Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 14

    "అది సరేగానీ... మీ కంటిచుట్టూ ఏంటి అలా నల్లగా కమిలిపోయి ఉంది?" ఈసారి కళ్ళలోకి కాకుండా కంటివైపు సూటిగా చూస్తూ అడిగింది ఆ అమ్మాయి.

    కన్నారావు మరొక్కసారి కంగారు పడిపోయాడు.

    "అదా? అదీ... హిహి మావాడు నా కన్ను మీద గుద్దాడు. నిన్న రాత్రి మా యిద్దరికీ ఒక విషయంలో అభిప్రాయభేదాలు వచ్చాయ్. అభిప్రాయ భేదాలు వస్తే వాదించుకుంటారు కదండీ.. అదేంటో... వాడు ఎక్కడబడితే అక్కడ గుద్దుతాడు వెర్రిపీనుగ.. హిహి" అన్నాడు ఇబ్బందిగా.

    "అంతేకదా?... నేనింకా ఏ అమ్మయియా తాలూకు అన్నయ్యో మీ కన్ను మీద గుద్దాడని అనుకున్నాను."

    "అబ్బెబ్బే... ఛీఛీఛీ... అలాంటిదేం కాదండీ... అయినా ఎవరైనా కొడ్తే నేనూరకుంటానా? డొక్క చీరెయ్యనూ? సరేగానీ మీ పేరు చెప్పరా ప్లీజ్"

    "మీరు మరీ ఇంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి చెప్పాలని అనిపిస్తుంది" మెల్లగా అంది.

    "చాలా థాంక్సండీ"

    "కానీ ఒక పందెం. అందులో నెగ్గితే మీకు నా పేరు చెప్తాను."

    "ఏంటండీ అది?" కుతూహలంగా అడిగాడు కన్నారావు.

    "నేను ఒక చిక్కు ప్రశ్న వేస్తాను... దానికి సమాధానం చెప్పగలిగితే మీకు నాపేరు చెప్తాను"

    "అలాగే.. చెప్పండి" ఉత్సాహంగా అడిగాడు.

    "ఒక వ్యక్తి తూర్పు దిక్కు నుండి పడమర దిక్కుకివెళ్ళి అక్కడ నిల్చుని బుర్రగోక్కుని అక్కడ నుండి దక్షిణం దిక్కుకి వెళ్ళి చేతులూ కాళ్ళూ ఆడించి, అక్కడ నుండి ఉత్తరం దిక్కుకి వెళ్ళి జేబులో చెయ్యి పెట్టుకుని రెండు నిమిషాలు నిల్చుని మళ్ళీ తూర్పు దిక్కుకి వెళ్ళి మెడని అటూ ఇటూ ఆడించి చిరునవ్వు నవ్వాడు. ఆ వ్యక్తి ఎందుకు అలాచేశాడు?"

    చెప్పడం ఆపి కన్నారావు కళ్ళలోకి చూసింది ఆమె.

    కన్నారావు తెల్లమొం వేశాడు.

    "మళ్ళీ ఒకసారి చెప్తారా?" మెల్లగా అడిగాడు.

    ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వి మొత్తం మరోసారి రిపీట్ చేసింది.

    కన్నారావుకి ఆ సమస్య ఏంటో కొంచెం కూడా అర్థంకాలేదు. దానికి సమాధానం ఏమిటో అస్సలు పాలుపోలేదు.

    "చెప్పలేరా?" అడిగింది ఆ అమ్మాయి.

    తల అడ్డంగా ఊగించాడు కన్నారావు.

    "పోనీ దాని సమాధానం ఏమిటో మీరు చెప్పండి" నీర్సంగా అన్నాడు.

    "ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారండీ... దానికి ఖచ్చితమైన కారణం ఉండాలా? ఇదే దానికి సమాధానం"

    ఇలా చెప్పి అటువైపు వచ్చిన ఆటోని ఆపి అందులో చటుక్కున ఎక్కి కూర్చుంది ఆమె.

    ఆటో రివ్వున కదిలింది. వెళ్తున్న ఆటోలోంచి ముందుకు వంగి కన్నారావుకి టాటా చెప్పింది ఆ అమ్మాయి.

    కన్నారావు చేయి అప్రయత్నంగా గాల్లోకి లేచి ఆ అమ్మాయికి టాటా  చెప్పింది.

    ఇంటికి వస్తూనే కన్నారావు గట్టిగా కేకవేసి చిట్టబ్బాయ్ ని ఎత్తుకుని గిరగిరా తిప్పి వదిలేశాడు.

    చిట్టబ్బాయ్ నేలమీద కూర్చున్నాడు.

    "అదేంటి అలా నేలమీద కూర్చుండిపోయావ్?' ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు కన్నారావు.

    "అలా గిరగిరా తిప్పితే కళ్ళు తిరగవా వెధవాయ్? అందుకనే నేలమీద కూర్చున్నా... ఇంతకీ ఆ సంతోషానికి కారణం ఏమిటి?" చిరాకుగా చూస్తూ అడిగాడు చిట్టబ్బాయ్.

    "ఆరోజు ఒక అమ్మాయి వెనకాల చేతిరుమాలు వేసి మాట్లాడానే.. ఆ అమ్మాయి బజార్లో కనిపించింది... తనే నన్ను పిలిచి పలకరించింది. నేను ఆ అమ్మాయిని మొదట గుర్తుపట్టలేదు. ఆ అమ్మాయి ఎంతమంది అమ్మాయిల వెనకాల రుమాళ్ళు వేశారు అని అడిగేసరికి గుర్తుకొచ్చింది" హుషారుగా చెప్పసాగాడు కన్నారావు.

    "తరువాతేమైంది?" చిట్టబ్బాయ్ కుతుహలంగా అడిగాడు.

    అటు తరువాత జరిగినదంతా చెప్పాడు కన్నారావు.

    "ఏడ్చినట్టే ఉంది! నీకు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలీదు. ఏ కాలేజీలో చదువుతుందో తెలీదు... కనీసం నీకు తన పేరుకూడా చెప్పకుండా వెళ్ళిపోయింది.. మరి దేనికంత సంతోషం?" మొహం చిట్లిస్తూ అన్నాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు భారంగా నిట్టూర్చాడు.

    "నిజమేరా, కానీ ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే అదో విధమైన ఇదిగా... ఎంతో చెప్పలేని అదిగా ఉందిరా... నాక్కూడా ప్రేమలో పడిపోవాలని ఉందిరా.. ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తే బావుణ్ను"

    "మన కాలనీ ఏరియాలోనే కనిపించిందిగా? మళ్ళీ ఆమె స్నేహితురాల్ని కలవడానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కనిపిస్తుందేమోలే.. నువ్వు అట్టే బాధపడకు."

    కన్నారావుతో ఓదార్పుగా అన్నాడు చిట్టబ్బాయ్.

    "సరేగానీ నువ్విలా నేలమీద చతికిలబడి ఉన్నావేం? లేచి తయారవ్వు.. ఆఫీసుకి టైమౌతుంది"

    "నేను రాలేనురా. ఆ కరాటే అమ్మాయి ఒళ్ళు హూనం చేసింది... ఈవేల్టికి నేను యింట్లో రెస్టుతీసుకుంటా... నువ్వెళ్ళు"

    "అలాగే..."

    కన్నారావు టవల్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళాడు.

                             *                 *                  *

    రాత్రి భోజనం చేసేటప్పుడు చిట్టబ్బాయ్ అన్నాడు. "ఎల్లుండి ఆదివారం మోహన్ గాడి పెళ్ళి వుంది... మనం ఆ విషయమే మర్చిపోయాం"

    "అవునవును... ఆ అవిషయమే మర్చిపోయాం వెళ్ళి ఎక్కడ?" అన్నంలో సాంబార్ కలుపుతూ అడిగాడు కన్నారావు.

    "సంజీవరెడ్డినగర్ కమ్యూనిటీహాల్లో!...థూ" అన్నాడు చిట్టబ్బాయ్.

    "ఏం?... సంజీవరెడ్డినగర్ కమ్యూనిటీ హాలు బాగుండదా?" అడిగాడు కన్నారావు.

    "కాదు... సాంబార్ లో ఉప్పెక్కువైంది!" చెప్పాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు కలిపిన సాంబార్ అన్నం వంక చూశాడు. తరువాత ఆ అన్నాన్ని కంచంలో ఓ పక్కకి తోసేసి మిగిలిన అన్నంలో పెరుగు కలిపాడు.

    "రేపు మనం ఆఫీసు నుండి వచ్చేటప్పుడు ఏదైనా గిఫ్ట్  కొనాలి!!" అన్నాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు పెరుగన్నం జుర్రుతూ అలాగే అన్నట్టు తల ఊపాడు.

    పెళ్ళి మోహన్ ది అయినా ఆ పెళ్ళి తన జీవితంలో అనేక మార్పులు, తనకి అనేకమైన అవస్థలూ, థ్రిల్సూ తెచ్చిపెడుతుందని చిట్టబ్బాయ్ కి ఆ క్షణంలో తెలీదు.

                *                    *                     *

    చిట్టబ్బాయ్, కన్నారావులు ఇల్లు తాళం వేస్కుని కంగారుగా రోడ్డు మీదికి వచ్చారు.

    అప్పుడు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలయింది.  పెళ్ళి ముహూర్తమేమో పన్నెండు ఇరవై నిముషాలకి, అంటే ఇంక ఇరవై నిముషాలు మాత్రమే వుంది ముహూర్తానికి.

    పెళ్ళి మొదటి నుండి చూడకపోయినా కనీసం ముహూర్తం టైమ్ కయినా ఉండకపోతే ఎలా?

    అందుకే వాళ్ళకంత కంగారు.

    అప్పుడే అటుగా ఒక ఆటో వెళ్తుంది.

    "ఏయ్ ఆటో... ఆటో... ఆటో" ఇద్దరూ గోలగోలగా అరిచారు.

    ఆటో ఆగింది.

    చిట్టబ్బాయి, కన్నారావులు పరుగెత్తుకు వెళ్ళి ఆటో ఎక్కి కూర్చున్నారు,

    ఆటో రివ్వుమని ముందుకు దూకింది.

    చిట్టబ్బాయి, కన్నారావులు ఇద్దరూ కంగారుపడిపోయారు.

    "అరెరె... ఏంటిది? ఆటోని ఎక్కడికి తీస్కెళ్తున్నావ్?" గట్టిగా అరుస్తూ అడిగాడు చిట్టబ్బాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS