Previous Page Next Page 
ప్రతీకారం పేజి 14


    "లాయర్ గా ఏదో కేసు గురించి ఆలోచిస్తున్నట్టున్నారు?"
    ఇందిర వెంటనే సమాధానం చెప్పలేకపోయింది.
    "కొంపదీసి మీరే ఏదైనా కేసులో చిక్కుకోవడం లేదు గదా?" అదోలా మ్రోగింది అతని కంఠం.
    "అసాధ్యునిలా వున్నాడు ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టే ఘటం" అనుకుంది ఇందిర.
    "మీరేం చేస్తున్నారు? సంభాషణను మరో మలుపుకు తిప్పే ఉద్దేశంతో అడిగింది.
    రవి ఓ క్షణం ఆలోచింది "మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారనుకోండి..." అని ఆగాడు.
    తన ప్రశ్నకూ, అతని సమాధానానికీ సంబంధం ఏమిటో బోధపడక ఓ క్షణం రవి ముఖంలోకి చూసింది ఇందిర.
    "అనుకోండి ఏమిటి? చూస్తూనే వున్నాగా?" అన్నది.
    "అప్పుడు మీ పర్సు పోతుందనుకోండి. అందులో బంగారు వస్తువులు కూడా ఉన్నాయనుకోండి!"
    "అనుకోవటం ఏమిటి? నిజంగానే నా పర్సు కనిపించడం లేదు. అందులో నగలు కూడా ఉన్నాయ్! అంటే మీరు గజదొంగ అన్నమాట!" అన్నది ఇందిర నవ్వుతూ.
    "అబ్బే లాయరుగారి బుర్ర సరిగా పనిచేయడం లేదు! మరో ఉదాహరణ చెబుతాను. మీరు ఒంటరిగా వుండటం చూసి మిమ్మల్ని రౌడీలు చుట్టుముడతారు మీ శీలాన్ని హరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను."
    "చచ్చాం పొండి!" మీరు తెలుగు సినిమాల్లో హీరో వేషాలు వేస్తుంటారన్నమాట" అన్నది ఇందిర టీజింగ్ గా.
    "ట్యూబ్ లైట్! లాభంలేదు" చప్పరించాడు రవి ఇందిరను ఉడికిస్తూ.
    ఇందిర చిరుకోపంతో చూసింది.
    "మరో ఛాన్స్ ఇస్తున్నాను. ఈసారి గెస్ చేయండి.
    "మీ మీద ఒక యువకుడికి మోజు వుంటుంది. మీరు అతన్ని తిరస్కరిస్తారు. అతను అంతంత మాత్రానికే వదిలే ఘటం కాదు. మిమ్మల్ని బెదిరిస్తూ, మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మీరు భయపడిపోయి రక్షణ కోసం నా దగ్గరకు వచ్చి కంప్లయింటు ఇస్తారు.
    "అర్ధమయింది. మీరొక పోలీసు ఆఫీసరు" అన్నది రవి ముఖంలోకి చూస్తూ.
    "ట్యూబ్ లైటు వెలగడానికి ఇంతసేపు పట్టింది" అన్నాడు రవి ఇందిర కళ్ళలోకి కొంటెగా చూస్తూ.
    రవీ, ఇందిరా జోక్సు కట్ చేసుకుంటూ చిరపరిచితుల్లా కబుర్లలో పడిపోయారు.
    రైలు ఆగింది.
    "ఇక్కడ ఎంతసేపు ఆగుతుందో?" ఇందిర తనకు తానే అనుకుంటున్నట్టు అన్నది.
    "అర్ధగంట ఆగుతుంది. ఏమయినా కావాలా?" అడిగాడు రవి.
    "మీకు అభ్యంతరం లేకపోతే...ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ...కాఫీ..." అంటూ ఆగిపోయింది ఇందిర.
    "ఎంతమాట! మీలాంటి యువతులకు సేవచేసే అదృష్టం అందరికీ లభిస్తుందా? లభించిన అవకాశాన్ని వదులుకునేంత మూర్ఖుడ్ని కాను" అన్నాడు రవి.
    ఇందిర సిగ్గుతో మల్లెమొగ్గలా ముడుచుకుపోయింది.
    ప్లాస్కు తీసుకొని రెస్టారెంటుకేసి నడుస్తున్న రవిని వెనకనుంచి చూస్తూ కూర్చుంది ఇందిర.
    విచిత్రమయిన వ్యక్తిత్వం! కత్తిలా దూసుకుపోయే స్వభావం! ఎంత ఠీవిగా నడుస్తున్నాడో? రూపంలో అద్భుతమైన ఆకర్షణ ఉంది! మాటలో చాతుర్యం...చూపుల్లో చురుకుతనం...ఏమిటో తను అతన్ని గురించి ఇంతగా ఆలోచిస్తోంది. తనెవరు? అతనెవరు? మరికొన్ని గంటల్లో ఎవరి గమ్యస్థానం వారు చేరుకొంటారు? అతని గురించి తను ఎందుకింతగా ఆలోచించాలి. అతను వివాహితుడేమో? ఆ ఆలోచన రాగానే ఇందిరకు మనసులో ఏదో కదిలినట్లనిపించింది.
    కాఫీకీ, పత్రికకూ డబ్బు ఇవ్వబోయింది ఇందిర.
    "ఉంచండి! ఎక్కడకు పోతుంది? వడ్డీతో వసూలు చేసుకుంటాను" అన్నాడు రవి తమాషాగా నవ్వుతూ.
    ఇందిరకు ఏదో ఇబ్బందిగా అనిపించింది. వద్దనుకుంటూనే సిగ్గుపడింది ఇందిర.
    ఇందిర రవి ధైర్యానికి విస్తుపోయింది. ఇంత కొద్ది పరిచయంలో ఇంత ధైర్యంగా, తనలోకి చొచ్చుకుపోతూ మాట్లాడే వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు. తనలా నిబ్బరంగా, నిదానంగా, హుందాగా ఉండే యువతులు దగ్గిర చనువు తీసుకోవడానికి సాధారణంగా ఏ యువకుడైనా జంకుతాడు. హృదయ ద్వారం వరకూ వచ్చి కూడా తలుపు తట్టే ధైర్యం లేక వెళ్ళిపోతాడు. ధైర్యం చేసి తలుపు తట్టిన వ్యక్తి పిలుపుకు తనలాంటి యువతులు సమాధానం ఇవ్వకుండా వుండలేరు. కారణం తమలాంటి వారి జీవితంలో ఇలాంటి యువతులు అరుదుగా తటస్థపడతారు. పిలవకుండా పలికే స్వభావం కాదు తనది. అవతల వ్యక్తి చేయి చాపందే చేయి అందించడానికి తాను సిద్ధపడలేదు. అలాంటి తనను ఇతను తట్టినట్లయ్యింది. కాని ఇంకా పిలవలేదు. ఆ పిలుపుకోసం తను ఎంతకాలమైనా వేచి ఉండగలదు. కాని తనకు తానుగా మాత్రం పలకలేదు పలకదుకూడా.
    "ఏమిటంత ధీర్గంగా ఆలోచిస్తున్నారు? నా గురించేనా?" కొంటెగా నవ్వుతూ అడిగాడు రవి.
    బిత్తరపోయి చూసింది ఇందిర. ఏమిటి ఇతను తనను తెరచిన పుస్తకంలా చదివేస్తున్నాడు? ఈసారి ఇందిరకు నిజంగానే కోపం వచ్చింది. దొంగ దొంగతనం చేస్తూ పట్టుబడితే వచ్చే కోపం వచ్చింది. పట్టుకున్న వాళ్ళపై కాదు. తనమీద తనకే వచ్చే కోపం అది.
    "కోపం వచ్చిందా? క్షమించండి" అన్నాడు రవి లోతుగా ఇందిర కళ్ళలోకి చూస్తూ.
    "మీకు పిల్లలు ఎంతమంది" అడిగింది ఇందిర అనుకోకుండానే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS