Previous Page Next Page 
దేవదాసు పేజి 14

    ఇంత సేపటి తరువాత చంద్రముఖి కొంచెం నవ్వింది. అయితే నవ్వులో ఆనందం లశ మాత్రం కూడా లేదు. ఇష్టంమీద ఇవ్వలేదు. నేను డబ్బు తీసుకుంటున్నాను. ఇందువల్ల కోపగించి ఇచ్చి వెళ్ళాడు. అవును చున్నీబాబూ, అతడేమైనా పిచ్చివాడా?"
    "ఏమీ కాదు. ఈ మధ్య అనేక రోజుల నుంచి అతడి మనస్సు బాగా వుండటం లేదు."
    "మనసు ఎందుకు బాగా వుండలేదో అదేమైనా తెలుసా?"
    "నాకు తెలియదు. బహుశా ఇంటిదగ్గర ఏదో జరిగింది."
    "అటువంటప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు?"
    "నేను తీసుకురాలేదు. అతడే స్వయంగా బలవంత పెట్టి వచ్చాడు."
    చంద్రముఖి ఈసారి యదార్థంగా విస్తుబోయింది. "స్వయంగా బలవంత పెట్టి వచ్చాడా? అంతా తెలిసివుండి!"
    చున్నీలాల్ కొంచెం ఆలోచించి "లేకపోతే యేమిటి? ఆయనకు అన్నీ తెలుసు. నేను మరపించి తీసుకురాలేదు!"
    చంద్రముఖి కొంచెం సేపటి వరకూ మౌనంగా వుంది. మళ్ళీ ఆలోచించుకొన్నదో, తెలియదు. చున్నీ! నాకు ఒక ఉపకారం చేసి పెడతావా?" అన్నది.
    "ఏమిటీ?"
    "నీ మిత్రుడు యెక్కడ వుంటున్నాడు?"
    "నాతోనే!"
    "అయితే ఒకరోజు మళ్ళీ తీసుకొనిరాగలవా?"
    "ఇది నేను చేయలేను. ఇంతకు పూర్వం ఆయన ఇటువంటి చోటుకు ఎక్కడికీ వెళ్ళలేదు. ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి చోటుకు ఎక్కడికీ వెళ్తాడనే ఆశ కూడా లేదు. యెందుకు? ఈ విషయం చెప్పు!"
    చంద్రముఖి ఒక మాలిన్యపు నవ్వు నవ్వి "చున్నీ! ఎలాగయినా సరే, మరోసారి ఆయన్ని తీసికొనిరా" అన్నది.
    చున్నీ చిరునవ్వు నవ్వి, ఆమెకు కన్నుగొట్టి "దబాయించి నందు వలన ఎక్కడైనా ప్రేమ ఉత్పన్నమయిందా యేం?" అన్నాడు.
    చంద్రముఖి కూడా చిరునవ్వు నవ్వి_"చూడలేదు, నోటు యిచ్చి వెళ్ళారు. ఈ మాత్రం కూడా తెలుసుకోలేవా?"
    చున్నీ, చంద్రముఖిని కొంచెం గుర్తెరిగే వున్నాడు. తల వూపుతూ "కాదు-కాదు, నోటు తీసుకునేది వేరే వుంటుంది. నీవు అటువంటి దానివి కావు. నిజం సంగతి యేమిటో చెప్పు?"
    సత్యమైన మాట యేమిటంటే అతడి వైపుకు మనసు లాగుతూ వుంది.
    చున్నీ విశ్వసింపలేదు. నవ్వి ఈ కొద్ది సేపటిలోనా?
    ఈసారి చంద్రముఖి కూడా ఫక్కున నవ్వింది_"ఇది జరగనివ్వు. మనసుకు స్వస్థత చేకూరిన తరువాత మరోసారి తప్పకుండా తీసుకొనిరా! మరోసారి చూస్తాను. తీసుకొస్తావు కదూ?" అన్నది.
    "చెప్పలేను."
    "నా తలమీద ఒట్టు వేసుకో!" అన్నది.
    "సరే, ప్రయత్నిస్తాను."
                                  10
    పార్వతి వచ్చి చూసింది. తన భర్త భవనం ఓ పెద్ద రాజభవనం లాగుంది. కొత్తగా దొరల పద్ధతిలో కట్టినది కాదు. పురాతన పద్ధతిలో కట్టిన కట్టడం. ముఖ్య భవనం, లోపలి భవనం, పూజా మందిరం, నాట్య మందిరం, అతిధి శాల, కచేరీ భవనం, భోజనాలయం, అనేక మంది దాసదాసీజనం-ఇదంతా చూసి పార్వతి అవాక్కయిపోయింది. తన భర్త ధనవంతుడని, జమీందారని మాత్రమే విన్నది. కాని ఇంత గొప్పవాడని అనుకోలేదు. కేవలం మనుషులదే కొరత అంటే కుటుంబంలో ఆత్మీయులైన వాళ్ళు యెవరూ లేరు. ఇంత పెద్ద అంతఃపురం శూన్యంగానే పడి వుంది. పార్వతి నూతనంగా వచ్చిన వధువు. కాని అమాంతంగా గృహిణి అయిపోయింది. హారతిచ్చి, దృష్టి తీసి ఇంటి లోపలికి తీసికొని వెళ్ళడానికి కేవలం వృద్ధురాలైన మేనత్త మాత్రమే వుంది. మిగిలిన వాళ్ళందరూ దాసదాసీ జన బృందమే.
    సాయంకాలానికి కొంచెం ముందుగా ఇరవై సంవత్సరాల వయసులో వున్న అందమైన యువకుడు వచ్చి, నమస్కారం చేసి, పార్వతి యెదుట నిలబడి "అమ్మా, నేను పెద్ద కొడుకును" అన్నాడు.
    పార్వతి ముసుగు లోపలనుంచే చూసింది. ఏమీ అనలేదు. అతడు మరోసారి నమస్కారం చేసి "అమ్మా! నేను నీ పెద్ద కుమారుణ్ని, నమస్కారం చేస్తున్నాను" అన్నాడు.
    పార్వతి దీర్ఘంగా వున్న ముసుగును తొలగించి, మృదువుగా "రా నాయనా, ఇక్కడకు రా!" అన్నది.
    ఆ కుర్రవాడి పేరు మహేంద్రుడు. అతడు కొంచెం సేపటి వరకు అవాక్కయిపోయి పార్వతి ముఖం వైపు చూస్తూ వున్నాడు. తరువాత దగ్గరలో కూర్చుని వినయంగా "మా అమ్మ స్వర్గస్తురాలై ఇప్పటికి రెండు సంవత్సరాలయింది. ఈ రెండు సంవత్సరాల కాలం మేము చాలా దుఃఖంతోనూ, కష్టాలతోనూ గడిపాము. ఈ రోజు నీవు వచ్చావు. ఇప్పుడు మేము సుఖంగా వుండాలని ఆశీర్వదించు!" అన్నాడు.
    పార్వతి చనువుగానూ, సరళంగానూ మాట్లాడుతూ వుంది. ఆమె అకస్మాత్తుగా గృహిణి అయిపోయినందువలన ఎన్నో విషయాలు తెలుసుకోవలసి వుంది. ఎంతోమంది వ్యక్తులతో, ఎన్నోసార్లు మాట్లాడవలసిన అవసరం వస్తుంది అయితే యీ మాట చెప్పడం ఎంతో మందికి కొంచెం అస్వాభావికం అనిపిస్తుంది. కాని పార్వతి స్వభావాన్ని బాగా తెలిసికుని వున్నవాళ్ళు వయసులో వచ్చిన అనేక మార్పులు వయసుకన్న మించి ఆమెను ఎక్కువగా పరిణతి చెందేటట్లు చేశాయని గమనించగలరు. అంతేగాక నిరర్ధకమైన సిగ్గూ, అకారణమైన జడత్వమూ, అనవసరమైన సంకోచమూ ఆమెలో ఏనాడూ లేవు.
    మహేంద్రుడు కొంచెం నవ్వి "నీ పెద్ద కూతురు_నా చెల్లెలు. తన అత్తవారింటి వద్ద వున్నది. నేను ఆమెకు ఉత్తరం వ్రాశాను. కాని  యశోద ఏ కారణం చేతనో రాలేకపోయింది" అన్నాడు.
    "రాలేక పోయిందా లేక రావడం ఇష్టం లేక రాలేదా?" అని పార్వతి బాధపడుతూ అడిగింది.
    "నాకు సరీగా తెలియదమ్మా!" అన్నాడు మహేంద్రుడు సిగ్గుపడుతూ.
    కాని అతడి మాటను బట్టీ, ముఖంలోని భావాన్ని బట్టీ 'యశోద కోపం కారణంగా రాలేదు' అని గ్రహించింది. "మరి మన చిన్న పిల్లవాడూ?" అన్నది.
    "అతడు త్వరలోనే వస్తాడు-కలకత్తాలో వున్నాడు, పరీక్షలు వ్రాసి వస్తాడు" అన్నాడు మహేంద్రుడు.
    చౌధరి మహాశయుడు స్వయంగానే జమీందారీ వ్యవహారాలు చూస్తూ వుంటాడు. ఇంతే గాకుండా ఆయన నిత్యం సాలగ్రామ విగ్రహానికి తన చేతులతో పూజ చేస్తూ వుంటాడు. వ్రతాలు, ఉపవాసాలు, నియమాలు అన్నీ యధోచితంగా పాటిస్తూ వుంటాడు. అతిధిశాలకు, సాధువులకూ, సన్యాసులకూ సేవలు చేస్తూ వుంటాడు. ఉదయం మొదలుకొని రాత్రి పదకొండు గంటలదాకా ఈ పనులన్నిట్లో నిమగ్నమై వుంటాడు. కొత్తగా పెళ్ళి చేసుకున్నందువలన విలాస యాత్రల్లాంటి కొత్త అభిరుచులేమీ ఆయనలో కన్పించలేదు. రాత్రిపూట ఒక్కోరోజు లోపలికి వచ్చేవాడు. ఒక్కోరోజు రాలేకపోయేవాడు. వచ్చిన కూడా చాలా మామూలు సంభాషణ జరిగేది. మంచంమీద బాలీసు వేసుకొని పాడుకొంటూ మహా అయితే కేవలం ఇదిగో చూడూ! నీవే యింటి యజమానురాలివి. అన్నీ జాగ్రత్తగా చూసీ, వినీ, తెలివి తేటలతో, యుక్తి ప్రయుక్తులతో అన్ని పనులూ చూసుకుంటూ వుండు" అని మాత్రం అనేవాడు.
    పార్వతి తలవూపి "సరే, మంచిది!" అనేది.
     "ఇదిగో, చూడూ! ఈ మగ పిల్లలూ, ఆడ పిల్లలూ_ఆఁ -వీళ్ళందరూ నీ వాళ్ళే!" అనేవాడు భువన్ బాబు.
    భర్త సిగ్గు పడటం చూసి పార్వతి కనుకొలికి నుంచి నవ్వు ఉట్టిపడుతుండేది. ఆయన కూడా కొంచెం నవ్వి "ఆఁ ఇదిగో, చూడూ! ఈ మహేంద్రుడు నీ పెద్ద కొడుకు. ఈ మధ్యనే బి.ఏ. పాసయ్యాడు. ఇంత మంచి పిల్లవాడు_
ఇతడిలాగా ప్రేమించే వాళ్ళు. ఆహా ఈ....!" అనేవాడు.
    "ఇతడు నా పెద్ద కొడుకని నాకు తెలుసు" అన్నది పార్వతి నవ్వును ఆపుకొంటూ.
    "ఈ సంగతి నీవు తెలుసు కోవేం? ఇటువంటి కుర్రవాణ్ని మరెక్కడా చూడలేదు. నా కూతురు యశోమతి అమ్మాయిగాదు, ఆపాద మస్తకం ఆ లక్ష్మీదేవి ప్రతిమ. ఆమె తప్పకుండా వస్తుంది. వృద్దుడైన ఈ తండ్రిని చూడటానికి రాదా? ఆమె వచ్చినందువలన...."
    పార్వతి దగ్గరకు వచ్చి ఆ బట్టతల మీద తన కోమలమైన కరకమలాన్ని వుంచి మృదువుగా అంటుంది_"ఈ విషయాన్ని గురించి మీరు చింతించవలసిన పని వుండదు. యశోదను పిలిచుకొని రావడానికి నేను మనిషిని పంపిస్తాను. లేకపోతే మహేంద్రుడే స్వయంగా వెళ్ళి వస్తాడు."
    "వెళ్ళివస్తాడా! వెళ్ళివస్తాడా! సరే మంచిది, చూసి చాలా రోజులయింది. నీవు మనిషిని పంపిస్తావు గదూ?"
    "తప్పకుండా పంపిస్తాను. నా కూతురును నేను పిలిపించనా?"
    వృద్దుడు యీ సమయంలో ఉత్సాహపడి లేచి కూర్చున్నాడు. తమ పరస్పర సంబంధాన్ని కూడా మరచిపోయి పార్వతి తలమీద చేయి వుంచి దీవిస్తూ "నీకు శుభం కలుగుగాక! నీకు సుఖం కలుగుగాక! భగవంతుడు నీకు దీర్ఘాయుస్సు ప్రసాదించుగాక!" అని ఆశీర్వదిస్తాడు.
    దీని తరువాత అకస్మాత్తుగా ఆ వృద్ధుని మనసులో ఏమేమిటో విషయాలు మెదులుతూ వుండేవి. మళ్ళీ మంచంమీద కళ్ళు మూసుకొని తన మనసులో అనుకొంటూ వుండేవాడు. ఆహా! ఆమె నన్ను చాలా ప్రేమిస్తూ వుండేది.
    ఇదే సమయంలో సగం నరసి పులగం లాగా వున్న ఆ మీసాల దగ్గరగా జాలువారుతూ అశ్రుబిందువులు దిండుమీద పడేవి. పార్వతి తుడిచి వేసేది. అప్పుడప్పుడు  ఆయన లోలోపల అనుకొంటూ వుండేవాడు__ఆహా! ఆ జనమంతా వచ్చేస్తే ఒక్కసారి మళ్ళీ ఇళ్ళూ, వాకిళ్ళూ ప్రకాశిస్థాయి-ఆహా! పూర్వం ఎంత కోలాహలంగా వుండేది! అబ్బాయిలూ, అమ్మాయిలూ ఇంట్లో అందరూ వుండేవారు. నిత్యం దుర్గోత్సవం లాంటి ఆనందం వుండేది. తరువాత ఒకనాడు అంతా సమాప్తమైపోయింది. అబ్బాయిలు కలకత్తా వెళ్ళిపోయారు. యశోదను ఆమె మామగారు వచ్చి తీసికొని వెళ్ళారు. మళ్ళీ అంతా అంధకారం, శ్మశానం...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS