Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 16

వాళ్ళు పారిపోవడానికి ఒక అరగంట టైం ఇచ్చి వుంటే బాగుండేది! కానీ అంత టైం ఇస్తే అందరికీ అనుమానం వస్తుంది. తన ప్రాణాలమీదికి వస్తుంది.
కానీ -
"అఖల్ మంద్ కో ఇషారా కాఫిర్ హై..." అని సామెత!
తెలివైన వాడికి సైగచేస్తే చాలు...అల్లుకుపోతాడు.
సాహస్ లాంటి వాడికి అరక్షణం వ్యవధి వుంటే చాలు, తప్పించుకుపోతాడు!
అయితే - ఎటు వెళ్ళారు వీళ్ళిద్దరూ?

                             *    *    *    *

పెద్దపులి బస్ షెల్టర్ మీదికి దూకగానే, అక్కడే వున్న సోల్జరు, "చచ్చాన్రోయ్!" అని కేక పెట్టాడు. పులి అతని పక్కనే ఆగి, రొప్పడం మొదలెట్టింది.
"చావంటే భయమెందుకూ? పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదు! ఇది సృష్టి ధర్మం!" అని డల్ గా వుండే ఒక గొంతు వినబడింది.
ఉలిక్కిపడి పక్కకు చూశాడు సోల్జరు. ఎప్పుడెక్కడోగానీ, అతని పక్కనే కూర్చుని వున్నాడు స్కైలాబ్ అనే ఆ చిత్రమైన వ్యక్తి. అలా అని, అక్కడితో ఆగకుండా, ఇంకా చెప్పడం మొదలెట్టాడు స్కైలాబ్. "ఆ సర్వాధికారి ఆర్డర్స్ వస్తే గానీ ఈ పులిని ఏం చెయ్యాలో తేలదు! ఈ పులి అతని పెట్. సర్వాధికారిని కాంటాక్ట్ చెయ్యడం కష్టంగా వుంది. అతను ఎక్కడ వున్నాడో, ఎంత బిజీగా వున్నాడో తెలియదు. బిజీ! ఏం బిజీ! ఏ నాయకుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఒకే రకం బిజీ! పదవుల పందారం. కాంట్రాక్టుల పంపకాలు - ప్రజల సంగతి పట్టించుకునే నాయకుడు లేడు...ఇప్పుడీ సర్వాధికారీ అదే చేస్తూ వుంటాడు. అతనికీ వున్నారుగా భార్యా - బిడ్డలూ - బంధువులూ - మిత్రులూనూ! చతురా - మదన్ - కామినీ... ఎట్ సెట్ రా... ఎట్ సెట్ రా! ముందు వాళ్ళందరి సంగతీ చూడకుండా అతను ప్రజల సంగతి ఏం చూస్తాడు పాపం!...
అతను తన మోనోటనస్, డల్ వాయిస్ లో అలా చెప్పుకుపోతూనే వున్నాడు. అతని గొంతులో ప్రత్యేకత ఏమిటోగానీ, అది వింటున్న సోల్జర్ కి భయం స్థానంలో నిస్త్రాణ చోటు చేసుకుంది. నిద్దర వస్తున్నట్లు అనిపించింది.
అప్పుడు అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది పులి.
మళ్ళీ ఒక్కసారిగా భయంతో వణుకు వచ్చినట్లయింది అతనికి.
కానీ -
ఆ గొంతు వింటున్న పెద్దపులికి కూడా మళ్ళీ నిద్దరొచ్చినట్లయి బద్ధకంగా చూస్తూ మగతగా పడుకుంది.

                           *    *    *    *

అక్కడ....
సర్వాధికారి పాలెస్ లో
అచ్చం స్కైలాబ్ చెప్పినట్లే జరుగుతోంది.
'సీక్రెట్ ఛాంబర్'లో అతనూ, అతని భార్య చతుర, కొడుకు మదన్, కూతురు కామిని, వగైరాలు వున్నారు. తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
పదవులు ఎలా పంచాలి?
ఏ పోర్టు ఫోలియో ఎవరికి?
ఎక్కడ ఏ ఏ వనరులు వున్నాయి?
వాటిని సొంతానికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చును?
ఏ ఏ కాంట్రాక్టులు ఎవరికి ఏ కండిషన్ల మీద ఇవ్వాలి.
వాటిలో ముడుపులు శాతం ఎంత వుండాలి?
ఇది ఒక వ్యక్తి కాదు...ఒక పార్టీ కాదు...ఒక దేశం కాదు...ప్రపంచమంతటా ఇదే పరిస్థితి!
కొన్నిచోట్ల ఎక్కువ!
మరికొన్ని చోట్ల తక్కువ! డిగ్రీ వ్యత్యాసం!
అంతే తేడా!!
కీలకమైన పదవుల పంపకం దగ్గర ఏకాభిప్రాయం కుదరలేదు. హెచ్చు స్వరాలతో మాట్లాడుకుంటూ వున్నారు వాళ్ళు.
అప్పుడు-
ఫైనల్ గా -
మిలిటరీ హెడ్ క్వార్టర్స్ వారు సర్వాధికారిని కాంటాక్ట్ చేయగలిగారు.
సర్! తమరి పెద్దపులి తప్పించుకుపోయింది. ఏం చెయ్యమని ఆర్డర్స్?"
"దాని తోకలో ఒక్క వెంట్రుక తెగినా మీ పీకలు తెగుతాయ్!" అన్నాడు సర్వాధికారి చర్చల్లో తనని డామినేట్ చేస్తున్న తన భార్య మీది కోపమంతా ఆ జనరల్ మీద చూపిస్తూ.
"నోటెడ్ సర్!" అన్నాడు జనరల్ భయంగా.

                                             *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS