ఒక 'పేద్ద' పెద్దపులి గాండ్రిస్తూ పరిగెత్తుకు వస్తోంది.
దాన్ని చూసి జనం అంతా కకావికలై పారిపోతున్నారు.
స్కైలాబ్ పక్కన కూర్చుని వున్న సోల్జరు తన గన్ ని పెద్ద పులివైపు గురిపెట్టాడు.
అంతలోనే పక్కన ఉన్నవాడెవడో ఎగ్జయిటెడ్ గా అన్నాడు.
"ఓరి దీన్తల్లి ముండమొయ్యా! ఇది సర్వాధికారి గారి పెంపుడు పులిరా! దీని కుడి చెవి కత్తిరించినట్లు వుంటుంది. దీన్ని నేను ఇదివరకు చూశా!"
ఆ మాటలు చెవిన పడగానే సోల్జరు భయంతో నీలుక్కుపోయాడు. పెద్దపులి అంటే భయం -
సర్వాధికారి అంటే అంతకు మించిన భయం!
తక్షణం అతను పులిని చంపే ప్రయత్నం విరమించి, ఉడుములాగా ఒడుపుగా బస్ షెల్టర్ మీదకి ఎగబాకి, అక్కడ కోతిలా కూర్చుని, తన వాకీ టాకీలో హెడ్ క్వార్టర్సుకి మెసేజ్ పంపాడు.
"సర్! ఇక్కడికి ఫీల్డ్ మార్షల్ సారి గారి పెద్దపులి పారిపోయి వచ్చింది. షూట్ చెయ్యమంటారా?"
"దాన్ని నువ్వు షూట్ చేస్తే నేను నిన్ను షూట్ చేస్తా! ఈలోగా బిగ్ బాస్ నన్నే షూట్ చేసెయ్యకుండా వుంటే! అర్రే బేవకూఫ్ - అది ఫీల్డు మార్షల్ గారి ప్రాణంరా! జాగ్రత్త!"
"మరి నేను ఏం చెయ్యాలి సార్...పులి ఇటే వస్తోంది" అన్నాడు సోల్జరు కంగారుగా.
"నేను బిగ్ బాస్ ని కాంటాక్ట్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాను. ఆర్డర్స్ కోసం వెయిట్ చెయ్!"
"సర్...ఈ లోపల పెద్దపులి..."
అవతల డిస్ కనెక్ట్ అయిపోయింది.
పెద్దపులి ఫుట్ బాల్ ఫీల్డులో ఆటగాడు బాల్ వెంబడి పరిగెత్తినట్లు మనుషుల వెంబడి పరిగెడుతోంది. అయితే ఎవర్నీ ఏమీ చెయ్యడం లేదు. మనుషులని చంపే కర్కోటకుడి దగ్గర పెరిగినా కూడా, దానికింకా మనుషులని చంపడం అలవాటు కాలేదు.
ఐదు నిముషాల తర్వాత మళ్ళీ హెడ్ క్వార్టర్స్ ని కాంటాక్ట్ చేశాడు సోల్జరు.
"సర్! ఇక్కడ పులి ప్రాణాలతో కబడ్డీ ఆడేస్తోంది"
"సోల్జర్! వెయిట్ ఫర్ యువర్ ఆర్డర్స్"
"ఆర్డర్స్ ప్రాణాలు పోకముందు వస్తే బాగుంటుంది సర్!" అన్నాడు సోల్జరు కీచుగొంతుతో.
"బిగ్ బాస్ ఎక్కడ వున్నారో తెలీటం లేదు...ఆయన చెప్పకుండా ఏమీ చెయ్యడానికి వీల్లేదు. సోల్జర్...వెయిట్ ఫర్ యువర్ ఆర్డర్స్!"
అప్పుడు
పులి హఠాత్తుగా వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి, పెద్ద జంప్ చేసి సరిగా ఆ బస్ షెల్టర్ మీదికే దూకింది!
* * * *
అంతకు కొద్ది నిమిషాల ముందు -
టార్చర్ ఛాంబర్ లో
"నువ్వు తప్పించుకుపోవడానికి ఏమిటా ఐడియా?" అంది ప్రగతి.
"జస్ట్ సీ!" అని ఒడుపుగా పులిబోను తలుపు తెరిచాడు సాహస్. లోపల మగతగా కదుల్తోంది పులి. అప్పుడే దానికి మెలకువ వస్తోంది. లోపలే వున్న అంకుష్ ని బయటకు రమ్మని సైగ చేశాడు సాహస్. మెల్లిగా బయటికి వచ్చేశాడు అంకుష్. అంకుష్, సాహస్, ప్రగతీ బోనుకి వెనకగా నిల్చున్నారు. రివాల్వర్ తీసి, కప్పువైపు కాల్చాడు సాహస్. ఆ శబ్దానికి మగతలో నుంచి ఒక్కసారిగా బయటపడింది పులి. అదిరిపడి లేచి, బొంలో నుంచి బయటకు పరిగెత్తింది.
మరుక్షణంలో తెరిచి వున్న గుమ్మంలో నుంచి అదృశ్యం అయింది.
వెంటనే -
మనుషుల హాహాకారాలు వినబడ్డాయి!
మెరుస్తున్న కళ్ళతో సాహస్ వైపు చూసింది ప్రగతి.
"వెరీ స్మార్ట్! పారిపోండి! కానీ కాంటాక్ట్ లో వుండండి. ఆల్ ద బెస్ట్!" అంది త్వరత్వరగా.
అంకుష్ చెయ్యి పట్టుకుని, బయటికి పరిగెత్తాడు సాహస్.
బయటంతా ఎవరి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో వాళ్ళున్నారు. ఆ సందట్లో సాహస్, అంకుష్ తప్పించుకోవడం ఎవరూ గమనించలేదు.
మళ్ళీ రెండు నిముషాల తర్వాత ప్రగతి టార్చర్ ఛాంబర్ లో నుంచి బయటకి వచ్చి కేకలు వేసేదాకా!
"బుద్ధుందా లేదా? వాళ్ళిద్దరూ పారిపోతుంటే చూస్తూ వుంటారేం! పట్టుకోండి!" అంది, తను కూడా పరిగెడుతూ.
అప్పటికే వాళ్ళిద్దరూ జనంలో కలిసిపోయి వుంటారని ప్రగతికి తెలుసు.
బయటే నిలబడి వున్న ఒక మిలిటరీ జీపులో ఎక్కింది ప్రగతి. జీప్ కి ఉన్న సైరన్ దెయ్యప్పిల్లలా ఏడవడం మొదలెట్టింది. జీపు స్పీడందుకుంది. రివాల్వర్ చేతిలో రెడీగా పట్టుకుని అటూ ఇటూ చూస్తోంది ప్రగతి.
