Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 15


    ఆమె నోరు విప్పలేదు.

 

    అతనే చెప్పుకుపోతున్నాడు.

 

    "భర్త చనిపోతే స్త్రీ మరో వివాహం చేసుకోకూడదు. అదే పురుషుడు భార్య కర్మక్రియలు అయిపోయిన రెండోరోజే మరో వివాహానికి తయారుకావచ్చు. ఇంతటి వివక్ష ఎక్కడయినా వుందా?"   

 

    ఆమెలో కొత్త అలజడి. దానిని అధిగమించడానికి ఆమె విఫలయత్నం చేస్తోంది.

 

    "ఇంతకు ముందు మీరు నవ్వుతూ బలవంతంగా దాన్ని దిగమింగుకున్నారు. ఎందుకు? నవ్వొచ్చినప్పుడు నవ్వాలి. దుఃఖం వచ్చినప్పుడు ఏడ్వాలి. మనం ఎంత సహజంగా ప్రవర్తించే వీలుందో అంత సహజంగానే ప్రవర్తించాలి. తెచ్చిపెట్టుకున్న గంభీరత మనల్ని మానసిక రుగ్మతల్లోకి నెడుతుంది తప్ప మరో ప్రయోజనం లేదు"    

 

    తను నవ్వును కంట్రోల్ చేసుకోవడాన్ని అతను కనిపెట్టడం చిన్నతనంగా తోస్తోంది ఆమెకి.

 

    అందుకే దాన్ని మరింత పొడిగించలేక "ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇక పడుకోండి" అంది.

 

    ఇంత సుదీర్ఘంగా మాట్లాడటం కూడా ఈమధ్య బొత్తిగా అలవాటులేని విషయం ఆమెకి. అయినా రేపు తెల్లవారేటప్పటికి అతని దారి అతనిది. ఈ రాత్రి ఎంత గింజుకున్నా ఒకరినొకరు మార్చలేరు. కాబట్టి ఆలోచించడం శుద్ధ దండుగ అనుకుని కళ్ళు మూసుకుంది.

 

    క్షణంలో ఆమెకి నిద్ర పట్టేసింది.

 

    అతను మరోసారి మాట్లాడాలని ప్రయత్నించాడు. అప్పటికే ఆమె నిద్రపోయిందని గ్రహించి తనూ బలవంతంగా నిద్రకుపక్రమించాడు.

 

    రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన మౌనికకు కరెక్టుగా నాలుగూ నలభై ఐదు నిమిషాలకి మెలకువ వచ్చింది. స్నానానికి పోతూ అతనివైపు చూసింది. గాఢంగా నిద్రపోతున్నాడు. లేపడానికి మనస్కరించక పోవడంతో అలానే స్నానానికి వెళ్ళి వచ్చింది.  

 

    ఇక లేపక తప్పదని గ్రహించి "తరుణ్ గారూ!" అంటూ పిలిచింది.

 

    "గుడ్ మార్నింగ్!" అన్నాడు కళ్ళు విప్పుతూనే.

 

    ఆమె తిరిగి విష్ చేయకుండానే "నేను సభామందిరానికి వెళుతున్నాను. నేను వచ్చేటప్పటికి మీరుండకూడదు" అంది.

 

    అతను సరేనన్నట్లు తల ఊపి అంతలోనే ఏదో విషయం గుర్తుకురావడంతో "మీరో సాయం చేయగలరా?" అని అడిగాడు.

 

    ఆమె ఏమీ మాట్లాడకుండా చూస్తుండిపోయింది.

 

    "మీరు బయటికి వెళుతున్నారు కదా! ఈ ఆవరణలో ఎవరైనా కొత్తవాళ్ళు, అంటే రౌడీ టైపులో వున్నవాళ్ళు వున్నారేమో చూడండి. ముందూ వెనకా చూడకుండా గుడ్డిగా బయటికి వెళితే ప్రమాదంలో చిక్కుకుంటానేమో" అని అన్నాడు.  

 

    ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇతని విషయంలో తలదూర్చకూడదని నిర్ణయించుకోవడం వల్ల "అలాంటి పనులు నాకు చెప్పకండి. రాత్రంటే ప్రమాదంలో వున్నారని అంటే ఆశ్రయమిచ్చాను. ఇక నావల్లకాదు. ఇప్పటికే ఈ పాపపు పనికి మనసంతా మూలుగుతోంది" అని చెప్పింది.

 

    "అయితే మీరు నాకీ సాయం చేయరన్నమాట. ఓ.కె! మీరు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నేనిక్కడ వుండను. బయటికి వెళ్ళగానే నేను వాళ్ళకు కంటపడితే యిక నా పని ఆఖరు. అలాంటిదేదైనా జరిగితే మాత్రం ఆ పాపమంతా మీదే" అన్నాడు.

 

    "ఇక ఏమీ మాట్లాడకండి! దయచేసి వెళ్ళిపొండి" అని విసురుగా రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టి బయటపడింది.

 

    సభామందిరానికి వెళ్ళేటప్పటికి అందరూ అప్పటికే వచ్చేశారు. చివరగా కూర్చుని ధ్యానంలోకి వెళ్లింది. ఏ పని మొదలు పెడుతుందో అందులోనే మనసులగ్నం చేయడం సంవత్సరం నుండి పొందిన శిక్షణలో నేర్చుకుంది.   

 

    అందుకే నిర్మలంగా ధ్యానం ముగించింది.

 

    అమ్మాయిలంతా మహిళాసదన్ కేసి నడుస్తుంటే ఆమె మాత్రం విమలాబాయి కుటీరానికి బయలుదేరింది.

 

    మహిళాసదన్ లో ఏం జరిగినా దాన్ని విమలాబాయికి చెప్పాలి. తను రాత్రి చేసింది మహాపరాధం. ఓ యువకుడికి రాత్రి తన గదిలో ఆశ్రయమిచ్చిన విషయం తెలియజేయాలి. ఆ తరువాత సాయంకాలం ఆత్మ ప్రక్షాళనా కార్యక్రమంలో శిక్ష వేసుకోవాలి. ఏం శిక్ష వేసుకోవాలో కూడా నిర్ణయించుకుంది. శిక్ష అమలు జరిగితే ఇక తనకు విముక్తి లభించినట్లే. అంతవరకు తను పాపం చేశానన్న భావన పోదు.

 

    ఇదంతా ఆలోచించే ఆమె చకచకా అడుగులు వేసింది. కుటీరం బయట రెండు మూడు కొత్త చెప్పుల జతలు చూశాక లోపల విమలాబాయి కాక మరెవరో కూడా వున్నారని గ్రహించింది.

 

    ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని తటపటాయించింది. ఎవరున్నా వెళ్ళి విమలాబాయితో మాట్లాడే చొరవ ఆమెకుంది. అందులోనూ ఆ విషయం చెప్పేస్తే తప్ప విముక్తి కలిగేటట్లు లేదనిపించి లోపలికెళ్ళింది.

 

    ఆమె వెళ్ళేటప్పటికి విమలాబాయి ముందు కూర్చున్న గణపతిరాజు తరుణ్ ఫోటో చూపిస్తూ "ఇతను తరుణ్. మొన్నటివరకు ఓ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేసేవాడు. చాలా డేంజర్ మనిషి, పెద్ద వెధవ పనిచేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక్కడికేమైనా వచ్చాడా?" అని అడుగుతున్నాడు.   

 

    "వచ్చినట్లు లేదు. ఎవరెవరో వచ్చి సాయంకాలాలు నా ప్రసంగాలు విని వెళుతుంటారు. ప్రత్యేకించి ఎవరినీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు గనుక ఖచ్చితంగా ఇతను వచ్చాడో లేదో చెప్పలేను."  

 

    విమలాబాయి మాటలకు గజపతిరాజు నిరుత్సాహపడ్డాడు. ఏదో చెప్పాలని నోరు తెరవబోయిన అతను ఎవరో వచ్చినట్లు అనిపించడంతో తలతిప్పి చూశాడు.

 

    అంత అందమైన అమ్మాయి అక్కడ వుండడం ఆశ్చర్యంగా అనిపించి మౌనికనే చూస్తుండిపోయాడు.

 

    "ఆమె నా శిష్యురాలు మౌనిక" విమలాబాయి చెప్పడంతో ఈ లోకంలోకి వచ్చాడు అతడు. వచ్చిన ఆమె కొత్త వ్యక్తి కాకపోవడంతో తిరిగి విమలాబాయితో చెప్పాడు.

 

    "ఇతను మరీ పిరికివాడేం కాదు. ఇంతకుమించి దూరం పోయి వుండడు. అందుకే ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇక్కడే రెండు మూడు రోజులుంటాం. కావాలనుకుంటే నా మనుషుల్ని ఓ నెలరోజులపాటు ఇక్కడే వుండే ఏర్పాట్లు కూడా చేస్తాను. అతన్ని పట్టుకోవడం చాలా అవసరం."

 

    "ఇక్కడ అతను కనపడ్డా గొడవలు చేయకూడదు. ఈ సదన్ ఆవరణ దాటాక మీ యిష్టం."

 

    "అట్లాగే" అని లేచాడు గణపతిరాజు,

 

    మౌనికకు తెలియకుండానే కాళ్ళు వణుకుతున్నాయి. భూమిని ముద్దగా పిసికి తనమీదకు విసిరినట్లు భయపడిపోతోంది. ఆమె కళ్ళ ముందు ఓ భయానక దృశ్యం కదులుతోంది.

 

    ఈ పాటికి తరుణ్ తన గదినుంచి బయటపడి నడుస్తుంటాడు. ఇక్కడి నుంచి ఓ కిలోమీటర్ దూరంలో అన్నావారి సత్రం వుంటుంది. ఇక్కడికి రావాలన్నా, ఇక్కడనుంచి వెళ్ళాలన్నా ఆ ఊరికి పోవాలి. అది ఊరు కాదు, అలా అని టౌనూ కాదు. మెయిన్ రోడ్డు ఊరు మధ్యలో పోతుంది. రోడ్డు పక్కన అటూ ఇటూ అంగళ్ళు వుంటాయి. వాటి వెనుక ఓ వరుసలో యిళ్ళుంటాయి. అంతే ఊరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS