Previous Page Next Page 
మంచివాడు పేజి 14

మిసెస్ కైలాసం ముఖంమీద అజ్ఞాత హస్తం ఏదో గట్టిగా కొట్టినట్టు కళ్ళల్లో లోతుగా బాధ కన్పించింది.
"ఎవరు చెప్పారు? ఆ జానకేనా?" విసురుగా అడిగింది.
"జానకి ఎవరూ?" అన్నాను తెలియనట్టు నటిస్తూ.
"ఆవిడే. నేను రాజీనామా ఇచ్చాక నా ఉద్యోగంలోకి వచ్చిందిలే. మహా తలపొగరు" కోపంతో పెదవులు వణికాయి.
"ఆమెను మీ ప్లేసులో గెజిటెడ్ చేసి మిమ్మల్ని రివర్టు చేశాకనే రాజీనామా ఇచ్చారని విన్నాను. అయినా ఈ ముష్టి ఉద్యోగం మీకెందుకండీ? మీకు తగిన ఫీల్డు రాజకీయాలే అనిపిస్తుంది" అన్నాను.
ఆమె నాకేసి చూసింది ప్రశంసా పూర్వకంగా. చివరకు ఆమె యోగ్యతను గుర్తించ గలిగిన నా తెలివితేటల్ని మెచ్చుకున్నట్టు చిద్విలాసంగా నవ్వింది.
"అవును అమ్మాయ్! అందరూ అలాగే అంటారు. నాకూ అలాగే అనిపిస్తుంది. ఈ రాజకీయ నాయకుల్లో బొత్తిగా నిజాయితీ ఉండటం లేదు. దేశాన్ని పెడత్రోవ పట్టిస్తున్నారు. చూస్తూ వుంటే నా రక్తం వుడికిపోతుంది. నాలాంటివాళ్ళు కొందరైనా రాజకీయాల్లో వుంటేకాని దేశం బాగుపడదని తెలుసు కాని మా వారు గవర్నమెంటులో టాప్ అఫిషియల్ కావడం వల్ల ఏమీ చెయ్యకుండా వున్నాను. కొంతమంది నాయకులూ, రచయితలూ విప్లవం పేరుతో యువతరాన్ని పెడత్రోవ పట్టిస్తున్నారు. మన పవిత్ర భారతదేశంలో హింసకు స్థానం లేదు. అహింసతో ఇంగ్లీషు వాణ్ని ఎదుర్కొన్నాము. నల్లవాడిని ఎదుర్కోడానికి హింస కావాలా_ గాంధీ సిద్ధాంతాలు నాకు ఉగ్గు పాలతోనే వంటబట్టాయి. అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. ఒకసారి నన్ను నాన్నగారు వార్ధా తీసుకెళ్ళారు. బాపూ నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, వళ్ళో కూర్చోపెట్టుకొని తల దువ్వారు. నేను చాలా గొప్పదాన్ని అవుతానని ఆనాడే గాంధీజీ చెప్పారు. నేను ఇంటిదగ్గర ఖద్దరు తప్ప కట్టను. కర్చీఫు కూడా ఖద్దరే వాడ్తాను. బయటికి వస్తున్నప్పుడు ఆఫీసరు భార్యగా ఇష్టం లేకపోయినా ఈ వేషం వెయ్యక తప్పదు." అంటూ కొంచెం ముందుకు వంగి చిన్నగా రహస్యం చెబుతున్నట్టు "మా నియోజక వర్గంలోని పెద్దలందరూ పోయిన ఎలక్షన్స్ లో నన్ను నిలబడితీరాలన్నారు. మిసెస్ కైలాసం లాంటివారు పాలక వర్గంలో ఒక్కరు వున్నా చాలన్నారు. చేసేది లేక, మా వారి ఉద్యోగాన్ని కూడా లక్ష్యపెట్టకుండా ఆ మాత్రం త్యాగం చేయడానికి ఒప్పుకున్నాను.
"అవును, మీరు ఎలక్షన్స్ లో నిల్చుని ఓడిపోయారని విన్నాను."
అవును. ఐదు ఓట్లలో పోయింది" అన్నది ముఖం మార్చుకుంటూ.
"అదేమిటండీ! డిపాజిట్ కూడా గల్లంతయిందని చదివాను పేపర్లో. మూడెకరాల సుక్షేత్రం లాంటి మాగాణి పోగా, పాపం బట్టల షాపులో ఖాతా మిగిలిపోయిందని కూడా విన్నాను" అన్నాను కొంటెగా చూస్తూ.
మిసెస్ కైలాసం ముడుచుకు పోయింది. అసలే చిన్నగా వున్న ముఖం చింతాకంత అయింది. ఆ ముఖం చూస్తుంటే జాలి వేసింది.
"వేస్తారు వేస్తారు - ఎందుకు వెయ్యరూ? పేపర్ల వాళ్ళకు కావాల్సింది అవాకులూ చవాకులేగా? మన ప్రజలు మూర్ఖులు. మంద. గొర్రెల మంద. మాబ్. వాళ్ళకు ఓటు విలువ తెలిస్తేనా? ఎవరికి ఓటు ఇవ్వాలో మన మందకు తెలిస్తే మనదేశం ఏనాడో బాగు పడేది" కోపంగా అని వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది. "ఇక నాతో మాట్లాడకు!" అన్నట్టు వుంది ఆమె ధోరణి.
నేను ఆమెనే చూస్తున్నాను.
అకస్మాత్తుగా కళ్ళు తెరిచి ముందుకు వంగి నా ముఖంలోకి ఓ క్షణం పరీక్షగా చూసింది.
"చూడమ్మాయ్! మనలో మాట!" రహస్యం చెబుతున్నట్టు ముందుకు వంగి గొంతు తగ్గించి నాకు అలా మాట్లాడే వాళ్ళంటే మహా చిరాకు. నేను ముఖం చిట్లించాను. అదేమీ గమనించని ఆమె ప్రారంభించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS