Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 14

అతని పక్కన కూచుని వున్న మరో వ్యక్తి ఇంకెవరితోనో అన్నాడు.
"మిలిటరీ అంటేనే డిసిప్లిన్! మిలిటరీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇకనుంచి బస్సులు సక్రమంగా నడుస్తాయనుకుంటాను."
ఇంకెవరో వ్యక్తి సమాధానం చెప్పేలోపలే, ఈ వికృతంగా కనబడుతున్న వ్యక్తి అందుకున్నాడు. అతను మాట్లాడే పద్ధతి ఎవర్నీ ఉద్దేశించి చెబుతున్నట్లుగా లేదు. స్వగతం లాగా వుంది. నాన్ స్టాప్ గా చెప్పడం మొదలెట్టాడు. అతని గొంతు మాడ్యులేషన్, హెచ్చుతగ్గులూ, భావప్రకటనా లేకుండా మెకానికల్ గా, మొనాటనస్ గా వుంది. అలాంటి వాయిస్ కాసేపు వింటే, మనకి బోర్ డమ్ తో నిద్ర వచ్చేస్తుంది.
"ఏమిటీ? మిలిటరీ ప్రభుత్వంలో బస్సులు సరిగ్గా నడుస్తాయా? చూడబోతే ఈ జనం మిలిటరీ ప్రభుత్వం వచ్చినందుకు చాలా హ్యాపీగానే వున్నట్లు కనబడుతున్నారు.
ఇక్కడొక సైకలాజికల్ ఫ్యాక్టర్ వుంది. ఈ భూమ్మీద ఏ ప్రభుత్వమైనా, ఏ కాలంలోనయినా కూడా ప్రజలకు కావలసినవి అన్నీ చెయ్యలేదు. ఒక ప్రభుత్వం కొన్నాళ్ళు పవర్ లో వున్న తర్వాత ఎలెక్షన్ల నాటికి వైముఖ్యం బలపడి, నెగిటివ్ ఓటుగా మారుతుంది. ఇంకో పార్టీ పెద్దగా ఊడబొడుస్తుందన్న నమ్మకం వున్నా లేకపోయినా కూడా, 'ఈ పార్టీని శిక్షించాలి' అన్న నెగిటివ్ ఫీలింగుతో ఓటు వేస్తారు. సానుభూతి పవనాలూ, ఆకర్షణ పవనాలూ కొన్ని ఎన్నికల్లో తమ ప్రభావం చూపినా కూడా, తరచుగా ప్రభావం చూపించేది మాత్రం నెగిటివ్ ఓటే!
ఇక్కడ ఇంకో విశేషం కూడా వుంది. అదే 'నెగ్లెక్టెడ్ చైల్డ్' సైకాలజీ! ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు వుండవచ్చును. వాళ్ళలో తండ్రికి ఒక బిడ్డ అంటే ముద్దు కావచ్చును. తల్లికి ఇంకో బిడ్డ ముద్దు కావచ్చును. ఒక్కోచోట ఇద్దరూ పెద్దగా లెఖ్ఖచెయ్యని 'నెగ్లెక్టెడ్ చైల్డ్'- అంటే నిర్లక్ష్యం చెయ్యబడ్డ బిడ్డ వుండవచ్చును. ఫేవరేట్ చైల్డూ, నెగ్లెక్టెడ్ చైల్డూ ఒకే కుటుంబంలో వున్నప్పుడు, ఫేవరేట్ చైల్డ్ కి జరుగుతున్న ముద్దు ముచ్చట్లు చేయబడుతున్న గారాబం, తన నిస్సహాయ స్థితీ, నెగ్లెక్టెడ్ చైల్డ్ మనసులో నెగిటివ్ ఫీలింగు డెవలప్ అయేటట్లు చేస్తాయి. ప్రభుత్వం అంటే నిజానికి ప్రజలకి తల్లీ, తండ్రీ తనే అయినట్లు వుండాలి. కానీ ప్రభుత్వాలు సర్వ సాధారణంగా, సవతి తల్లుల్లాగానో, గయ్యాళి అత్తగార్లలాగానో వుంటాయి. అయితే ప్రభుత్వానికి ముద్దు బిడ్డలలాంటి వాళ్ళు కూడా కొందరుంటారు. నాయకుడి కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, ఆశ్రితులు, సపోర్టర్లు, కాంట్రాక్టర్లు, రౌడీలు, పార్టీ మెంబర్లు...వీళ్ళకి రాజోపచారాలు జరుగుతుండగా, సాధారణ ప్రజల గతి మాత్రం సవతి బిడ్డల గతే... సాధారణ ప్రజలందరూ నెగ్లెక్టెడ్ చిల్డ్రనే... అందుకనే ప్రజలలో ప్రభుత్వాల పట్ల నెగెటివ్ ఫీలింగు వుంటుంది. ప్రభుత్వం మారితే తమ తలరాత కూడా మారుతుందేమోనని నిస్పృహతో కూడిన ఆశ వుంటుంది.
కానీ -    
ఇప్పుడీ సర్వాధికారికి కూడా చలాకీ పెళ్లాం, కిలాడీ కొడుకులూ వున్నారు. పెళ్లాం పేరు చతుర!
కొడుకు పేరు మదన్ -
కూతురి పేరు కామిని.
వాళ్ళు సర్వాధికారికి ఫేవరేట్ చిల్డ్రన్ అవుతారు. మీరందరూ నెగ్లెక్టెడ్ చిల్డ్రనే!" అన్నాడు.
అని, అంత సేపటి తర్వాత మొదటిసారిగా కళ్ళు ఆర్పి తెరిచాడు.
"వీడు మెంటల్ గాడయి వుంటాడు!" అన్నాడు పక్కన కూర్చుని వున్న వ్యక్తి.
కానీ -
అతనికి రెండో వైపు కూర్చుని వున్నవాడు ఒక సోల్జర్. అతను రైఫిల్ బట్ తో ఆ వికృతాకారం మనిషి డొక్కలో పొడిచి, "ఎవడ్రా నువ్వు? ఏమిటి నీ పేరు?" అన్నాడు.
"నా పేరు స్కైలాబ్" అన్నాడు అతను డల్ గా.
"ఏమిటీ?"
"స్కైలాబ్...ఎస్.కె.వై.ఎల్.ఏ.బీ."
"అది నీ పేరా?" అన్నాడు సోల్జర్ తిక్కగా.
"అవును! స్కైలాబ్"
పక్కన కూర్చున్న ఇంకో వ్యక్తి అన్నాడు.
"ఈ వెర్రోడికి వెర్రిపేరే సూటబుల్... పల్స్ పోలియో డ్రాప్సు వేస్తున్నప్పుడు పుట్టిన పిల్లలకి పల్స్ కుమార్, పల్స్ కుమారి అని పేర్లు పెట్టలేదూ...అలాగే...ఆ మధ్య విమానంలో ఒకబ్బాయి పుడితే అతనికి విమాన్ కుమార్ అని పేరు పెట్టలేదూ... అలాగే...ఆ మధ్య అంతరిక్షంలో నుంచి స్కైలాబ్ అనే కృత్రిమ ఉపగ్రహం కింద పడుతుందని జనం భయపడ్డారు. అప్పట్లో పుట్టి వుంటాడు వీడు. దానిపేరే పెట్టి వుంటారు వీడికి... స్కైలాబ్. పిచ్చోడికి పిచ్చి పేరు! వదిలెయ్యండి సోల్జర్ సార్!" అన్నాడు.
"బుర్ర బద్దలు కొడితే పిచ్చీ గిచ్చీ వదుల్తుంది!" అని తుపాకి మడమతో స్కైలాబ్ తల బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు    సోల్జరు -
సరిగ్గా అదే క్షణంలో -
అక్కడో పెద్ద విశేషం జరిగింది.
చాలా పెద్ద విశేషమే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS