Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 14


    "ఒక స్త్రీ నిద్రాగతురాలై వున్నప్పుడు చాటుగా ఆమె సౌందర్యాన్నిలా కన్నులతో దోచెయ్యడం ఉత్తమ పురుష లక్షణంగా ఉందా? నీ తత్వజ్ఞత ఎక్కడదాక్కొంది. ఈ స్త్రీ సౌందర్యం ముందు? మనసు చేసిన వెటకారానికి తృళ్ళిపడి బలవంతాన చూపులు త్రిప్పుకొన్నాడు.

    'అరె! నా నిగ్రహం ఏమయింది?' నిశ్శబ్దంగా బట్టలు మార్చుకొని స్నానానికి క్రిందికి వెళ్ళాడన్న మాటేగాని ఈ ప్రశ్నే పడగఎత్తి అతడిని కలవర పరుస్తున్నది!

    తామరపత్రం మీదుండే నీటిబిందువు పత్రాన్ని అంటకుండా నిలబడి మౌక్తిక భ్రాంతి గొల్పుతుంది. అన్యపత్రంమీద వ్రీలిపోయే నీటిచుక్కలవలెనే కొందరి నిగ్రహమూ!

    ఇహలోకసుఖాలు అశాశ్వతాలు; ఈ సృష్టిమిధ్య అని తెలుసుకొన్నంత మాత్రాన బ్రహ్మజ్ఞాని అయిపోడు మనిషి. మనిషి విరక్తిపై సృష్టిచైతన్యం తీవ్రంగా దెబ్బ తీస్తూనే ఉంటుంది. తను తానుకై పరిస్థితులను నీటిబిందువులుగా మార్చుకోగలవాడు వాడు ఎంతటి మహాజ్ఞానో? సామాన్యుడై ఉండడు!

    సుఖదుఃఖ నిర్వేద సోపానం అధిరోహించిన బ్రహ్మజ్ఞాని కాదు భార్గవరామ్. మహామహా తపస్సంపన్నులే స్త్రీ సౌందర్యం ముందు దుర్బలులైపోయారు. అతడెంత?

    కాని అతడికి ఈ దుర్బలత చిన్నతనంగా ఉంది. 'ఈ మానవులందరూ క్షణిక సుఖాలకై అర్రులుచాచి పరుగులు పెడుతూంటే, నేను ఆ వ్యామోహానికి దూరంగా ఉన్నాను. సత్యం తెలుసుకొన్నాను' అన్న అహంభావుకత అతడిలో ఏ మూలనో ఉంది! ఆ అహంభావమే సహజంగా ఉండవలసిన మమతనూ, కరుణనూ అంతమొందిస్తున్నదేమో!

    'అమ్మ మీద మమకారం లేదు! నాన్నంటే ప్రేమ లేదు! ప్రపంచమంటే వ్యామోహంలేదు!!' అనుకోవడంలోనే అతడికి సంతృప్తి కనిపించేది!

    ఈ క్షణం ఊహించనిది!

    దీపకళిక వాయుప్రసారం లేక నిశ్చలంగా ఉన్నది. ఇన్నాళ్ళు ఆ నిశ్చలత తన గొప్పగా భావించాడు. గాలి వీచింది ఎక్కడినుండో. జ్యోతి నిశ్చలత బయటపడింది.

    'రెపరెపలాడి ఆ ఆత్మజ్యోతి ఆరిపోతుందా? భగవాన్ అలా జరుగనివ్వకు!' వ్యాకులంగా అనుకొన్నాడు భార్గవరామ్.

    అప్పుడే నిద్రనుండి మేలుకొన్న దేవదాసి ఎద మీద పుస్తకం చేతికి తీసుకొని అక్షరాలమీద చూపు నిలుపబోతూ అడ్డపంచ ఒంటికి చుట్టుకొని తుండుతో తడిజుట్టు తుడుచుకొంటూ గదిలోనికి వస్తూన్న బావనిచూచి తత్తరపాటుతో లేచి కూర్చొంది.

    హేంగర్ కి కొత్తగా పాంటూ, బుష్ కోటూ తగిలించి ఉండడం కనిపించింది.

    'తను నిద్రపోతున్నప్పుడు బావ వచ్చివెళ్ళాడా గదిలోకి? తనే అవస్థలో పడుకొని ఉందో? నిద్రనుండి లేస్తూనే మోకాటివరకూ వచ్చిన చీరను సరిజేసుకోవడం గుర్తొచ్చి. దేవదాసి మేను లజ్జతో జలదరించింది! 'ఛ! ఎప్పుడొచ్చేది తెలియకుండా బావగదిలో పడుకోవడం నాదేతప్పు!' పుస్తకం చాపమీద పడేసి మెరుపులాగే తుర్రుమంది దేవదాసి క్రిందికి.

    మెట్లదగ్గర సుబ్బయ్య ఎదురయ్యాడు "బావగారు భోజనానికి వస్తున్నారా, అమ్మా?"

    "నాకేం తెలుసు?" కొంచెం విసుగ్గా అన్న దేవదాసి 'అరె! బావ ఇంకా భోజనం చేయలేదా? నాలుగవుతుందేమో?' అన్నది నొచ్చుకొంటూ.

    భోజనశాలలో పీటవాల్చి, వెండి చెంబులో నీళ్ళుపోసి తెచ్చి చెంబుమీద వెండిగ్లాస్ పెట్టి. వెండిపళ్ళెం నీళ్ళుపోసి కడిగిసిద్ధంగా పెట్టింది దేవదాసి. బావరావడం గమనించి తలుపు వారగా వెళ్ళి నిల్చుంది. వచ్చి పీటమీద కూర్చున్నాడు. సుబ్బయ్య పళ్ళెంలో అన్నీ వడ్డించాడు.

    భార్గవరామ్ పళ్ళెం చుట్టూ నీళ్ళు చుట్టి అన్నం కలపటానికి ఉపక్రమించాడు.

    సుబ్బయ్య తెచ్చిన నేతిగిన్నెను అందుకొని, భార్గవరామ్ కలుపుకొన్నవాయిలో రెండుసార్లువేసి 'మామయ్యకు ఎలావుంది బావా!' అని అడిగింది దేవదాసి.

    "అక్కడ చేర్చి వారమైనా సరిగ్గా కాలేడు. అప్పుడే అంత చెప్పుకోదగ్గ మార్పేం కనబడుతుంది? నయం కాగలదన్న ఆశమాత్రం ఉంది."

    "అయితే, మామయ్య యధావిధిగా నడవగలడంటావా? ఆనందంగా అడిగింది.

    "నయం కావడమంటే పోయిన చెయ్యీ, కాలూ స్వాధీనంలోకి రావడమేకదా? సన్నగా నవ్వాడు.

    బాబుగారికి నయం కావాలి. బాబూ! చింతల ఆంజనేయస్వామికి జోడుకొబ్బరికాయలిస్తానని మొక్కుకొన్నాను. బాబుగారు మంచాన పడినప్పటినుండి లక్ష్మిదేవిలా కళకళలాడే అమ్మ అలా అయిపోయింది? ఆతల్లి ముఖంచూస్తే గుండెలు కోతపడతాయి!" ఎంతో బాధను వ్యక్తం చేశాడు సుబ్బయ్య. మంచి యజమానికి ప్రాణాలర్పించే సేవకులుండటం ఆశ్చర్యంకాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS