Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 14


    ఇన్ని వివరాలు సేకరించిన వ్యక్తి సామాన్యుడు కాదని బోధపడిపోయింది శశాంకకి. "సో వాట్?"


    "కీర్తి మాత్రమే ముఖ్యమనుకున్నవాడివైతే ఈపాటికే ఫోన్ క్రెడిల్ చేసేవాడివి. నీకు కీర్తికన్నా నీ కృపే ముఖ్యం. ఈ చిన్న లాజిక్ ని నువ్వూ అంగీకరిస్తావనుకుంటాను."


    మీ తర్కాన్ని అభినందిస్తున్నాను" ఉద్వేగాన్ని అదుపుచేసుకోవడం కష్టంగా వుంది. "సూటిగా విషయానికి వస్తే బెటరనుకుంటాను."


    "వెల్...నా ఉద్దేశం కూడా అదే. నువ్వు ఇప్పుడు వెళ్ళబోతున్న షూటింగ్ కాంపిటీషన్ లో నిజంగా ఒక రికార్డు సృష్టించగల మొనగాడివే. కాని అది నాకు ఇష్టంలేదు. అన్నట్టు నీ భార్య క్షేమం దృష్ట్యా ఆమెకూ అది ఇష్టమవుతుందని నేననుకోను."


    "మిస్టర్ ధనుష్కోటీ!"


    "పేరు తెలిసింది కాబట్టి. పైగా నేను బాగా పలుకుబడి గల వ్యక్తిని కాబట్టి సునాయాసంగా నువ్వు హైద్రాబాద్ ఫోన్ చేసి పోలీసుల సహాయం అర్థించాలనుకుంటున్నావేమో...నీకు తెలీదు. ఆ డిపార్ట్ మెంటులో వాళ్లకు దొరికే ఇంక్రిమెంట్లకన్నా నా కానుకల విలువే చాలా ఎక్కువ. పైగా ఒక్క పేరుతో నన్ను చట్టరీత్యా నేరస్థుడ్ని చేయలేవు. కారణం నా పేరుతో ఎవరన్నా మాటాడొచ్చు కాబట్టి..."


    ధనుష్కోటి మాటలు ఒక నేరస్థుడిగా అతడి అనుభవాన్ని విశ్లేషిస్తుంటే నిశ్శబ్దంగా వింటున్నాడు శశాంక.


    "పాపం, నీ భార్య తిరిగి రావాల్సిన భర్తకోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టుంది కాని..." వ్యంగ్యంగా నవ్వు వినిపించింది. "నువ్వు పోటీలో మొదటివాడివిగా వచ్చిన క్షణమే ఆమె బ్రతుక్కి చివరిక్షణమవుతుంది ఇంత వివరంగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే నేనేమిటీ అన్నది ఇంతవరకూ తెలీని దురదృష్టవంతుడివి కాబట్టి. ఆలోచించు... నా హెచ్చరికని అర్ధం చేసుకోనివాడు అక్కడ నీ గెలుపు ఇచ్చే సంతృప్తి కన్నా యిక్కడ ఓటమి మిగిల్చే దుఃఖమే ఎక్కువని నీకు చెప్పాల్సిన అగత్యం లేదనుకుంటాను."


    క్లిక్ మన్న చప్పుడు ఆవలివేపు నుంచి.


    అప్పటికే చమటతో తడిసిపోయాడు శశాంక.


    "సర్...బయలుదేరండి" దిగువ వేన్ బయలుదేరుతున్న సూచనగా ఆర్గనైజర్ వచ్చి మరోసారి గుర్తుచేశాడు.


    వ్యవధి లేదు.


    అయినా ఎస్.టి.డి. ద్వారా హైద్రాబాద్ ట్రై చేశాడు.


    అదృష్టవశాత్తూ వెంటనే కృప లైన్ లోకి వచ్చింది.


    "కృపా...నేను శశాంకని మాటాడుతున్నాను." అతడి గొంతు వణికింది.


