6
సల్మా వెళ్లిపోయింది. ప్రశాంత్ ని ఒక్కసారిగా భయంకరమైన ఒంటరితనంలోకి తోసేసి వెళ్లిపోయింది.
ఆ గదిలో నిశ్శబ్దం....
అతని గుండెల్లో కోలాహలం....
ఆ గదిలో ప్రశాంతత!
అతని మనసంతా అలజడి!!
టీపాయ్ మీద ఆల్కహాల్ బాటిల్ అతన్ని చేతులు చాచి "రా నా గుండెలమీద వాలిపోయి సేద తీర్చుకుందువుగాని" అని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
వెంటనే సీసా అందుకున్నాడు.
అప్పటికే సహానికిపైగా తాగేసాడు. మిగిలినదంతా ఒక్క గుక్కలో తాగేయాలన్నంత కసిగా సీసా పైకెత్తి గటగట తాగుతుంటే.... అతని కంఠనాళాలు ఉబ్బి కనిపిస్తున్నాయి స్పష్టంగా. అతని వుంగరాల తల వెంట్రుకలు అతని మొహంమీద పడి నాట్యం చేస్తున్నాయి...
మాధురి!
దట్ బ్లడీ స్విన్ మాధురీ!!
దట్ యారొగెంట్ బ్లడీ ఉమన్ మాధురీ!!!
ఎంత మర్చిపోదామన్నా, మనసు అట్టడుగుపొరల్లోంచి ఆమె తలపులని ఎంతగా తుడిచేసుకోవాలని ప్రయత్నిస్తున్నా.. సాధ్యం కావటం లేదు.
ఏ అంద చందాలని చూసి కుర్ర కారు వెర్రెత్తిపోయే వారో, ఆ అందం తనని కూడా సమ్మేహితుడ్ని చేసింది!
ఆ అందమే తనని నవ్వులపాలు చేసింది!
ప్రశాంత్ కణతమీద నరాలు ఉబ్బి, అతని నుదుటిమీద స్వేద బిందువులు ముత్యాల్లా మెరుస్తూ కనిపించసాగాయి.
అతని మనోఫలకం మీద... మాధురి మాయమోహన శచృంగార సౌందర్యం స్వరూపం లాస్యం చేసింది!
అప్రయత్నంగా అతని ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి.
మాధురీ! ది బ్యూటీగాడెస్ ఆఫ్ ది కాలేజ్!!....
7
కాలేజీ అంతా కోలహలంగా వుంది...
కేరింతలతో, నవ్వులతో కేకలతో.... విద్యార్దిలోకపు స్వాతంత్ర్య కపోతాలు స్వేచ్చా విహారం చేస్తున్న గగనసీమలా వుంది .ఆ కాలేజీ!
ప్లే గ్రౌండ్ లో పుట్ బాల్ ఆడుకుంటున్నారు.. కొందరుస్టూడెంట్స్
కారిడార్ లో .. నిలబడివున్న కొంతమంది అమ్మాయిలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఆ ఆటని.
ప్రసాంత్ ...ఎంతో అధ్బుతంగా ఆడుతున్నాడు.
స్వతహాగా అందగాడు, స్పూరద్రూపి....
అతని కండలు తిరిగిన శరీరంమీద తెల్లని దుస్తులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి తెల్లని నిక్కరు, టీ షర్టు, వైట్ స్పోర్ట్సు ధరించిన అతని శరీరం మీద ఎండ పడుతూంటే, ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు.
చాచిపెట్టి అతను బలంగా ఇచ్చిన కిక్ తో పుట్ బాల్ గాల్లోకి దూసుకుపోయి గోల్ కావటంతో.... ప్రేక్షకుల్లా చుట్టుముట్టివున్న విద్యార్దులంతా చప్పట్లతో అతన్ని అభినందించారు.
రుక్మిణి అనే లావుపాటి అమ్మాయి కూడా ఎంతో ఆనందంతో చప్పట్లు కొడుతోంది!
ఆమె పక్కనే నిలబడి వుంది..మాధురి!
బంగారు రంగులో మెరిసిపోతున్న ఆమె శరీరానికి అతుక్కు పోయినట్లున్న పొడుగాటి బాబ్డ్ హెయిర్!కళ్లకి గుండ్రటి ఫ్రేము నల్ల కళ్లద్దాలు...
ఆమె రుక్మిణి వైపు విచిత్రంగా చూసింది.
"ఎందుకే అంత ఆనందం?" అని అడిగింది.
"ప్రశాంత్ చూడు! ఎలా విజృంభిస్తున్నాడో!"
"షిట్! ఆటలో ఆ మాత్రం స్పడు చూపించకపోతే.. మగాడిగా పుట్టటమే వేస్ట్. అది సర్వ సహజమైన అతి సాధారణమైన దృశ్యం! దానికి... అంత ఆనందంగా కేరింతలు కొడ్తావేమిటి? అదేదో పెద్ద స్టంట్ సీన్ లాగా!" అంది మాధురి తేలిగ్గా.
ఆమెకు కొంతదూరంలో నిలబడివున్న వికాస్, రాజేష్ ఆ మాటలు విన్నారు.
మెల్లిగా రెండడుగులు ముందుకివేసి... ఆమె మాటలు మరింత స్పష్టంగా వినేందుకు చెవులు రిక్కించారు.
"అంతమంది స్టూడెంట్స్ లో అంత డాషింగ్ గా కనిపిస్తున్న మగాడిని చూస్తుంటే, చప్పట్లు కొట్టాలని అనిపించటంలో తప్పేముంది?" అంది రుక్మిణి.
మాధురి చిరునవ్వు నవ్వింది.
ఆ నవ్వులో ఆమెపట్ల ఒక రకమైన హేళన ద్వనించింది.
"చూడు రుక్కూ! మనం స్పందించినా, ఆనందించినా... అవతల వాడికి ఓ స్ట్రేచరూ, స్టేటస్సూ, వుండాలి!అంతేగాని ప్రతి కోన్ కిస్కాగాడిని చూసి... చప్పట్లు కొట్టేస్తే... మన చీప్ టేస్ట్ బైటపడి పోతుంది!" అంది మాధురి.
"నాన్నెన్స్ . ఎవరైనా స్పందించేది. ... స్ట్రేచర్ ని బట్టి కాదు. అసలు స్టేచర్ ని బట్టి వచ్చేది స్పందన కాదు. టాలెంట్ కనిపించినప్పుడు అది మనని కదిలించినప్పుడూ మనకన్నా చిన్నవారైనా అభినందించటం, ఆనందించటం 'ఇగో' లేని మనుషులం టెండెన్సీ!" అంది రుక్మిణి.
