కోటీశ్వరుల లైఫ్ స్టయిల్ గురించి చాలా విన్నాడు. పుస్తకాల్లో చదివాడు. కాని ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి....కారు పోర్టికోలో ఆగింది. రాజేశ్వరి, రాజారామ్ కారు దిగగానే__విరించి హడావిడిగా వాళ్ళదగ్గరికి వచ్చాడు. అతని వెనుకనే అతని భార్య మహాలక్ష్మి. నల్లని నలుపు, కొద్దిగా లావుగా కూడా ఉంది. పరిచయాలయ్యాక అంతా హాల్లోకి వెళ్లారు. సోఫాల్లో కూర్చున్నారు. చైర్మన్ కోసం రాజారామ్ అటూ ఇటూ చూశాడు. అది గ్రహించినట్లున్నాడు విరించి.
"చైర్మన్ గారు కాసేపట్లో వస్తారు. ఈలోగా మనం ఓ రెండు పెగ్గులు లాగించేద్దామా?" అన్నాడు.
'అలాగే' అన్నట్టు తలూపాడు రాజారామ్.
"డింపుల్ స్కాచ్ తీసుకువస్తాను." అంటూ లేచాడు విరించి. క్షణాల్లో రెండు గ్లాసుల్తో వచ్చి రాజారామ్ పక్కన కూర్చున్నాడు. విరించి అంతకుముందే చాలా పెగ్గులు వేసుకున్నట్టు అన్పించింది రాజారామ్ కి మాట్లాడకుండా తన చేతిలోని గ్లాసులోని ద్రవాన్ని నెమ్మదిగా సిప్ చెయ్యడం ప్రారంభించాడు. అతని కళ్ళు డ్రాయింగ్ రూం ని పరిశీలనగా చూడసాగాయి గది నాలుగు గోడల మీదా విరించి ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో అతనొక్కడే ఉన్నాడు. ఇంకో ఫోటోలో అతనూ, అతని భార్య మహాలక్ష్మి ఉన్నారు. మూడో ఫోటోలో చైర్మన్ గారితో కలిసి, భార్యాభర్తలు. నాలుగోది విరించి చిన్నప్పటి ఫోటో నాలుగింటికీ బంగారం రంగు ఫ్రేములు.
ఏవేవో కబుర్లతో గంట గడిచింది. అంతలో చైర్మన్ రాజభూషణరావు గదిలోకి ప్రవేశించాడు. అతను రాగానే సోఫాల్లో ఉన్న నలుగురు లేచి నిలబడ్డారు.
"హల్లో రాజేశ్వరీ...వచ్చేశావన్నమాట!" అంటూ రాజేశ్వరిని పలకరించాక రాజారామ్ చేతిని అందుకున్నాడు చైర్మన్. "ఏమిటి మాస్టారూ, నువ్వు చాలా హెడ్దేక్ గా తయారయ్యావట. ఆఁ....ముందు భోజనాలు అయ్యాక ఆ విషయం ఆలోచిద్దాం....ఏం?" అంటూ చైర్మన్ రాజారామ్ భుజం మీద చెయ్యి వేశాడు.
అయిదుగురూ డైనింగ్ టేబిలు దగ్గర కూర్చున్నారు. మౌనంగా భోజనాలయ్యాయి. మళ్ళీ డ్రాయింగ్ రూంలోకి వచ్చారు.
"రాజారామ్, నీకు తెలుసో తెలీదో గాని రాజేశ్వరి చిన్నప్ట్నుంచీ నాకు తెలుసు."
"విన్నాను సర్"
"అన్నట్టు నీకో అమ్మాయి ఉందట కదూ?"
"అవునండీ. అమ్మాయి పేరు రమణి"
"ఎంత వయస్సు ఉంటుందేమిటి?"
"ఏడేళ్ళు చినప్పుడే వాళ్ళమ్మ పోయింది."
"సారీ టు హియరిట్, సరే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? నీ పోలికా? వాళ్ళమ్మ పోలికా?" అనడిగాడు చైర్మన్.
"మీరే చెప్పుకోండి!" అంటూ రాజారామ్ తన మనీ పర్స్ లో ఉన్న రమణి ఫోటో తీసి చైర్మన్ కి ఇచ్చాడు.
"బ్యూటిఫుల్ గర్ల్" అని మెచ్చుకుంటూ ఆ ఫోటోని మేనకోడలికి ఇచ్చాడు చైర్మన్.
"అబ్బ...ఎంత లవ్ లీ గా ఉందో! కదండీ? అంటూ ఫోటోని భర్త చేతికి అందించింది.
సంతానం లేని ఆ స్త్రీ ఆనందం అదోలా అన్పించింది రాజారామ్ కి. విరించి తన చేతిలోని ఫోటోని నిర్లిప్తంగా చూస్తున్నాడు.
"రాజారామ్ గారూ, మీ అమ్మాయిని తీసుకొని మా యింటికోసారి రండి. అసలు మనం అంతా కలిసి మన మెటడార్ వాన్ లో సాగర్ కి వెళ్తే..."భర్తవేపు చూసింది మహాలక్ష్మి.
"తప్పకుండా" అంటూ విరించి తన చేతిలోని ఫోటోని రాజారామ్ కి ఇచ్చేశాడు.
"ఓకే నౌ బిజినెస్!" అన్నాడు చైర్మన్.
"మీరు బిజినెస్ మాట్లాడుకోండి. మేం నా గదిలోకి వెళ్ళి సినిమా కబుర్లు చెప్పుకుంటాం" అంటూ మహాలక్ష్మి లేచింది. రాజేశ్వరి ఆమెని అనుసరించింది.
"నాకో అయిడియా వచ్చింది పెదనాన్న గారూ!"
"ఏమిటది?"
"మన మద్రాసు ఎడిషన్ చాలా వీక్ గా ఉంది. అక్కడ న్యూస్ ఎడిటర్ శేఖర్ మాటి మాటికీ తోకాడిస్తున్నాడట. 'సాయంకాలం' నుండి ఏవేవో ఆఫర్లు వస్తున్నాయని చెప్తున్నాట్ట. అక్కడికి మన రాజారామ్ ని పంపిస్తే ప్రాబ్లెం ఉండదు." అని చైర్మన్ మొహంలోకి చూశాడు.
"శేఖర్ని ఇక్కడకు రమ్మను. మన అబ్రహాంని కావాలంటే మద్రాస్ పంపిద్దాం! రాజారామ్ ఇక్కడే హైదరాబాద్ లోనే ఉండాలి. నిజానికి హైదరాబాద్ ఎడిషన్ పరమ వీక్ గా ఉంది. ఇక్కడ రాజారామ్ ఉంటేనే ఇది బాగుపడ్తుంది." దృఢంగా అన్నాడు చైర్మన్.
"కాని....వాళ్ళిద్దరి మధ్యా పర్సనాలిటీ క్లాషెస్ వస్తున్నాయి కదా?" అంటూ నసిగాడు డైరెక్టర్ విరించి.
"ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అసలు నాకిదంతా చాలా గమ్మత్తుగా కనిపిస్తోంది. ఆఫ్టరాల్ ఎవరో అమ్మాయి కనిపించకుండా పోతే ఎడిటర్లిద్దరూ ఆ విషయం మీద ఘర్షణ పడడం విడ్డూరంగా ఉంది. ఎనీ హౌ...మరి కొన్నాళ్ళు ఓపిక పట్టి 'ఆంధ్రా టైమ్స్' లో ఉండలేవా రాజారామ్?" అనడిగాడు చైర్మన్ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
"ఇలాంటిది మళ్ళీ జరగదన్న హామీ ఉంటే నాకేం అభ్యంతరం లేదు." అన్నాడు రాజారామ్.
"అయితే రాజారామ్ సిటీ ఎడిటర్ గా కంటిన్యూ అవుతాడు..." అంటున్న విరించి మాటలకి చైర్మన్ అడ్డుపడ్డాడు.
"అవును ఇంప్రూవ్ కావలసింది ఇక్కడి ఎడిషన్! దానికి రాజారామ్ టేలంట్ చాలా అవసరం!"
విరించి ముఖకవళికలు మారిపోయాయి. తను తీసుకున్న నిర్ణయాని చైర్మన్ తోసిపారేశాడు. కోపంతో అతని వొళ్ళంతా కుతకుతలాడి పోతుందని రాజారామ్ గ్రహించాడు.
"ఓకే లెటజ్ కాలిట్ ఎడే!" అంటూ లేచాడు చైర్మన్.
అంతలో యూనిఫారం లో ఉన ఒక బట్లర్ అక్కడికి వచ్చాడు. "సార్ రాజారామ్ సార్ కి టెలిఫోన్" అన్నాడు. పక్కగదిలో ఉన్న టెలిఫోన్ దగ్గరికి నడిచాడు రాజారామ్. రిసీవర్ అందుకని "హల్లో" అన్నాడు.
"నేను బాబుగారూ, లక్ష్మీకాంతమ్మని మనింటికి పోలీసులు వచ్చారు. మన వీధిలో ఏదో హత్య జరిగిందట, మన రమణిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తామంటున్నారు..." అంటూ గాభంగా వినిపించాయి మాటలు. అంతలో ఫోన్ లో మరో గొంతు.....మగ గొంతు విన్పించింది.
