ఏ పోలికలకూ ఉపమానాలకూ అందని యీ స్వభావాన్నే grace, charm అని వొదిలేస్తారు కవులు. కాని వీటి అన్నిటికన్నా ఆత్మ గొప్పగా నేత్రాల్లో ప్రకాశించడం చూశాను. ఆ ప్రకాశం చాలామందికి సామాన్యమిత్రుల మనస్సులకు అందలేక పోవడంకూడా చూశాను. ఈ mystio factor వల్ల సాధారణ స్వరూపాలు అతి ఆకర్షకంగా మారినప్పుడు అనశ్వరమైన ఆత్మలో విశ్వాసం కలుగుతుంది. తన సహజ స్వభావంవల్ల పూర్వ సంస్కారాన్నిబట్టి ఆత్మ తనచుట్టూ కల్పించుకున్న గూడుకాదుగదా యీ దేహం అనుకుంటాను.
నిన్న ర-గారి కూతురు వొచ్చింది. ఆమె యెవరో నాకు తెలీక తెరవెనకనించి కంఠంవరకు కనపడే ఆమె శరీరాన్ని చూసి ఏ రసికుడైన చిత్రకారుది స్వప్నమా యిది అని ఆనందపడుతున్నాను. ఆమె నా "పాపం" కోసం కబురంపింది. ఆ మాట సరిగా వినకపోవడంవల్ల కలిగిన అసందర్భానికి ఆమెను నవ్వించి పుస్తకం యిస్తోదగ్గిరగా నుంచుని - నాయెత్తున యెదురుగా వున్న ఆమె ముఖంకేసి చూశాను. చాలా చక్కని well chiselled face లో, తీర్చిన కళ్ళలో ఆత్మలేదు. కళ్ళలో తెలివి, పెదవుల్లో పెంకితనం, గడ్డంలో గర్వం, అన్నీ coquettishness తో కలిసి చాలా ఆకర్షకంగా వున్నాయి; challenge చేస్తున్నాయి. కాని ఆత్మలేదు. ఏమిటా ఆత్మ అని ఆమె ప్రియులెవరైనా నన్ను ధిక్కరిస్తే అర్ధం చెప్పడం నాతరం కాదు.
కాని నా చి- కళ్ళు కిందికి వాల్చి
"ఇంతే, కలలు కందాం జీవితమంతా" అంటే___
ఆ ఆజ్ఞ చొప్పున చేతులు కిందికి వాల్చి జీవితమంతా కలలు కంటున్నాను.
ప్రబంధాల్లో గాని, పురాణాల్లోగాని, సౌందర్యాన్ని వర్నించేప్పుడు, చాపలూ, చాటలూ, పువ్వులూ, కాడలూ, తిన్నెలూ, పుట్టలూ వుపమానాలుగా తీసుకొచ్చి పెట్టారుగాని ఒక్కచోటా ఈ ఆత్మ తేజస్సు సంగతి యెత్తుకోలేదు, ఎక్కడో ఒకచోట కాని. మైకేల్ ఆర్లెస్ గాని, గాల్ స్వర్దీ గాని ఏ వర్ణనా లేకుండానే తమ కథానాయికలచేత మనసంతా కలవరపరిచి వారం రోజులు ఆ చింతవదలలేనంత సన్నిహితంగా ఆకర్షనీయంగా చేస్తారు. పైగా పూర్వ కవుల్నీ, పతివ్రతల్ని తలుచుకుని పొంగిపోతారు యీ దేశస్తులు, ఆ పిండిబొమ్మల్ని ఆత్మలేని మట్టిసుద్దల్ని చూసుకుని. ఇతరుల్ని మెటీరియలిస్టులూ, దేహలంపటులూ అని తిడతారు.
Dead beauty ని అనుభవిస్తున్నారు. ఆత్మల్ని నాశనంచేసి స్వేచ్చకాళ్ళు విరగగొట్టి కళేబరాల్ని కావిలించుకుని సుఖపడుతున్నా రీనాటి ప్రజలు. సౌందర్యానికి అంధులు కావటంకన్న సౌందర్యం మామూలైపోవడంకన్న మృత్యువు వేరేలేదు.
సౌందర్యభావం ప్రజలలో వచ్చింది. చూసే సౌందర్యాన్ని ఎట్లా వుపయోగించుకుందామా అనే ధ్యాస ఎక్కువయింది. పక్క మీదికి, గదుల్లోకీ, గోడల మీదికీ లాగి, బంధించి, ఎంగిలిచేసి, అవతలపారేసి, అనుభవించామని గొప్ప చెప్పుకోడంలో తృప్తిపడుతున్నారు.
సౌందర్యంమీది భక్తి వుంటుందనికూడా మరిచిపోయినారు, గొప్పకవులూ, కళారాధకులూ సౌందర్యాలన్నిట్లోకీ సుందరమైనది సుందరమైనజీవితం, డానికి మాత్రం సుందరమైన ఆత్మ. అధికారుల ముందు ఉపకారాలకి ఆశించి డోళ్ళుకొట్టేకవులూ, సినిమా డైరెక్టర్ల కాళ్ళుపట్టే చిత్రకారులూ, వీళ్ళేయువకులకి ఆదర్శప్రాయులు. సౌందర్యం శృంగారం ఏమివ్రాసినా, బూతు, వ్యభిచారంగా పరిణమిస్తున్నాయి యీ క్షుద్ర విమర్శకులకి. ఎంగిలి ఏడుపులు లేకుండా మానసిన masterbations తోటి కాకుండా సాంఘిక కృత్రిమ ఏర్పాటులకి లొంగక, సృష్టిలోమల్లే ఆరోగ్యంగా, ఆనందంగా, అనుభవించడం, తుచ్చమూ, క్షుద్రమూ, పశుత్వమూ అయింది. పవిత్రంగా ఆద్యాత్మికంగా, పరిణయంగా, అగ్నిసాక్షిగా, స్త్రీతో ఏం సంబంధం పెట్టుకుంటావు? విమర్శకుడా! చేతులూ, పెదిమలూ, తొడలూ పనిచెయ్యకుండా, ఎట్లా మోహిస్తావు, ప్రేమిస్తావు స్త్రీని, అదేదో ఆ రహస్యం కొంచెం చెపుదూ? నీరసంగా, ఏడుస్తో, తిడుతూ, కళ్ళు మూసుకుని, పాపకార్యం సాగిస్తున్నావా, మహామునీ! అనుభవించి పోతున్నారనా, ఆ ఆగ్రహం!
నీకూ, నీ సోదరులకూ, లేకపోతేనేం, కొందరి పాపులకన్నా మిగిలాయి రక్తమూ, మాంసమూ, రసికత్వమూ, శృంగారవాంఛా! యీ దరిద్రపు దేశంలో యీ కలియుగంలో!
చెరువునిండా యిట్లా తామరపువ్వులు వికసించి నవ్వుతో వుంటే తెల్లనికొంగలూ, నీటిబాతులూ, ఆకులమీద వూగుతో వుంటే, ఎర్రని మబ్బులు నీటిమీద బుక్కాలు చల్లుతోవుంటే, తలలు వొంచుకొని నీళ్ళు తీసుకుపొయ్యేవాళ్ళూ, ఎద్దుల్ని తోలుకుంటో పొలాలకి పొయ్యేవాళ్ళూ, 'చెరువుకి' వీపుతిప్పి కునికిపాట్లు పడేవాళ్ళూ! ఇదీ హిందూ దేశపు పల్లెటూరి జీవనము! ఇదే వీరి ఆధ్యాత్మిక సంపద!
ఎండాకాలంలో సాయంత్రం దక్షిణవాయువు స్పృశిస్తే "అమ్మా హాయిగా వుందంటారు."
"దక్షిణ మారుతంలోంచి యీ ప్రపంచప్రియుడు నన్నుతాకి ఆనందిస్తున్నాడం"టాడు ఏ ఒక్క టాగూరో.
------
