Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 15

ధీరజ వెంటనే వెళ్ళి ఆ రోజు పాల్గొంటున్న టీమ్ లో తన పేరును కూడా ఇచ్చింది.
పది గంటలకు ఐదు నిమిషాల వ్యవధి వుంది అనగా టీమ్ లోని వాళ్ళ పేర్లను పిలవడంతో, వాళ్ళ అందరూ పార్క్ లోపలకు నడచి ప్రత్యేకంగా ఎరేంజ్ చేయబడి వున్న పామియానాలో కూర్చున్నారు.
నిర్వాహకులు అక్కడే వున్నారు.
ఆ ట్రెజర్ హంట్ విషయం విన్న ప్రజలు పార్క్ చూట్టూ గుంపు కట్టి వున్నారు.
సరిగ్గా చెప్పిన టైమ్ కే పోటీ ప్రారంభమైంది.
'సూర్యడు తొంగి చూసినా వెలుగు పడని చోట ఆ నిధి దాచినట్టు' చెప్పారు నిర్వాహుకులు.
విన్న వెంటనే చాలా మంది ముఖాలు చూసుకున్నారు.
దట్టంగా పెరిగి వున్న గుబురు చెట్ల కింద వెదకడం మొదలుపెట్టారు మరికొందరు.
ఇంకొందరు తామే ముందుగా ఆ నిధిని సాధించాలని పట్టుదలతో ముందుకు సాగిపోయారు.
ఇప్పుడు అక్కడ మిగిలింది ధీరజ మాత్రమే.
అందరూ ఆమె వైపు వింతగా, విచిత్రంగా చూస్తున్నారు.
ధీరజ చాలా సేపు ఆలోచించింది.
ఆమె దృష్టి దూరంగా వున్న ఆకాశంవైపు సారించింది. సూర్యకిరణాలు చెట్ల ఆకులలో నుంచి నేలపైకి చొచ్చుకుని వస్తున్నాయి.
ఉన్నట్టుండి ఆమె చూపులు కొబ్బరి చెట్టుపై నిలిచిపోయాయి...
క్షణాల మీద ఆమె ఆలోచనలు కొబ్బరి బొండాం చుట్టూ తిరిగాయి.
వాళ్ళు చెప్పిన క్లూకి అర్ధం ఏమిటో అప్పుడు స్పురించింది.
కానీ, ఆ పార్క్ లో కొబ్బరి చెట్లు ఒక్కటి కాదు... చాలా వున్నాయి.
వాటిలో ఏ చెట్టు కిందనో ఎలా గుర్తించడం?
వెంటనే బయలుదేరి నీటి కొలను చూట్టూ వున్న కొబ్బరి చెట్ల కింద నిశితంగా పరిశీలించటం మొదలు పెట్టింది.
అది గమనించిన మిగిలిన పోటీదారులు ఆమె భావం అర్ధం చేసుకుని వాళ్ళు కూడా కొబ్బరి చెట్ల మొదళ్ళలో వెదక సాగారు.
ఒక పెద్ద మనిషి ఒక చోట కొబ్బరి చెట్టు కాండం కింద చాక్ పీస్ తో యారో మార్క్ వేసి వుండడం కనిపించింది.
దానిని గబగబా చెరిపేశాడు అతను!
ఇంకెవరు అయినా ఆ గుర్తు చూసి తనని అనుసరించి వస్తారు అనే భయం అతనిది.
ఆ గుర్తు సూచించిన దిక్కుగా సాగిపోయాడు అతను.
పది గజాలదూరంలో సిమెంట్ బాటపై పెద్ద సున్నా గీసి, దాని మధ్యలో చుక్కపెట్టి  ఉండడం గమనించాడు. అది ఏమిటో అర్ధంగాక అక్కడే చతికిల పడిపోయాడు.
ఇంకొక చోట ఇంకొకనికి చిన్న పొట్లాం దొరికింది.
దానిని తెరిచి చూస్తే ఒక బొమ్మవేసి వుంది. ఆ  బొమ్మ ఎక్కడ  కనిపిస్తుందోనని వెదుకుతూ సాగిపోయాడు అతను!
ఇలా ఎవరికి దొరికిన ఆధారాల ప్రకారంగా వాళ్ళు వెదుక్కుంటూ పోతున్నారు.
ధీరజకు ఒక చెట్టు మొదల దగ్గర స్లిప్ దొరికింది.
'వంతెన మీదుగా వెళ్ళి ఎడమవైపుకు చూడు...' అని వుంది దానిలో...
దాన్ని ముక్కలుగా చింపి పడవేసి నీటి కొలను మధ్యలో వున్న వంతెనను దాటి ఎడమవైపుకు చూసింది.
దూరంగా ఎత్తయిన గుట్టపై ఐస్ క్రీం అమ్మే షాపు ఒకటి కనిపించింది.
ఆ షాపును సమీపించి చుట్టూ పరిశీలనగా చూసింది ధీరజ.
వెనక వైపు ఒక చోట వాటర్ పౌంటెన్ దగ్గరకు వెళ్ళింది. నీళ్ళు చిమ్మే మధ్య భాగంలో చెక్కతో చేసిన ఇంటి బొమ్మ పడవేసి వుంది. అలాంటి షేప్ కలిగిన ఇల్లు ఆ పార్క్ లో ఎక్కడ అయినా వుంది ఏమోనని ధీరజ వెదికింది.
వెనుక వైపు గేటుకు దగ్గరగా గెస్ట్ హవుస్ లాంటి చెక్కలతో కట్టిన ఔట్ హవుస్ కనిపించింది.
ధీరజ గబగబా అటు నడిచింది.
ఆ ఇంటి పక్కనే వున్న రాతి బండపై సన్నని కాలిబాట మెలికలు తిరుగుతూ వెళుతున్న దృశ్యం ఆ రోడ్ పక్కనే కొన్ని గుర్తులు చాక్ పీస్ తో గుర్తించి వుండడం చూసింది ఆమె.
ఏయ్ మెలికల దగ్గర ఆ చుక్కలు వున్నాయో గుర్తుపెట్టుకుని అసలు ఆ రోడ్ ఎక్కడ వుందో వెదుకుతూ బయలు దేరింది.
ఒక పెద్ద మనిషికి 'నీకు కావలసింది ఇక్కడే వుంది' అన్న స్లిప్ దొరికింది.
ఆ ప్రకారంగా సంతోషంతో అతను వెదకగా నేలలో పాతిపెట్టిన లావాటి అట్ట పెట్టె దొరికింది.  ఆనందంగా దానిని తెరిచి చూస్తే లోపల పది చాక్ లెట్లు కనిపించాయి. వాటితో పాటు 'విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్' అన్నా స్లిప్ వెక్కిరిస్తూ కనిపించింది అతనికి.
నెత్తీ నోరూ లబలబా బాదుకుంటూ వాపోయాడు అతను!
ఇంకొకచోట ఇంకొక పెద్ద మనిషికి అందంగా చేసి వున్న పార్శిల్ లభించింది. రెట్టించిన ఉత్సాహంతో దాన్ని తెరచి చూడగా '36' సైజు వున్న బ్రా కనిపించింది. 'థాంక్యూ జంటిల్ మెన్' అన్న కాప్షన్ అభినందిస్తూ వుంది.
మధ్యాహ్నం అయింది...
ఎవరూ విజయం సాధించలేదు!
మొత్తం రెండువందలమంది పాల్గొన్నారు.
అప్పటికి సగంమంది నిరుత్సాహంగా విరమించుకున్నారు. మిగిలినవారిలో ఒక ఐదుమంది మాత్రం ధీరజ ఎటువెళితే అటు అనుసరిస్తున్నారు.
ఆమె ఆ కాలిబాటపై తనకు కావలసిన గుర్తుల ప్రకారంగా నడుస్తూ వెళుతుంది. ఒక గుర్తు చోట ఐస్ లు అమ్మే బండి పెట్టుకున్నాడు ఒకడు.
ముందుకు నడవబోయి ఎందుకనో ఆగిపోయిందామె.
"ఒరే... అటుపోయి అమ్ముకోరా"
"ఊహూఁ.. నేను ఇక్కడే అమ్మాలి"
"అలా అని రాసిపెట్టి వుందా ఇక్కడ? అటువెళ్ళి అమ్ముకోవచ్చుగా?" అనుమానంగా ప్రశ్నించిందామె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS