"నీ సలహా ను అక్షరాల పాటిస్తానక్కా! కానీ ఒక్క సందేహం. పెళ్లయిన తర్వాత భార్య భర్తల మధ్య నుండే అనురాగ స్రవంతి చీలి పోవడానికి వీలు లేదా? వారిలో అవేశానుమానాలు అనర్ధాల్ని కలిగించలేనా?"
"మంచి ప్రశ్నే చేశావు. భార్య భార్యలన్న తర్వాత సహజంగా వారిలో ఒకరి పై ఒకరికి ప్రేమానురాగాలు గాడంగా పెనవేసు కొనుంటాయి. అందరిలోనూ ఉంటాయా అని అడగద్దు. భార్యను ప్రేమించలేని భర్త, భర్త నారాధించలేని భార్య ఉన్నారంటే వారెలాంటి వారో చెప్పలేము. కొన్ని కారణాల వల్ల పరస్పరం ప్రేమించు కోలేకపోయినా కాలానుగుణంగా వారిద్దరి మధ్యా అనురాగం అల్లుకపోక తప్పదు. ఆ వివాహ బంధాని కున్న శక్తి అటువంటిది. అలా దాన్ని ఉల్లంఘించి తమ జీవిత భాగస్వామిని ప్రేమించలేని వారికి ఈ సమాజంలోనే కాదు, ఈ లోకం లోనే తావుండదు. నువ్వు చెప్పినట్లు వైవాహిక జీవితంలో అనురాగ స్రవంతి చీలిపోవడానికి అవకాశ ముంది. కానీ అది తిరిగి కలుసుకోక తప్పదు. అవేశాను మానాలు వారిలో కలగడం సహజమే. వాటికి అతీతు లైన వారు దేవతలుగా పూజింపబడతారు. కానీ వచ్చిన అనర్ధాలను సరిదిద్దుకు పోగలిగేవారు ధన్యులు.
"కానీ ఆ అనురాగస్రవంతి అంత సులభంగా చీలి పోదన్న విషయం జ్ఞాపక ముంచు కో. ఎందుకంటావా? ఆ వైవాహిక బంధాన్ని సులభంగా త్రెంపి వెయ్యగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. తమంత తామై కోరి విడిపోవడానికి ప్రయత్నించినా చాల కష్టపడవలసి వస్తుంది. ఈ ఆధునిక జీవితంలో అది సులభం చెయ్య బడిందనుకో. అయినా దాని కోసం కోర్టు లేక్కవలసి ఉంటుంది. అయినా విడాకు లిచ్చిన భర్తను గానీ, భార్యను గానీ హర్షించ లేదు లోకం. మొదటి నుండి కలహాలకూ , మనస్పర్ధలకూ అలవాటు పడి తమ జీవితాన్ని నరకం చేసుకునే వారుంతారు. సవరించుకొని తమ సంసారాన్ని చక్కదిద్దుకునే శక్తి వారిలో ఏ ఒక్కరికీ లేనప్పుడు వారి మధ్య అనురాగ స్రవంతి చీలిపోవడమే కాదు ఒకరి పై మరొకరి కి ద్వేషాగ్ని రగులుకొంటూ ఎక్కువవుతుంది. నిగ్రహాన్ని కోల్పోయి కష్టాలను కోరి తెచ్చుకొనే వారిని వివాహ బంధం కూడా అరికట్ట లేదు. కొన్ని రోజుల తర్వాత, తత్పలితం గానే విడిపోవడం జరుగుతుంటుంది. అటువంటి వారికి ఉదాహరణగా నా జీవితాన్ని జ్ఞాపక ముంచుకో లతా" అని ఇందిర తల త్రిప్పేసు కొని అక్కడ నుండి వెళ్ళిపోయింది.
లత అక్కయ్య బాధను గుర్తించింది. తను తప్పు చేశానని తెలిసికోంది. ఇందిర గదిలోకి పోయింది. ఇందిర ఏడుస్తూ కూర్చొని ఉంది.
"అక్కయ్యా, నన్ను క్షమించు. అనవసరంగా నీ మనసుకు కష్టం కలిగించాను."
'అదేం లేదు కానీ ఇలా కూర్చో" అని కళ్ళు తుడుచుకొని లతను తన ప్రక్కనే కూర్చో బెట్టింది నవ్వు తెచ్చుకుంటూ. కానీ లత మామూలు స్థితికి రాలేకపోయింది.
"మరి మీవారిని నాకు పరిచయం చెయ్యవా, లతా!"
"ఫో అక్కా! నీతో అసలు మాట్లాడ కూడదు" అని సిగ్గు పడింది లత.
"పోనీలే. ఎప్పటికైనా ఇక్కడికి వస్తాడుగా? అప్పుడు నేనే పరిచయం చేసుకుంటాను."
"వారి కన్నా ముందు నీకు మరొకరిని పరిచయం చెయ్యాలి."
"ఎవరు వారు?"
"ఆనాడు సినిమాలో చూపించ లేదూ రాజశేఖరమని? అతడి వల్లనే నాకీ అదృష్టం లభించింది."
"అతడంతటి గొప్పవాడా?"
"చూడడానికి ఆకాశమంతటి హృదయం గలవాడు."
"మరి నువ్వర్ధం చేసుకోగలిగావా?"
"అంతటి అదృష్టం మనకు లేదు. ఆకాశాన్నంతటిని మనం ఒక్కసారి చూడలేం గా! ఎన్నో కొండలు అడ్డు పడతాయి. అతన్ని అర్ధం చేసుకోవడానికి ఒక జీవితం కావాలి. అసలతనికి ముఖ్యమైన ఇద్దరు మిత్రులు ఉన్నారు. వారికే చేతకాలేదా పని. ఇకపోతే అతనికి నీడలా ఈ మధ్యన ఒక అమ్మాయి తిరుగుతోంది. పేరు తెలియదు కానీ మెడిసిన్ చదువు తోందని విన్నాను. ముస్లిం ల అమ్మాయి లాగుంది. ఆప్తుల కోసం అన్నీ చేయగల సమర్ధుడు. పరులకు జీవితపు విలువల్ని నేర్పిస్తాడు. అతనంటే నాకు చాలా యిష్టం."
"ఊ" అంది ఇందిర ఏదో ఆలోచిస్తూ.
'అక్కయ్యా, ఈ దినం స్కూలు కెళ్ళలేదేం?"
"ఈ దినం మా స్కూలే డే. సాయంకాలం వెళదాం. సిద్దంగా ఉండు."
"అలాగే."
10
"రజీ, ఇవ్వేళ మన షికారు స్టాప్!"
"కారణం?"
"మా చెల్లాయీ వాళ్ళ స్కూల్ డే ట. నిన్ను కూడా తప్పక తీసుకు రమ్మంది."
"నువ్వే క్కడుంటే నేనూ అక్కడే. ఒక్క నిమిషం. బట్టలు మార్చు కోస్తాను" అని లోపలికి పోయి పది నిమిషాల్లో తిరిగి వచ్చింది.
కవుల కవిత్వానికి అందని అందం, చిత్రాకారుల ఊహకు దొరకని రూపం , సౌందర్యమంటే ఏమిటో చూపడానికి నిలిచిన మూర్తి లా ఉన్న రజియా ను పరీక్షించసాగాడు రాజ్.
సృష్టి లో ఉన్నవి తొమ్మిది రంగులేనా లేక పదవ రంగు కూడా ఉందా అన్న భ్రమ కలిగిస్తుంది ఆమె శరీర చాయ. కేశాలా, మనో పాశాలా అని భయం పుట్టించే లా ఉంటాయి ఆమె శిరోజాలు . ఈ లోకం లో ఎక్కడా లేదు. సుమా ఈ లావణ్యం అని సవాలు చేస్తున్నట్లుంది. ఆమె అందానికి ముచ్చటపడి కన్నులు బదులు చిన్న పద్మాలను కూర్చాడా అనిపిస్తుంది. చిరునవ్వుతో అందేదాన్ని కాదు సుమా అనే మెరుపులా మెరిసి మాయమవుతుంది. ఆమె నొకసారి స్పర్శిస్తే చాలు ధన్యమా జీవితం అనిపించే అందంతో అలరారి పోతుంది.
"ఏమిటి, రాజ్, అలా చూస్తున్నావు?"
"దేవుడు నీకింత అందాన్ని ఎందు కిచ్చాడా అని."
ఆ మాట విని సిగ్గుతో పొంగిపోయింది రజియా. ఒక ప్రక్క సిగ్గు, మరో ప్రక్క ఆనందం ఉత్సాహం మిళితం కాగా పొంగిపోని వారెవరు ఉంటారు? అంతకన్నా ఎక్కువ కోరుకునేదేవరు?
"నువ్వు ఇంత ఆకర్షణీయంగా తయారై వస్తుంటే చూడటం తప్పా?"
"ఇదంతా నీ సొమ్మే అయినప్పుడు నువ్వు చూస్తె తప్పని ఎవరంటారు?"
"నీ మాట మీద నమ్మకం లేదు గానీ మీ నాన్నగారేక్కడ?"
"ఎక్కడికో బయటి కెళ్ళారు . ఎందుకు?"
"ఏమీ లేదు. నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నా అర్హతలు తెలుపుకొంటూ ఓ దరఖాస్తు పడేద్దామని అనుకుంటున్నాను."
ఒక్కసారిగా హృదయంలో వేయి వీణాతంత్రులు ఝుమ్మని మ్రోగాయి. వీనులకు విందోసగే ఆ మాటలు విని పులకరించిందామె శరీరం. ఆ పులకింతతో 'అంత అదృష్టమా రాజ్' అని అతని పై వాలిపోవాలను కుంది. కానీ అది సమయం కాదనుకొని సంభాళించు కొంది.
"నీకెప్పుడూ నన్ను ఏడిపించడం సరదాగా ఉంటుంది లే. పదా" అని అతని చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళింది. ఆమెలో మెదిలిన భావాలను గ్రహించ గలిగాడు. అతను తెలుసు కుంటాడని ఆమెకు తెలుసు. అదే వింత.
అందుకే ప్రేమించిన హృదయాలు పరప్సరం అర్ధం చేసుకొంటాయి అంటారు. వారిలో ఏవిధమైన జ్యోతిష్య శాస్త్రమూ ఉండదు. కేవలం ఎదుటి వారిని ఆరాధించడం వల్లనే వారి మనసులో మెదిలే భావాలను అర్ధం చేసుకోగలరు. దేవుడిని భక్తుడు ఆరాధిస్తాడు. దేవుడి గుణాగుణాలను , దయాత్మక హృదయాన్ని వర్ణిస్తాడు భక్తుడు. ఎలా? దేవుడేమైనా అతనికి కనిపించి అలా చెప్ప మంటాడా? ఏదో వినూతన శక్తి అతని చేత ఆ మాటలు చెప్పిస్తుంది. పరస్పరానురాగం వల్ల ఒకరి భాహీలు, ఒకరి ఉద్దేశ్యాలు మరొకరు సులభంగా అర్ధం చేసుకో గలరు. దాని కంతటి మహత్తర శక్తి ఉంది.
స్నేహానికి గూడా అంతటి శక్తి ఉంది. సాంగత్యం లో అభిమానమూ, ఆప్యాయతా కనిపిస్తాయి. ఆరాధన లో కనిపించేది అనురాగం, స్నేహం లో ఉండేది అభిమానం. అందులోని ఆనందం వేరు; ఇందులోని సంతోషం వేరు. రెండింటి లోనూ ఊహించ రాని గొప్ప శక్తులు ఉన్నాయి. స్నేహంలో నిస్వార్ధం , త్యాగం వాటంతటవే పుట్టుకు వస్తాయి. ప్రేమ వీటితోనే పుట్టుతుంది. అసూయా , అనుమానాలకు నిలయం ప్రేమ. స్నేహం లో అవి లేవని చెప్పలేక పోయినా అంత ఎక్కువగా వీటికి విలువ ఉండవని చెప్పవచ్చు. ఆరాధన లో వీటికి తావే ఉండకూడదు. ఉండవు కూడా.
స్కూల్లో వీళ్ళ కోసం కాచుకొన్న సుగుణ చిరునవ్వుతో ఆహ్వానించి వారిని కూర్చో బెట్టి గ్రీన్ రూమ్ లోకి పోయింది. రాజ్ స్టేజి అలంకరణ చూశాడు. చాలా శ్రద్ధతో అలంకరించారు స్టేజిని. స్టేజి నుండి రంగు రంగుల కాగితాలు చుట్టూ ఉన్న అరటి స్తంభాల కు కట్టారు. రంగుల కాగితాలతో వివిధములైన బొమ్మలు, పరికరాలు తయారుచేసి అక్కడక్కడ వ్రేలాడదీశారు. చాలా ఘనంగానే జరుపుతున్నారే అనుకొన్నాడు రాజ్.
"రాజ్!"
"ఊ?"
"ఆ తెర చూడు, ఎంత బావుందో!"
"బాగున్నది తెరా లేక ఆ తెరపైని ఆర్టా?"
'ఆ ఆర్టు ఉండబట్టే ఆ తెర బావుంది అన్నాను."
వారు చూసిన తెర స్టేజికి వెనుక భాగంలో కట్టి ఉన్నారు. ఆ తేర అంతా పసుపు రంగు పూయబడి ఉంది. అందులో ఏవో కొండలు, ఎన్నో చెట్లు, ఆ కొండల మధ్య నున్న దారి, ఆ దారి వెంబడి ఒక బాటసారి. రకరకాల రంగులతో కన్నుల పండువైన దృశ్యం చిత్రకారుడి కళా కౌశల్యం ఎవరినైనా మైమరపిస్తుంది. అతడి ఊహ అందరి మన్ననకు పాత్రమైంది. ఆ కొండల మధ్యన దారి కనిపించదు. అంత వరకూ వచ్చిన ఆ బాటసారి బిక్క మొగం వేశాడు. ఆ కొండల్లో దారి కానక ప్రయాణించేందుకు మార్గం తెలుసుకోలేక ధైర్యం చాలక దీనంగా చూస్తున్నాడు.
అతని చూపులు ఎవరిని చూస్తున్నాయి? కొండ మీద ఒక ఆకారం పై నిలిచి ఉన్నాయి. ఏమిటో ఆకారం? జంతువా? దెయ్యమా? సన్యాసా? ఏదీ కాదు. అదీ ఒక మానవ రూపమే. చిరునవ్వులు చిందిస్తూ క్రింద నున్న బాటసారికి ధైర్యాన్నిస్తూ కదలి రమ్మని సైగ చేస్తున్నాడు. ఎందుకో అతని కాశ్రమ? తోటి మానవుడనే అభిమానం. ఆత్రుత. అన్నిటికి మించి అతన్ని కూడా తనలాగా కొండ నధిగమించే ధైర్యాన్నివ్వాలనే ఆశ. కొండ చుట్టూ నున్న చెట్లు భయంకర మైనవీ, మ్రోడు పోయినవీ, పచ్చగా నున్నవీ అయి అతనికి భయాన్నీ, నిరాశనే గాక ఆశను కూడా పుట్టిస్తున్నాయి.
"రాజ్!"
"ఏమిటి , రజీ?"
"మీ లత కూడా వచ్చింది చూడు."
రాజ్ లతను, ఇందిరను చూశాడు.
"మా లత అంటున్నావు. ఆమె ఏమైనా నాకు బంధువనుకున్నావా?"
"అంటే మీ మిత్రుడి కి ....' అని ఆగిపోయింది రజియా.
"నా మిత్రుడికి అయినప్పుడు నీకు గూడా వారితో సంబంధం ఉంటుందన్న విషయం మరిచిపోవద్దు."
"తప్పయింది బాబూ! ఒప్పు కొంటున్నాను. ఇంకెప్పుడూ అలా అననులే."
"నీ ఉద్దేశ్యం యిక్కడికి వచ్చేది నువ్వు నేను తప్ప మరెవ్వరూ ఉండరనా?"
"నీతో మాట్లాడలేనని ఒప్పుకున్నానుగా? ఇంకా ఎందు కేడిపిస్తావు?"
నవ్వాడు రాజ్. తల వంచుకోంది రజియా.
చుట్టూ కలయ జూశాడు రాజ్. ఆ స్కూలు కు కాంపౌండు చాలా పెద్దది. అక్కడక్కడ పెద్ద చెట్లున్నాయి. ఒక వైపు తోట ఉంది. చెట్ల నుండి గాలి చల్లగా వీస్తుంది. ఆ గాలి అక్కడికి వచ్చిన అతిధుల రకరకాల సెంట్ల వాసనను అందరికీ అందిస్తుంది. మల్లె పూల గుబాళింపు , సంపెంగ పూల సువాసన అందరినీ మైమరపిస్తున్నాయి. వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులూ, జంటలు కబుర్లు చెప్పు కొంటున్నారు. అన్ని రంగుల దుస్తులూ అక్కడ కనబడుతున్నాయి. భార్యాభర్తలు గుసగుసల్లో మాట్లాడు కొని నవ్వు కుంటున్నారు. పెద్దలు రాజకీయాలు మాట్లాడు కొంటున్నారు. పిల్లలు అక్కడికీ ఇక్కడికీ పరుగెత్తుతూ కేరింతలు కొడుతున్నారు. తెలిసినవారు చిరునవ్వులతో పలుకరించుకొంటున్నారు. కొందరు రోమియో లు కష్టపడి పోజులు పెడుతున్నారు. స్కూలు ఆడపిల్లలు కూర్చున్నచోట చేరి ఏదో వాగుతూ వారి నేడిపిస్తున్నామనుకొని తృప్తి పడుతున్నారు. బ్రహ్మచారులు -- భార్య భర్తల ఆనందాన్నీ, ఒంటరి వారు-- తోడుగా నవ్వుకొంటూ మాట్లాడుతున్న వారినీ, కొన్ని చక్కని జంటలను చూసి మరి కొందరు ఈర్ష్య పడుతుండగా ముచ్చట పడేవారు కూడా కనిపించారు. ఈ జరిగే తతంగమంతా చూసి నవ్వుకొంటున్న మహానుభావులు కొందరూ కనిపించారు.
ఇంతలో ఆ సభాధ్యక్షులు వచ్చారని మైక్ లో వినిపించింది. అప్పుడే లత వచ్చి తన వెనుక వరుసలో కూర్చోవడం రాజ్ గమనించాడు. రజియా, లతను చూసింది. లత, రాజ్ ను పలుకరిద్దామనుకోంది. కాని అంతమంది లో సిగ్గుపడి ఆ పని చేయలేక పోయింది. జడ్జి గారి శ్రీమతి గారి ఆధ్వర్యాన ఉపన్యాసం ముగిసిందని పించగా బహుమతి ప్రదాన కార్యక్రమం మొదలైంది. ఇందిర మైక్ ముందు నిలబడి పేర్లు చదువుతుండగా మరొక టీచరు వారికి రావలసిన బహుమతులను అద్యక్షురాలి చేతి గుండా ఇస్తుంది.
"తెలుగు వక్రుత్వపు పోటీలో మొదటి బహుమతి సుకుమారి అరవ ఫారం"-
అనగానే ఒక లావుపాటి అమ్మాయి స్టేజి ఎక్కలేక ఎక్కుతూ వచ్చింది.
