ ది రికార్డాఫ్ మిస్టర్ సింధియా ఆఫ్ జైపూర్."


    ఉత్సుకత లేదు. ఊపిరందనట్టు జనసందోహాన్ని తప్పించుకుంటున్నాడు.


    మనసును అదుపుచేసుకోలేని మైకంలో తనను తానే మరచిన ఉన్మాదంలో అతడెంత తప్పిదం చేశాడూ అంటే అతడి నిర్ణయం మరుగునపడి మొన్నకన్నా మిన్నగా మరో అద్భుతాన్ని సృష్టించాడు.


    "గాడ్."


    గొణుగుతున్నాడు తనలో తానే. కాదు మరో రోజు స్నేహితుల్తో గడుపుదామని రాజమణి వారిస్తున్నా వెళ్ళిపోదామని మామగారితో మొండిగా అన్నాను...


    ఏనాడూ జవాబు చెప్పడం ఎరుగని శశాంక ఇప్పుడు ఇలా మాట్లాడ్డం రాజమణిని ఆశ్చర్యంలోకి నెట్టింది.


    గెలిచిన శశాంక పరాజితుడిలా కనిపించాడాక్షణంలో.


                               *    *    *    * 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS