Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 14


    వారం రోజులు శీను వెధవపనిని గమనించాక సుభాషిణి విషయాన్నంతా తన అన్నయ్యకి చెప్పింది. అంతా విన్నాక 'మేం మగాళ్ళం. వెళ్ళివాడిని కొడితే మన పొలాల మధ్య వాళ్ళు పొలం కొన్నారన్న ఈర్ష్యతో కొట్టామని ఊరి జనం అనుకునే ప్రమాదముంది. కాబట్టి నేనొక ప్లాన్ చెబుతాను. అలా ప్రొసీడ్ అయిపోండి. జీవితంలో వాడు అలాంటి పనులు చేయడు' అన్నాడు.

 

    తన అన్నయ్య చెప్పిన ప్లాన్ గురించి మిగిలిన అమ్మాయిలకి చెప్పింది. అంతా అద్భుతం అన్నారు.

 

    ఆ రోజు శ్రీను పొలానికి రాకముందే సుభాషిణి తప్ప మిగిలిన  అమ్మాయిలంతా ఏటికి వెళ్ళారు. ఎవరికీ కనపడకుండా రహస్యంగా ఏటి గట్టుమీదున్న చెట్లెక్కి కూర్చున్నారు.

 

    మామూలు టైమ్ కి శ్రీను పొలానికి వచ్చాడు. అతను రావడాన్ని దొడ్లోంచి చూసిన సుభాషిణి ఒంటరిగా బకెట్లో బట్టలు వేసుకుని బయలుదేరింది. తన ముందు నుంచి మరింత హొయలుగా, ఒంటరిగా వెళుతున్న సుభాషిణిని చూడగానే శీను ఎలాస్టిక్ లా సాగాడు.

 

    ఆమె ఏట్లోకి వెళ్లడం, అతను పొలం గట్టుమీదున్న చెట్ల వెనక నక్కడం ఒకేసారి జరిగాయి.

 

    సుభాషిణి మామూలుకంటే మరి కాస్తంత ఎక్కువగా చీర కుచ్చిళ్ళను పైకిలాగి బొడ్లో దోపుకుంది.

 

    శీను కళ్ళు పెద్దవి చేశాడు.

 

    ఆమె బట్టల్ని నీళ్ళల్లో ముంచి, అటూ ఇటూ చూసి, తన దగ్గరికి రమ్మన్నట్లు పొలం గట్టు మీదున్న చెట్లకేసి చేయి వూపింది.

 

    'నువ్వు చాటునుంచి మమ్మల్ని చూడకపోతే మేం చేయివూపింది నీకెలా తెలుస్తుంది?' అన్న లాజిక్ మీద వేసిన ప్లాన్ అది. అందుకే ఆమె రహస్యంగా పిలుస్తున్నట్లు భయం భయంగా చూస్తూ చేయి వూపింది.

 

    తను వున్న ఎగ్జయిట్ మెంట్ లో ఇవన్నీ ఆలోచించే స్థితిలో లేడు అతను. నేతి గిన్నెలా వుండె ఆమె బొడ్డు తప్ప మరేదీ కనిపించలేదు అతనికి.

 

    చెట్ల నుంచి తప్పుకున్న అతను అదిరే గుండెను అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నట్లు వచ్చాడు.

 

    'పిలిచావా?' అన్నాడు దగ్గర నిలబడి. అప్పటికీ ఆమె తన కుచ్చిళ్ళను కిందకు జార్చలేదు. ఆ పాదాలను పట్టుకుని పైకెగబాకుతున్న అతని చూపులు ఆ నునుపుకి మాటిమాటికి జారిపోతున్నాయి.  

 

    "అవును శీనూ! నువ్వంటే నాకెంత యిష్టమో... మీరు ఇక్కడ పొలం కొన్నారని తెలిసి ఎంత సంతోషించానో నీకు తెలుసా?"

 

    "తెలుసు" మరింత ముందుకొచ్చాడు. నీళ్ళ చెమటతో తడిసిన ఆమె ఎద పెద్దింటి పాలకడవల్లా వున్నాయి. తేనెసీసాలా వుండే ఆమె బొడ్డు చుట్టే అతని కళ్ళు వాలాయి.

 

    "రోజూ నువ్వు చెట్లచాటున నిలబడి చూస్తూ వుంటే నువ్వు నన్ను తడుముతున్నట్లే వుంది" అని తల దించుకుంది.

 

    కాసేపు సిగ్గుపడి తల పైకెత్తి -

 

    "అయినా అలా చాటుగా నిలబడి దొంగతనంగా ఆడపిల్లల్ని చూస్తావా?" అని చిరుకోపంతో చూసింది.

 

    అతను దొరికిపోయినట్లు తడబడిపోయాడు.

 

    "అందర్నీ కాదు -నిన్నే చూసేది" అన్నాడు.

 

    "అంటే చూస్తున్నట్టే కదా"

 

    "ఆఁ! నిన్నే"

 

    అప్పుడు కిందకు దూకారు చెట్లమీద కూర్చుని యిదంతా విన్న అమ్మాయిలు.

 

    ఊహించని ఈ సంఘటనకు అతను జడుసుకున్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అమ్మాయిలు కిందకు దూకగానే ఏట్లో చేపపిల్లలు ఈదుతున్నట్లు నిశ్శబ్దంగా నవ్వుకున్న సుభాషిణిని చూడగానే వాళ్ళ ప్లానేమిటో అర్థమయింది. అంత సులభంగా దొరికిపోయిన తనకు తానే నిందించుకున్నాడు.

 

    ఆరోజు కూడా యథాప్రకారంగానే అమ్మాయిలు ఉతికారు. అయితే బట్టల్ని కాదు - శ్రీనుని"

 

    మౌనిక అదంతా విని నవ్వుతోంది. కణతలు అదిరేలా నవ్వుతున్నా ఆమె నవ్వు పాలమీగడలా వుంది. అలా మనసు కదిలేలా నవ్వడం యిక్కడ చేరాక మొదటిసారి అదే.  

 

    శ్రీనూని తలుచుకుంటుంటే ఆమెకి నవ్వాగడం లేదు. అలా నవ్వుతున్నప్పుడు మధ్యలో తను ఎంత పొరబాటుచేసిందీ తెలిసింది.

 

    అలాంటి విషయాలు వినడం తప్పు. విని అంత ఎంజాయ్ చేయడం మరింత తప్పు. అందుకే స్విచ్ ఆఫ్ చేసినట్టు ఠక్కున నవ్వు ఆపేసింది.

 

    ఇటువైపు పడుకున్నా ఆమె పడ్డ అవస్థ అంతా అతను ఊహించాడు.

 

    "ధర్మప్రచారిణి అంటే ఏమిటి మౌనికగారూ?" టాపిక్ మార్చకపోతే ఆమె మాట్లాడదని అతనికి తెలుసు. అంతేకాకుండా ఆమెగురించి మరింత తెలుసుకోవాలనుకున్నాడు.

 

    "మన సనాతన ధర్మాలను ప్రజలకు బోధించడం"

 

    "సనాతన ధర్మాలంటే?"

 

    ఆమె క్లుప్తంగా వివరించింది.

 

    అతను అంతా విన్నాక - "ఇది చాలా అన్యాయమండి మౌనికగారూ! ఎందరో మహానుభావులు ఎన్నో ఏళ్ళు కష్టపడి ఈ దురాచారాలను రూపుమాపితే తిరిగి మీరి వాటికి ప్రాణ ప్రతిష్ట చేయాలనుకోవడం దారుణం" అన్నాడు.  

 

    "ప్రాచీనులు చెప్పిన ధర్మాలను మనం ఆచరించాలి. మోక్షం, కర్మ, యోగం - భారతీయ తత్వశాస్త్ర ఉత్కృష్టతకు తార్కాణాలు"

 

    వాటిని వింటూనే తల కొట్టుకోవాలన్నంత చిరాకు పుట్టుకొచ్చింది అతనికి. కానీ తమాయించుకున్నాడు. "మన పూర్వీకులంతా వీటిని చెప్పారనడం తప్పు. వీటిని వ్యతిరేకించినవాళ్ళు అప్పట్లోనూ వున్నారు. అయితే వాళ్ళ సిద్ధాంతాలను కావాలనే కొందరు వెలుగు చూడకుండా చేశారు. వాళ్ళ గ్రంథాలను తగులబెట్టారు. క్రీస్తు పూర్వమే పాయసివంటి తత్వవేత్తలు కర్మ సిద్ధాంతాన్ని నిరాకరించారు. కుమారిలోని వంటి ప్రముఖులు యోగ అనుభవాలను అపహాస్యం చేశారు. యజ్ఞ యాగాదులను, యజ్ఞ ఫలాన్ని చార్వాకులు అంతా అబద్ధం అన్నారు"

 

    ఆమెకి యివన్నీ కొత్త. కొంతకాలం విమలాబాయి చెప్పిందే ఆచరిస్తూ వచ్చింది. ఇప్పుడెవరో అనామకుడు వచ్చి వాటిని వ్యతిరేకిస్తుంటే పెద్దగా పట్టించుకోనవసరం లేదనిపించింది. కానీ అతను వదల్లేదు. "పురుషుడితో స్త్రీ ఎప్పటికీ సమానంకాదని మీరు నమ్మడం, దానిని ప్రచారం చేయడానికి దీక్ష తీసుకుంటూ వుండడం మూర్ఖంగా తోస్తోంది నాకు.

 

    ఈ సృష్టిలో మనుషులందరూ సమానమే. మొదట్లో అలానే వున్నారు కూడా. తరువాత్తరువాత పురుషుడు తన ఆధిపత్యం నిలుపుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడూ భుజబలంతోనే అధికారం చెలాయించలేడు కదా. అందుకే ఆమెను ఎప్పుడూ అణగదొక్కి వుంచడానికి ఆమెకు మాత్రం కొన్ని కట్టుబాట్లు పెట్టాడు. ఆమెను వంటగదిలో బంధించాడు. పడకటింట్లో ఆటబొమ్మను చేశాడు. డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి ప్రపంచాన్ని చూడకుండా చేశాడు"   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS