Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 14

    "కాస్సేపు మాట్లాడుకుందాం. ఆ సినిమా సొద ఆపవే!" అంది గాయత్రి.

    ఆఫ్ చేసింది ఆమని. కాసట్ ఎజెక్ట్ అయిం తరువాత దాన్ని భద్రంగా సూట్ కేస్ లో దాచిపెట్టి తిరిగి వచ్చి ఆమె ప్రక్కనే కూర్చుంది.

    "తిరునాళ్ళు అయిపోయిం తరువాత వెళ్ళిపోతావు. మళ్ళీ ఎప్పుడొస్తావు?"

    "ఇహ మళ్ళీ రావటం నీ పెళ్ళికే" అంది ఆమని.

    "ఆమనీ! నీతో ఒక ముఖ్యమయిన విషయం మాటాడాలి!"

    "మాటాడేదంతా ముఖ్యమయిందే కాని చెప్పు!"

    "తమాషా కాదు. సీరియస్ గా విను! మనిద్దరం ఒకే ప్రాణంగా పెరిగాం."

    "కాదని ఎవడంటాడు. ఒళ్ళు చీరేస్తా!"

    "అదికాదు ఆమనీ! ఆయన నీకు నచ్చారా?"

    "బాగుంది వరుస! నాకు నచ్చటమేమిటి? చేసుకోవాల్సింది నువ్వు! బావగారుగా అయితే బాగానే ఉంటాడనిపిస్తోంది. భర్తగా అయితే ఎలా వుంటాడో నువ్వే చూచి నిర్ణయించుకోవాలి."

    "నీకు నచ్చితే నాకూ నచ్చుతారు. నువ్వు ప్రపంచమంతా తిరుగుతున్నావు కదా! చాలా సంగతులు తెలుసుకుని ఉంటావు కదా అందుకని!"

    "నీ ఆలోచన బాగానే ఉంది కాని మగవాళ్ళలో మంచివాళ్ళు అంటూ ఎవరూ ఎవరూ ఉండరు. కనీసం మంచివాళ్ళు కనిపిస్తే చాలు అని మనం వెతుక్కోవాలి. పైగా మనిషి ప్రవర్తన అనేది కాలంతో ముడిపడి వుంటుంది. ఈరోజు వరకు ఎలా ఉన్నారనిపించుకుంటే చాలు?!"

    "నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఆ తర్వాత నీ యిష్టం."

    "నువ్వు సరే అంటే చేసుకుందామనుకుంటున్నాను."

    "ఆ తెలివి తక్కువ మాటలే మాటాడ వద్దంటున్నా! నేనయితే అసలు పెళ్ళే చేసుకోవద్దంటాను వింటావా!"

    "అతను మంచివాడే అని నాకు అనిపించింది. మరో నాలుగు రోజులుంది కదా! ఈలోగా వీలయినంత ఎక్కువ సమాచారం అతన్ని గురించి తెలుసుకుంటాను. మీ ఇద్దరిని ఒకసారి కలుపుతాను."

    "ముందుగా మాటాడుకోవటం మంచిది. ఒకరి నొకరు అర్ధం చేసుకునేందుకు వీలు అవుతుంది."

    "ఆయన అపార్ధం చేసుకుంటారేమో!"

    "పిచ్చిదానా! నువ్వు చదివే రుక్మిణీ కళ్యాణంలో హీరోయిన్ ఏమి చేసింది. ప్రేమించిన ప్రాణవిభుడిని కబురెట్టి పిలిపించుకుంది. ఆడపిల్లకి పెళ్ళి విషయంలో స్వయం నిర్ణయాధికారం ఉండాలని ఏనాడో చెప్పారు. నీకెందుకు నువ్వలా ఉండు. కధ అంతా నేను చూచుకుంటాను కదా?" అంది ఆమని.

    "నీవు సాయంగా ఉంటానంటేనే నేను ధైర్యం చేయగలుగుతాను" అంది గాయత్రి. "అలాగే తధాస్తు" అంది ఆమని ఆరిందలాగ!

    ఆ తరువాత అక్క వెళ్ళిపోయింది. ఆమని ఏం తిన్నదో గుర్తు తెలియకుండా కాస్తంత తినేసి రేపు గురించి ఆలోచిస్తూ పదుకుంది!

    భళ్ళున తెల్లవారింది! ఆమని నిద్రలేచే సమయానికే గాయత్రి, సుమిత్ర ఆలయానికి వెళ్ళివచ్చారు. ఇంక రేపటి ఉదయం వరకూ ఉత్సవం గురించి తెలుసుకుంటూ ఉండటమేకాని ఇల్లు విడిచి వెళ్ళే పనిలేదు.

    కాని భవనం వచ్చిపోయే జనంతో కోలాహలంగా ఉంది.

    గ్రామంలో జరిగే ఉత్సవాలకు కేంద్ర బిందువు ఆలయమైతే దాన్ని నియంత్రించే అధికారం సుమిత్ర చేతిలో ఉంది!

    ఆలయంలో దర్శనానికి జనం వరుసలో వెళ్ళేందుకు క్రొత్తగా నిర్మించిన బారికేడ్స్ వచ్చి చూడమని పెద్దలు వచ్చారు.

    తాను రాలేనని గాయత్రిని తీసుకుపొమ్మని చెప్పింది!

    అక్క వెంట అడుగులో అడుగువేసుకుంటూ పిల్లికూనలా అమాయకంగా బయలుదేరింది ఆమని!చిన్న కూతురికి ఆలయ విషయాల మీద ఆపాటి శ్రద్ధ కలగడం మంచిదిగానే భావించి ఊరుకుంది సుమిత్ర. భవనం సరిహద్దులు దాటే వరకూ పిల్లిపిల్లలా వచ్చిన ఆమని వీధిలోకి వచ్చాక వెన్ను నిటారుగా చేసి నిలబడింది.

    గాయత్రి గమనిస్తూనే ఉంది తమాషాలు.

    కాని ప్రక్కన పెద్దలున్నారు కాబట్టి అప్పటికేమీ మాటాడలేదు.

    బారికాడ్స్ ఎలా నిర్మిస్తారో ఎలా నిర్మిస్తే బావుంటాయో వాస్తవంగా వారికి తెలియదు. వారిచ్చిన పెద్దరికం నిలుపుకునేందుకు వచ్చారు. "బావున్నాయి" అని యాంత్రికంగా చెప్పి స్వామి దర్శనానికి వెళ్ళారు. చేతులు జోడించి అక్షతలు తీసుకుని వెళ్ళిపోయారు. వెనుకకు తిరిగి చూచిన అక్కగారికి చెల్లెలు కన్పించలేదు.

    ఆలయం వెలుపలకు వస్తే వీధి మలుపు తిరుగుతోంది!

    పంజరంలో బంధించిన రామచిలుకను వదిలిపెడితే రెక్కలు విదిల్చి వెళ్ళి పోయినట్లుగా నడుస్తోంది.

    గాయత్రి నవ్వుకుంటూ తిరుగు ముఖం పట్టింది.

    అమ్మగారికి కన్పిస్తే ఆమని గురించిన ప్రశ్నలు ఎదురు అవుతాయని నేరుగా తన గదిలోకి వెళ్ళింది గాయత్రి.

    వర్ధనిని పిలిచి ఆలయంలో చూచి వచ్చామని బారికేడ్స్ బావున్నాయని ఆమని గురించి అనుమానం రాకుండా వార్త పంపింది.

    సుమిత్ర తన బాధ్యతల్ని పంచుకుంటున్న బిడ్డల్ని తలుచుకుని సంతృప్తిపడింది. తన పనుల్లో లీనమయింది.

    ఉట్టి పండుగ కోసం ఉషారు పడుతున్న మర్రిచెట్లు దగ్గరకు చేరుకుంది ఆమని!

    అప్పటికే అక్కడకు చాలామంది చేరుకున్నారు.

    హుషారయిన ఆ ఉత్సవాన్ని చూచేందుకు వయసు చాలని చిన్న పిల్లలు మర్రిచెట్లు కొమ్మలమీదికి చేరుకున్నారు.

    ఆడవాళ్ళు అందరూ ఒకవంక చేరారు.

    మగవాళ్ళు మరోవంక గుమిగూడారు.

    ఎత్తయిన చెట్టుకొమ్మల మీద ఒక గిలక బిగించి పుల్లీ తయారు చేశారు. త్రాడుకి రెండవ అంచున ఒక ఉట్టి కట్టాడు.

    దానిలో ఎర్రనీళ్ళు పోసిన ఒక మట్టిపాత్రను పెట్టారు.

    ఉట్టిని పైకిలాగే ముందుగా అతను ఎనౌన్స్ చేశాడు. "ఉత్సాహవంతులయిన యువకులకు బహుమతులు ఇవ్వదలుచుకున్నవారు ఈ మట్టిపాత్రలో వేయండి!" అని.

    "యువకుల్ని ప్రోత్సహించాలనుకున్న పెద్దలు, యువతులు ముందుకు వచ్చారు. చిల్లర నాణాలు, చిన్నచిన్న వెండి, బంగారు వస్తువులు దానిలో వేశారు. అది బరువుగా తయారయింది.

    అది చూస్తున్న యువకులకు నోరూరింది.

    ఎవరైతే ఉట్టి కొట్టగలుగుతారో వారికే బహుమతులన్నీ.

    వారు జట్టీలు కట్టి సిద్ధంగా వున్నారు.

    మధ్యవర్తులు అనుమతి ఇవ్వగానే ఉట్టి పైకిలేచింది.

    అంతసేపూ ఆమని దిక్కులు గమనిస్తూనే వుంది. ఎక్కడున్నాడో కన్పించని వాల్మీకి ఆట ప్రారంభం అవుతూనే యువకుల మధ్యకు వచ్చాడు.

    అందరికన్నా పీలగా గెడ కర్రలా వున్న యువకుడు మిగిలిన వారికి భయం పుట్టించాడు. ఆరడుగుల నాలుగు అంగుళాలున్నాడు.

    చెయ్యి ఎత్తితే ఎనిమిది అడుగులు పైగా వున్నాడు.

    అతడు అవలీలగా ఉట్టిని కొట్టేయడంతో వాల్మీకితో సహా అందరూ పరాజయం పాలు అయ్యారు.

    అరగంటకు పైగా సాగిన ఆటలో కవ్వింపు ప్రధాన రసం!

    పౌరుషంగా పనిచేయాలి అనేది ప్రధానమయిన సందేశం! జీవితం కూడ అలాంటి కవ్వింపులే! ఆశించినవన్నీ అందవు.

    కొన్ని అందుతాయి. మరికొన్ని అందనంత ఎత్తులో ఉండిపోతాయి. వాటిని అందుకునేందుకు పదుగురితో పోటీపడాలి.

    విజయం ఎదురైనా కావచ్చు. పెట్టుకున్న ఆశలు వృధా కావచ్చు. పడిన శ్రమ అంతా వ్యర్ధం కావచ్చు.

    ఏది ఎలా జరిగినా మనిషి దొరికిన దాంతో సంతోషంగా జివించగలగాలి! పౌరుషంతో పోటీపడి మరో విజయాన్ని సాధించేందుకు ముందుకు పోవటం నేర్చుకోవాలి!

    గ్రామీణుల ఆటలు అర్ధవంతాలు!!

    ఎలా జీవించాలనే విషయాన్ని అవి సందేశాత్మకంగా నిర్వచిస్తాయి. ఈ ఆట చాల ఆలోచనా పూర్వకమయినది అనుకుంది ఆమని!!

    రెండో ఉట్టికి సిద్ధమవుతున్నారు.

    మళ్ళీ కానుకలు వేయమని అనౌన్స్ చేశారు.

    ఈసారి ఆమని కూడా జనం మధ్యకు వచ్చింది.

    వ్రేలికి ఉన్న ఉంగరం తీసి యువకులు అందరికి చూపించింది.

    వాల్మీకి వంక తిరిగి చిరునవ్వు నవ్వింది.

    ఈదటంలో నువ్వు మొనగాడివేకావచ్చు. కాని ఎగరటంలో వెనుక పడిపోయావు అన్నట్లు కవ్వింపుగా నవ్విందామె!

    ఈసారి నా తడాఖా చూపుతాను అన్నట్లు కాలర్ ఎగురవేశాడు వాల్మీకి! ఉట్టిపైకి లేచింది.

    దానిలో ఉన్న టెక్నిక్ ఏమిటో అతనికి అర్ధమయింది.

    ఉట్టి కొట్టగలగాలంటే ఎక్కువ ఎత్తుగా ఉండటం ఎక్కువ ఎత్తు ఎదగటం ప్రధానంకాదు. అది అందరికి అందుబాటులోకి మీమీద అయిదడుగుల ఎత్తులోకి వస్తుంది.

    ఆ సమయంలో అందరూ ఎగరాలని ప్రయత్నిస్తారు. ఎగిరేందుకు పట్టే సమయాన్ని ఉపయోగించుకుని దాన్ని పైకి లాగేస్తే అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని కొట్టాలంటే అందరికన్నా వేగంగా ముందుగా ప్రయత్నించాలి!
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS