18 వ. సర్గ
1. మూడుజాముల - రేయి గడువగా
నాల్గవ జాము - నడుచుచుండగా |
మంగళవాద్య మ | నోహర ధ్వనులు
లంకేశ్వరుని - మేలుకొలుపులు |
క్రతువు లోనర్చు ష | గంగ వేదవిదుల
స్వరయుత శబ్ద త | రంగ ఘోషలు |
శోభిల్లు శింశుపా - శాఖలందున
మారుతి కూర్చొని - ఆలకించెను ..... ||శ్రీ||
2. రావణాసురుడు - శాస్త్రోక్తముగ
వేకువనే విధు | లన్ని యొనర్చెను |
మదోత్కటుడై - మదన తాపమున
మరి మరి సీతను - మదిలో నెంచెను |
పలువురు కాంతలు - పరి సేవింపగ
రత్నకాంతులు - దిశలు నిండగ |
దశకంఠుడు దే | దీప్యమానముగ
వెడలెను అశోక - వనము చేరగ .... ||శ్రీ||
3. జలములు నింపిన - భృంగారములతో
కొందరు యువిదలు - ముందు నడవగ |
కాంచన దీప - స్తంభములతో
కొందరు కాంతలు - వెంట నడువగ |
చత్ర చామర - మధు పాత్రలతో
కొందరు రమణులు - తోడ నడువగ |
దశకంఠుడు దే | దీప్యమానముగ
వెడలెను అశోక - వనము చేరగ .... ||శ్రీ||
4. లంకేశునితో - వెడలిరి సతులు
మేఘము వెంట వి | ద్యుల్లతలవలె |
మధువు గ్రోలిన - పద్మముఖుల
ముంగురులు రేగే - భృంగముల వలె |
క్రీడల తేలిన - కామినీమణుల
నిద్రలేమిపడు - అడుగులు తూలె |
దశకంఠుడు దే | దీప్యమానముగ
వెడలెను అశోక - వనము చేరగ .... ||శ్రీ||
5. మందగమనల - అందెల రవళులు
ఒడ్డాణపు చిరు | గజ్జల రవములు |
మెల్ల మెల్లగ - చేరువ కాగ
మారుతి గాంచెను - ఆశ్చర్యముగ |
నూర్గురు భార్యలు - సుర కన్యలవలె
పరి సేవింపగ - దేవేంద్రుని వలె |
దశకంఠుడు దే | దీప్యమానముగ
చేరెను అశోక - వనము వేగముగ .... ||శ్రీ||
6. జీరాడేడు ఉ | త్తరీయమును గని
విలాసముగ కై | దండగా గొని |
ఏతెంచెడు మ | హాబలశాలిని
తపోధనుని వి | శ్రవసు కుమారుని |
మధువు గ్రోలి మ | త్తిల్లిన వాని
రక్తారుణ వి | శాలనేత్రుని |
అంతటి యశో వి | శాలుని కనుగొని
మారుతి దలచె | దశకంఠుడేనని .... ||శ్రీ||
7. రావణుని జూడ - వేడుక కలిగి
క్రింది కొమ్మలకు - మారుతి జరిగెను
లంకేశుని మ | హా తేజము గని
మారుతి గూడ వి | భ్రాంతి జెందెను |
దశకంఠుడు స | మీపించి నిలిచెను
సీతపైననే - చూపులు నిలిపెను |
సుడిగాలి బడిన | కదళీతరువు వలె
కటిక నేలపై - జానకి తూలె | ... ||శ్రీ||
__: 18 వ. స. సంపూర్ణము :__
19 వ. సర్గ
1. దిశలు దహించే - అగ్నియైదోచె
చేజిక్కిన నా | గ కన్యయైదోచె
నలువంకల ర | క్షణకై జూచె
మనమున రాముని - నమ్రత గొలిచె |
తొడలు జేర్చుకొని - కడుపును దాచె
కరములు ముడిచి - చనుగవ గాచె |
సుడిగాలి బడిన | కదళీతరువు వలె
కటిక నేలపై - జానకి తూలె .... ||శ్రీ||
__: 19 వ. స. సంపూర్ణము :__