    "ఇప్పటికి గుర్తుకొచ్చానన్నమాట."


    "కృపా... కృపా గుర్తుకు రావడమేంటి... ఎప్పుడూ... ప్రతి క్షణమూ ఆల్ ది టైం... నాలో వుంటావు. అసలు నిన్ను మరచిందెప్పుడు... యస్" తడబడ్డాడు గొంతు రుద్దమౌతూంటే.


    సులభంగానే అర్థం చేసుకుంది అతడి గొంతులోని ఆందోళన్ని. "ఎనీ థింగ్ రాంగ్?"


    "నథింగ్. ఆర్యూ ఓ.కె."


    "ఏయ్ శశి డియర్... నీకేమైంది" ఆమె కంఠంలోని ఆత్మీయత అఖండ సచ్చిదానంద స్థితికి చేరిన మహర్షిగా మార్చింది క్షణకాలమైనా. మళ్ళీ పీడ కల వచ్చిందా" అడిగింది.


    కాదు కల నిజం కాబోతూందని చెప్పాలనుకుంటూనే తమాయించుకున్నాడు. "లేదు... ఎవరో బెదిరిస్తూ ఫోన్ చేశారు. అంతే."


    "తెలుగు సినిమా పైత్యం అయ్యుంటుంది మాస్టారూ... మీరేం వర్రీ కాకండి... ఒక గొప్ప సైనికాధికారి కూతుర్ని... మరో గొప్ప... అవునూ రెండు చేతుల్తోను సమానంగా షూట్ చేసే ఎక్స్ పర్ట్ ని సవ్యసాచి అనొచ్చు కదా. అలాంటి రికార్డ్ షూటర్ కి భార్యని...


    మీరు ప్రస్తుతం మాటాడుతున్నదెక్కడ్నుంచి... ఇంకా కాంపిటీషన్ మొదలుకాలేదా. చూడండీ. ఎవరో ఏదో అన్న విషయాన్ని మీరు మరచిపోతున్నారు. మీరిప్పుడు చాలా ప్రశాంతంగా వున్నారు... మీ లక్ష్యం చాలా స్పష్టంగా వుంది. మీరు ఓ అద్భుతమైన రికార్డు సృష్టించబోతున్నారు. యూ ఆర్ కేపబులా ఫిట్... ఓ.కే... మరేం లేదు. సైకోథెరపీ... ప్చ్... ఒకటి... రెండు... బోలెడన్నిము... ము... ము..." పెదవులతో చిరుచప్పుడు అల్లరిగా.


    ఫోన్ క్రెడిల్ చేశాడు. అంతా కలలా వుంది.


    దిగులుగానే మరో పది నిముషాలలో స్పాట్ కి చేరుకున్నాడు.


    దూరంగా కొందరు మిలిటరీ అపీషియల్స్ తో నిలబడ్డ రాజమణి గర్వంగా ముందుకొచ్చి శశాంకని వారికి పరిచయం చేశాడు.


    శుభాకాంక్షలు.


    కెమెరా ఫ్లేషెస్...


    అక్కడ చేరిన చాలామంది దృష్టి శశాంక పైనే...


    ప్రిలిమినరీ టెస్ట్ లో శశాంక సాధించిన ఘనత ఎంత గొప్ప అంటే చివరి ఘట్టం పూర్తికాకముందే కొందరు ఢిల్లీ పత్రికా విలేకరు అతణ్ణి చుట్టుముట్టారు.


    అది కాదు శశాంక ఆ క్షణంలో కోరుకుంటున్నది.


    మనసును వేధిస్తున్న దిగులు గురించి మామగారితో చెప్పాలని వుంది.


    ఇప్పుడతడు మనసారా కోరుకుంటున్నది గెలుపు కాదు. ఒకటే ఈ గెలుపు కృపని దూరం చేసే ఒక పరీక్ష అయితే అతను మనస్పూర్తిగా ఓటమినే కోరుకుంటున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS