Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 14


    ఫాతిమాబీబీ కొండవీటికి పాతిక ముప్పై మైళ్ళ దూరంలో వున్న అమరావతిలో చిన్నతనంలో స్వేచ్చగా, అరమరికలు లేకుండా పెరిగింది. అంతో ఇంతో సంపన్నులైన ముస్లిం కుటుంబంలో పుట్టింది. రోజులు గడిచాయి.
    ఆమె మనసు వికసించే సమయానికి ఆ మనసులో ఒక రూపం చోటుచేసుకుని ఉంది. అది ప్రతి మనిషి జీవితంలోనూ ఎదురయ్యే ఘట్టమే. కాని ఫాతిమా జీవితానికి అదే శాపమైంది. ఆమె మనసులో చోటుచేసుకున్నవాడు ముస్లిం యువకుడు కాదు. సంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన ఒక బ్రాహ్మణ యువకుడు. అయ్యలకూ మియ్యలకూ పొత్తు కుదరదని తండ్రి చెప్పనే చెప్పాడు. ఫాతిమా మనసు మారే స్థితిని దాటిపోయింది.
    ఆ బ్రాహ్మణ యువకుడు బాగా చదువుకున్నవాడే! ఫాతిమా సౌందర్యానికి ముగ్ధుడై ప్రేమించాడు. ఆ లేత మనసుల అనుబంధం కులాలకు మతాలకు అతీతమై తీగలు సాగింది. గ్రామంలో అటు అయ్యల కుటుంబాలవారికీ ఇటు మియ్యల కుటుంబాలవారికీ ఇది పెద్ద తలనొప్పిగా పరిణమించింది. యువ జంటకు ఏమీ పాలుపోలేదు.
    కొన్నాళ్ళు పోయాక అయ్యలు ఆ వివాహానికి అంగీకరించాలంటే ఒక షరతు విధించారు. మియ్యలందరికీ ఆవు మాంసంతో అన్నదానం చెయ్యాలన్నదే షరతు. దాంతో అయ్యలకు ఒళ్ళు మండిపోయింది. వారిద్దరూ కలుసుకోకుండా వుండటానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఫాతిమాకు పిచ్చెత్తిపోయేలా వుంది.
    ముస్లిం కుటుంబాల్లో ఒక విద్యావంతురాలైన యువతితో తన గోడంతా వెళ్ళబోసుకుంది. ఎలాగయినా సాయపడమని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమిలాడుకుంది.
    ఆ విద్యావంతురాలు వారి హృదయాలను అర్థంచేసుకుంది. కులాంతర వివాహమైనా పరస్పరా కృష్టులైన వధూవరులు కాగలరని ఆశించింది. మరికొందరికి నచ్చచెప్పి వారిద్దరూ ఆ వూరు దాటిపోయే ఏర్పాటు చేసింది.
    కృష్ణాతీరం నుండి వారిద్దరూ కొండవీటికి చేరారు. అక్కడ కొన్ని ముస్లిం గ్రామాలున్నాయి. అవి ఫాతిమాకు తెలుసు. వారికి దూరపు బంధువులు కూడా వుండేవాళ్ళు.
    కాని వారి ఆశలేమీ ఫలించలేదు. ప్రేమకోసం కష్టాలపాలైన జంటను ఎవరూ ఆదరించలేదు.
    అవి ఉధృతంగా స్వాతంత్ర్యపోరాటం జరుగుతున్న రోజులు. అప్పటికింకా కొండమీద బంగ్లా కట్టలేదు. అక్కడే చెట్లక్రింద చిన్న గుడిసెలాంటిది నిర్మించుకుని కాపురం పెట్టారు వాళ్ళు. చలంగారు వూహించిన మైదానంలోని జంటవలె జీవించటం ప్రారంభించారు. కాని ఆకలిని ఎవరు జయించగలరు? కొద్దిరోజుల్లోనే జీవికను వెదుక్కోవలసిన అవసరం కలిగింది వారికి. ఆ కీకారణ్యంలో వారు చేయగలిగిన దేమున్నది? ఫాతిమాబీ తన సుకుమారమైన చేతులు కందిపోయేలా కట్టెలు కొట్టసాగింది. బ్రాహ్మణ యువకుడు అడవిపండ్లు సంపాదించి, కట్టెలమోపూ, బడిలో జామ, సీతాఫలం మొదలైన పండ్లూ తీసుకుని గ్రామాలకు దిగి వెళ్ళేవాడు. వెదురు బియ్యమూ, కలువదుంపలూ వగైరాలతో కాలం వెళ్ళదీస్తున్నారు. కాలం చేసే పనులు అనూహ్యం. కష్టపడి జీవికను సాధించుకుంటూ, తీరిక వేళల్లో ప్రకృతిలో తామూ కలిసిపోయి కొండవీటి వొడిలో శిశువులైపోయారు. కొండవీడు తల్లిలా వారిని లాలించినది. నిత్యమూ క్రయ విక్రయాల కోసం గ్రామాల వెంట తిరుగుతున్న బ్రాహ్మణ యువకునిలో ఏదో మార్పు రాసాగింది. అతని ఆలోచనలు ఇప్పుడు ప్రేమకూ, ప్రకృతి సౌందర్యారాధనకే పరిమితమై ఉండిపోవటంలేదు. పరిశుద్ధమైన అతని మనసులో విప్లవ భావాలు చెలరేగటం ఫాతిమా గమనించింది.
    గాంధీగారి నాన్సుడు వ్యవహారం ఆ యువకునికి నచ్చలేదు. భగత్ సింగూ, సీతారామరాజూ అతనికి నచ్చుతున్నారు. వారి ఆశయాలే అతనికి లక్ష్యాలయ్యాయి. అప్పుడప్పుడూ ఫాతిమాకు చెప్పకుండా ఎటో వెళ్ళిపోయేవాడు. కొన్ని రోజులవరకూ వచ్చేవాడు కాదు. తన ప్రియుని ఆలోచనలే తోడుగా ఆమె కాలం వెళ్ళబుచ్చేది. ఏమి తిన్నదో? ఎలా బ్రతికిందో!
    దేశంలో విప్లవ జ్వాలలు పూర్తిగా చెలరేగాయి. ఓ సుప్రభాతాన అడవిలో పండ్లు కోసుకొస్తానని వెళ్ళిపోయిన ఆ బ్రాహ్మణ యువకుని కోసమే యిప్పటికీ ఆమె ప్రాణాలు నిలిచివున్నాయి. ఇప్పటికీ అతడు తిరిగివస్తాడనే ఆమె ఆశ. ఏమైపోయాడో!
    నాకు ఈ కథ విన్న తర్వాత ఆమె పాదాలకు ప్రణమిల్లాలనిపించింది. ఆమె కోసం ఏ తాజమహలూ యెవరూ కట్టించరు. ఆమె ప్రియుడు ఒకవేళ జీవించి ఉంటే కనీసం జ్ఞాపకమైనా పెట్టుకున్నాడో లేదో! కాని, నిష్కళంకమూ, అచంచలమూ, ఆత్మవిశ్వాస పరిపూర్ణమయిన ఆ ప్రేమమూర్తి చేసిన త్యాగానికి ఎవరే మూల్యం చెల్లిస్తే సరిపోతుంది? "యుగముల్ సాగిన యీ విరాళి..." అంటూ నీల విలపిస్తే నీలమేఘ శ్యాముడు సాక్షాత్కరించాడు. కాని యీమె విలాసానికి ప్రతిఫలమేమి ఉన్నది? ఎవరిస్తారు? ఏ చరిత్రకారుడు ఇటువంటి విషయాలను పట్టించుకుని పరిశోధన చేశాడు? ఉళగేమాయం.
    "అవ్వా! మహత్తరమూ, ఆదర్శప్రాయమూ అయిన నీ జీవితం స్త్రీలోకానికి ఆదర్శప్రాయమైనది!" అన్నాను. అవ్వ మెత్తగా నవ్వింది. దశాబ్దాలక్రితం అణగారిపోయిన సిగ్గు దొంతరలు రివ్వున లేచి గువ్వలా ముడుచుకుపోయింది. టూరిస్టులుగా వచ్చేవారు. ఈ యాచకురాలి మీద కురిపించేది ఛీత్కారాల వర్షం మాత్రమే! ఇప్పుడీ ప్రశంసా పూర్వక వాక్యాలు ఆమెకు క్రొత్త.
    "బేటా! అల్లా నీమీద దయా వర్షం కురిపిస్తాడులే!" అన్నది ఉర్దూలో. ఆమె ఆశీర్వచనం అరమరికలు లేకుండా అంతరాన్ని చీల్చుకుని వచ్చినదే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS