Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 14

 

                                       10
హైదరాబాద్ , మద్రాసు బెంగుళూరు అన్నీ తిరిగి తిరిగి విసుగు పుట్టింది. లాడ్జి లలో కాపురం. హోటళ్ళ లో భోజనం రాజుకు పడలేదు. చివరకు ఒకరోజు వనజ కూ విసుగు పుట్టి అన్నది "ఏమండీ ఎన్నాళ్ళని ఇలా ఊళ్ళ వెంట తిరుగుతాం. లంబాడీ వాళ్ళకు మల్లె. ఎక్కడన్నా ఓ ఇల్లు చూసుకొని కాస్త స్థిమితంగా ఒక్కచోట ఉండనీయరా ఏమిటి?"
    తెలిసిన వాళ్ళెవరూ కనుపించరనే ఉద్దేశంతో రాయలసీమ లోని ఒక పట్టణం లో ఇల్లోకటి తీసుకొన్నారు. కొత్త కాపురానికి అవసరమైన సరంజామా అంతా చేకూర్చుకొని కాస్త స్థిమితం చిక్కిన రెండు మూడు రోజుల్లోనే పక్కింటి ఆడవాళ్ళతో పరిచయం చేసుకొంది. ఇంటి యజమాని పోలీసు ఇన్స్ పెక్టర్ . పేరు గోవిందరావు. వయస్సు నలభై దాటినా చలాకీగా కుర్రవాడిలా ఉంటాడు. కొంచెం దుడుకు స్వభావమైనా నలుగురితో కలిసి మెలిసి పోతూనే ఉంటాడు. అర్ధం లేని ఆదర్శాలకి లోను గాకుండా అవసరాల కనుగుణంగా జీవితాన్ని నెట్టుకు పోవాలనే సిద్దాంతం కలవాడు. అందుచేత రెండు చేతులా, న్యాయంగా, అన్యాయంగా కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. ఖర్చు కూడా తక్కువేమీ కాదు. దుర్వసనాలకు లోపం లేదు. లక్ష్మీ కటాక్షం పూర్తిగా ఉన్నా ఇంట్లో ఇల్లాలికి ఆరోగ్యం మాత్రం లోతుగా ఉండేది. భార్య రోగిష్టి తెల్లగా పాలిపోయి ఈసురో మంటూ ఉంటుంది. మూడు వందల అరవై రోజులూ మందుల రూపంలో కేవలం డబ్బు తాగుతూ ఉంటుంది.
    ఇల్లాలి ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంట్లో విందులూ, వినోదాలూ కేమీ లోటు లేదు. ఎప్పుడూ పార్టీలు, డిన్నర్లూ జోరుగా సాగుతూ ఉంటాయి. నౌకర్ల నూ చాకర్ల నూ అజమాయిషీ చేస్తూ వితంతువైన ఇన్స్ పెక్టర్ గారి వదిన ఒకావిడ ఉంది. మొదట విధవరాలనే జాలితో చెల్లెలే ఆమెను చేరదీసింది. రానురాను ఆ రోగిష్టి ఇల్లాలికి అక్కగారి కంటే ప్రేమానురాగాలు కాస్తా ఎగిరిపోయాయి. మనసులో ఏవేవో అనుమాన బీజాలు నాటుకోన్నాయి. క్రమేణా అన్ని విషయాల్లోనూ తన స్థానాన్ని వితంతువైన అక్కగారు ఆక్రమించటం అశక్తు రాలై చూస్తూ ఊరుకొంది. ఆరోగ్యం క్షీణించి, అజమాయిషీ చేసే శక్తి లేని తను అంతకన్నా చేయగలిగిందేమీ లేదు.
    వనజ ఆ రోగిష్టి ఇల్లాలి పై కాస్త సానుభూతీ, ప్రస్తుతం యజమాను రాలిన విధవావిడ పట్ల బోలెడు గౌరవ భావమూ పదర్శించి వారిద్దరికీ అప్తురాలై పోయింది. ఇన్స్ పెక్టర్ గారి పాప వనజకు బాగా మాలిమై ఒక్క నిముషం కూడా విడిచి పెట్టి ఉండలేక పోతుంది. ఇక వనజ ఇంట్లో పని కూడా ఇన్స్ పెక్టర్ గారి నౌకర్లె చేసి పెడుతున్నారు.
    "పక్కింటి వాళ్ళను బాగా మచ్చిక చేసుకోన్నావే?' అన్నాడు రాజు ఒకరోజు.
    "ఏముందండి , నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది' సమాధాన మిచ్చింది వనజ.
    ఆడవాళ్ళకు చప్పునే స్నేహం కలిసినా, రాజు కూ ఇన్స్ పెక్టర్ గారికీ పరిచయం కావటం మాత్రం కొంచెం ఆలస్యంగా జరిగింది. కాని అది స్నేహంగా మారటం మాత్రం ఆనతి కాలంలోనే  జరిగిపోయింది. అపరిచితమైన ఆ ప్రదేశం లో అటువంటి వారి అండ దొరకటం అదృష్టమే ననిపించింది రాజుకి. వయసులో ఇద్దరికీ తేడా వున్నా అది వారి స్నేహానికి అడ్డు రాలేదు. సాయంత్రం వేళల్లో ఇద్దరూ కలిసి పోలీస్ క్లబ్బు కెళ్ళేవారు. అక్కడ ఇన్స్ పెక్టర్ గారు తన ఉద్యోగ ధర్మంగా చేసిన సహస కృత్యాలన్నీ బ్రహ్మాండంగా వర్ణించి చెప్తుంటే రాజు ముగ్ధుడై వింటూ ఉండేవాడు. ఇన్స్ పెక్టర్ గారిలో కొంచెం "అగ్రెసివ్ నేచర్' ఉన్నా అతని మొరటు మాటల్లోని నిర్మోహమాటమే రాజును ఎక్కువగా ఆకర్షించింది.
    ఒక్కసారి రాజు ఏదో భావోద్రేకంలో పడి తన చరిత్రనంతా ఏమీ దాచకుండా చెప్పి వేశాడు. ఇన్స్ పెక్టర్ అంతా విన్నాక ఉత్సాహంతో రాజు వీపు తడుతూ "ఫర్వాలేదు నువ్వూ మంచి రసికుడవేనన్న మాట !" అన్నాడు రాజు నవ్వి ఊరుకున్నాడు.
    "మీ ఇద్దరికీ ఉన్న వ్యత్యాసం చూసి అప్పుడే గ్రహించాను. ఎలాగైనా పోలీసు వాణ్ణి కదూ. జీవితంలో ఆనందం అందినంత వరకూ అనుభవించవలసిందే. దానికి తగిన వయసు మీది. కారీ అన్. హావ్ ఎ గుడ్ టైం . కాని కోర్టుల కేక్కకుండా మాత్రం చూసుకో. ఈ కాలం ఆడపిల్లలు మరీ తెలివి మీరిపోతున్నారు. నాలుగు రోజులు ప్రేమా గీమా అనటం. ఐదో రోజు నన్ను మోసం చేశాడని కేసు పెట్టడం. అది జరక్కుండా ఉంటె ఎంత కాలమైనా సైయ్యాటలాడుకోవచ్చు."
    అతని మాటలు రాజు కెంతో బాధ కలిగించాయి. "మీరు నన్ను అపార్ధం చేసుకొంటున్నారు. చట్టరీత్యా మాకు వివాహం కాకపోయినా నైతికంగా ఆమె బాధ్యతంతా నామీదే ఉన్నదని భావిస్తున్నాను. నన్ను నమ్ముకొని తన వాళ్ళందర్నీ వదులుకొని వచ్చిన ఆమె కెన్నడూ మోసం జరగదు."
    ఇన్స్ పెక్టర్ అనుభవ శాలి. తన మాటలు రాజుకు బాధ కలిగించాయని తెలుసుకొని వెంటనే మాట మార్చి వేస్తూ నేననేది అది కాదు, మీరు నన్ను మిస్ అండర్ స్టాండ్ చేసుకొంటున్నారు. కాకపొతే మరీ ఆదర్శాల ప్రవాహంలో పడి కొట్టుకపోకుండా కాస్త ఒడ్డు కూడా చూడమని చెప్తున్నాను. నువ్వు ఆ అమ్మాయిని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. కాని జీవించటానికి ప్రేమ ఒక్కటే చాలదుగా?' అన్నాడు.
    అవి పెద్ద మనుషులు మాట్లాడవలసిన మాటలు కావు. కేవలం నాగరికత అనే బురఖా తగిలించుకొని ఉన్న అతని నిజ స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. అతను ఒక అవకాశ వాదిగా కనిపించాడు రాజుకి. దాంతో అంతకు ముందేర్పడిన కాస్త గౌరవ భావము గాలిలో కలిసిపోయింది.
    సాయంకాలం బజారు నుంచి వస్తుండగా సినిమా హాలు ముందు ఇన్స్ పెక్టర్ కనిపించాడు. సంసారంతో సినిమాకి వచ్చాడల్లె ఉంది. రాజును అతను చూడలేదు. రాజు చూశాడు గాని పలకరించటానికి మనస్కరించక తల వొంచుకొని వచ్చేశాడు. భోజనం చేస్తూ యధాలాపంగా వనజతో ఆ విషయం చెప్పేసరికి, వనజ పకపకా నవ్వుతూ "మీరు భలేవారండీ . అయన గారి భార్య జబ్బుతో మంచాన పడి వుంటే సినిమా కేలా వెళ్తుంది? మీరు చూసినావిడ బహుశా అయన గారి వదినై ఉంటుంది." అన్నది.
    "చచ్చాం పో. పక్కన వాళ్ళ పాప కూడా వుంటే అయన భార్యే అనుకొన్నాను సుమా."
    మీరనుకోవటమే ఏమిటిలే. నాకూ అప్పుడప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది.' అన్నది అదో విధంగా నవ్వుతూ.
    ఆ నవ్వులోని నిగూడర్ధం రాజుకి బోధ పడింది. ఇక వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఏమీ కలుగలేదు. ఆడవాళ్ళ లో కూడా ఇంత కుటిల హృదయా లుంటాయా, నమ్మి చేరదీసిన చేల్లెలికే మోసం తలపెట్టిందే అక్క గారు, ఆమె నెమనుకోవాలి?............ రాజు మనసంతా వ్యధా పూరితమై పోయింది... విశాఖపట్నం వదిలి పెట్టి యింకా నాలుగు నెలలైనా కాలేదు. అప్పుడే ఎన్నో సంవత్సరాలై నట్లుంది. మెడికల్ కాలేజీ -- విద్యార్ధి జీవితం, అప్పల్రాజు, మారుమూల ప్రశాంతమైన స్వగ్రామం తండ్రి మేనకోడలు పద్మ -- ప్రేమమయియైన అక్క -- ఒకరి తర్వాత ఒకరు జ్ఞాపకం రాసాగారు. ఇక్కడి కొత్త జీవితం. కొత్త వ్యక్తులూ, ఈర్ష్యా ద్వేషాలతో నిండిన పరస్పర సంబంధాలు -- అతనికి చిక్కుపడ్డ దారంలా కనుపించాయి. పరధ్యానంగా తల వొంచుకొని భోజనం ముగించాడు.
    ఆ రాత్రి పడకగదిలో వెన్నెల వంటి నీలి వెలుగులోని మెత్తగా మెరిసిపోతూ సున్నితంగా అతని శిరోజాలను సవరిస్తూ వనజ అన్నది. "మీ మనసులో బాధ నాకు తెలుసు. మీకు యింటి మీద బెంగ కలిగింది కదూ? దూరంగా పారిపోయి వచ్చి దాక్కోటానికి మీరు చేసిన తప్పేమీ లేదు. అంతగా చూడాలని వుంటే ఒకసారి వెళ్ళి మీ వాళ్ళందర్నీ చూసి రాకూడదా?"
    రాజు సమాధాన మేమీ ఇవ్వలేదు. వనజే మళ్ళా అన్నది "ఈరోజు మీ మనసులో ఉన్న మరో చింత కూడా గ్రహించాను. సాయంత్రం నుంచీ మీరు మీ పద్మను గురించి ఆలోచిస్తున్నారు కదూ? నిజమే. ఆ అనుబంధాలు  ఒక్కనాటితో తెంపుకోవాలన్న తెగేవి కావు. మీరు నా కోసం ఎంతో త్యాగం చేశారు. నేనే వట్టి స్వార్ధ పరురాలను!"
    ప్రశాంతమైన ఆ రాత్రి వేళ , ఆర్ద్ర స్వరం తో వనజ పలికిన ఆ మృదు వాక్కులు అలమట చెందిన అతని మనస్సు పై అమోఘంగా పని చేశాయి. హృదయం చాలా స్వాంతన చెందింది. జవాబెమీ చెప్పకుండానే నున్నని ఆమె కపోలాల్ని ప్రేమతో నిమురసాగాడు. వనజ కూడా ఊరట చెందిన మనస్సుతో కన్నులు అరమోడ్చి అన్నది "నా కెందుకో ఉదయం నుంచీ ఒక విషయం మాటి మాటికీ గుర్తొస్తుంది. మీరు గమనించారో లేదో గాని మా ఇద్దరి పేర్లూ ఒక్కటే : వనజ అంటే నీటి నుండి పుట్టినది -- పద్మ! చిత్రంగా లేదూ?"
    
                              *    *    *    *
    లిల్లీ డియర్.
    హటాత్తుగా ఊడిపడ్డ నా ఈ ఉత్తరం చూసి ఆశ్చర్యం కలిగింది కదూ? మన వాళ్ళంతా న గురించి కొన్నాళ్ళ పాటు అదేపనిగా చెప్పుకొని, మళ్ళీ ఇప్పటి కంతా మర్చిపోయి ఉంటారు. ఔను మరి నేను లేచిపోయిన విషయం పాతపడి పోయిందాయే! కాని నువ్వు మాత్రం మర్చిపోలేవు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నేనంటే అసహ్యం కలిగితే కలుగవచ్చు గాని నన్ను మర్చిపోవటం మాత్రం జరగదు ఔనా?
    అక్కా, పొగడ్త అనుకొంటావేమో గాని, నిన్ను నా తోబుట్టువుకంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఒకప్పుడు నువ్వు తోబుట్టువులా ఎన్నో సలహాలిచ్చావు, జ్ఞాపక ముందా? అప్పుడు నాకు ప్రపంచ జ్ఞానం తక్కువ. ప్రేమోన్మాదం లో పడి ఉన్నాను. నీ హెచ్చరికలు నేను పాటించ లేదు. కాని అందుకు నేను తగిన శిక్షే అనుభవించానక్కా! ఆ వొక్క అనుభవంతోనే ప్రపంచమంటే ఏమిటో తెలిసి వచ్చింది! ప్రపంచాన్ని తెలుసుకొన్న దానిని మరి ఇప్పుడు చేసిన పనేమిటని అడుగుతావేమో. దానికి నా సమాధానం విని కోపం తెచ్చుకోవు కదూ? ఇప్పుడు నేను చేసిన పని తెలియక చేసింది కాదక్కా. తెలిసే చేశాను అక్కా. పేదరికం ఎంత భరింప రానిదో బహుశా నీకు తెలియకపోవచ్చు. కాని మేమూ , మా నాన్న, మా తాత, వాళ్ళ నాన్న అంతా పేదరికంలో పుట్టి పేదరికం లోనే పెరిగాము. మా అక్కా, నేనూ రెక్కలు రాని వయసులో అనాధలమయ్యాము. నా చిన్నతనం లో -- నాకు బాగా గుర్తు -- ఎవరిదో గొడ్ల చావిట్లో పశువులతో పాటు నివశిస్తూ , ఆ ఇంటి వారు దయా తల్చి పెట్టిన రోజున తిని, మర్చిపోయి పెట్టని రోజున కడుపులో కాళ్ళు పెట్టుకొని పస్తులున్న రోజులున్నాయంటే నమ్ముతావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ పచ్చి నిజాలక్కా! అవన్నీ తలుచుకుంటే ఇప్పటికే గుండె దడదడ లాడి పోతోంది . జీవితంలో అన్ని బాధలనుభవించిన నేను జీవితాని కెదురు నిల్చి పోరాడి, పేదరికం లోంచి బయట పడటానికి ప్రయత్నించటం తప్పంటావా? నేను ఆశావాదిని, ఐనా మానవ ప్రయత్నం లేనిదే జీవితంలో ఏదీ లభ్యం కాదని నా నమ్మకం. ఆ ప్రయత్నం లోనే నేను ఇలా చేయవలసి వచ్చింది. అర్ధం చేసుకోగలవా అక్కా? నేనంటే ఇంకా అసహ్యం కలుగుతూనే ఉందా?
    వారికి నేనంటే పిచ్చి ప్రేమ. పాపం అంత భాగ్యవంతుల బిడ్డడైనా , ఇప్పుడు నా వల్ల ఎన్ని కష్టాలనుభావిస్తున్నారో చూస్తుంటే నాకే హృదయం కరిగిపోతోంది. కాని కష్టాలు కలకాలం ఉండవని పెద్దలంటారు. యెంత కఠినాత్ములైనా కన్నవారు ఒక్కగానొక్క కొడుకుని వదిలేస్తారా అక్కా! ఏనాటి కైనా మమ్మల్ని చేరదీయరా/ అప్పుడు నిరంతరం వారికీ సేవ చేస్తూ ఆ ఇంటి గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తా నక్కా? నిష్కల్మష ప్రేమతో సరళ ప్రవర్తనతో వారి ప్రతిష్ట కు తగినట్లు నడుచుకుంటే నన్ను మాత్రం క్షమించి ఇంటి కోడలుగా స్వీకరించరా? ఇప్పుడు అదే నా జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను. నా ప్రయత్నం ఫలించాలని ప్రతిరోజూ వేయి దేవుళ్ళను పూజిస్తున్నాను. నాకోసం నువ్వూ ఒక్కసారి భగవంతుణ్ణి ప్రార్ధించవూ.
    అక్కయ్య క్షేమంగా ఉన్నదని ఆశిస్తున్నాను. ఎప్పుడయినా నా ప్రసక్తి వస్తే బాగానే వున్నాననీ క్షమార్హురాలుననీ చెప్తావ్ కదూ? ప్రకాశం కాలేజీలో చేరి వుంటాడు నీకు తెలుసుగా. మా ఆశలన్నీ వాడి మీదనేనని? వాడు బాగా చదివి ప్రయోజకుడయితే , మా అక్కయ్య చేసిన త్యాగమూ, నేను చేసే ప్రయత్నమూ అన్నీ సార్ధకమై నట్లే! ఈ కవర్లో రెండు వంద రూపాయల నోటు పెట్టి పంపిస్తున్నాను. మరి నాకు మనియార్డరు చేసేందుకు వీలు లేదు. చేరుతుందో ,చేరదో భగవంతుడి పైన భారం వేసి పంపిస్తున్నాను. నీకు చేరితే ఆ డబ్బు ప్రకాశానికి అవసరమైనప్పుడల్లా కొద్ది కొద్దిగా ఇస్తూ ఉండమని నా ప్రార్ధన. మన్నిస్తావ్ కదూ.
    నా అడ్రస్ వ్రాయనందుకు క్షమించక్కా. మంచిరోజులు వచ్చేవరకూ నీ నుంచి జవాబు ఆశించను. మరి ఉంటాను. సెలవా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS