రెండు నిముషాల దాకా రెస్పాన్స్ ఏమీలేదు. అనుచరుడు తల గోక్కున్నాడు.
"మనం నిజంగా డాన్ గారింటికే వచ్చామా లేక ఏ పార్కుకో"... అంటుంటే అనుచరుడికి కోపం వచ్చింది.
"భూగర్భ గృహప్రవేశం జరిగి నేలకూడా అవలేదు. అనవసరంగా నన్ను కన్ ఫ్యూజ్ చేయొద్దు" అని తిట్టాడు.
"పోనీ కాలింగ్ బెల్ ఏదైనా"... అంటుంటే 'ష్' అని అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్లు మొహంలో చిన్న వెలుగు రాగా "ఆఁ... కోడ్ సాంగ్ జ్ఞాపకమొచ్చింది" అని ఆ పాలరాయి మీద గంతులేస్తూ "గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా!" అని పాడుతూ ఎగురుతుండగా మెల్లగా పాలరాయి పక్కకు తప్పుకుంది.
లోపల్నుంచీ ఓ నడివయస్కుడు పైకి వచ్చాడు. అతను పైకిరాగానే అంతవరకూ పొదలచాటున వున్న పాలవాడూ పేపర్ వాడూ వచ్చి పాలరాయి నెమ్మదిగా మూసుకునేలోపలే పాలపేకట్టూ పేపరూ లోపలికి వేసేసి సైకిళ్ళ మీద వెళ్ళిపోయారు.
అతను విశ్వేశ్వరయ్యని, సర్వేశ్వరయ్యని చూసీచూడనట్లు అతని అనుచరుణ్ణి అసింటా కొంచెం దూరంగా తీసుకుపోయాడు.
బావాబామ్మర్దులిద్దరూ డాన్ వంక ఆరాధనగా చూస్తున్నారు.
అతను అండర్ వరల్డ్ నించీ పైకొచ్చినప్పుడు గడ్డం, మీసం వున్నై. అనుచరుడితో మాట్లాడుతూ కోటు జేబులోంచి మాస్క్ తీసి, ఎడం చేత్తో మీసం గడ్డం వున్న మాస్క్ తీసేసి వేరే జేబులో పెట్టుకుని, కొత్త మాస్క్ తగిలించుకున్నాడు. ఇప్పుడతనికి గడ్డమూ మీసమూ లేవు.
అనుచరుడు డాన్ కి ఏదో చెప్తూ వీళ్ళవైపు చూపిస్తూ మాట్లాడుతున్నాడు. డాన్ వీళ్లవైపు చూసి మళ్ళీ మొహానికున్న మాస్క్ తీసి వేరే మాస్ పెట్టుకున్నాడు. అది ఫ్రెంచి గడ్డం మాస్క్. పైన కళ్ళజోడు పెట్టుకున్నాడు.
తరువాత అనుచరుడిని వదిలి పక్కకిపోయి జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు.
అనుచరుడు వీళ్ళ దగ్గరకి బొటనవేలు పైకెత్తి చిన్నగా నవ్వుతూ వస్తూంటే విశ్వేశ్వరయ్య జేబులో సెల్ ఫోన్ మోగింది.
అనుచరుడు సర్వేశ్వరయ్యతో ఏదో మాట్లాడుతున్నాడు.
అబ్బో సేలం సెల్ లో "విశ్వేశ్వరయ్యా! నా గురించి తెలుసుగా! తెలీకపోతే తెలుసుకో. నా పేరు డాన్. ఈ చిత్రసీమ మొత్తం నాదే. నేనే శాసిస్తున్నాను" అన్నాడు.
విశ్వేశ్వరయ్య "సార్! నమస్తే! నా నెంబరు మీరు కనుక్కోవటం నాకు ఫోన్ చెయ్యటం నా అదృష్టం" అన్నాడు.
అబ్బో సేలం "ఎక్కడున్నావు నువ్వు? ఆఫీసులోనా?"
విశ్వేశ్వరయ్య "కాదు సార్ ప్రస్తుతం వేరే డాన్ గారి అండర్ గ్రౌండ్ దగ్గరున్నాను. వీరితో మాట్లాడి సాయంత్రంలోపు తమ దర్శనం చేసుకుంటాను. దయచేసి తమ భూగర్భ ఎడ్రసూ..."
అబ్బో సేలం "నన్ను కాదని వేరే డాన్ దగ్గరికి వెళ్ళావా! ఎంత ధైర్యంరా!" అన్నాడు.
భయంగా విశ్వేశ్వరయ్య "సార్! మీరు నాకు ఫోన్ చేస్తారని వూహించానా సార్!" అన్నాడు.
అబ్బో సేలం "ఓకే! ఓకే! సాయంత్రం నా మనిషిని పంపిస్తాను. అరవై లక్షలు ఇచ్చి పంపించు. లేకపోతే నీ పిక్చరు మొదలవదు."
విశ్వేశ్వరయ్య "అరవై లక్షలా! సార్! అన్యాయం. ఏదో మీబోటి డాన్ ల దగ్గర ఫైనాన్స్ దొరుకుతుందని ఆశపడితే, మీరే నన్ను అరవై లక్షలు కక్కమంటే ఎలా సార్!"
అబ్బో సేలం "అదేం కుదర్దు ఫోన్ పెట్టేయ్. సాయంత్రంలోపు డబ్బు సిద్ధంగా వుంచు. లేదా నువ్వు హైదరాబాద్ లో వుండవు."
విశ్వేశ్వరయ్య "సార్ మీరు మరీ అంత ఆంక్ష పెడితే నా ఇల్లూ, ఆఫీసూ సికిందరాబాద్ కి మార్చేసుకుంటా" అంటుండగానే "షటప్" అని ఫోన్ పెట్టేసి సెల్ జేబులో పెట్టుకుని జేబులోంచి ఇంకో మాస్క్ తీసి పెట్టుకున్నాడు. ఈసారి పావలాకాసంత బొట్టూ, విభూదిరేఖలూ, నుదుటిమీద వున్నాయి.
విశ్వేశ్వరయ్య చెమటలు తుడుచుకుంటూ సెల్ జేబులో పెట్టుకుని బలవంతంగా చిరునవ్వు ముఖం మీద పులుముకున్నాడు.
అబ్బో సేలం దగ్గరకు రాగానే అనుచరుడు పరిచయం చేశాడు. "సార్ ఈయనే మిస్టర్ విశ్వజిత్ రప్పా. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్" అని.
'హలో హౌ ఆర్ యు' అని షేక్ హ్యాండిచ్చాడు అబ్బో సేలం.
అబ్బో సేలం చెయ్యందివ్వగానే కాస్త ధైర్యం వచ్చింది రప్పాకి. ఇప్పుడు ఫోన్ చేసి బెదిరించిన డాన్ గురించి అబ్బో సేలం గారికి చెప్తే ఈయన వాడి తిక్క కుదురుస్తాడు అనుకున్నాడు.
అబ్బో సేలం టైం చూసుకున్నాడు. "త్వరగా చెప్పండి మీ పిక్చర్ కి ఎంత ఫైనాన్స్ కావాలి?" అడిగాడు.
"సార్! కనీసం ఓ కోటి అయినా కావాలి" అన్నాడు.
"నో మిస్టర్ రప్పా. నేను ఈ మధ్యనే ఇక్కడ వ్యాపారంలోకి దిగాను. మీ నెక్ట్స్ పిక్చర్ కి తప్పకుండా వన్ క్రోర్ ఇస్తాను. ఈసారి మాత్రం 60 లక్షలు తీసుకోండి. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్" అని ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అనుచరుడి వైపు తిరిగి "కల్లూ! సాయంత్రం ఇదిగో ఈ నంబరుకి ఫోన్ చేసి ఆఫీసుకి వెళ్ళు. అక్కడ విశ్వేశ్వరయ్య అనే పార్టీ వుంటాడు. వాడి దగ్గర అరవై లక్షలు తీసుకొని, మిస్టర్ రప్పాగారికి ఇవ్వు. రప్పాగారితో అగ్రిమెంట్లు పక్కాగా రాయించుకో" అని చకచకా పాలరాయి దగ్గరికి నడిచాడు.
విశ్వేశ్వరయ్య నిశ్చేష్టుడయి తేరుకుని సార్ సార్ అని అరిచేటప్పటికే అబ్బో సేలం పాలరాయి మీద గెంతుతూ 'నన్ను తిట్టకురో కొట్టకురో మావో ముద్దులమావో' అని పాడుతూ ఎగురుతుంటే పాలరాయి పక్కకి జరిగింది. అబ్బో సేలం లోపలికెళ్ళి పోగానే అనుచరుడు రివాల్వర్ తీసి చూసుకుని 'బాస్ బుల్లెట్లయిపోయాయి. నేనూ వస్తున్నాను" అని పాలరాయి మూసుకునే లోపలే లోపలికి వెళ్లిపోయాడు. పాలరాయి ద్వారం పూర్తిగా మూసుకు పోయింది.
విశ్వేశ్వరయ్య - ఎలియాస్ విశ్వజిత్ రప్పా పాలరాయి మీద గెంతుతూ
'చిలకా ఏతోడు లేక ఎటేపమ్మ ఒంటరినడకా
తెలిసీ అడుగేసినావూ ఎడారంటి డానులవెంటా'
అని పాడుతూ గోలపెడుతుంటే బామ్మర్ది సర్వేశ్వరయ్య ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు.
* * * *
