ఆరతి ఆరోజు చాలా సంబరంగా, హుషారుగా బ్యాగు ఊపుకుంటూ వచ్చింది. అందరు డైనింగ్ టేబిల్ దగ్గర భోజనం కోసం కూర్చున్నప్పుడు ... "హాయ్ గర్ల్స్! అయామ్ వెరీ హ్యాపీ హ్యాపీ" అంది బ్యాగును టేబిల్ మీద పడేసి ఊరిస్తున్నట్టు.
"ఏం తల్లీ! ఏదన్నా యాడ్ లో యాక్ట్ చేసే ఛాన్సు ఇంకోటి వచ్చిందా?" సీమ అంది.
మహిమ కుతూహలంగా చూసింది.
"ఓ యస్! గెస్ ... ఏం పాత్ర..." ఊరించింది.
"ఏముంది ఏ సబ్బో చేత్తో పట్టుకుని ఫోజిస్తూ... 'మాసబ్బునే వాడండి' అని చెప్పడం" మంగళ నవ్వుతూ అంది ఆటపట్టిస్తూ.
"ఏయ్ పో ... చీప్ ఆలోచనలు మీవి. ఈసారి మిలమిల మెరిసిపోయే పెళ్ళికూతురు వేషం. ఖరీదయిన పట్టుచీర, ఒంటినిండా ధగధగలాడే నగలు, అద్భుతమైన మేకప్ తో రిచ్ గా గొప్పింటి పెళ్ళికూతుర్ని చూస్తారు. పెళ్ళికూతురిగా నేను సెలక్ట్ అయ్యాను. పెద్ద చీరాల షోరూమ్ షూటింగ్" అంటూ నడుం మీద చెయ్యిపెట్టి ఫోజిస్తూ అంది.
"ఎంతసేపు? పది సెకన్ల సీనా...? చీరల ప్రకటన అయి ఉంటుంది" స్రవంతి కవ్వించింది.
"ఏయ్ ... రెండు నిమిషాల సీను. పెళ్ళి స్టేజి ... పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వరమాల మార్చుకునే సీను..." గొప్పగా అంది ఆరతి.
'ఏమిటి పెళ్ళి సీనా ...? అబ్బాయి అమ్మాయి వంక, చీరవంక అలా మైమరచి చూస్తాడు... అంతేనా, అదేనా సీను? ఉద్విగ్నంగా అంది మహిమ.
"నువ్వు రాశావా? రియల్లీ...! ఏయ్ థాంక్స్ మహిమా! నాకోసమే రాసినట్టున్నావు. ఇవాళ ఆ యాడ్ కి ఏక్ట్ చెయ్యడానికి అగ్రిమెంటు రాయించుకున్నారు. థాంక్యూ..." మహిమ చేతులు పట్టుకు ఊపింది.
"భలేదానివే. రాయడం నా డ్యూటీ. అది నీకు దొరకడం నీ లక్. థాంక్స్ నాకెందుకు. నీ బాస్ కి చెప్పు. డైరెక్టర్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు?"
"అవన్నీ నాకేం తెలుస్తాయి. నా పాత్ర వరకు నాకు చెప్పారు. మిగతాదంతా పని ఆరంభించినప్పుడు తెలుస్తుంది. ఏయ్ లెటజ్ సెలబ్రేట్...ఐస్క్రీమ్ ఆర్డర్ చేస్తాను" అంది ఆరతి సంబరంగా.
"ఓకే గ్రేట్! రేణూ డిన్నర్ పట్రా ఆకలేస్తోంది" అమ్మాయిలంతా అరిచారు.
"ఇదివరకు ఎన్ని యాడ్స్ లో నటించావు" మహిమ ఆరా తీసింది చపాతీ తింటూ.
"ఎక్కడ ... నేను ఫీల్డ్ లోకి వచ్చే ఏడాదిన్నర అయింది. చిన్న చిన్న ఫోటో యాడ్స్ రెండు మూడు, ఒకటి రెండు చిన్న యాడ్స్ తప్ప, ఇంత రిచ్ ప్రకటన, అదీ రెండు నిమిషాల ప్రకటనలలో ఇదే మొదటిసారి. ఒకసారి ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నాను. రన్నరప్ గా బహుమతి వచ్చింది. ఈ ఛాన్స్ తో నా అదృష్టం తిరిగి సినిమా ఛాన్స్ లు వస్తే... అది నా కల మహిమ" ఎమోషనల్ గా అంది ఆరతి.
"తప్పకుండా నెరవేరుతుంది. అందం, టాలెంట్ ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది" నమ్మబలికింది.
డిన్నర్ తరువాత ఐస్ క్రీమ్ ట్రీట్ అందరూ ఎంజాయ్ చేస్తుండగా ప్రీతి వచ్చింది. "హాయ్ ఎవ్రీబడీ... ఏమిటి ఐస్ క్రీమ్ పార్టీ. వావ్ ... నాది వేరే పెట్టండి. తరువాత తింటా... ఇంతకీ ఈ సెలబ్రేషన్ దేనికి?" అంది కుర్చీలో వాలిపోయి.
"ఆరతికి మంచి యాడ్ ఫిలింలో నటించే ఆఫర్ వచ్చింది" సీమ అంది.
"ఓ, ఐసీ, కంగ్రాట్స్ ఆరతి... ఏ ప్రోడక్ట్..." అంది.
"ఏదో చీరల షోరూమ్, గ్రాండ్ ఓపెనింగ్, పెళ్ళి షాట్... పెళ్ళికూతురి వేషం" అంది ఆరతి.
"కంగ్రాట్స్ వన్స్ ఎగైన్. ఇదిగో ఇలా షూటింగ్ లప్పుడు జాగ్రత్తగా ఉండు. ఆ వినోద్ గాడి కంటబడకు వీలయినంత వరకు. చూశాడంటే, కాస్త ఎర్రగా బుర్రగా ఉంటే పట్టేస్తాడు. వాడి పొగడ్తలకి పడిపోకు. బీ కేర్ ఫుల్" అని చెబుతూ, "ఓకే! మీరంతా తినేశారా! లంచ్ కూడా తినలేదు, ఐదొందలు చేతిలో పెట్టాడు. మన డేస్ బాగులేనప్పుడు... అదే దక్కుడు అని సంతోషించాలి" తనలో తనే అనుకుంటున్నట్లు మాట్లాడుతూ అన్నం తినసాగింది.
ప్రీతి మాటలు, ధోరణి మహిమకి ముందునుంచీ వింతగానే ఉన్నాయి. సీమ కూడా సరిగా చెప్పలేదు. ఇంకోసారి అడగాలి... అనుకుంది. గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు.
"సీమ... ఈ ప్రీతి సంగతి చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. సగం చెప్పి వదిలేశావు ఆరోజు..." అంది మహిమ కుతూహలంగా.
"ఓకే. రేపు ఆదివారం. సెలవు కాబట్టి తొందరగా లేవక్కరలేదు గదా. చెప్పడానికి చాలా ఉంది కథ. కాని ప్రీతి కథ విని ప్రతి ఆడపిల్లా జాగ్రత్తగా ఉండాలని మేమందరం కొత్తగా వచ్చిన అమ్మాయిలకి చెప్తుటాం. తనూ పాపం తన చేతులు కాలినట్టు ఇంకో అమ్మాయి కాల్చుకోకూడదని ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ జాగ్రత్తలు చెప్తుంటుంది. అవునూ... నువ్వు హిందీలో 'పేషన్" అనే సినిమా చూశావా? మన ప్రీతి కథ అలాంటిదే ఇంచుమించు." "చూడలేదే...నాకిన్నాళ్ళు చదువు, ట్రైనింగ్ తో బిజీలైఫ్ అయిపోయి సినిమాలు చూసే తీరికే లేకపోయింది".
తరువాత సీమ చెప్పిన మాటలు, ప్రీతి వాళ్లతో చెప్పిన కథ, ప్రీతి జీవితం ఎలా నాశనం అంటుందో వింటుందో... మహిమకి సినిమా చూస్తున్నట్టే అనిపించింది.
* * * *
