మరో అరగంటలో పోలీసులు వచ్చారు. చాలా నిశ్శబ్దంగా వుండే ఆ కాలనీ అపరాత్రివేళ కలవరపాటుగా నిద్రలేచింది.
మొహానికి మాస్క్ లు తొడుగుకుని సాయుధులై వచ్చిన వ్యక్తుల గురించి సాంబయ్య చెప్పిన స్టేట్ మెంట్ ని రికార్డు చేసుకున్న ఇన్ స్పెక్టర్ శవాన్ని తరలించేక నిశ్శబ్దంగా కూర్చున్న రాజమణితో అన్నాడు.
"ఆధారాల్ని బట్టి ఎనలైజ్ చేస్తే హంతకులు ఇంటిని దోపిడీ చేయాలని వచ్చి ఈ దారుణానికి ఒడికట్టినట్టు లేదు. మీ గురించి నాకు తెలుసు మీకెవరూ శత్రువులు కాకపోవచ్చు. పోనీ మీరెవరి'కైనా శత్రువయ్యే అవకాశం వుందా అంటే...?"
"ఉంది ఇన్ స్పెక్టర్" అప్పటికి నోరు తెరిచాడు శశాంక. రక్తం ఓడుతున్న కళ్ళతో శశాంక తదేకంగా చూస్తూ అన్నాడు "ధనుష్కోటి"
ఉలిక్కిపడ్డాడు రణధీర్ "వ్వాట్?"
ఒక పోలీసాఫీసరుగా ధనుష్కోటి ప్రశస్తి గురించి తెలిసిన రణధీర్ ముందు తత్తరపడి వెంటనే అన్నాడు "ఆయనకి అవసరమేముంది?"
చెప్పాడు ఫోన్ లో జరిగిన సంభాషణ గురించి.
"ఢిల్లీ నుంచి వెంటనే బయలుదేరా" అని శశాంక ఎందుకంత కంగారుపడిందీ హైదరాబాద్ చేరేదాకా ఎందుకంతలా వ్యాకుల పడిందీ అప్పటికి అర్ధమైంది రాజమణికి.
"ఐసీ... ఆ అపరాధి ఎవరన్నా కానివ్వండి... చట్టానికి అప్పచెప్పేవరకూ నేను నిద్రపోను" ఆందోళనగానే వెళ్ళిపోయాడు రణధీర్.
స్మశాన స్థబ్దత ఆవరించిన ఆ ఇంటిలో నిద్రలేని మరెన్నో రాత్రులకి తొలి రాత్రి కాగా ఓ మూల నిశ్శబ్దంగా నిలబడివున్న శశాంక మనసు ఎలాంటి సంఘర్షణకి లోనవుతున్నదీ సునాయాసంగానే గ్రహించారు రాజమణి.
కాని మాటాడలేకపోయారు.
ఒక నిర్విరామ తపస్సుకిలాంటి మూల్యం చెల్లించాల్సి రావడమన్నది ఆయనకి అర్థంకాని విషయమే.
అనుభవం కన్నా జీవితం, జీవితం కన్నా దేశం గొప్పదనే ఒక సిద్ధాంతపు పునాదులపై నిలబడి ప్రపంచాన్ని దర్శించడమే అలవాటైన రాజమణి తొలిసారి ఆ క్షణాన ఆందోళన పడింది కొన్ని క్షణాల క్రితమే. శవంగా తరలించబడిన కూతురు కృప గుర్తుకొచ్చి కాదు.
అక్కడ ఓ మూల నిలబడి ఏ క్షణంలో అయినా పగలబోయే "వల్కనో"లా పిడికిళ్ళు బిగిస్తున్న శశాంకని చూసి...
సరిగ్గా ఇదే సమయంలో...
ప్రముఖ సారా కాంట్రాక్టర్ గానేకాక తెలుగుదేశంలో అంచెలంచెలుగా ఎదిగిపోతూ అండర్ వరల్డ్ కింగ్ గా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసే ప్రయత్నంలో వున్న ధనుష్కోటి తన అనుచరులు చెబుతున్నది ఆశ్చర్యచవితుడై వింటున్నాడు.
"యస్సర్... నిజానికి మేం వెళ్ళింది కృపని కిడ్నాప్ చేయాలనే కానీ అప్పటికే ఆమె హత్య చేయబడింది. అందుకే సైలెంట్ గా వెనక్కి వచ్చేశాం"
"తమకన్నా ముందు ఆమెపై అఘాయిత్యం చేయాల్సిన అగత్యం ఎవరికుంది?"
ఒకవేళ అగర్వాలా. శశాంక బిజినెస్ తనకి మాత్రమేగాక మరొకరికి అప్పచెప్పాడా...
"ఆల్ రైట్" బాధ్యులెవరన్నా కాని తన ప్రమేయం లేకుండా ఓ పని పూర్తయిపోయింది.
అంతకు మించి ఆ విషయంపై ఆసక్తి చూపించలేకపోయాడు.
అనుచరులను వెళ్ళమని సౌంజ్ఞ చేసాక అప్పటికి చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్న తన బిజినెస్ వ్యవహారంలోకి తల దూర్చాడు మళ్ళీ.
రిజర్వీద్ బ్యాంకు క్రెడిట్ స్క్వీజ్ చేసాక వ్యాపారస్తులకి బ్యాంకుల నుంచి రుణాలు దొరకడం కష్టం కావడంతోను, పైగా ఇరవై నుంచి ముప్పైశాతందాకా వడ్డీలు దొరకడంతో ప్రజలు పుట్టగొడుగుల్లా లేస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ అండ్ ఇన్ వెస్ట్ మెంట్ సంస్థలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.
ఒక సారా కొట్టుతో జీవితాన్ని ప్రారంభించి అంతెత్తు కెదిగిన ధనుష్కోటికి బాగా తెలుసు మధ్య తరగతి మనస్తత్వం గురించి. "బ్లీడ్ కంపెనీస్"గా పిలవబడే ఈ సంస్థలు పేరుకు తగ్గట్టు గొంతులు కోసే ప్రమాదముందనిపించినా తక్కువ కాలంలో ఎక్కువ సంపాదనంటే తలలు సైతం తాకట్టు పెట్టేస్తారు.
అది వాళ్ళ తప్పుకాదు. వెంటాడే ఆర్ధికావసరాలు, కనీస వనరుల్ని సైతం ఒక జీవిత కాలంలో ఏర్పాటు చేసుకోలేని నిస్సహాయతలో మగ్గిపోతూ కూడా ప్రతిక్షణం మరొకరితో పోల్చుకుంటూ తాము ఒకరికన్నా పై మెట్టులోనే వున్నామనిపించుకోవాలనే తపన వాళ్ళని రిస్కులోకి నెడుతుంది.
ఆ చిన్న లాజిక్ తోనే అతను కూడా ఓ ఆరు నెలల క్రితం పార్టనర్ షిప్ ఫర్మ్ కింద ఓ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ ప్రారంభించాడు. ఈ స్వల్పకాలంలో సుమారు నలభై లక్షలదాకా డిపాజిట్ చేయబడింది. ఇప్పుడు ఆ డబ్బుని మరో వ్యాపారంలోకి మళ్ళించాలనుకుంటుండగా మూతవేయబడిన ఓరియంటల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ గురించి పత్రికలో వార్త వచ్చింది. డిపాజిటర్స్ గుండెలు బాదుకుంటున్నారు.
నినాదాలని నాదాలుగా మార్చుకునే మా ప్రజ గుంపులోనే తప్ప విడిగా తననేదో చేస్తారన్న భయం లేదు ధనుష్కోటికి. మహా అయితే కోర్టుకి వెళతారు... వెళితే...
